రెచ్చగొడితే తిప్పికొడతాం | India And China dispute : Army Chief Reviews Operational Preparedness In Ladakhi | Sakshi
Sakshi News home page

రెచ్చగొడితే తిప్పికొడతాం

Published Fri, Sep 4 2020 3:10 AM | Last Updated on Fri, Sep 4 2020 10:27 AM

India And China dispute : Army Chief Reviews Operational Preparedness In Ladakhi - Sakshi

లద్దాఖ్‌ పర్వత ప్రాంతంలో గురువారం ఐఏఎఫ్‌కు చెందిన చినూక్‌ హెలికాప్టర్‌ గస్తీ

న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా నిర్వాకం వల్లనే ఉద్రిక్తత నెలకొందని, దీనిపై ముందుకెళ్లాలంటే చర్చలే మార్గమని భారత్‌ తేల్చిచెప్పింది. యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నందువల్లనే లద్దాఖ్‌లో నాలుగు నెలలుగా ఉద్రిక్తత కొనసాగుతోందని స్పష్టం చేసింది. దీన్ని పరిష్కరించడానికి ఉన్న ఏకైక మార్గం చర్చలేనని చెప్పింది. ఒకవైపు విదేశాంగ శాఖ చర్చల కోసం భారత్‌ సిద్ధంగా ఉందని చెబుతుండగా, మరోవైపు చైనా రెచ్చగొట్టే చర్యలను తిప్పిగొట్టే సామర్థ్యం తమ త్రివిధ బలగాలకు ఉందని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు. తగిన రీతిలో డ్రాగన్‌ దేశానికి బుద్ధి చెప్పేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. వాస్తవాధీన రేఖ వద్ద అలజడి నేపథ్యంలో గురువారం ఆర్మీ చీఫ్‌ నరవాణే, వాయుసేనాధిపతి భదౌరియా తమ బలగాల యుద్ధ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. చైనా కవ్వింపు చర్యలతో సైనిక బలగాల మోహరింపులో భారత్‌ మార్పులు చేసింది. వాయుసేన బలగాలు రాత్రిపూట తూర్పు లద్దాఖ్‌లోని గగనతలంలో పెట్రోలింగ్‌ చేపడుతూ ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనాకు పరోక్షంగా సంకేతాలు పంపుతోంది. 

ఒప్పందాలను గౌరవించాలి 
భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ చైనా ఆగడాలను మీడియా సమావేశంలో ఎండగట్టారు. ద్వైపాక్షిక ఒప్పందాలను, ప్రొటోకాల్‌ను చైనా ఉల్లంఘించడం వల్లనే సరిహద్దులో దాదాపు మూడు దశాబ్దాలుగా ఉద్రిక్తత నెలకొందన్నారు. ఒప్పందాలను గౌరవించి తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని చైనాను కోరారు. శాంతియుత చర్చలతో అన్ని అంశాలను పరిష్కరించుకునేందుకు భారత్‌ కట్టుబడి ఉందన్నారు. దౌత్య, మిలిటరీ మార్గాల ద్వారా చర్చలకు రావాలని చైనాను కోరారు. ఇరుదేశాల విదేశాంగ మంత్రులు, ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు సరిహద్దులో బాధ్యతాయుతంగా మెలగాలని, ఏ ఒక్కరు కూడా ఉద్రిక్తత నెలకొనేలా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని ఆయన పేర్కొన్నారు. సరిహద్దులో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ఏకపక్షంగా వ్యహరించిందని మండిపడ్డారు. ఈనెల 10న మాస్కోలో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) నిర్వహించే సదస్సులో విదేశాంగ మంత్రి జైశంకర్‌ పాల్గొంటారని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎనిమిది దేశాలుండే ఎస్‌సీఓలో చైనా కూడా భాగస్వామిగా ఉంది. 

వాయుసేన సన్నద్ధత 
సరిహద్దులో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో వాయుసేన చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా ఈస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్‌ పరిధిలోని కీలకమైన ప్రాంతాలను సందర్శించారు. గురువారం అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి వాయుసేన సన్నద్ధతపై సమీక్షించారు. వాయుసేన చాలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారని అధికారులు చెప్పారు. షిల్లాంగ్‌లో ఉండే ఈస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్‌ కేంద్ర కార్యాలయం అరుణాచల్, సిక్కింలోని ఎల్‌ ఏసీ వెంబడి ఉన్న కీలక ప్రాంతాల గగనతలంపై పహారా కాస్తుంది. భదౌరియా ఈస్ట్రన్‌ కమాండ్‌ పరిధిలోని కీలక స్థావరాలను సందర్శించారని వాయుసేన తెలిపింది.

లద్దాఖ్‌లో ఆర్మీ చీఫ్‌ 
పాంగాంగ్‌లో చైనా దుస్సాహసం నేపథ్యంలో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవాణే లద్దాఖ్‌లో పర్యటిస్తున్నారు. అక్కడి భద్రతా పరిస్థితిపై గురువారం సమీక్ష చేపట్టారు. ఆయన శుక్రవారం కూడా అక్కడే పర్యటిస్తారు. బలగాల సన్నద్ధత, మోహరింపు గురించి టాప్‌ ఆర్మీ కమాండర్లు నరవాణేకు వివరించారు. సరిహద్దుకు సమీపంలోని భారత ఆర్మీ శిబిరాన్ని నరవాణే సందర్శించి సైనికులతో మాట్లాడారు. 3,400 కిలోమీటర్ల సరిహద్దులోని కీలక ప్రాంతాల్లో ఆర్మీ, వాయుసేన బలగాలను చాలా అప్రమత్తంగా ఉంచారు.
 
సర్వ సన్నద్ధతతో...పూర్తి నియంత్రణలో
లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద భారత సైన్యం సర్వ సన్నద్ధతతో పహారా కాస్తోంది. అదనపు సైనిక బలగాలను, ఆయుధ సామగ్రిని తరలించి... పాంగాంగ్‌ దక్షిణ తీరంలో కీలక పర్వత ప్రాంతాల్లో మోహరించిన భారత్‌...డెప్సాంగ్‌ ప్లెయిన్స్, చుమర్‌ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయుధ సంపత్తిని, సైన్యాన్ని ఇక్కడకు భారీగా తరలించింది. అంగుళం భూమిని కూడా వదులుకోబోమని, చైనా వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైనా దీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (చైనా సైన్యం)కి గట్టి సంకేతాలు పంపింది. పీఎల్‌ఏకు దీటుగా స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ను రంగంలోకి దింపింది. ఐదురోజుల కిందట పాంగాంగ్‌ సరస్సు దక్షిణతీరంలో చైనా చొరబాటు యత్నాలను తిప్పికొట్టడంలో కూడా స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ ముఖ్య భూమిక పోషించింది. లద్దాఖ్‌ పరిధిలో 1,597 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) పొడవునా భారత్‌ అత్యంత అప్రమత్తతను పాటిస్తోంది. డెమ్‌చోక్, చుమర్‌ల్లో భారత్‌ ఎత్తైన పర్వత ప్రాంతాలను ఆక్రమించి ఉండటంతో చైనా ఆయుధ, సైనిక రవాణాకు కీలకమైన లాసాకస్గర్‌ హైవేపై ప్రత్యర్థి కదలికలపై స్పష్టంగా కన్నేయగలుగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement