ప్రచార యుద్ధంలో చైనా కొత్త తంత్రం | Article On India And China Dispute | Sakshi
Sakshi News home page

ప్రచార యుద్ధంలో చైనా కొత్త తంత్రం

Published Fri, Sep 18 2020 1:15 AM | Last Updated on Fri, Sep 18 2020 9:56 AM

Article On India And China Dispute - Sakshi

భారత సైన్యం సరిహద్దుల్లో ఎదురుదాడి చేయడంతో చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలోని మీడియా భారత్‌ తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందంటూ హెచ్చరించడం మొదలెట్టింది. ఇది ప్రచార యుద్ధంలో సరికొత్త తంత్రం. పైగా భారత సైన్యం పీఏల్‌ఏ పైకి కాల్పులు జరిపినట్లయితే అది భారత సైన్యాన్నే తుడిచిపెట్టేటటువంటి పర్యవసానాలకు దారి తీస్తుందని బెదిరింపులకు దిగుతోంది. వాస్తవానికి పర్వత ప్రాంత యుద్ధంలో రాటుదేలిపోయిన భారత సైన్యాన్ని గత కొన్ని దశాబ్దాలుగా యుద్ధానుభవం లేని పీఎల్‌ఏ బలగాలు నిలువరించలేవన్నది వాస్తవం. చైనా ప్రచారయుద్ధాన్ని చైనా భూభాగంలోనే భారత్‌ తిప్పికొట్టగలిగితే చైనా ప్రజల, చైనా సైనిక కుటుంబాల నైతిక ధృతిని చెల్లాచెదురు చేయవచ్చు.

వాస్తవాధీన రేఖ పొడవునా భారత సైన్యం ఇప్పుడు ఆధిపత్య స్థానాన్ని స్థిరపర్చుకున్న తర్వాత, యుద్ధం తప్పదంటూ భారత్‌ని హెచ్చరించే తీవ్రమైన ప్రచార యుద్ధతంత్రాన్ని చైనా పునరుద్ధరిం చింది. రోజు తర్వాత రోజు ఈ ప్రచార స్థాయి పెరుగుతూండటం గమనార్హం. ముందుగా కాల్పులు ప్రారంభించింది భారతదేశమే అంటూ ఆరోపించిన చైనా పత్రిక ది గ్లోబల్‌ టైమ్స్‌ సెప్టెంబర్‌ 8న దూకుడు ప్రకటన చేసింది. ‘చర్చలకు సిద్ధమవుతున్న చైనా గస్తీ దళాలపైకి భారత బలగాలు రెచ్చగొట్టే ధోరణితో కాల్పులు ప్రారంభించాయి. ఇది సైనికపరంగా తీవ్రంగా రెచ్చగొట్టే అంశమే తప్ప మరొకటి కాదు.’

ప్రజా విముక్తి సైన్యానికి చెందిన పశ్చిమరంగ కమాండ్‌ ప్రతినిధి కల్నల్‌ జాంగ్‌ షుయిలి ఈ అంశంపై మరింతగా మాట్లాడారు. ప్రమాదకరమైన చర్యలను వెంటనే ఆపివేయాలని, సరిహద్దులు దాటి మరీ లోపలికి వచ్చిన సైనిక బలగాలను తక్షణమే ఉపసంహరించాలని, సరిహద్దుల్లో ఫ్రంట్‌ లైన్‌లో ఉన్న భారత బలగాలను అదుపులో పెట్టాలని మేం అభ్యర్థిస్తున్నాం, అలాగే ముందుగా చైనా బలగాలపైకి కాల్పులు ప్రారంభించిన భారత బలగాలపై తీవ్ర స్థాయిలో విచారించాలని చైనా ప్రతినిధి ప్రకటన చేశారు. 

అయితే భారత సైన్యం చైనా ప్రకటనను తోసిపుచ్చింది. ‘వాస్తవాధీన రేఖ సమీపంలో ఉన్న మా సైనిక దళాలపైకి ముందుగా చైనా దళాలే కాల్పులు జరిపిన తర్వాతే మా దళాలు వారిని అడ్డుకున్నాయి. మా బలగాలను బెదిరించే లక్ష్యంతో పీఎల్‌ఏ దళాలు కొన్ని రౌండ్ల కాల్పులు జరిపాయి’. దీంతో ప్రకటనలు దాని ఖండన ప్రకటనల ఆట మొదలైపోయింది. భారత సైన్యాలు ఎదురుదాడి చేయడంతో చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలోని మీడియా భారత్‌ తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందంటూ తీవ్రస్థాయిలో హెచ్చరిం చడం మొదలెట్టింది.

చైనా మీడియా చాలావరకు ప్రస్తుత దృశ్యాన్ని 1962 నాటి దృశ్యంతో పోల్చి చూస్తోంది. సెప్టెంబర్‌ 8న ది గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక స్పష్టంగా దీన్ని ఎత్తిచూపింది. ‘చైనా 1962 యుద్ధంలో విజయం సాధించింది. ఇది భారత్‌కు గుణపాఠం కావాలి. పైగా, దశాబ్దాల క్రితం పీఎల్‌ఏ ఉపయోగించిన సైనిక సామర్థ్యంతో పోలిస్తే ప్రస్తుత చైనా సైనిక సామర్థ్యం అత్యున్నత స్థాయిలో ఉంది. సమాచార సమర్థత, వ్యవస్థీకృత పోరాట సామర్థ్యం, సంయుక్త పోరాట సామర్థ్యంతో కూడిన పీఎల్‌ఏ ఇప్పుడు ఒక అత్యాధునిక సైన్యం’.  అదే రోజు వచ్చిన మరొక కథనం కూడా ఇదే రీతిలో సాగింది. ‘పీఎల్‌ఏ మొట్టమొదటగా కాల్పులు మొదలెట్టలేదు. కానీ భారత సైన్యం పీఎల్‌ఏ పైకి కాల్పులు జరిపినట్లయితే అది భారత సైన్యాన్నే తుడిచిపెట్టేటటువంటి పర్యవసానాలుకు దారితీస్తుంది. ప్రస్తుత సంఘర్షణను పెంచాలని భారత సైన్యం సాహసించినట్లయితే మరిన్ని భారత బలగాల నిర్మూలన జరగడం ఖాయం’.

అయితే చైనా పత్రిక చేసిన ఈ వ్యాఖ్యలు భారత ప్రజానీకాన్ని, ప్రతిపక్ష రాజకీయ పార్టీలను, శాంతికాముకులను ప్రభావితం చేసేలా సోషల్‌ మీడియాలో కనిపించాయి. చైనా సైనిక స్థానాలకు ప్రమాదకరంగా తయారైన భారత సైనిక స్థానాల నుంచి వెనక్కు తగ్గి, ఉపసంహరించుకునేలా భారత ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే ఈ వ్యాఖ్యల ఉద్దేశం. వాస్తవానికి ఇప్పుడు చైనా ముందున్న ఏకైక ఎంపిక ఏదంటే మరిన్ని తీవ్ర దాడులను ప్రారంభించి తన సైనికులను భారీగా నష్టపోవడమే. 

అయితే తన ప్రచార కార్యక్రమాలు మొత్తంగా బూటకం అని నిరూపించే అనేక అంశాలను చైనా మీడియా అస్సలు పేర్కొనడం లేదు. 1962లో కూడా భారత బలగాలు మందుగుండు సామగ్రి, శీతాకాల దుస్తులు, ఆర్టిలరీ, గగనతల మద్దతు ఏమాత్రం లేనప్పటికీ చివరి మనిషి బతికి ఉన్నంతవరకు, చిట్టచివర తూటా పేల్చేంతవరకు విడివిడి స్థానాల్లో పోరాడుతూ చివరకు చైనా సైన్యమే దిగ్భ్రాంతికి గురయ్యేంత నష్టాలను పీఎల్‌ఏకు కలిగించాయి. అయితే ఆనాడు సైనిక చర్యలను ముందుకు తీసుకుపోగల వనరులు భారత సైన్యం వద్ద లోపించాయి. అయితే ఆనాటి ఆ లోటుపాట్లు ఇప్పుడు భారత సైన్యానికి అస్సలు లేవు. అలాగే తన బలగాలకు తీవ్ర నష్టం కలిగిన 1967 నాటి నాథూలా, చో లా ప్రాంతాల్లోని ఘర్షణల గురించి చైనా ఎన్నడూ పేర్కొనలేదు. భారత బలగాల ప్రతిదాడికి తట్టుకోలేక చైనా సైన్యం పలాయనం చిత్తగించింది. అదేవిధంగా ఇప్పుడు గల్వాన్‌ ప్రాంతంలో తమకు కలిగిన నష్టాల గురించి అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ కూడా చైనా ఇంతవరకు వెల్లడించలేదు. అలాగే పాకిస్తాన్‌తో యుద్ధ కాలంలో కార్గిల్, సియాచిన్‌ ఎల్తైన పర్వతప్రాంతాల్లో భారత బలగాలు చేసిన భీకర దాడికి సంబంధించిన తీవ్రత, దాని అనుభవాలను కూడా చైనా ఎన్నడూ కనీసంగా కూడా పేర్కొనలేదు. 

లద్దాఖ్‌ ప్రాంతంలో చైనా హాన్‌ జాతి సైనికులు ఎదుర్కొంటున్న తీవ్రమైన అననుకూలతను కూడా చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలోనే చైనా మీడియా దాచి ఉంచుతోంది. చైనా సైన్యంలోని 60 శాతం మంది గ్రామీణ చైనా నుంచి నియమితులైనవారితో కూడిందే. భవి ష్యత్తు ఉద్యోగం కోసమే వీరు సైన్యంలో చేరారు తప్పితే యుద్ధాల్లో పాల్గొనాలనే కాంక్షతో కాదు. వీరు టిబెట్, లద్దాఖ్‌ ప్రాంతాల్లోని గడ్డకట్టించే శీతాకాల పరిస్థితుల్లో బతికి బట్టకట్టలేరు. చారిత్రకంగా చూస్తే కూడా పీఎల్‌ఏ ప్రతి ఏడాది నవంబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు సరిహద్దుల్లోని తన బలగాలను చైనా మైదాన ప్రాంతాలకు వెనక్కు పంపుతూ స్థానికంగా రిక్రూట్‌ చేసుకున్న సరిహద్దు రక్షణ రెజిమెంట్లను, మిలీషియాను వాస్తవాధీన రేఖ వద్ద గస్తీకోసం ఉంచుతోంది.

చైనాలో హాన్‌ జాతి సైనికులు శీతాకాలంలో కూడా తట్టుకుని సరిహద్దుల్లోనే మనగలిగి ఉంటే వారిని అడ్డుకోవడం భారత సైన్యానికి కాస్త కష్టమయ్యేది. చైనా హాన్‌ జాతి సైనికులు అలాంటి వాతావరణంలో మనగలగడం అసాధ్యం. ఈ కారణం వల్లే చైనా ప్రస్తుత ఘర్షణాత్మక స్థితిని శీతాకాలం పొడవునా కొనసాగించాలని భావించడం లేదు. అదే సమయంలో ప్రస్తుత ఘర్షణను నిలిపివేయాలని భారత్‌ తొందరపడటం లేదు. ఇప్పటికే మన సైన్యం దీర్ఘకాలిక పోరాటానికి సన్నాహాలు ప్రారంభించింది.

మరొక వాస్తవమేమిటంటే 1962లో పీఎల్‌ఏ తనకు జరిగిన నష్టాలను అంగీకరించి ఉండవచ్చు. ఎందుకంటే అప్పట్లో చైనాలో కుటుంబానికి ఒక్కరే సంతానం అనే విధానం అమలులో ఉండి 1979 వరకు అది కొనసాగింది. పైగా చైనాకు జరిగిన భారీ నష్టాలను చెప్పేందుకు అప్పట్లో బహుముఖ మీడియా నెట్‌వర్క్‌ లేదు. ఇప్పుడు పరిస్థితి బాగా మారింది. ప్రతి చైనా సైనికుడూ బ్రహ్మచారి అయినట్లయితే కనీసం తల్లిదండ్రులు, అవ్వాతాతలు కలిపి ఆరుగురు కుటుంబ సభ్యులను పోషించాల్సి ఉంది. ఇప్పుడు చైనా సైనికుడు ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి అది శరాఘాతమే అవుతుంది. చైనా సైనికుడికి పెళ్లి కూడా అయి ఉంటే, అతడిపై ఆధారపడేవారి సంఖ్య ఇంకా పెరుగుతుంది. అందుకే 1960లలోలాగా తనవైవు ఎంతమంది సైని కులు చనిపోయారు అని లెక్క ప్రకటించే స్థితిలో చైనా ఇప్పుడు లేదు. పైగా చైనా 1979లో వియత్నాంలో తన చివరి యుద్ధాన్ని ముగిం చింది. అప్పుడు సైతం అది అవమానకరంగా వెనుదిరగాల్సి వచ్చింది.

బలహీనమైన, అనుభవ లేమితో కూడిన, తమపై కుటుంబాలు ఆధారపడి ఉన్న చైనా సైనికులు యుద్ధాల్లో రాటుదేలిన సుశిక్షితులైన భారత సైనికులతో తలపడటం అంటే చందమామను తెచ్చివ్వమని కోరినట్లే కాగలదు. కార్గిల్, సియాచిన్‌ యుద్ధ దృశ్యాలతో కూడిన వీడియోలను కౌంటర్‌ ప్రాపగాండా యుద్ధ తంత్రంలో భాగంగా భారత్‌ విడుదల చేస్తే, ప్రస్తుత భారత సైన్యం సమర్థత ఏంటో చైనాకు అర్థమవుతుంది. పాకిస్తాన్‌ బలగాలతో అతిఎత్తైన పర్వత ప్రాంతాల్లో భారత సైనికులు కార్గిల్‌లో యుద్ధం చేసిన అనుభవంతో పోల్చితే కేవలం తుపాకీ కాల్పుల శిక్షణకు పరిమితమైన చైనా ప్రాపగాండా వీడియోలు ఎంత పేలవంగా ఉంటాయో ఎవరైనా పోల్చుకోవచ్చు. 

ప్రస్తుత ప్రచారయుద్ధంలో సమస్య ఏమిటంటే ప్రపంచ సోషల్‌ మీడియా సైట్లను చైనాలో నిషేధించారు. ఇక చైనా సొంత సోషల్‌ మీడియా బయటి ప్రపంచంలోకి జొరబడే అవకాశం తక్కువ. ఈ చైనా సోషల్‌ మీడియాలోకి జొరబడి భారత సైనిక బలగాల సామర్థ్యాన్ని ప్రదర్శించిగలిగితే చైనా ప్రజలు, చైనా బలగాల నైతిక ధృతిని చెదర గొట్టవచ్చు. అందుకే భారత ప్రచార యుద్ధ తంత్రం చైనాలోకి చొచ్చుకెళ్లాలి. సంవత్సరాలుగా చైనా బలగాలను ఎదుర్కొంటూ అనుభవం సాధించిన భారత సైన్యం.. చైనా సైన్యం గుట్టుమట్ల గురించి పూర్తి అవగాహనతో ఉంది. కాబట్టే అత్యంత కఠిన పరిస్థితుల్లో భారత్‌ సైన్యానిదే పైచేయిగా ఉంటోంది. ఇక భారత సైన్యం తన సమర్థతల గురించి చక్కటి అవగాహనతో ఉన్నందున చైనా సైనిక దాడులను చక్కగా నిలువరించే స్థానంలో ఉంది. (ది స్టేట్స్‌మన్‌ సౌజన్యంతో)
హర్ష కకార్, రిటైర్డ్‌ మేజర్‌ జనరల్, భారత సైన్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement