India and China
-
శత్రుత్వం కన్నా మిత్రత్వం మిన్న..
శత్రుత్వాన్ని శాశ్వతీకరించడం చాలా సులభం. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న పక్షాలకు యుద్ధాలు రాజకీయ ప్రయోజనాలను తీసుకురావచ్చు కానీ ఆర్థిక, భౌగోళిక, చారిత్రక సత్యాలు ఎంతో విలువైనవి. చైనా జాతి చైతన్యంలో శతాబ్దాలుగా భారత్ ఒక భాగమై ఉంటూ వస్తోంది. చరిత్ర, హిమాలయన్ అనుసంధానం రీత్యా భారత్, చైనా ప్రజల మధ్య శత్రుత్వం శాశ్వతంగా ఉంటుందన్న అభిప్రాయాలు నేడు తిరస్కరణకు గురవుతున్నాయి. పైగా, భౌగోళిక రాజకీయాలు, పాలకుల పేరాశలు, సరిహద్దు వివాదాలు వంటివాటిని కఠిన వాస్తవాల ప్రాతిపదికన నిశితంగా విశ్లేషించాల్సి ఉంది. అతిపెద్ద పొరుగుదేశాల్లోని దాదాపు 300 కోట్ల మంది ప్రజల మధ్య సంబంధాలను కొద్దిమంది నేతలకు, వారి సలహాదార్లకు విడిచిపెట్టడం ప్రశ్నించాల్సిన విషయమే. చైనా ప్రెసిడెంట్ షి జిన్‌పింగ్ ఇటీవల టిబెట్ లోని నింగ్చి మెయిన్లింగ్ విమానాశ్రయంలో దిగి, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలోని లాసాకు బుల్లెట్ ట్రెయిన్లో ప్రయాణించడం రెండు అంశాలపై ఆసక్తి కలిగించింది. ఒకటి, పాక్షికంగా పూర్తిచేసిన ప్రమాదకరమైన 1,629 కిలోమీటర్ల రైల్ ప్రాజెక్టు. ఇది చైనాలో అతిపెద్ద ఇన్నర్ సిటీ అయిన చెంగ్డును పశ్చిమాన ఉన్న లాసాతో అనుసంధానిస్తుంది. ఈ మార్గంలోని చాలా భాగం అతిపెళుసైన, ఎల్తైన, భూకంపాలు చెలరేగే, పర్యావరణపరంగా ప్రమాదకరమైన భూభాగంనుంచి వెళుతుంది. ఈ ప్రాజెక్టులో తొలి భాగమైన చెంగ్డు నుంచి యాన్ మార్గం దాదాపుగా పూర్తయింది. నింగ్చి నుంచి లాసా మార్గం కూడా పూర్తయింది. అయితే యాన్ నుంచి నింగ్చి మార్గంలోనే అత్యంత పొడవైన మధ్య భాగం నిర్మాణం పూర్తి కావడానికి మరొక పదేళ్ల సమయం పట్టవచ్చు. రెండోది, దక్షిణ టిబెట్‌కి షీ జిన్‌పింగ్ యాత్ర... భారత్‌తో సరి హద్దు ఘర్షణకు చైనా జాతీయ ఎజెండాలో ఆయన అత్యంత కీలక స్థానం ఇస్తున్నట్లు సూచించింది. టిబెట్ పరిణామాలను అధ్యయనం చేస్తున్న బ్రిటిష్ స్కాలర్ రాబర్ట్ బర్నెట్ దీన్నే నొక్కి చెబుతున్నారు. చైనా ప్రభుత్వ మీడియా ఇప్పుడు భారత్‌కు ప్రాధాన్యమివ్వడం ద్వారా బర్నెట్ అంచనా మరోసారి నిజమైంది. 1980లలో రాజీవ్‌గాంధీ నుంచి 2014లో నరేంద్ర మోదీ వరకు భారత ప్రధానుల హయాంలో భారత్ సైనిక సామగ్రి పరంగా సాధించిన విజయాలను విస్తృతంగా గుర్తిస్తూ చైనా మీడియా ఇప్పుడు స్పందిస్తోంది. భారత్, చైనా మధ్య శత్రుత్వం కొనసాగే అవకాశముందని, ఘర్షణలకు సన్నద్ధమయ్యే ఆవశ్యకత కూడా ఉంటుందని వాస్తవికవాదులు తప్పక గుర్తించాల్సి ఉంది. అదేసమయంలో పవిత్రమైన హిమాలయాలను ఒక భారీ శ్మశాన వాటికగా మార్చిన ఆ విషాద ఉన్మాదాన్ని, యుద్ధం అనే ప్రమాదకరమైన ప్రయోగం ద్వారా హిమాలయా పర్వతాలకు, నదులకు నష్టం కలిగించే పర్యవసానాలను కూడా వీరు మనసులో ఉంచుకోవాల్సి ఉంది. శత్రుత్వాన్ని శాశ్వతీకరించడం చాలా సులభం. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న పక్షాలకు యుద్ధాలు రాజ కీయ ప్రయోజనాలను తీసుకురావచ్చు కానీ ఆర్థిక, భౌగోళిక, చారి త్రక సత్యాలను లెక్కించడం కూడా విలువైనదేనని చెప్పాలి. చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ (జీఏసీ) అంచనా ప్రకారం లద్దాఖ్ ఘర్షణలు చెలరేగిన 2020 సంవత్సరం నాటికి భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 87.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత సంవత్సరంలో ఇది 5.6 శాతానికి పడిపోయింది. చైనా నుంచి భారత్‌కు దిగుమతులు 66.7 శాతంగా నమోదయ్యాయి. 2016 నుంచి చూస్తే ఇది అతితక్కువ శాతం అన్నమాట. దాదాపు 10.8 శాతం పతనమైందన్నమాట. కానీ చైనాకు భారత్ ఎగుమతులు 2020లో 16 శాతం పెరిగి 20.86 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందాయి. వీటిలో ఇనుప ఖనిజం ఎగుమతులు అత్యధికంగా పెరిగాయి. భారత వాణిజ్య లోటు అయిదేళ్ల స్వల్పానికి అంటే 45.8 శాతానికి పడిపోయింది. కానీ ఈ సంవత్సరం ఇరుదేశాల మధ్య వాణిజ్యంలో మళ్లీ పెరుగుదల కనిపించింది. చైనా ప్రభుత్వ పత్రిక ‘గ్లోబల్ టైమ్స్ చైనా’ జీఏసీ నివేదికనుంచి పేర్కొన్నట్లుగా గత సంవత్సరంలో డాలర్ల రూపంలో పోలిస్తే, భారత్‌తో చైనా వాణిజ్యం 2021 జనవరి నుంచి జూన్ నెలలో 62.7 శాతానికి పెరిగింది. అంటే చైనా–భారత్ వాణిజ్యం వృద్ధి మొత్తం చైనా వాణిజ్యంలో రెండో స్థానం ఆక్రమించింది. దక్షిణా ఫ్రికా తొలి స్థానంలో ఉంది. కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొనేం దుకు అవసరమైన చైనా సరఫరాలు భారత్‌కు దిగుమతి కావడం బాగా పెరగడం దీంట్లో భాగమేనని చెప్పాలి. మరీ ముఖ్యంగా 2020 సంవత్సరంలో చైనా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 23 వేలమంది భారతీయ విద్యార్థులు విభిన్న కోర్సులలో చేరి అధ్యయనం సాగించారు. వీరిలో 21 వేలమంది డాక్టర్లు అయ్యేందుకు తమ పేర్లు నమోదు చేసుకోవడం విశేషం. 2021లో కూడా ఈ సంఖ్య మారలేదు. పైగా, చైనాలోని భారత్ లేక బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న బారతీయుల సంఖ్య కూడా తక్కువగా లేదు. చైనాలో మొత్తం 36 వేలమందికి పైగా భారతీయులు పనిచేస్తున్నారని అంచనా. ఈ సంఖ్య తక్కువేమీ కాదు. ఎర్రచైనా పెట్టుబడిదారీ విధానాన్ని పరిధికి మించి అధికంగా అనుమతించినట్లయితే, మతపరమైన, తాత్వికపరమైన విశ్వాసాలకు సంబంధించిన వాస్తవాలను కూడా అది ఆమోదిస్తున్నట్లు కనిపిస్తోంది. కన్ఫ్యూసియనిజంను గౌరవించి, చైనా ప్రభుత్వం స్వీకరించగా, మావో కాలంలో బౌద్ధమతం పట్ల సర్వసాధారణంగా అవలంబించిన సైద్ధాంతిక అవహేళనను నేటి చైనాలో అనుసరిస్తున్న సూచనలు లేవు. ఇప్పుడు టిబెట్‌లోనే కాకుండా చైనాలో ప్రతి చోటా బుద్ధిజం చొచ్చుకుపోయిందని పలువురు భారతీయులు గుర్తించడంలేదు. సంఖ్యలకు ప్రాధాన్యం ఉందంటే, చైనాలో పెరుగుతున్న లక్షలాది బౌద్ధమతానుయాయులు భారత్‌లో కంటే ఎక్కువ సంఖ్యలో ఉండి ప్రభావం చూపగలరన్నది వాస్తవం. బౌద్ధమత గ్రంథాలను పొందడం కోసం శతాబ్దాల క్రితం అత్యంత కష్టభూయిష్టమైన ప్రయాణాలు సాగించి భారత్‌కు చేరుకున్న చైనా పండితులు... అదృశ్యమయ్యే అవకాశమున్న భారతీయ చరిత్రను తమ రచనల్లో నమోదు చేశారు. ఇలాంటి పండితుల్లో సుప్రసిద్ధుడైన హుయాన్‌త్సాంగ్ భారతదేశంలో అత్యంత గౌరవం పొందాడు. చైనాలో అత్యంత జనాదరణ పొందిన 16వ శతాబ్దం నాటి చారిత్రక గాథ ‘గ్జియుజి లేదా పశ్చిమానికి పయనం’ అనే కథ... హుయాన్‌త్సాంగ్ 7వ శతాబ్దిలో భారత్‌కి సాగించిన తీర్థయాత్రను అత్యంత ఉత్కంఠతో, సరదాతో కూడిన సాహస యాత్రకు కాల్పనిక రూపమిచ్చిందని బహుశా చాలామంది భారతీయులకు తెలీకపోవచ్చు. 2015లో మరణించిన ఆంథోనీ సి. యు అనే అమెరికన్ పండితుడు ‘ఎ జర్నీ టు ది వెస్ట్’ అనే ఈ పుస్తకానికి చేసిన నాలుగు సంపుటాల అనువాదం ఇంగ్లిష్ అనువాదాల్లో అత్యుత్తమ రచనగా నిలిచిపోయింది. బుద్ధుడికి, జర్నీ టు ది వెస్ట్ గ్రంథానికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే చైనా జాతి చైతన్యంలో శతాబ్దాలుగా భారత్ ఒక భాగమై ఉంటూ వస్తోంది. ఈ చరిత్ర రీత్యా, హిమాలయన్ వారధి రీత్యా భారత ప్రజలు, చైనా ప్రజల మధ్య శత్రుత్వం శాశ్వతంగా ఉంటుందన్న అభిప్రాయాలు ఇప్పుడు తిరస్కరణకు గురవుతున్నాయి. మరోవైపున భౌగోళిక రాజకీయాలు, పాలకుల పేరాశలు, సరిహద్దు వివాదాలు వంటి వాటిని కఠిన వాస్తవాల ప్రాతిపదికన నిశితంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కాలమిస్టులకు అందుబాటులో ఉండవు. కాబట్టి వీటి నుంచి విశాల దృష్టితో కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, అతిపెద్ద పొరుగు దేశాల్లోని దాదాపు 300 కోట్ల ప్రజల మధ్య సంబంధాలను కొద్దిమంది నాయకులకు, వారి సలహాదార్లకు విడిచిపెట్టడం అన్నది ఆలోచించదగిన కీలక విషయం. రెండు.. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ కూటమిలో కొన్ని ఉపయోగకరమైన అంశాలు కూడా ఉండవచ్చు. ఎందుకంటే, ఒకటి అమెరికా నేతృత్వంలో, మరొకటి చైనా నేతృత్వంలో ఉండే రెండు శిబిరాల మధ్య ఆసియా, ప్రపంచ ప్రజలను విడదీసే ప్రయత్నాలు చెడు ఫలితాలను ఇవ్వవచ్చు. కాబూల్ ప్రభుత్వం తెలుసుకున్నట్లుగా అగ్రరాజ్యాలు శాశ్వతమైన రక్షణ ఛత్రాలను అందించవు. అందుకే, క్వాడ్ కూటమి కంటే ఎక్కువగా, భారతీయ స్వతంత్ర పౌరుల స్వేచ్ఛ, రాజకీయ నేతలను ఓటు వేసి సాగనంపే భారత పౌరుల సామర్థ్యం అనేవి చైనా ప్రజలకు అత్యంత ప్రభావం కలిగించే సందేశాన్ని ఇస్తాయి. చైనా ప్రజలు ఈర‡్ష్య పడేవిధంగా, భారత్‌లో ఉన్న మనం మన నేతలను పరిహాసం చేయవచ్చు, అవహేళన చేయవచ్చు లేదా ఇంటికి సాగనంపవచ్చు కూడా. మనం ఈ ప్రయోజనాన్ని కూడా కోల్పోయామంటే ఇక ఆట ముగిసినట్లే. -రాజ్‌మోహన్ గాంధీ వ్యాసకర్త ప్రస్తుతం ఇలినాయ్ యూనివర్సిటీలో బోధకుడుగా ఉన్నారు -
అసంపూర్ణ చర్చలు
భారత–చైనాల మధ్య కోర్ కమాండర్ల స్థాయిలో జరిగిన ఆరో దఫా చర్చలు యధావిధిగా అసంపూర్తిగా ముగిశాయి. ఆ తర్వాత ఒక ఉమ్మడి ప్రకటన కూడా వెలువడింది. అయితే ఎప్పటిలాగే అది కూడా అస్పష్టంగానే వుంది. చైనా సైనికులు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చొరబాటుకు దిగడానికి ముందున్న యధాపూర్వ స్థితి పునరుద్ధరణకు రెండు పక్షాలూ ఏం చర్యలు తీసుకో బోతున్నాయో, ప్రతిష్టంభన తొలగింపు కోసం తిరిగి చర్చలు ఎప్పుడు ప్రారంభిస్తాయో అందులో చెప్పలేదు. సోమవారం ఉదయం 9.30 ప్రాంతంలో మొదలైన చర్చలు రాత్రి 10.30 వరకూ సాగాయంటే చాలా అంశాల విషయంలో ప్రతినిధి బృందాల మధ్య వాదోపవాదాలు జోరుగానే సాగివుంటాయనుకోవాలి. నెలన్నర వ్యవధి తర్వాత ఈ చర్చలు చోటుచేసుకున్నాయి. ఈసారి చర్చల్లో మన విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి హోదా స్థాయి అధికారి పాల్గొనడమే విశేషం. ఎల్ఏసీలో ప్రస్తుతం ఎలాంటి ఘటనా జరగటంలేదన్న మాటేగానీ.. ఉద్రిక్తతలు ఎక్కువే. ఎందుకంటే ఇరుపక్కలా చెరో 40,000మంది సైనికులు సర్వసన్నద్ధంగా వున్నారు. వారి వద్ద శతఘ్నులు, తుపాకులు, క్షిపణులు వున్నాయి. ఏ పక్షంనుంచి ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెను ఘర్షణలకు దారితీసే ప్రమాదం వుంది. కనుకనే చర్చలు త్వరగా కొలిక్కి వచ్చి సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడాలని అందరూ కోరుకుంటున్నారు. ఎల్ఏసీ వద్ద రెండు దేశాల మధ్యా ఖచ్చితమైన, పరస్పర ఆమోదయోగ్యమైన సరిహద్దు లేనిమాట వాస్తవమే అయినా... దశాబ్దాలుగా ఇరు సైన్యాలు గస్తీ కాస్తున్న ప్రాంతాలు స్పష్టంగానే వున్నాయి. సైన్యం కదలికలు పూర్తిగా భౌగోళిక మ్యాప్‌లపై ఆధారపడి వుంటాయి గనుక పొరబడే అవకాశం లేనేలేదు. అందువల్లే మన దేశం చైనా సైన్యం తమ పాత ప్రాంతానికే పరిమితమై వుండాలని పట్టుబడుతోంది. ప్యాంగాంగ్ సో, చుశాల్, గోగ్రా హాట్ స్ప్రింగ్స్, డెస్పాంగ్ ప్రాంతాలనుంచి చైనా వైదొలగాలని కోరుతోంది. అలా వైదొలగడానికి సంబంధించిన పథకమేమిటో చెప్పాలంటోంది. మిగిలిన ప్రాంతాల్లోకన్నా డెస్పాంగ్ వద్ద చైనా సైన్యం బాగా లోపలికి చొచ్చుకొచ్చింది. అది దాదాపు 15 కిలోమీటర్ల వరకూ వుంటుందంటున్నారు. అయితే మీరే ప్యాంగాంగ్ సో సరస్సు సమీపంలోని ఫింగర్–5, ఫింగర్–6 శిఖరాల నుంచి వైదొలగాలని చైనా డిమాండ్ చేస్తోంది. ఆ తర్వాతే తాము ఆక్రమిత ప్రాంతాల నుంచి వైదొలగే అంశాన్ని పరిశీలిస్తామంటోంది. ఉమ్మడి ప్రకటనలో వీటి ప్రస్తావన ఎక్కడా లేదు. చైనా వెనక్కు తగ్గడానికి నిరాకరించడాన్ని చూశాక మన సైన్యం గత నెలాఖరున ప్యాంగాంగ్ సో సరస్సు వద్ద వున్న కైలాష్ రేంజ్ శిఖరాల్లో భాగమైన ఫింగర్–5, ఫింగర్–6 శిఖరాలపై పట్టు సాధించింది. వ్యూహాత్మకంగా మన సైన్యం పైచేయి సాధించడానికి ఇవి ఉపయోగపడతాయి. చైనా సైన్యం కదలికలు, వారు చేరేసుకుంటున్న ఆయుధాలు వగైరా సులభంగా తెలుస్తాయి. పశ్చిమంవైపు విస్తరించకుండా అడ్డుకునేందుకు అది దోహదపడుతుంది. కనుకనే ఇక్కడినుంచి వెనక్కు వెళ్లాలని చైనా పట్టుబడుతోంది. ఉద్రిక్తతలు, ఘర్షణలు ఇరు దేశాలకూ ఏమాత్రం మేలు చేయబోవన్న అంశంలో రెండు దేశాలదీ ఒకే మాట. ఈ నెల 10న ఉభయ దేశాల విదేశాంగమంత్రులూ మాస్కోలో సమావేశమైనప్పుడు దీన్ని అంగీకరించారు. కనుకనే ఈసారి జరిగే కోర్ కమాండర్ల స్థాయి చర్చల్లో పురోగతి వుంటుందనుకున్నారు. అయితే ఈ స్థాయి చర్చలు ఎక్కువ సందర్భాల్లో దేశాధినేతలు వాస్తవ పరిస్థితిపై లోతైన అవగాహన పెంచుకోవడానికి, సరిహద్దు వివాదంలో అవతలి పక్షం ఉద్దేశాలేమిటో తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. తుది పరిష్కారం లభించాలంటే అది అధినేతల మధ్య జరిగే చర్చల్లో మాత్రమే సాధ్యం. అధినేతలు కేవలం సైనిక కోణంలో మాత్రమే సమస్యను చూడరు. మొత్తంగా అంతర్జాతీయ పరిస్థితులు, పరిణామాలు చూసుకుని ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దేశానికి గరిష్టంగా ప్రయోజనం కలుగుతుందో తేల్చుకుంటారు. ఆ మేరకు తమ తమ సైన్యాలకు సూచనలిస్తారు. ఇప్పుడున్న సైనిక దళాల సంఖ్యను రెండు దేశాలూ పెంచకూడదన్న అంశంలో కోర్ కమాండర్ల స్థాయి చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరిందని ఉమ్మడి ప్రకటన చెబుతోంది. అయితే ఇప్పటికే అక్కడ చైనా అవసరమైనమేర సైన్యాన్ని పెంచుకుందనేది మరిచిపోకూడదు. అన్ని దేశాలతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ విభేదాలను తగ్గించుకోవాలని, వివాదాలను సామ రస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈమధ్య జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాలనుద్దేశించి పంపిన వీడియో ప్రసంగంలో చెప్పారు. ఆ మాటల్లో చిత్తశుద్ధి ఎంతవుందో మన దేశమే కాదు... ప్రపంచమంతా గమనిస్తుంది. రెండు దేశాల రక్షణమంత్రులు, విదేశాంగమంత్రులు చర్చించుకున్నా కోర్ కమాండర్ల స్థాయి చర్చల్లో మెరుగైన పురోగతి లేకపోవడం అందరూ చూస్తున్నారు. తూర్పు లద్దాఖ్‌లో చైనా దూకుడుకు కారణాలేమిటో తెలియనివారెవరూ లేరు. జమ్మూ–కశ్మీర్ ప్రతిపత్తిని రద్దు చేసి దాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించినప్పటినుంచీ చైనా, పాకిస్తాన్లకు అది కంటగింపుగా వుంది. చైనా లద్దాఖ్‌లో చొచ్చుకొస్తే, పాకిస్తాన్ గిల్గిత్–బాల్టిస్తాన్‌కు సంబంధించిన కొత్త మ్యాప్ విడుదల చేసి వివాదం రేపాలని చూసింది. వారి ఉమ్మడి ఎజెండా సుస్పష్టం. 1979లో ఆనాటి చైనా అధినేత డెంగ్ జియావో పెంగ్ ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారిస్తూ ఉదారవాద విధానాలు ప్రారంభించినప్పుడు చైనాలో ఏకస్వామ్య వ్యవస్థ బద్దలు కావడానికి అవి దోహదపడతాయని పాశ్చాత్య దేశాలు భావించాయి. కానీ తూర్పు చైనా సముద్రంలోనైనా, తూర్పు లద్దాఖ్లోనైనా చైనా తీరు చూస్తుంటే ఆ ఆర్థికాభివృద్ధి ఆంతర్యం ప్రపంచంపై పట్టు సాధించడానికేనన్న సంశయాలు కలుగుతున్నాయి. తమకా ఉద్దేశం లేదని నిరూపించుకునే బాధ్యత ఇప్పుడు చైనాదే. -
ప్రచార యుద్ధంలో చైనా కొత్త తంత్రం
భారత సైన్యం సరిహద్దుల్లో ఎదురుదాడి చేయడంతో చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలోని మీడియా భారత్ తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందంటూ హెచ్చరించడం మొదలెట్టింది. ఇది ప్రచార యుద్ధంలో సరికొత్త తంత్రం. పైగా భారత సైన్యం పీఏల్ఏ పైకి కాల్పులు జరిపినట్లయితే అది భారత సైన్యాన్నే తుడిచిపెట్టేటటువంటి పర్యవసానాలకు దారి తీస్తుందని బెదిరింపులకు దిగుతోంది. వాస్తవానికి పర్వత ప్రాంత యుద్ధంలో రాటుదేలిపోయిన భారత సైన్యాన్ని గత కొన్ని దశాబ్దాలుగా యుద్ధానుభవం లేని పీఎల్ఏ బలగాలు నిలువరించలేవన్నది వాస్తవం. చైనా ప్రచారయుద్ధాన్ని చైనా భూభాగంలోనే భారత్ తిప్పికొట్టగలిగితే చైనా ప్రజల, చైనా సైనిక కుటుంబాల నైతిక ధృతిని చెల్లాచెదురు చేయవచ్చు. వాస్తవాధీన రేఖ పొడవునా భారత సైన్యం ఇప్పుడు ఆధిపత్య స్థానాన్ని స్థిరపర్చుకున్న తర్వాత, యుద్ధం తప్పదంటూ భారత్‌ని హెచ్చరించే తీవ్రమైన ప్రచార యుద్ధతంత్రాన్ని చైనా పునరుద్ధరిం చింది. రోజు తర్వాత రోజు ఈ ప్రచార స్థాయి పెరుగుతూండటం గమనార్హం. ముందుగా కాల్పులు ప్రారంభించింది భారతదేశమే అంటూ ఆరోపించిన చైనా పత్రిక ది గ్లోబల్ టైమ్స్ సెప్టెంబర్ 8న దూకుడు ప్రకటన చేసింది. ‘చర్చలకు సిద్ధమవుతున్న చైనా గస్తీ దళాలపైకి భారత బలగాలు రెచ్చగొట్టే ధోరణితో కాల్పులు ప్రారంభించాయి. ఇది సైనికపరంగా తీవ్రంగా రెచ్చగొట్టే అంశమే తప్ప మరొకటి కాదు.’ ప్రజా విముక్తి సైన్యానికి చెందిన పశ్చిమరంగ కమాండ్ ప్రతినిధి కల్నల్ జాంగ్ షుయిలి ఈ అంశంపై మరింతగా మాట్లాడారు. ప్రమాదకరమైన చర్యలను వెంటనే ఆపివేయాలని, సరిహద్దులు దాటి మరీ లోపలికి వచ్చిన సైనిక బలగాలను తక్షణమే ఉపసంహరించాలని, సరిహద్దుల్లో ఫ్రంట్ లైన్లో ఉన్న భారత బలగాలను అదుపులో పెట్టాలని మేం అభ్యర్థిస్తున్నాం, అలాగే ముందుగా చైనా బలగాలపైకి కాల్పులు ప్రారంభించిన భారత బలగాలపై తీవ్ర స్థాయిలో విచారించాలని చైనా ప్రతినిధి ప్రకటన చేశారు. అయితే భారత సైన్యం చైనా ప్రకటనను తోసిపుచ్చింది. ‘వాస్తవాధీన రేఖ సమీపంలో ఉన్న మా సైనిక దళాలపైకి ముందుగా చైనా దళాలే కాల్పులు జరిపిన తర్వాతే మా దళాలు వారిని అడ్డుకున్నాయి. మా బలగాలను బెదిరించే లక్ష్యంతో పీఎల్ఏ దళాలు కొన్ని రౌండ్ల కాల్పులు జరిపాయి’. దీంతో ప్రకటనలు దాని ఖండన ప్రకటనల ఆట మొదలైపోయింది. భారత సైన్యాలు ఎదురుదాడి చేయడంతో చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలోని మీడియా భారత్ తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందంటూ తీవ్రస్థాయిలో హెచ్చరిం చడం మొదలెట్టింది. చైనా మీడియా చాలావరకు ప్రస్తుత దృశ్యాన్ని 1962 నాటి దృశ్యంతో పోల్చి చూస్తోంది. సెప్టెంబర్ 8న ది గ్లోబల్ టైమ్స్ పత్రిక స్పష్టంగా దీన్ని ఎత్తిచూపింది. ‘చైనా 1962 యుద్ధంలో విజయం సాధించింది. ఇది భారత్‌కు గుణపాఠం కావాలి. పైగా, దశాబ్దాల క్రితం పీఎల్ఏ ఉపయోగించిన సైనిక సామర్థ్యంతో పోలిస్తే ప్రస్తుత చైనా సైనిక సామర్థ్యం అత్యున్నత స్థాయిలో ఉంది. సమాచార సమర్థత, వ్యవస్థీకృత పోరాట సామర్థ్యం, సంయుక్త పోరాట సామర్థ్యంతో కూడిన పీఎల్ఏ ఇప్పుడు ఒక అత్యాధునిక సైన్యం’. అదే రోజు వచ్చిన మరొక కథనం కూడా ఇదే రీతిలో సాగింది. ‘పీఎల్ఏ మొట్టమొదటగా కాల్పులు మొదలెట్టలేదు. కానీ భారత సైన్యం పీఎల్ఏ పైకి కాల్పులు జరిపినట్లయితే అది భారత సైన్యాన్నే తుడిచిపెట్టేటటువంటి పర్యవసానాలుకు దారితీస్తుంది. ప్రస్తుత సంఘర్షణను పెంచాలని భారత సైన్యం సాహసించినట్లయితే మరిన్ని భారత బలగాల నిర్మూలన జరగడం ఖాయం’. అయితే చైనా పత్రిక చేసిన ఈ వ్యాఖ్యలు భారత ప్రజానీకాన్ని, ప్రతిపక్ష రాజకీయ పార్టీలను, శాంతికాముకులను ప్రభావితం చేసేలా సోషల్ మీడియాలో కనిపించాయి. చైనా సైనిక స్థానాలకు ప్రమాదకరంగా తయారైన భారత సైనిక స్థానాల నుంచి వెనక్కు తగ్గి, ఉపసంహరించుకునేలా భారత ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే ఈ వ్యాఖ్యల ఉద్దేశం. వాస్తవానికి ఇప్పుడు చైనా ముందున్న ఏకైక ఎంపిక ఏదంటే మరిన్ని తీవ్ర దాడులను ప్రారంభించి తన సైనికులను భారీగా నష్టపోవడమే. అయితే తన ప్రచార కార్యక్రమాలు మొత్తంగా బూటకం అని నిరూపించే అనేక అంశాలను చైనా మీడియా అస్సలు పేర్కొనడం లేదు. 1962లో కూడా భారత బలగాలు మందుగుండు సామగ్రి, శీతాకాల దుస్తులు, ఆర్టిలరీ, గగనతల మద్దతు ఏమాత్రం లేనప్పటికీ చివరి మనిషి బతికి ఉన్నంతవరకు, చిట్టచివర తూటా పేల్చేంతవరకు విడివిడి స్థానాల్లో పోరాడుతూ చివరకు చైనా సైన్యమే దిగ్భ్రాంతికి గురయ్యేంత నష్టాలను పీఎల్ఏకు కలిగించాయి. అయితే ఆనాడు సైనిక చర్యలను ముందుకు తీసుకుపోగల వనరులు భారత సైన్యం వద్ద లోపించాయి. అయితే ఆనాటి ఆ లోటుపాట్లు ఇప్పుడు భారత సైన్యానికి అస్సలు లేవు. అలాగే తన బలగాలకు తీవ్ర నష్టం కలిగిన 1967 నాటి నాథూలా, చో లా ప్రాంతాల్లోని ఘర్షణల గురించి చైనా ఎన్నడూ పేర్కొనలేదు. భారత బలగాల ప్రతిదాడికి తట్టుకోలేక చైనా సైన్యం పలాయనం చిత్తగించింది. అదేవిధంగా ఇప్పుడు గల్వాన్ ప్రాంతంలో తమకు కలిగిన నష్టాల గురించి అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ కూడా చైనా ఇంతవరకు వెల్లడించలేదు. అలాగే పాకిస్తాన్‌తో యుద్ధ కాలంలో కార్గిల్, సియాచిన్ ఎల్తైన పర్వతప్రాంతాల్లో భారత బలగాలు చేసిన భీకర దాడికి సంబంధించిన తీవ్రత, దాని అనుభవాలను కూడా చైనా ఎన్నడూ కనీసంగా కూడా పేర్కొనలేదు. లద్దాఖ్ ప్రాంతంలో చైనా హాన్ జాతి సైనికులు ఎదుర్కొంటున్న తీవ్రమైన అననుకూలతను కూడా చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలోనే చైనా మీడియా దాచి ఉంచుతోంది. చైనా సైన్యంలోని 60 శాతం మంది గ్రామీణ చైనా నుంచి నియమితులైనవారితో కూడిందే. భవి ష్యత్తు ఉద్యోగం కోసమే వీరు సైన్యంలో చేరారు తప్పితే యుద్ధాల్లో పాల్గొనాలనే కాంక్షతో కాదు. వీరు టిబెట్, లద్దాఖ్ ప్రాంతాల్లోని గడ్డకట్టించే శీతాకాల పరిస్థితుల్లో బతికి బట్టకట్టలేరు. చారిత్రకంగా చూస్తే కూడా పీఎల్ఏ ప్రతి ఏడాది నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు సరిహద్దుల్లోని తన బలగాలను చైనా మైదాన ప్రాంతాలకు వెనక్కు పంపుతూ స్థానికంగా రిక్రూట్ చేసుకున్న సరిహద్దు రక్షణ రెజిమెంట్లను, మిలీషియాను వాస్తవాధీన రేఖ వద్ద గస్తీకోసం ఉంచుతోంది. చైనాలో హాన్ జాతి సైనికులు శీతాకాలంలో కూడా తట్టుకుని సరిహద్దుల్లోనే మనగలిగి ఉంటే వారిని అడ్డుకోవడం భారత సైన్యానికి కాస్త కష్టమయ్యేది. చైనా హాన్ జాతి సైనికులు అలాంటి వాతావరణంలో మనగలగడం అసాధ్యం. ఈ కారణం వల్లే చైనా ప్రస్తుత ఘర్షణాత్మక స్థితిని శీతాకాలం పొడవునా కొనసాగించాలని భావించడం లేదు. అదే సమయంలో ప్రస్తుత ఘర్షణను నిలిపివేయాలని భారత్ తొందరపడటం లేదు. ఇప్పటికే మన సైన్యం దీర్ఘకాలిక పోరాటానికి సన్నాహాలు ప్రారంభించింది. మరొక వాస్తవమేమిటంటే 1962లో పీఎల్ఏ తనకు జరిగిన నష్టాలను అంగీకరించి ఉండవచ్చు. ఎందుకంటే అప్పట్లో చైనాలో కుటుంబానికి ఒక్కరే సంతానం అనే విధానం అమలులో ఉండి 1979 వరకు అది కొనసాగింది. పైగా చైనాకు జరిగిన భారీ నష్టాలను చెప్పేందుకు అప్పట్లో బహుముఖ మీడియా నెట్వర్క్ లేదు. ఇప్పుడు పరిస్థితి బాగా మారింది. ప్రతి చైనా సైనికుడూ బ్రహ్మచారి అయినట్లయితే కనీసం తల్లిదండ్రులు, అవ్వాతాతలు కలిపి ఆరుగురు కుటుంబ సభ్యులను పోషించాల్సి ఉంది. ఇప్పుడు చైనా సైనికుడు ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి అది శరాఘాతమే అవుతుంది. చైనా సైనికుడికి పెళ్లి కూడా అయి ఉంటే, అతడిపై ఆధారపడేవారి సంఖ్య ఇంకా పెరుగుతుంది. అందుకే 1960లలోలాగా తనవైవు ఎంతమంది సైని కులు చనిపోయారు అని లెక్క ప్రకటించే స్థితిలో చైనా ఇప్పుడు లేదు. పైగా చైనా 1979లో వియత్నాంలో తన చివరి యుద్ధాన్ని ముగిం చింది. అప్పుడు సైతం అది అవమానకరంగా వెనుదిరగాల్సి వచ్చింది. బలహీనమైన, అనుభవ లేమితో కూడిన, తమపై కుటుంబాలు ఆధారపడి ఉన్న చైనా సైనికులు యుద్ధాల్లో రాటుదేలిన సుశిక్షితులైన భారత సైనికులతో తలపడటం అంటే చందమామను తెచ్చివ్వమని కోరినట్లే కాగలదు. కార్గిల్, సియాచిన్ యుద్ధ దృశ్యాలతో కూడిన వీడియోలను కౌంటర్ ప్రాపగాండా యుద్ధ తంత్రంలో భాగంగా భారత్ విడుదల చేస్తే, ప్రస్తుత భారత సైన్యం సమర్థత ఏంటో చైనాకు అర్థమవుతుంది. పాకిస్తాన్ బలగాలతో అతిఎత్తైన పర్వత ప్రాంతాల్లో భారత సైనికులు కార్గిల్‌లో యుద్ధం చేసిన అనుభవంతో పోల్చితే కేవలం తుపాకీ కాల్పుల శిక్షణకు పరిమితమైన చైనా ప్రాపగాండా వీడియోలు ఎంత పేలవంగా ఉంటాయో ఎవరైనా పోల్చుకోవచ్చు. ప్రస్తుత ప్రచారయుద్ధంలో సమస్య ఏమిటంటే ప్రపంచ సోషల్ మీడియా సైట్లను చైనాలో నిషేధించారు. ఇక చైనా సొంత సోషల్ మీడియా బయటి ప్రపంచంలోకి జొరబడే అవకాశం తక్కువ. ఈ చైనా సోషల్ మీడియాలోకి జొరబడి భారత సైనిక బలగాల సామర్థ్యాన్ని ప్రదర్శించిగలిగితే చైనా ప్రజలు, చైనా బలగాల నైతిక ధృతిని చెదర గొట్టవచ్చు. అందుకే భారత ప్రచార యుద్ధ తంత్రం చైనాలోకి చొచ్చుకెళ్లాలి. సంవత్సరాలుగా చైనా బలగాలను ఎదుర్కొంటూ అనుభవం సాధించిన భారత సైన్యం.. చైనా సైన్యం గుట్టుమట్ల గురించి పూర్తి అవగాహనతో ఉంది. కాబట్టే అత్యంత కఠిన పరిస్థితుల్లో భారత్ సైన్యానిదే పైచేయిగా ఉంటోంది. ఇక భారత సైన్యం తన సమర్థతల గురించి చక్కటి అవగాహనతో ఉన్నందున చైనా సైనిక దాడులను చక్కగా నిలువరించే స్థానంలో ఉంది. (ది స్టేట్స్‌మన్ సౌజన్యంతో) హర్ష కకార్, రిటైర్డ్ మేజర్ జనరల్, భారత సైన్యం -
దృఢ వైఖరితోనే దారికి...
వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద ఏం జరుగుతున్నదో వెల్లడించాలంటూ కొన్నాళ్లుగా విపక్షాలు నిల దీస్తున్న తరుణంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం లోక్‌సభలో అందుకు సంబంధించి ఒక ప్రకటన చేశారు. చైనా భారీగా సైన్యాన్ని మోహరించడంతో లద్దాఖ్ ప్రాంతంలో మనం పెను సవాల్‌ని ఎదుర్కొంటున్నామని ఆయన అంగీకరించారు. దీన్ని దీటుగా ఎదుర్కొంటామని ప్రకటిం చారు. చైనా సైన్యం మన భూభాగంలోకి చొచ్చుకొచ్చిందా, మన భూభాగాన్ని ఆక్రమించిందా అన్న విషయంలో ఇందులో వివరణ లేదు. సరిగ్గా ఈ అంశంపైనే విపక్షాలు ఆదినుంచీ నిలదీస్తున్నాయి. ఎల్ఏసీ వద్ద చైనా సైన్యం చొచ్చుకురావడం, కల్నల్ సంతోష్‌బాబుతోసహా మన జవాన్లు 21 మందిని కొట్టిచంపడం వంటి ఘటనలు జరిగాక చైనా సైనికులు ప్యాంగాంగ్ సో తదితర ప్రాంతాల్లో మన భూభాగాన్ని దురాక్రమించారన్న వార్తలొచ్చాయి. ‘ఎవరూ మన భూభాగంలోకి రాలేదు... దేన్నీ స్వాధీనం చేసుకోలేద’ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశాక కూడా ఎవరికీ సంతృప్తి కలగ లేదు. అటు తర్వాత ఎల్ఏసీలో కాల్పుల ఘటన కూడా చోటుచేసుకుంది. గత నెలాఖరున మన దళాలు చైనా సైన్యంపై పైచేయి సాధించాయన్న కథనాలు కూడా వచ్చాయి. ఇలా వివిధ సంద ర్భాల్లో వస్తున్న కథనాలపై ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత లేదు. రాజ్‌నాథ్‌సింగ్ తాజా ప్రకటన కొంతమేరకు వివరణ ఇచ్చిందనే అనాలి. ఎందుకంటే మన ‘లోపలి ప్రాంతాల్లోకి’ వారు చొచ్చు కొచ్చారన్న మాట ఆయన ఉపయోగించారు. అలాగే ఎల్ఏసీని ఏకపక్షంగా మార్చడానికి చైనా ప్రయ త్నించిందని ఆరోపించారు. అయితే ఆ సందర్భంగా తాత్కాలికంగానైనా వారి స్వాధీనంలోకి ఏ ప్రాంతమైనా వెళ్లిందా లేదా అనిగానీ... ఆగస్టు నెలాఖరున మన దళాలు కూడా దూకుడు ప్రదర్శించి ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ ప్రాంతాన్ని కైవసం చేసుకున్నాయా అన్నదిగానీ వివరించలేదు. మన జవాన్ల మరణానికి దారికి తీసిన ఘర్షణల స్వభావం ఎటువంటిదో, ఏ క్రమంలో అవి చోటు చేసుకున్నాయో కూడా ఆ ప్రకటన వివరించలేదు. రాజ్‌నాథ్ ప్రకటనపై చర్చించడానికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఇలాంటి అంశాలు తెలిసే అవకాశం లేదు. కేంద్రం చెబుతున్నట్టు ఇది సున్నితమైన సమస్యే కావొచ్చు... కానీ కనీసం మన జవాన్ల ప్రాణం తీసిన ఉదంతంలో ఏం జరిగిందో స్పష్టతనిచ్చివుంటే బాగుండేది. భారత–చైనాల మధ్య సైన్యం స్థాయిలో చర్చలు జరగడంతోపాటు ఈ నెల మొదట్లో రెండు దేశాల రక్షణమంత్రులు, విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. ఆ భేటీల్లో అవగాహన కుదిరింది. సామరస్య వాతావరణం ఏర్పడుతుందన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. కానీ రెండు మూడు రోజులుగా తీరుమారింది. కోర్ కమాండర్ల స్థాయి చర్చలపై చైనా మౌనం వహిస్తోందన్న వార్తలొస్తున్నాయి. ఇది కలవరపరుస్తుంది. తొలుత అనుకున్న ప్రకారం ఈ వారం మొదట్లో కోర్ కమాండర్ల మధ్య చర్చలుండాలి. ప్యాంగాంగ్ సో సరస్సు దక్షిణ ప్రాంతంలోని పర్వత ప్రాంతం మన దళాల నియంత్రణలోకొచ్చిందని, అక్కడినుంచి వారిని పంపేయడానికి చైనా పథకాలు పన్ను తోందని చెబుతున్నారు. రెండు పక్కలా సైన్యాల మోహరింపు, వాటికి అవసరమైన సైనిక సామగ్రి, యుద్ధ విమానాలు, విమాన విధ్వంసక క్షిపణులు, ఆహారం వగైరాలు లద్దాఖ్ ప్రాంతంలోకి చేర డంతో అక్కడ ఏమైనా జరగొచ్చునన్న అనుమానాలున్నాయి. బహుశా కేంద్రం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే లోక్‌సభలో చర్చకు అంగీకరించకపోయి వుండొచ్చు. సాధారణంగా సైన్యం మోహరింపు దానికదే ఘర్షణలకు దారితీయదు. ఆత్మరక్షణ కోసం, తాము సంసిద్ధంగా వున్నామని అవతలి పక్షానికి చెప్పడం కోసం ఎక్కువ సందర్భాల్లో సైన్యం మోహరింపు వుంటుంది. సరిహద్దులపై జరిగే చర్చల్లో బేరసారాలు జరపడానికి అది ఉపయోగపడుతుంది. కానీ సుదీర్ఘకాలం ఎదురుబొదురుగా సైన్యాలుంటే ఏ చిన్నపాటి వివాదమైనా సాయుధ ఘర్షణలకు దారితీసే ప్రమాదం కూడా వుంటుంది. లద్దాఖ్‌లోనూ, అక్కడికి సమీపంలోని మరికొన్ని సెక్టార్లలోనూ ఎల్ఏసీ ఎక్కడన్న అంశంలో భారత, చైనాల మధ్య మొదటినుంచీ విభేదాలున్నాయి. సిక్కిం సెక్టార్లో అక్కడక్కడ కొన్నిచోట్ల కొన్ని మీటర్ల తేడా మాత్రమే వుంది. కానీ మరికొన్నిచోట్ల 20, 30 కిలోమీటర్ల ప్రాంతం మాదంటే మాదన్న పోటీ వుంది. ఇరు దేశాల విదేశాంగమంత్రులు మాస్కోలో సమావేశమైనప్పుడు కోర్ కమాండర్ల స్థాయిలో సమస్య పరిష్కారానికి కృషి చేద్దామన్న విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది. ఘర్షణలు మరింత ముదరకుండా వుండాలంటే సత్వరం పరిష్కారం కుదరాలి. అయితే కమాండర్లు వారంతట వారే ఇంత జటిలమైన సమస్యను పరిష్కరించలేరు. ప్రభుత్వాధినేతల నుంచి స్పష్టమైన ఆదేశాలొస్తే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు సొంతంగా నిర్ణయం తీసుకునేది వుండదు. ఇరు దేశాధినేతల భేటీ జరిగినప్పుడే అది సాధ్యమవుతుంది. మన సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దృఢంగా కాపాడుకుంటూనే శాంతియుత పరిష్కారానికి కృషి చేస్తామని రాజ్‌నాథ్ తాజా ప్రకటన చెబుతోంది. అది సాకారమై ఉద్రిక్తతలు సాధ్యమైనంత త్వరలో సడలాలని అందరూ ఆశిస్తారు. -
రెచ్చగొడితే తిప్పికొడతాం
న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా నిర్వాకం వల్లనే ఉద్రిక్తత నెలకొందని, దీనిపై ముందుకెళ్లాలంటే చర్చలే మార్గమని భారత్ తేల్చిచెప్పింది. యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నందువల్లనే లద్దాఖ్‌లో నాలుగు నెలలుగా ఉద్రిక్తత కొనసాగుతోందని స్పష్టం చేసింది. దీన్ని పరిష్కరించడానికి ఉన్న ఏకైక మార్గం చర్చలేనని చెప్పింది. ఒకవైపు విదేశాంగ శాఖ చర్చల కోసం భారత్ సిద్ధంగా ఉందని చెబుతుండగా, మరోవైపు చైనా రెచ్చగొట్టే చర్యలను తిప్పిగొట్టే సామర్థ్యం తమ త్రివిధ బలగాలకు ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. తగిన రీతిలో డ్రాగన్ దేశానికి బుద్ధి చెప్పేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. వాస్తవాధీన రేఖ వద్ద అలజడి నేపథ్యంలో గురువారం ఆర్మీ చీఫ్ నరవాణే, వాయుసేనాధిపతి భదౌరియా తమ బలగాల యుద్ధ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. చైనా కవ్వింపు చర్యలతో సైనిక బలగాల మోహరింపులో భారత్ మార్పులు చేసింది. వాయుసేన బలగాలు రాత్రిపూట తూర్పు లద్దాఖ్‌లోని గగనతలంలో పెట్రోలింగ్ చేపడుతూ ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనాకు పరోక్షంగా సంకేతాలు పంపుతోంది. ఒప్పందాలను గౌరవించాలి భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చైనా ఆగడాలను మీడియా సమావేశంలో ఎండగట్టారు. ద్వైపాక్షిక ఒప్పందాలను, ప్రొటోకాల్‌ను చైనా ఉల్లంఘించడం వల్లనే సరిహద్దులో దాదాపు మూడు దశాబ్దాలుగా ఉద్రిక్తత నెలకొందన్నారు. ఒప్పందాలను గౌరవించి తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని చైనాను కోరారు. శాంతియుత చర్చలతో అన్ని అంశాలను పరిష్కరించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. దౌత్య, మిలిటరీ మార్గాల ద్వారా చర్చలకు రావాలని చైనాను కోరారు. ఇరుదేశాల విదేశాంగ మంత్రులు, ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు సరిహద్దులో బాధ్యతాయుతంగా మెలగాలని, ఏ ఒక్కరు కూడా ఉద్రిక్తత నెలకొనేలా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని ఆయన పేర్కొన్నారు. సరిహద్దులో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ఏకపక్షంగా వ్యహరించిందని మండిపడ్డారు. ఈనెల 10న మాస్కోలో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) నిర్వహించే సదస్సులో విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొంటారని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎనిమిది దేశాలుండే ఎస్సీఓలో చైనా కూడా భాగస్వామిగా ఉంది. వాయుసేన సన్నద్ధత సరిహద్దులో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో వాయుసేన చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ పరిధిలోని కీలకమైన ప్రాంతాలను సందర్శించారు. గురువారం అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి వాయుసేన సన్నద్ధతపై సమీక్షించారు. వాయుసేన చాలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారని అధికారులు చెప్పారు. షిల్లాంగ్‌లో ఉండే ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ కేంద్ర కార్యాలయం అరుణాచల్, సిక్కింలోని ఎల్ ఏసీ వెంబడి ఉన్న కీలక ప్రాంతాల గగనతలంపై పహారా కాస్తుంది. భదౌరియా ఈస్ట్రన్ కమాండ్ పరిధిలోని కీలక స్థావరాలను సందర్శించారని వాయుసేన తెలిపింది. లద్దాఖ్‌లో ఆర్మీ చీఫ్ పాంగాంగ్లో చైనా దుస్సాహసం నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే లద్దాఖ్‌లో పర్యటిస్తున్నారు. అక్కడి భద్రతా పరిస్థితిపై గురువారం సమీక్ష చేపట్టారు. ఆయన శుక్రవారం కూడా అక్కడే పర్యటిస్తారు. బలగాల సన్నద్ధత, మోహరింపు గురించి టాప్ ఆర్మీ కమాండర్లు నరవాణేకు వివరించారు. సరిహద్దుకు సమీపంలోని భారత ఆర్మీ శిబిరాన్ని నరవాణే సందర్శించి సైనికులతో మాట్లాడారు. 3,400 కిలోమీటర్ల సరిహద్దులోని కీలక ప్రాంతాల్లో ఆర్మీ, వాయుసేన బలగాలను చాలా అప్రమత్తంగా ఉంచారు. సర్వ సన్నద్ధతతో...పూర్తి నియంత్రణలో లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద భారత సైన్యం సర్వ సన్నద్ధతతో పహారా కాస్తోంది. అదనపు సైనిక బలగాలను, ఆయుధ సామగ్రిని తరలించి... పాంగాంగ్ దక్షిణ తీరంలో కీలక పర్వత ప్రాంతాల్లో మోహరించిన భారత్...డెప్సాంగ్ ప్లెయిన్స్, చుమర్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయుధ సంపత్తిని, సైన్యాన్ని ఇక్కడకు భారీగా తరలించింది. అంగుళం భూమిని కూడా వదులుకోబోమని, చైనా వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైనా దీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (చైనా సైన్యం)కి గట్టి సంకేతాలు పంపింది. పీఎల్ఏకు దీటుగా స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్‌ను రంగంలోకి దింపింది. ఐదురోజుల కిందట పాంగాంగ్ సరస్సు దక్షిణతీరంలో చైనా చొరబాటు యత్నాలను తిప్పికొట్టడంలో కూడా స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ముఖ్య భూమిక పోషించింది. లద్దాఖ్ పరిధిలో 1,597 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) పొడవునా భారత్ అత్యంత అప్రమత్తతను పాటిస్తోంది. డెమ్చోక్, చుమర్ల్లో భారత్ ఎత్తైన పర్వత ప్రాంతాలను ఆక్రమించి ఉండటంతో చైనా ఆయుధ, సైనిక రవాణాకు కీలకమైన లాసాకస్గర్ హైవేపై ప్రత్యర్థి కదలికలపై స్పష్టంగా కన్నేయగలుగుతోంది. -
చైనా కవ్వింపు..‘ఇగ్లా’ను రంగంలోకి దించిన భారత్
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఇప్పటికే హెలికాప్టర్లను మోహరించి కవ్వింపు చర్యలకు దిగుతోంది. దీంతో భారత్ బలగాలు ఎక్కడికైనా మోసుకుపోగలిగే పోర్టబుల్ ఇగ్లా క్షిపణుల్ని అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో మోహరించాయి. సైనికులు భుజం మీద మోస్తూనే ఈ క్షిపణులతో శత్రువులపై గుళ్ల వర్షం కురిపించవచ్చు.(చదవండి : వినకుంటే సైనిక చర్యే.. చైనాకు రావత్ వార్నింగ్) ఈ క్షిపణి వ్యవస్థను ఆర్మీ, వైమానిక దళం వినియోగిస్తాయి. చైనా సైన్యం కదలికల్ని అనుక్షణం కనిపెట్టేందుకు నిఘాను పెంచారు. భూమ్మీద నుంచే గగన తలంలో జరిగే ప్రతీ కదలికను పసిగట్టేందుకు రాడార్లు ఏర్పాటు చేశారు. దౌత్య చర్చలు విఫలమైతే సైనిక చర్యలు తప్పవంటూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెచ్చరికలు జారీ చేశారు. -
వినకుంటే సైనిక చర్యే.. చైనాకు రావత్ వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు లద్ధాఖ్ సరిహద్దు ప్రాంతంలో చైనా అతిక్రమణలను ఎదుర్కోవడానికి భారత సైన్యం పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉందని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరోసారి స్పష్టం చేశారు. అయితే రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు విఫలమైతేనే తమ ప్లాన్‌ను అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్చలు జరుపుతున్నామని, అవి సఫలం కాకపోతే మిలటరీ యాక్షన్‌కు భారత సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. చైనా ఆర్మీని ఎదుర్కొవడానికి మిలటరీ యాక్షన్ ప్రతిపాదన తమ వద్ద సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. అయితే మిలటరీ యాక్షన్‌కు సంబంధించిన వివరాలను మాత్రం ఆయన బహిర్గతం చేయలేదు. (చవండి : అవసరమైతే చైనాతో అన్నీ బంద్: ట్రంప్) ‘ఎల్ఏసీ వెంట అతిక్రమణలు, దళాల మోహరింపు పైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అతిక్రమణలను నిరోధించేందుకు రక్షణ దళాలు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. వీటిని నిరోధించడానికి ప్రభుత్వం శాంతియుతంగానే పరిష్కారం కోరుతోంది. ఎల్ఏసీ వెంట యథాతథ స్థితిని పునరుద్ధరించడానికి ఈ ప్రయత్నాలు సఫలం కాకపోతే మాత్రం సైనిక చర్యలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం’ అని బిపిన్ రావత్ పేర్కొన్నారు. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్, జాతీయ సలహాదారు అజిత్ దోవల్ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారని రావత్ తెలిపారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్-మే నుంచి భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదంకొనసాగుతుంది. ఇక జూన్ 15న చైనా- భారత్ సరిహద్దుల్లో చెలరేగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులను డ్రాగాన్ దేశం పొట్టనపెట్టుకుంది. దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది. -
జొమాటో బాయ్స్ దేశ భక్తికి సెల్యూట్!
కోల్‌కతా : కొంతమంది జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ వినూత్నంగా తమ దేశ భక్తికి చాటుకున్నారు. పస్తులు ఉండి చస్తాం కానీ, చైనా పెట్టుబడులు ఉన్న కంపెనీలో పనిచేయమంటూ ఉద్యోగాలు వదులుకున్నారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లద్దాఖ్ గల్వాన్ లోయలో జరిగిన చైనా దాడిలో 20 మంది భారత సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా చైనా వ్యతిరేక ఉద్యమాలు మొదలయ్యాయి. చైనా వస్తువులను బ్యాన్ చేయాలని, ఎవరూ వాడకూడదని ప్రముఖులు సైతం పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోల్‌కతాకు చెందిన కొందరు జొమాటో బాయ్స్ అక్కడి బెహాలా వద్ద వినూత్నంగా నిరసనలు తెలియజేసి తమ దేశ భక్తిని చాటుకున్నారు. ( అమెరికన్ సంస్థతో జొమాటో ఒప్పందం..) నిరసన తెలుపుతున్న జొమాటో బాయ్స్ జొమాటో అధికారిక టీషర్టులను ఓ చోట కుప్పగా పోసి తగలబెట్టారు. అనంతరం జొమాటోలో చైనా పెట్టుబడులు ఉన్నాయని, దీని ద్వారా ఆహార పదార్థాలు ఆర్డర్ చేయవద్దని పిలుపునిచ్చారు. తమ ఉద్యోగాలను వదిలేస్తున్నట్లు తెలిపారు. చైనా.. భారత దేశం నుంచి ఆదాయం పొందుతూ దేశ సైనికులపై దాడి చేస్తోందని, భారత భూభాగాన్ని సొంతం చేసుకోవటానికి ప్రయత్నిస్తోందని.. అలా జరగకుండా చేయాలని అన్నారు. పస్తులు ఉండి చస్తాం కానీ, చైనా పెట్టుబడులు ఉన్న వాటిలో పనిచేయమని తేల్చిచెప్పారు. -
భారత్-చైనా ఘర్షణ : మరో జవాన్ వీరమరణం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా మధ్య గల్వాన్ లోయలో ఈ నెల 15న జరిగిన సరిహద్దు సైనిక ఘర్షణకు సంబంధించి మరో జవాను అమరుడయ్యారు. మహారాష్ట్రలోని మలేగావ్ తాలూకా సాకురి గ్రామానికి చెందిన సచిన్ విక్రమ్ మోరే గురువారం వీరమరణం పొందారు. గల్వాన్‌లో విధినిర్వహణలో ఉండగా, నదిలో పడిపోయిన ఇద్దరిని కాపాడే ప్రయత్నంలో విక్రమ్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా, గురువారం అమరుడైనట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. దీంతో గల్వాన్ ఘర్షణలో మరణించిన భారత జవాన్ల సంఖ్య 21కు పెరిగింది. (చదవండి : చైనా, భారత్ వ్యూహాలు ఏమిటి?) తెలంగాణ ముద్దుబిడ్డ కర్నల్ సంతోష్‌బాబు సహా 20మంది జవాన్లు అమరులైనట్టు ఇండియన్ ఆర్మీ ఇప్పటికే ప్రకటించింది. అయితే చైనా మాత్రం మరణాల సంఖ్యపై నోరు విప్పడంలేదు. 40మందికిపైగా సైనికులు మరణించినట్టు అంచనా వేస్తుండగా.. డ్రాగన్ ఆర్మీ మాత్రం కమాండర్ స్థాయి అధికారి సహా ఇద్దరు మాత్రమే మరణించినట్టు అధికారికంగా ప్రకటించింది. మరోవైపు భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదంపై చర్చలు జరుగుతున్నాయి. సరిహద్దుల్లోని ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకుందామని ఒకపక్క భారత్‌కు చెబుతూనే మరోపక్క తూర్పు లద్దాఖ్ సహా పలు ప్రాంతాల్లో తన బలగాలను విస్తరిస్తోంది. భారత్ కూడా తన యుద్ధ విమానాలతో ఆ ప్రాంతంలో విన్యాసాలు చేయించింది. దీంతో లద్దాఖ్‌లోఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. (చదవండి : గల్వాన్ ఘటనతో వణికిన చైనా సైన్యం) -
వారివల్లే భారత భూభాగాన్ని కోల్పోయాం
న్యూఢిల్లీ : తిరస్కరించబడిన, తొలిగించబడిన రాజవంశం ప్రతిపక్షంతో సమానం కాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ఓ రాజవంశం.. నిజాయితీ కలిగిన దాని అనుచరులు ప్రతిపక్షం అంటే ఆ రాజవంశమే అనే మాయలో ఉన్నారంటూ మండిపడ్డారు. బుధవారం ఆయన ట్విటర్ వేదికగా రాహుల్ గాంధీ కుటుంబంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘ రాజవంశం తంత్రాలు చేస్తుంది. అనుచరులు తప్పుడు ప్రచారాలతో రాళ్లు విసురుతారు. ఓ రాజవంశానికి చెందిన అభిప్రాయాలు భారత ప్రజల అభిప్రాయాలు కాదు. ఈ రోజు దేశం మొత్తం ఏకమై సైన్యానికి అండగా ఉంది. ఇది మనం ఏకమై సంఘీభావం తెలపాల్సిన సమయం. తొమ్మిదవ సారి వారసుడ్ని ప్రవేశపెట్టడానికి కొంచెం ఆగండి. (‘మన్మోహన్ హయాంలో చైనాకు లొంగిపోయారు’) ప్రశ్నలు అడగటానికి ప్రతిపక్షానికి హక్కుంది. అఖిల పక్ష భేటీ ఎంతో చక్కగా జరిగింది. కొంతమంది ప్రతి పక్ష నేతలు తమ విలువైన సలహాలు ఇచ్చారు. కేంద్రం ముందుకు సాగటానికి తమవంతు మద్దతు తెలిపారు. కానీ, ఓ కుటుంబం మాత్రం కాదు. అది ఎవరో చెప్పగలరా?.. ఆ రాజవంశం కారణంగా వందల కిలోమీటర్ల భారత భూభాగాన్ని కోల్పోయాం. సియాచిన్ గ్లేసియర్‌ని పూర్తిగా కోల్పోయే పరిస్థితి. అదే కాకుండా ఇంకా ఏన్నో.. ఆ రాజవంశాన్ని ప్రజలు పదవి నుంచి తొలిగించడంలో ఆశ్చర్యమేమీ లేదు’’ అని అన్నారు. -
చైనాను ఆర్థికంగా ఢీకొట్టే వ్యూహాలు..
ముంబై: ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెల 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రజలు చైనాకు సంబంధించిన వస్తువులను వాడకూడదని డిమాండ్ ఎక్కువైంది. కాగా తయారీ రంగంలో ప్రపంచ వ్యాప్త ఎగుమతులలో కీలక పాత్ర పోషిస్తున్న చైనాను ఢీకొట్టడం అంత సులువు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి చైనా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ.. దిగుమతులు తగ్గించుకొని, తయారీ రంగంలో చైనా వస్తువులతో ఆధారపడకుండా, సొంతంగా ఎదగడానికి ప్రభుత్వం వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో చైనాపై ఆర్థిక ఆంక్షలను ప్రభుత్వం మరింత కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. మరో కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ స్పందిస్తూ.. చైనా వస్తువులను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. తాజా ఉద్రిక్త పరిస్థితులలో నూతన స్మార్ట్పోన్లను లాంచ్ చేసే ఈవెంట్లను చైనీస్ స్మార్ట్ ఫోన్ సంస్థలు వాయిదా వేసుకున్నాయి. కాగా దేశ వృద్ధిలో చైనా ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2017 సంవత్సరంలో సిక్కింలో డొక్లాం ప్రాంతంపై సరిహద్దు వివాదాలున్న మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడకుండా చర్యలు చేపట్టింది. మరోవైపు చైనీస్ దిగ్గజాలు హువాయి టెక్నాలజీస్, షియోమీ బ్రాండ్స్ వైవిధ్యమైన స్మార్ట్ఫోన్స్తో అలరిస్తున్నాయి. అయితే దేశీయ మొబైల్ వినియోగంలో 75 శాతం చైనా నుంచి దిగుమతవుతున్నాయి. మరోవైపు దేశీయ ఫార్మా దిగుమతులలో 75శాతం ముడిపదార్థాలు చైనా నుంచి లభిస్తున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం చైనాను ఢీకొట్టాలంటే ఒకేసారి వస్తువులను బ్యాన్ చేయాలనడం సరికాదని, అలా పిలుపునిస్తే అంతర్జాతీయంగా దేశానికి నష్టం కలిగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశ్లేషకుల ప్రకారం.. దేశీయ తయారీ రంగానికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తు, యువతకు నైపుణ్య శిక్షణ అందించాలి. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారిస్తే తయారీ రంగంలో వేరే దేశంపై భారత్‌కు ఆధారపడే అవకాశం తగ్గుతుంది. అలాగే యువతకు ఉపాధితో పాటు నిరుద్యోగం తగ్గి, దేశ వృద్ధి రేటు పెరుగుతుంది. కాగా దేశీయ సంస్థలు తక్కువ ధరకే క్వాలిటీ వస్తువులు అందించి, చైనాను భావోద్వేగంతో కాకుండా క్వాలిటీతో ఢీకొట్టాలి. దేశీయ మార్కెట్లో చైనా వస్తువులను ప్రజలు స్వచ్చందంగా బహిష్కరించే ప్రణాళికలు రచించడానికి సన్నద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.(చదవండి: ఈ పాపులర్ యాప్స్ అన్నీ చైనావే) -
ధీటుగా బదులివ్వండి.. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఇటీవల హింసాత్మక ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తూర్పు లద్దాఖ్‌లో ప్రస్తుతం నెలకున్న పరిస్థితులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భారత త్రిదళాధిపతి(సీడీఎస్) బిపిన్ రావత్‌తో పాటు త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైనా దాడులను తిప్పికొట్టాలని, వారి ప్రతి కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. అలాగే జల, వాయు మార్గాల ద్వారా చైనా ప్రవేశించే అవకాశం ఉన్నందున గట్టి నిఘా ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించారు. సరిహద్దులో చైనా సైనికులు ఎటువంటి దాడులకు ప్రయత్నించినా ధీటుగా సమాధానం ఇవ్వాలని సూచించారు. ఎల్ఏసీ వెంబడి మరింత అప్రమత్తంగా ఉండి చైనా ఆర్మీ దురాక్రమణలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని ఆదేశాలు ఇచ్చారు. (చదవండి : సరిహద్ధు ఘర్షణ : అసలేం జరిగింది.?) చైనా సరిహద్దుల్లో ఆర్మీకి ఫ్రీహ్యాండ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. డ్రాగన్ సైన్యం దురాక్రమణలను తిప్పికొట్టేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. చైనా కవ్విస్తే ధీటుగా బదులిచ్చేలా సైన్యాన్ని స్వేచ్ఛ ఇచ్చినట్లు సమాచారం. కాగా గాల్వన్ లోయలో ఎప్పటికప్పుడు పరిస్థితిని భద్రతా దళాలు ప్రభుత్వానికి చేరవేస్తున్నాయి. మరోవైపు గల్వాన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ 14 ప్రాంతంలో భారత సైన్యం పట్టు సాధించింది. ఇదిలావుంటే రష్యాలో నిర్వహించే విక్టరీ డే పరేడ్ కు హాజరు కావడానికి మంత్రి రాజ్‌నాథ్ సోమవారం బయలుదేరి వెళతారు. అక్కడ జూన్ 24న జరిగే పరేడ్ లో పాల్గొంటారు. (చదవండి : గల్వాన్‌లో బయటపడ్డ చైనా కుట్రలు) కాగా,జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెసిలిందే. ఈ ఘటనలో కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. . చైనాకు చెందిన 45 మంది సైనికులు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే చైనా మాత్రం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. (72 గంటల్లోనే గల్వాన్ నదిపై బ్రిడ్జి నిర్మాణం) -
ఈ పాపులర్ యాప్స్ అన్నీ చైనావే
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ వినియోగదారుల సమస్త సమాచారాన్ని కూడగడుతున్న చైనాకు చెందిన 52 యాప్స్‌ను అడ్డుకోవాలంటూ ఇటీవల ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రధాని నరేంద్ర మోదీకి నేరుగా విజ్ఞప్తి చేశాయంటూ వార్తలు వచ్చాయి. ఆ విషయంలో ప్రధాని స్పందనేమిటో తెలియరాలేదు. అయితే అడ్డుకోవాలని కోరుతున్న యాప్స్ జాబితాలో భారత్‌లో అత్యధిక ప్రాచుర్యం పొందిన టిక్‌టాక్, షేర్ ఇట్, బిగో లివ్, క్లబ్ ఫ్యాక్టరీ, షైన్, హెలో తదితర యాప్స్ ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ యాప్స్ అన్నీ భారత ఆర్థిక వ్యవహారాలకు ఉపయోగపడుతున్నాయి. వీటిలో టిక్‌టాక్, హలో, బిగో వీడియో యాప్‌లు సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చాయి. టిక్‌టాక్‌కు భారత్‌లో నెలవారిగా 12 కోట్ల మంది, హెలోకు ఐదు కోట్ల మంది, బిగో లివ్కు 2.20 కోట్ల మంది ఉన్నారు.పెద్దగా ప్రచారం లేకపోయినప్పటికీ క్లబ్ ఫ్యాక్టరీకి పది కోట్ల మంది, షైన్‌కు 50 లక్షల మంది డౌన్‌లోడర్లు ఉండడం విశేషం. (చైనా ప్రకటనపై కేంద్రం స్పందించాలి) స్మార్ట్ఫోన్ల ద్వారా సెల్ఫీల మోజు పెరగడంతో సెల్ఫీల్లో అందంగా కనిపించడం కోసం బ్యూటీప్లస్, మేకప్‌ప్లస్ లాంటి యాప్స్‌ను కూడా చైనా తీసుకొచ్చింది. కేవలం భారతీయ వినియోగదారుల కోసమే ‘బ్యూటీప్లస్ మీ’ అంటూ మరో యాప్‌ను సృష్టించింది. వీటితోపాటు ఫొటో వాండర్, యూకామ్ మేకప్, సెల్ఫీసిటీ, వాండర్ కెమేరా, పర్ఫెక్ట్ కోర్ అనే మరో నాలుగు బ్యూటీ యాప్స్‌ను కూడా అడ్డుకోవాలని ఇంటెలిజెన్స్ వర్గాలు కోరుతున్నాయి. ఫైల్ షేరింగ్ టూల్స్‌గా ఉపయోగపడుతున్న షేర్ఇట్, క్సెండర్ యాప్స్ కూడా ఉన్నాయి. షేర్‌ఇట్‌కు దేశంలో 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇక నెట్ బ్రోజర్లలో చైనాకు చెందిన యూసీ బ్రోజర్, ఏపీయుఎస్ బ్రోజర్, సీఎం బ్రోజర్, డీయూ బ్రోజర్లు ఉన్నాయి. చైనా దిగ్గజ సంస్థ అలీబాబా గ్రూపునకు చెందిన యూసీ బ్రోజర్‌కు 13 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అది 14 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తోంది. అలీబాబా కంపెనీకి చెందిన వార్తల సమీకరణ సంస్థ యూసీ న్యూస్ భారతీయ భషలైన హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, పంజాబీ, మరాఠీ, ఒడియా, అస్సామీస్, భోజ్‌పూరి తదితర భాషల్లో కూడా ప్రాచుర్యం పొందింది. దీంతోపాటు న్యూస్‌డాగ్ వెబ్‌ను కూడా అడ్డుకోవాలని కోరుతున్నారు. (చైనా వస్తువులను బహిష్కరించండి) ఇక స్మార్ట్ఫోన్ల రంగంలో భారత్‌లో సంచలనం సృష్టించిన షావోమీ కంపెనీ ఫోన్లతోపాటు ఫిట్నెస్ పరికరాలను కూడా ఇంటెలిజెన్స్ జాబితాలో ఉన్నాయి. షావోమీ తన స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల్లో 30 శాతం ఉత్పత్తులను, ఫిట్నెస్ పరికరాల్లో 50 శాతం ఉత్పత్తులను ఒక్క భారత్‌లోనే విక్రయిస్తోంది. వీటికి సంబంధించిన యాప్స్ కూడా అడ్డుకోవాలనుకుంటోన్న జాబితాలో ఉన్నాయి. భారత్, చైనా సరిహద్దుల్లో సైనికుల సంఘర్షణతో చైనా ఉత్పత్తులను, యాప్స్‌ను బహిష్కరించాలనే వాదనల ప్రభావం అప్పుడే కనిపిస్తోంది. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘అప్పో’ భారతీయ మార్కెట్లో తన కొత్త ప్రాడక్ట్ ప్రారంభోత్సవాన్ని రద్దు చేసుకుంది. -
చైనా, భారత్ వ్యూహాలు ఏమిటి?
ముంబై: లద్దాఖ్‌లోని గాల్వన్ లోయా వద్ద చైనా దాడిలో భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వ్యాపార రంగంలో తీవ్ర అలజడి నెలకొంది. మంగళవారం శాంతిని కోరుకుంటున్నట్లు భారత్ ప్రకటించినప్పటికి అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్, టాటా మోటార్స్ లిమిటెడ్ లాంటి కంపెనీలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు సంస్థ ముఖ్య అధికారలు తెలిపారు. ఇలాగే ఉద్రిక్తతలు కొనసాగితే చైనా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులకు ఇబ్బందులు ఏర్పడతాయని, తాము ప్రత్యామ్నాయం చూసుకోక తప్పదని దేశీయ స్టార్ హెల్త్ఇన్సూరెన్స్ ఆఫీసర్ అనీష్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రపంచానికే అనేక వస్తువులను దిగుమతి చేస్తున్న చైనా.. ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో సంస్థ వ్యాపార వ్యూహాలు మార్చనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి సంక్షోభాలను దిగ్గజ దేశాలు సమర్థవంతంగా ఎదుర్కోగలవని.. గతంలో భారత్, చైనా యుద్ధం తరువాత ఇరు దేశాలు నిలదొక్కుకున్న విషయాన్ని షాంఘైకి చెందిన ఫండ్ మేనేజర్ దై మింగ్ గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితులతో చైనా తయారీ రంగానికి ఎలాంటి నష్టం లేదని మింగ్ అభిప్రాయపడ్డాడు. కాగా చైనా దిగ్గజం ఆలీబాబా గ్రూప్ డాటా సెంటర్లను భారత్‌లోనే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆలీబాబా గ్రూప్‌కు చెందిన యూసీ బ్రౌసర్ అత్యధిక పేజీ వ్యూస్‌తో దేశీయ ప్రజలను ఆకట్టుకుంటున్నట్లు సంస్థ తెలిపింది. కాగా చైనీస్ బ్రాండ్ షియోమీ స్మార్ట్‌ఫోన్ విభిన్న సిరీస్‌లతో దేశ ప్రజలను ఆకట్టుకుందని సంస్థ పేర్కొంది. యూఎస్‌కు బదులుగా దేశంలోనే పెట్టుబడులు పెట్టడానికి చైనా వైర్లెస్ నెట్వర్క్ దిగ్గజం హువావే టెక్నాలజీస్ 5జీనీ అందించేందుకు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. చైనా కంపెనీల నుండి సోర్సింగ్ పరికరాలను దేశీయ టెలికాం కంపెనీలు నిలిపివేయవచ్చని ఓ ప్రభుత్వ అధికారి అభిపప్రాయపడ్డారు. ప్రైవేటు మొబైల్ ఫోన్ ఆపరేటర్లు ఉపయోగించే పరికరాలు భారత ప్రభుత్వం నిషేధించవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా దేశీయ ఫార్మారంగం(రెడ్డీస్ ల్యాబ్, అరబిందో) కూడా చాలా వరకు ముడిపదార్థాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఫార్మారంగం కొంత ఇబ్బంది ఎదుర్కొవచ్చని ఫార్మా నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల్లో పరికరాల కొనుగోలు తదితర అంశాల్లో డిఫెన్స్ రంగం గణనీయ వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. చదవండి: చైనా సంస్థకు షాక్.. రూ. 470 కోట్ల ప్రాజెక్టు రద్దు -
అదే చైనా వ్యూహం: జిజి ద్వివేదీ
న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ ఏ నిర్మాణమూ చేపట్టకుండా చూడటం, లద్దాఖ్‌ను సొంతం చేసుకోవటమే చైనా లక్ష్యమని భారత సైన్యపు మాజీ మేజర్ జనరల్ జిజి ద్వివేదీ వ్యాఖ్యానించారు. చైనా ఓ వైపు చర్చలు జరుపుతూనే మరో వైప కొంచెం కొంచెంగా భారత భూభాగంలోకి చొరబడే ప్రయత్నం చేస్తోందని అన్నారు. బుధవారం జిజి ద్వివేదీ మీడియాతో మాట్లాడుతూ.. చైనా, భారత్‌తో గొడవ పెట్టుకోవటానికి గల ఉద్దేశ్యాన్ని వివరించారు. చైనా నిర్లక్ష్యం కారణంగానే ప్రపంచ దేశాలకు కరోనా విస్తరించిందన్న అమెరికా వాదనలకు భారత్ వంతపాడటమే ఇందుకు కారణమన్నారు. సైనిక బలంతో రాజకీయ లక్ష్యాలను సాధించటమే కాకుండా భారత భూభాగాన్ని సొంతం చేసుకోవటమే చైనా వ్యూహంగా పేర్కొన్నారు. ( చైనా వాదనలపై అనురాగ్ శ్రీవాస్తవ ఫైర్!) ఆయన కమాండర్‌గా పనిచేసిన 1992నాటి కొన్ని సంఘటనలు గుర్తుచేసుకుంటూ..‘‘ అప్పుడు ఇరు దేశాల మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవు. మేము.. మాలాగే వాళ్లు కూడా హాట్ స్ప్రింగ్స్ వరకు పాట్రోలింగ్ చేసుకునే వాళ్లం. లద్దాఖ్‌లోని భారత సైన్యం గాల్వన్ లోయను పర్యవేక్షించేది. వారికప్పుడు ఏలాంటి సమస్యా ఎదురుకాలేదు. ఆ సమయంలో చైనా సైన్యం అక్కడి రాళ్లపై ‘‘ చుంగ్ కో( ఇది చైనా)’’ అని రాశారు. వెంటనే భారత సైనం వాటిని చెరిపేసి ‘ఇది భారత్’ అని రాసింది’’ అని చెప్పుకొచ్చారు. -
స్వస్థలాలకు చేరిన వీర జవాన్ల మృతదేహాలు
సాక్షి, న్యూఢిల్లీ: లద్దాఖ్‌లోని గాల్వన్ లోయా వద్ద చైనాతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు అర్పించిన సైనికుల మృతదేహాలు బుధవారం వారి స్వస్థలాలకు చేరుకున్నాయి. సోమవారం రాత్రి చైనా దాడిలో 20 మంది భారత సైనికులు వీరమరణం పోందినట్లు ఆర్మీ అధికారులు మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. మరణించిన సైనికుల మృతదేహాలను ఉంచిన శవపేటికకు జాతీయా జెండాను కప్పి సైనిక లాంఛనాలతో వారి స్వస్థలాలకు తరలించారు. కాగా మరణించిన సైనికుల్లో బీహార్‌కు చెందివారు అయిదుగురు, పంజాబ్‌కు చెందిన నలుగురు, పశ్చిమ బెంగాల్, ఓడిశా, జార్ఖండ్‌కు రాష్ట్రాలకు చెందిన వారు ఇద్దరూ చొప్పున ఉన్నారు. చత్తీస్గడ్, మధ్యప్రదేశ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ చెందిన ఒక్కొక్కరూ ఉన్నారు. కాగా ఇవాళ సైనికుల మృతదేహాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నాయి. (సూర్యాపేటలో కల్నల్ సంతోష్ అంతిమయాత్ర) మరణించిన సైనికుల పేర్లు.. 1. కల్నల్ బి. సంతోష్‌బాబు (తెలంగాణ) 2. నాయిబ్ సుబేదార్ నుదురం సోరెన్ 3. నాయబ్ సుబేదార్ మన్దీప్ సింగ్ 4. నాయబ్ సుబేదార్ సత్నం సింగ్ 5. హవిల్దార్ కె పళని 6. హవిల్దార్ సునీల్ కుమా 7. హవిల్దార్ బిపుల్ రాయ్ 8. నాయక్ దీపక్ కుమార్ 9. సిపాయి రాజేష్ ఒరాంగ్ 10. సిపాయి కుందన్ కుమార్ ఓజా 11. సిపాయి గణేష్ రామ్ 12. సిపాయి చంద్రకాంత ప్రధాన్ 13. సిపాయి అంకుష్ 14. సిపాయి గుర్బిందర్ 15. సిపాయి గుర్తేజ్ సింగ్ 16. సిపాయి చందన్ కుమార్ 17. సిపాయి కుందన్ కుమార్ 18. సిపాయి అమన్ కుమార్ 19. సిపాయి జై కిషోర్ సింగ్ 20. సిపాయి గణేష్ హన్స్డా అడ్డుకున్న సంతోష్ నేతృత్వంలోని దళం సూర్యాపేటలో కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు.. కాగా తెలంగాణకు చెందిన కమాండర్ కల్నల్ సంతోష్‌బాబు మృతదేహాన్ని బుధవారం రాత్రి దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి హైదరాబాద్‌లోని హకీంపేటలోని వైమానిక దళానికి తరలించారు. ఆ తర్వాత విద్యానగర్‌లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. జాతియ జెండా కప్పిన సంతోస్ బాబు శవపేటికను సైనికులు అంబులెన్స్ నుంచి బయటకు తీస్తుండగా అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఉద్వేగానికి లోనవుతూ ‘సంతోష్ బాబు అమర్ హ’ అంటూ నినాదాలు చేశారు. గురువారం ఉదయం కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ఆయన స్వస్థలం సూర్యాపేటలో ముగిశాయి. సంతోష్ అంత్యక్రియలకు మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు, పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. -
అమరవీరులకు శాసనసభ సంతాపం
సాక్షి, అమరావతి: గాల్వన్ లోయ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవానులకు రాష్ట్ర శాసనసభ సంతాపం ప్రకటించింది. బుధవారం ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమర వీరులకు సంతాపం తెలుపుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు విధి నిర్వహణ చేస్తూ.. గాల్వన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారని.. వారికి రాష్ట్ర ప్రజల తరఫున శాసనసభ ఘన నివాళులర్పిస్తోందన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు త్యాగం తెలుగు ప్రజలకు ఎప్పటికీ గుర్తుండి పోతుందన్నారు. వీర మరణం పొందిన సైనికులకు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. అనంతరం రెండు నిమిషాల పాటు సభ మౌనం పాటించింది. అలాగే శాసనమండలిలో కూడా బీజేపీ సభ్యుడు మాధవ్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభ్యులు మూడు నిమిషాలు మౌనం పాటించి అమర వీరులకు నివాళులర్పించారు. మండలి చైర్మన్ షరీఫ్ మాట్లాడుతూ.. వీర మరణం పొందిన భారత సైనికులకు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. -
వీరుడా.. వందనం
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట/తాళ్లగడ్డ: భారత్–చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్‌బాబుకు జనం జోహార్లు అర్పించారు. జాతీయ జెండాలు, సంతోష్ చిత్రపటాలతో ర్యాలీలు నిర్వహించారు. సూర్యాపేట పట్టణంతో పాటు జిల్లా కేంద్రంలోని పలు మండలాల్లో జై జవాన్.. జోహార్ సంతోష్ అనే నినాదాలు వెల్లువెత్తాయి. కొన్నిచోట్ల కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీలు నిర్వహించారు. సంతోష్‌బాబు మరణవార్త తెలుసుకున్న నేతలు, అభిమానులు, బంధువులు బుధవారం పెద్ద ఎత్తున సూర్యాపేట విద్యానగర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. సంతోష్ తల్లిదండ్రులు బిక్కుమళ్ల ఉపేందర్–మంజులను పరామర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే కల్నల్ స్థాయి అధికారి సూర్యాపేటలో ఉండటం.. భారత్–చైనా సరిహద్దు ఘర్షణలో ఆయన వీరమరణం పొందడంతో ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. చివరిసారిగా సంతోష్‌ను చూసేందుకు భారీగా ఆయన నివాసానికి తరలివచ్చారు. రాత్రి ఆయన పార్ధివదేహం వచ్చేవరకు అక్కడే ఉన్నారు. బుధవారం హకీంపేట ఎయిర్‌బేస్‌లో సంతోష్‌బాబు పార్థివదేహం వద్ద నివాళులర్పిస్తున్న ఆయన సతీమణి సంతోషి కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు: సంతోష్‌బాబు భౌతికకాయం బుధవారం రాత్రి 11.40 గంటలకు సూర్యాపేటలోని ఆయన నివాసానికి చేరుకుంది. పార్థివదేహం వెంట మంత్రి జగదీశ్‌రెడ్డి కాన్వాయ్‌లో సంతోష్‌బాబు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ, కుమారుడు అనిరుథ్ వచ్చారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్‌నుంచి సంతోష్ నివాసం వరకు ప్రజలు కొవ్వొత్తులు, జాతీయ జెండాలతో రోడ్డుకు ఇరువైపులా ఉండి అమరవీరుడికి జైజైలు పలికారు. సంతోష్‌బాబు అమర్‌రహే, భారత్‌మాతాకీ జై అనే నినాదాలతో సూర్యాపేట మార్మోగింది. కాగా, కల్నల్ సంతోష్‌బాబు పార్థి«వదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు ఉపేందర్, మంజుల, సంతోష్‌బాబు సతీమణి సంతోషి చిన్నారులను చూసుకుంటూ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ విలపించడంతో ఆ ప్రాంతం మొత్తం విషాదంలో మునిగిపోయింది. కల్నల్ పార్థివదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు కేసారంలో అంత్యక్రియలు సూర్యాపేట పట్టణానికి సమీపంలోని కేసారంలో కల్నల్ సంతోష్‌బాబుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో గురువారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ ఆర్.భాస్కరన్, ఆర్మీ మేజర్ ఫరీది, ఆర్డీఓ మోహన్‌రావు, డీఎస్పీ మోహన్‌కుమార్, కమిషనర్ పి.రామానుజులరెడ్డి, ఆర్మీ అధికారి దినేష్‌కుమార్ పరిశీలించారు. అంత్యక్రియలు నిర్వహించే ప్రాంతాన్ని జేసీబీలతో చదును చేయించారు. ప్రోటోకాల్ ప్రకారం కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరగనున్నాయి. బుధవారం ఆర్మీకి చెందిన 50 మంది అధికారులు, సిబ్బంది జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు సంతోష్‌బాబు నివాసం వద్ద ఆయన పార్థివదేహానికి సైనిక సంప్రదాయం ప్రకారం రీత్లింగ్ డ్రిల్ నిర్వహిస్తారు. ఆ తర్వాత అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. సంతోష్ నివాసం నుంచి కేసారం గ్రామ సమీపం వరకు 5.5 కిలోమీటర్లు మిలటరీ వాహనంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచి సైనిక సిబ్బంది ముందు వరుసలో కవాతు చేస్తూ అంతిమయాత్ర నిర్వహిస్తారని సంబంధిత అధికారులు తెలిపారు. సంతోష్‌ను కడసారి చూసేందుకు వచ్చేవారు కరోనా నిబంధనలను అనుసరించే విధంగా ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, ఆర్మీ మేజర్లు, కల్నల్స్తోపాటు కొద్ది మందిని మాత్రమే అనుమతించనున్నట్లు తెలిసింది. సంతోష్ అంత్యక్రియలకు మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు కూడా హాజరుకానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సంతోష్‌బాబు పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచుతూ నివాళి అర్పిస్తున్న కేటీఆర్ సందర్శకులు 8 గంటల్లోగా రావాలి... కల్నల్ సంతోష్ పార్థివదేహాన్ని సందర్శించాలనుకునేవారు ఉదయం 8 గంటల్లోగా రావాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. అనంతరం కల్నల్ సంతోష్ ఇంటి వద్ద నుంచి సైనిక లాంఛనాలతో అంతిమయాత్ర ప్రారంభమవుతుందన్నారు. కరోనా నిబంధనల మేరకు 50 మందిని మాత్రమే దహన సంస్కారాలకు అనుమతించనున్నట్లు తెలిపారు. హకీంపేట ఎయిర్‌బేస్‌లో కల్నల్ సంతోష్‌బాబు పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచుతూ నివాళి అర్పిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ టీఎస్ నారాయణన్ పరామర్శల వెల్లువ.. కల్నల్ సంతోష్‌బాబు మరణవార్త తెలుసుకున్న నేతలు ఆయన తల్లిదండ్రులు బిక్కుమళ్ల ఉపేందర్, మంజులను పరామర్శించారు. వారికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, మాజీ ఎమ్మెల్యేలు పద్మావతి, సంకినేని వెంకటేశ్వర్రావు, జూలకంటి రంగారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, ప్రముఖ మోటివేటర్ బ్రదర్ షఫీ తదితరులు ఉన్నారు. బుధవారం రాత్రి సూర్యాపేటలో సంతోష్ పార్థివదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు (ఇన్సెట్లో) సంతోష్ భౌతికకాయం ఇలా అవుతుందని కలలో కూడా అనుకోలేదు ఈ నెల 14వ తేదీ నా పెళ్లిరోజున అన్నయ్య ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు. ఎలా ఉన్నావ్ అన్నయ్యా అంటే ఏం చెప్పలేను, నన్ను అడుగొద్దు అన్నాడు. చాలా బాధగా అనిపించింది. అన్నయ్య మాతో చాలా ప్రేమగా ఉండేవాడు.. ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్లం. సెలవుల్లో వచ్చినప్పుడు పండుగలా గడిపేవాళ్లం. చిన్నప్పటి నుంచి చదువుల్లో యాక్టివ్‌గా ఉండేవాడు. అన్నయ్య చదువు కోసమే మేమంతా అదిలాబాద్ నుంచి విజయనగరం వెళ్లాం. సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్‌లో మూడోర్యాంక్ వచ్చింది. పాకిస్తాన్ వంటి ఎంతో ఉద్రికత్త ఉన్న ప్రాంతాల్లోనే అన్న డ్యూటీ నిర్వహించాడు. కొంతమంది చొరబాటుదారులను అంతమొందించాడు. అప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. చైనా సరిహద్దులో తుపాకులు వాడకపోవడంతో ఇలాంటి దారుణం జరిగింది. అన్నయకు ఇలా అవుతుందని కలలో కూడా అనుకోలేదు. – శృతి, కల్నల్ సంతోష్‌బాబు చెల్లెలు కల్నల్ సంతోష్‌బాబుకు గవర్నర్ సహా పలువురి నివాళి సాక్షి, హైదరాబాద్: కల్నల్ సంతోష్‌బాబు పార్థివదేహానికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం రాత్రి సంతోష్ భౌతికకాయం హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై.. ఆయన పార్థివదేహం ఉన్న పేటికపై పుష్పగుచ్ఛం ఉంచి వందనం చేశారు. సంతోష్ ధీరత్వాన్ని దేశం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటుందని పేర్కొన్నారు. సంతోష్‌బాబు జన్మస్థలం అయిన తెలంగాణకు తాను గవర్నర్ కావడం గర్వంగా ఉందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందే తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియాకు చెందిన సైనిక ఉన్నతాధికారులతో కలసి కల్నల్ సంతోష్ భార్యాపిల్లలు హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. సంతోషపార్థివదేహానికి మేజర్ జనరల్ ఆర్కే సింగ్, లెఫ్టినెంట్ జనరల్ టీఎస్ఏ నారాయణన్లతోపాటు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, ఇతర సైనికాధికారులు పుష్పాంజలి ఘటించారు. అనంతరం సంతోష్ భౌతికకాయాన్ని సూర్యాపేట తరలించారు. మీతో మేమున్నాం.. ధైర్యంగా ఉండండి కల్నల్ సంతోష్ సతీమణికి ఏఐసీసీ చీఫ్ సోనియా, రాహుల్‌గాంధీ లేఖలు సాక్షి, హైదరాబాద్: గాల్వాన్ లోయలో చైనా సైనికుల ఘాతుకానికి బలైన కల్నల్ సంతోష్‌కుమార్ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఏఐసీసీ చీఫ్ సోనియాగాంధీ ఆకాంక్షించారు. ఈ మేరకు బుధవారం ఆమె సంతోష్ సతీమణి సంతోషికి లేఖ రాశారు. ‘మాతృభూమి రక్షణ కోసం మీ భర్త ప్రాణాలు కోల్పోయారు. ఆయన చేసిన త్యాగాన్ని, గుండె ధైర్యాన్ని ఎప్పటికీ మరువలేం. ఆయనను గౌరవంగా స్మరించుకుంటూనే ఉంటాం. కల్నల్ మరణం పట్ల నా హృదయాంతరాల నుంచి సంతాపం తెలియజేస్తున్నాను. ఆయన భరతమాత కన్న వీరుడు. మీ కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలి. కల్నల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’అని ఆ లేఖలో సోనియాగాంధీ తన సందేశాన్ని పంపారు. వీరుడికి సెల్యూట్: రాహుల్ దేశంలోని ప్రతి పౌరుడు శాంతితో స్వతంత్రంగా జీవించేందుకు కల్నల్ సంతోష్‌బాబు చేసిన త్యాగం ఈ దేశం ఎన్నటికీ మరచిపోదని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ కొనియాడారు. భరతజాతి ఒక దేశ భక్తుడిని కోల్పోయిందని, ఇలాంటి కష్టకాలంలో జాతి యావత్తు కల్నల్ కుటుంబానికి అండగా ఉంటుందని బుధవారం సంతోష్‌బాబు సతీమణికి రాసిన వేరొక లేఖలో రాహుల్ వెల్లడించారు. -
సరిహద్దు ఘర్షణలో సరికొత్త సవాళ్లు
అంతర్జాతీయ సంబంధాల్లో వాస్తవికవాదానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇది జాతీయ ప్రయోజనాల రీత్యా ప్రభుత్వ చర్యలను సమర్థిస్తుంది పైగా అన్నిటికంటే జాతీయ ప్రయోజనాలను సంతృప్తిపర్చడమే అన్ని ప్రభుత్వాల విధి అని అది చాటిచెబుతుంది. లద్దాఖ్ రీజియన్‌లోని వివాదాస్పద అక్సాయ్ చిన్ ప్రాంతంలో భారత్, చైనా మధ్య ఘర్షణను ఈ దృక్కోణంలోంచే అంచనా వేయాలి. జూన్ 15వ తేదీన జరిగిన సైనిక ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అసువులు బాయడం, కొందరు చైనా సైనికులు గాయపడ్డానికి దారి తీసిన విషాదకర ఘటనలు నిజంగా కలవరం కలిగిస్తున్నాయి. సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన ఇరుదేశాల మధ్య ఘర్షణకు, ఇరుదేశాలు తమ భూభాగాలను పోగొట్టుకోవడానికి దారితీసే అవకాశాల గురించి పలు చర్చలకు దారి తీసింది. భారత్, చైనాలు కేవలం ఇరుగుపొరుగు దేశాలు మాత్రమే కాదు.. అవి అణ్వాయుధాలు కలిగిన దేశాలు. పైగా ప్రపంచంలోని ఆరు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో ఇవి భాగం. ఇరుదేశాల్లో 250 కోట్లపైగా జనాభా ఉంది. కాబట్టే ఇరుదేశాల మధ్య నెలకొనే ఎలాంటి ప్రయోజనాల మధ్య వైరుధ్యం అయినా సరే అంతర్జాతీయ వ్యవస్థ భౌగోళిక వ్యూహాత్మకతపై, ఆర్థిక పర్యవసానాలపై తీవ్రమైన ప్రభావం కలిగిస్తుంది. కాబట్టే్ట పరిస్థితిని, రాబోయే ఫలితాలను మదింపు చేయడానికి ముందు ఈ ప్రాంతంలో రెండు దేశాల ప్రయోజనాలను అర్థం చేసుకోవడం తప్పనిసరి. ఆర్టికల్ 370ని రద్దుతో చైనా అప్రమత్తం చైనా దృక్కోణం నుంచి చూస్తే ఈ ప్రాంతంలో దానికి కొన్ని కీలకమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి. చైనా జింజియాగ్ ఉగర్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని ఎచెంగ్ నుంచి టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని లెట్సెని కలుపుతున్న 2342 కిలోమీటర్ల పొడవైన 219 జాతీయ రహదారిని నిర్మించింది. ఈ రోడ్డు 1962 యుద్ధంలో చైనా ఆక్రమించిన అక్సాయ్ చిన్ ప్రాంతం గుండా వెళుతోంది. అధికారికంగా భారత్ ఇప్పటికీ ఈ ప్రాంతంపై తనకు హక్కులున్నాయని వాదిస్తూ దాన్ని లద్దాఖ్ రీజియన్‌లో భాగంగా చూస్తోంది. అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో, అక్సాయ్‌చిన్ ప్రాంతంపై భారత్ ఉద్దేశాలు చైనా అధికార వర్గాల్లో ప్రమాదఘంటికలు మోగించాయి. ఎందుకంటే 219వ జాతీయ రహదారి టిబెట్‌ను జింగ్జియాంగా ప్రావిన్సుతో అనుసంధానించడంవల్ల చైనాకు ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా, ఆర్థికంగా చాలా ముఖ్యమైనది. టిబెట్, జింజియాంగ్ ప్రావిన్సు రెండింటిలో ఇప్పుడు వేర్పాటువాదం ప్రబలంగా ఉంది. ఇప్పటికే టిబెటన్ ఆకాంక్షలకు భారత్ ఎత్తుగడల రీత్యా మద్దతు ఇవ్వడం చైనాను ఆందోళనకు గురిచేస్తోంది. రెండు, చైనా–పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ) లోని కారంకోరం హైవేతో అనుసంధానించడంలో 219వ జాతీయ రహదారికి కీలక పాత్ర ఉంది. వాస్తవాధీన రేఖ నుంచి దౌలత్ బేగ్ వరకు భారత్ మౌలికవ్యవస్థాపనలను అభివృద్ధి పర్చుకోవడం అనేది ఇటు కారంకోరం, అటు ఎన్‌హెచ్ 219 హైవే రెండింటికి భద్రతాపరంగా చైనాకు హెచ్చరికలు పంపుతోంది. మూడు, సీపీఈసీకి భద్రతాపరమైన ప్రమాదం ఉందంటే ఈ ప్రాంతంలో చైనా మదుపు చేసిన 60 బిలియన్ డాలర్ల మేరకు మౌలిక వసతుల అభివృద్ధి పూర్తిగా స్తంభించిపోతుంది. పైగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మానసపుత్రిక అయిన బెల్ట్ అండ్ రోడ్స్ ఇనిషియేటివ్ (బిఆర్ఐ)ని ఇది అడ్డుకుంటుంది. ఈ ఇనిషియేటివ్‌కు ఎలాంటి నష్టం వాటిల్లినా, స్వదేశంలో జీ జిన్‌పింగ్‌కు రాజకీయ సమస్యలను కొనితెస్తుంది. ఈ వ్యూహాత్మక, ఆర్థిక కారణాలే మొత్తం కశ్మీర్ సమస్యను కొత్త మలుపులకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు చైనా తాను కూడా కశ్మీర్ సమస్యలో భాగమేనని భావిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఐక్యరాజ్యసమితిలోని చైనా శాశ్వత ప్రతినిధి భారత్ చర్యను చైనా సార్వభౌమాధికారానికి సవాలు అని ఆరోపించారు. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు అనేది అక్సాయ్ చిన్, గిల్గిత్–బాల్టిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ మూడింటికీ వర్తిస్తుందని భారత్ స్పష్టంగా ప్రకటించింది. అక్సాయ్ చిన్ ఏరియాపై చైనా బలంగా పట్టు సాధించాలంటే టిబెట్–జింజియాంగ్ కనెక్టివిటీనుంచి భారత్‌ను దూరంగా నెట్టేయాలి. భవిష్యత్తులో నెలకొనే ఏ ఘర్షణలో అయినా, కారంకోరం హైవేకి ప్రమాద అవకాశాలను తగ్గించడం అనేది లడాఖ్ రీజియన్‌లో చైనాకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక ప్రయోజనంగా మారింది. అందుచేత వివాదాస్పద భూభాగంలోపలికి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు తన బలగాలను చైనా ఉపసంహరించుకోవడం జరిగితే, దాన్ని తాత్కాలిక చర్యగానే భావించాల్సి ఉంటుంగది. అంతేకాకుండా భవిష్యత్తులో చైనా ప్రజావిముక్తి సైన్యం అనేకసార్లు ఇలా వివాదాస్పద ప్రాంతంలోకి వస్తూ, వెనక్కి వెళ్లిపోతూ ఉండే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అక్సాయ్‌చిన్‌లో తన ప్రయోజనాలను కాపాడుకోవడంతో పోలిస్తే సిక్కింలో నకూ లా సెక్టర్లో, భూటాన్ సమీపంలోని డోక్లామ్, అరుణాచల్ ప్రదేశ్ సెక్టర్లో చైనా ప్రయోజనాలు పెద్దగా ముఖ్యమైనవి కాదు. భారత్ దృష్టిని ఏమార్చడానికి, దాని శక్తిని బలహీనపర్చడానికి మాత్రమే ఈ ప్రాంతాల్లోని ఘర్షణలు ఉపయోగపడతాయి. ఎంపికలే భారత్ ముగుదాళ్లు కాబట్టి భారత్‌కు ఇప్పుడు మూడు అవకాశాలున్నాయి. ఒకటి, ప్రాదేశికప్రాంతం విషయంలో రాజీపడి యధాతథ స్థితిని కొనసాగించడం. అంటే పీఓకే, గిల్గిత్–బల్టిస్తాన్ ప్రాంతాలు పాకిస్తాన్‌తో కొనసాగేలా, అక్సాయ్‌చిన్ చైనాలో భాగంగా ఉండేలా భారత్ రాజీపడాలి. పైగా పాకిస్తాన్‌తో ఆధీన రేఖను పరిష్కరించడంలో చైనాతో వాస్తవాధీనరేఖను పరిష్కరించుకోవడానికి వాటిని అంతర్జాతీయ సరిహద్దులుగా గుర్తిస్తూ భారత్ దౌత్యపరంగా చర్చలకు కూర్చోవాల్సి ఉంటుంది. రెండు, అరుణాచల్ ప్రదేశ్‌తో సహా తూర్పు రంగంలో ఉండే అక్సాయ్‌చిన్ తదితర భూభాగాలపై చైనాతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. మూడు, భారత్ తనకు తానుగా సైనిక ఘర్షణకు సిద్ధం కావాల్సి ఉంటుంది. మొదటి రెండు ఎంపికలను భారత్ ఎంచుకోకపోతే భవిష్యత్తులో ఏ సమయంలోనైనా సైనిక ఘర్షణ తప్పదన్నమాట. ఇతర భూభాగాలకోసం అక్సాయ్ చిన్‌పై చర్చలు జరపటం అంటే రాజకీయ పార్టీలను పెద్ద ఎత్తున కూడగట్టాల్సి ఉంటుంది. పైగా ప్రజా తీర్పును కూడా కోరాల్సి ఉంటుంది. ఎందుకంటే సరిహద్దులు నిర్ణయించడమే భారత్ అసలు సమస్య. వాస్తవాధీన రేఖ ఒక సరిహద్దుగా ఉన్నప్పటికీ చైనా దాన్ని అవలీలగా దాటేస్తుంది. అందుకే ఈ ప్రాంతంలో ఇలాంటి ముఖాముఖి ఘర్షణలు తప్పవు. పైగా ఇప్పటికీ పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న పీఓకే, గిల్గిట్ బాల్టిస్తాన్ అనే కశ్మీర్‌లోని రెండు ప్రధాన భాగాల భద్రతకి అది హామీ ఇవ్వలేదు. పైగా, ఈ మూడు ఎంపికల్లో దేన్ని ఎంచుకోవాలన్నా అది అంత సులభం కాదు. దీనికి సుదీర్ఘకాల వ్యూహం అవసరమవుతుంది. మరోవైపు, ఈ ప్రాంతంలో భారత ప్రయోజనాలు ప్రధానంగా పాకిస్తాన్ చుట్టూనే తిరుగుతున్నాయి. 1947లో దేశ విభజన కాలం నుంచి మన సైనిక, వ్యూహాత్మక చింతన మొత్తంగా సీమాంతర ఉగ్రవాదం నుంచి, సైనిక కేంపెయిన్ల నుంచి కశ్మీర్‌ను కాపాడుకోవడంపైనే దృష్టి సారించింది. 1962లో చైనాతో యుద్ధం భారత్ కళ్లు తెరిపించినప్పటికీ, భారత్ రాజకీయ, వ్యూహాత్మక లక్ష్యాలు పాకిస్తాన్ నుంచి వస్తున్న ప్రమాదాలను మాత్రమే పట్టించుకుంటున్నాయి. పీఓకే, జీబీ భూభాగాలను పాకిస్తాన్ నుంచి లాక్కోవడానికి ప్రయత్నించడం కంటే ఈ ప్రాంతంలో పాకిస్తాన్ మరింతగా చొచ్చుకు రాకుండా చేయడం, సీమాంతర ఉగ్రవాదంతో పోరాడటమే భారత్ ఏకైక కర్తవ్యంగా మిగిలిపోయింది. కాబట్టి లద్దాఖ్ భద్రతతోపాటు కశ్మీర్ సమస్యను పాకిస్తాన్ నుంచి ప్రమాద హెచ్చరిక కోణంలోనే మనం చూస్తున్నాం. దీనివల్లే చైనాతో సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పన పట్ల భారత్ ఉదాశీనంగా ఉండిపోతోంది. అయితే కొత్త సహస్రాబ్దంలో భారతీయ వ్యూహాత్మక చింతనలో ప్రధానమైన మార్పు చేటు చోసుకుంది. లద్దాఖ్ రీజియన్‌లో 2003 నుంచి భారత్ రోడ్లు, బ్రిడ్జిలను నిర్మించడం ప్రారంభించింది. కఠినమైన సందర్భాల్లో పాకిస్తాన్–చైనా మిశ్రమ బలగాలు ముందుకు చొచ్చుకురాకుండా చేయడానికి వీటి నిర్మాణం అవసరం. 2013లో సీపీఈసీని చైనా ప్రారంభించి కారంకోరం హైవే అభివృద్ధిని ప్రకటిం చినప్పుడు భారత్ అప్రమత్తమై తన అభ్యంతరం వ్యక్తంచేసింది. కశ్మీర్ ప్రతిపత్తికి ఇది విఘాతం కలిగిస్తుంది కాబట్టే భారత్ చైనా ప్రతిపాదిత బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో చేరడానికి నిరాకరించింది. భారత్ అష్టదిగ్బంధనమే చైనా లక్ష్యం పైగా అంతర్జాతీయంగానే ఇరుదేశాల ప్రయోజనాలు దక్షిణ చైనా సముద్రం నుంచి తూర్పున హిందూ మహాసముద్రంవరకు, పశ్చిమ భారత్ లోని అప్ఘానిస్తాన్ వరకు వ్యాపించి ఉన్నాయి. చైనాతో లెక్కలు తేల్చుకోవడానికి అమెరికా పొంచుకుని ఉన్నందున భారత్‌తో సైనిక ఘర్షణను కోరి తెచ్చుకోవడం అంటే చైనాకు కొరివితో తల గోక్కున్నట్లే అవుతుంది. అందుకే పూర్తి స్థాయి యుద్ధానికి బలీయమైన కారణాలు కనిపిస్తే తప్ప, చైనా తన ప్రయోజనాల రక్షణ కోసం స్థానిక ఘర్షణలకు మాత్రమే పరిమితమవుతుంది. పైగా వివాదాస్పద ప్రాంతాలను కొంచెంకొంచెంగా ఆక్రమించడం, భారత్‌ను పొరుగుదేశాల సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పనను వృద్ధి చేసి భారత్‌ను అష్టదిగ్బంధానికి గురి చేయడం వంటి ఇతర వ్యూహాలను కూడా చైనా ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి దక్షిణాసియా ప్రాంతంలో చైనా జోక్యం ద్వారా ఎదురవుతున్న కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా భారత్ సిద్ధమై ఉండాలి. వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్శిటీ, సిక్కిం ఈమెయిల్ – opgadde@cus.ac.in -
కల్నల్ సంతోష్ బాబు భౌతికకాయానికి ప్రముఖుల నివాళి
-
సూర్యాపేటకు సంతోష్ బాబు పార్థీవదేహం
సాక్షి, హైదరాబాద్ : భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహం సూర్యాపేట విద్యానగర్ కాలనీలోని స్వగృహనికి చేరుకుంది. జాతీయ జెండాలు, వందేమాతరం నినాదాలతో ఎదురెళ్లి సంతోష్ బాబు పార్ధీవదేహన్ని ప్రజలు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్మీ మేజర్ జనరల్ అధికారులు రిసీవ్ చేసుకున్నారు. అంబులెన్స్‌తో పాటే హైదరాబాద్ నుంచి మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటకు చేరుకున్నారు. అంతకు ముందు సంతోష్ బాబు పార్థీవ దేహం హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రత్యేక సైనిక విమానం ద్వారా సంతోష్ బాబు పార్థీవదేహాన్ని హకీంపేటకు తరలించారు. ఎయిర్‌పోర్ట్‌లో సంతోష్ బాబు భౌతికకాయానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రుల కేటీఆర్, మల్లారెడ్డిలతో పాటుగా పలువురు ప్రముఖులు నివాళుర్పించారు. అనంతరం సంతోష్ బాబు పార్థీవదేహానికి ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలతో వందనం సమర్పించారు. గోల్కొండ వసతి గృహం నుంచి సంతోష్ బాబు కుటుంబసభ్యులు కూడా హకీంపేటకు చేరుకున్నారు. కాగా, సంతోష్ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు పెద్దఎత్తున ప్రజాప్రతినిధులు, స్థానికులు, ప్రజలు హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో అనుమతి ఉన్నవారిని మాత్రమే ఆర్మీ అధికారులు ఎయిర్‌పోర్ట్‌లోనికి పంపించారు. అంత్యక్రియల ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు సూర్యాపేట : కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు గురువారం సూర్యాపేట పక్కనే ఉన్న కేసారం గ్రామంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లును జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, ఆర్మీ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్మీ, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సంతోష్ బాబు అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆర్మీ మేజర్లు, ఉన్నతాధికారులు ఈ అంత్యక్రియల్లో పాల్గొంటారని చెప్పారు. బుధవారం రాత్రి 8 గంటలకు సంతోష్ పార్థీవదేహం చేరకుంటుందన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. రేపు జరిగే కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సంతోష్ బాబను కడసారి చూసేందుకు వచ్చేవారు భౌతిక దూరం నిబంధన పాటించాలన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చనిపోతున్నా.. చైనాకు చుక్కలు చూపించాడు
సాక్షి, విజయనగరం: చైనాతో జరిగిన సరిహద్దు వివాదంలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబుకు విజయనగరంలోని కోరుకొండ సైనిక్ స్కూల్ సిబ్బంది నివాళులు అర్పించారు. అక్కడ ఉపాధ్యాయులు మాట్లాడుతూ... సంతోష్ బాబు తమ విద్యార్థి కావడం గర్వకారణమన్నారు. కల్నల్ సంతోష్ బాబు మరణం తమను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృత్యువుతో పోరాడుతూ కూడా సంతోష్ బాబు చైనా సేనకు దడ పుట్టించారని కొనియాడారు. సంతోష్ కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. (సలామ్ కల్నల్ సంతోష్..) -
వారి త్యాగానికి దేశం గర్విస్తోంది: మోదీ
న్యూఢిల్లీ : భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. బుధవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న మోదీ.. లేచి నిలబడి రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న హోం మంత్రి అమిత్ షా, సీఎంలు కూడా అమర జవాన్లకు నివాళులు అర్పించారు. అమర జవాన్ల త్యాగాన్ని చూసి దేశం గర్విస్తోందని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘మన జవాన్ల త్యాగం వృథా కాదని దేశానికి హామీ ఇస్తున్నాను. భారత్ సార్వభౌమాధికారంపై రాజీ పడే ప్రసక్తే లేదు. భారత్ శాంతిని కోరుకుటుందని.. కానీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే అందుకు తగ్గ సమాధానం ఇవ్వగలదు’ అని మోదీ తెలిపారు. మరోవైపు తూర్పు లద్ధాఖ్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు మోదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్టుగా సమాచారం. కాగా, తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో సోమవారం రాత్రి భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది జవానులు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. (చదవండి : సలామ్ కల్నల్ సంతోష్..) -
అమర జవాన్లకు ఏపీ అసెంబ్లీ నివాళి
సాక్షి, అమరావతి : భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో అమరులైన వీరసైనికులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ బుధవారం సంతాపం తెలిపింది. భారత జవాన్ల మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఈ సంతాప తీర్మాణాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టారు. ‘దేశసమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే విధి నిర్వహణ చేస్తూ, ఇండియా – చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయవద్ద ఘర్షణలో అమరులైన 20 మంది మనదేశ వీర సైనికులకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఈ శాసనసభ ఘనమైన నివాళులు అర్పిస్తోంది. మొత్తం దేశంతోపాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారందరి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది. తెలుగువాడు, పక్కరాష్ట్రం తెలంగాణలోని సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్‌బాబు త్యాగం ఎప్పటికీ తెలుగు ప్రజలకు గుర్తుండిపోతుంది. వీరమరణం పొందిన మన సైనికులకు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
జవాన్ల మధ్య ఘర్షణకి కారణం ఏంటంటే..
న్యూఢిల్లీ : భారత్–చైనా జవాన్ల మధ్య ఘర్షణ, పలువురి మృతికి దారితీయడానికి టెంట్ వద్ద జరిగిన గొడవే కారణమని సమాచారం. వాస్తవాధీన రేఖకు(ఎల్ఏసీ) ఇటువైపున భారత భూభాగంలోనే చైనా సైనికులు టెంట్ ఏర్పాటు చేశారు. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత భూభాగంలో పెట్రోలింగ్ పాయింట్ 14 అనే చోట చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) టెంట్ వేసిందన్న సమాచారంతో భారత జవాన్లు రంగంలోకి దిగారు. ఈ నెల ప్రారంభంలోనే ఈ టెంట్ వేశారు. (అప్పుడు మేము గర్వంగా ఫీలయ్యాం : కల్నల్ సంతోష్ సోదరి) గత వారం ఇక్కడే భారత్, చైనా డివిజన్ కమాండర్ స్థాయి అధికారుల సమావేశం జరిగింది. గాల్వన్‌లో బలగాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించుకున్నారు. జూన్ 6న భారత్, చైనా లెఫ్ట్‌నెంట్ జనరల్ ర్యాంకు అధికారుల మధ్య జరిగిన సమావేశంలో టెంట్ తొలగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆ టెంట్‌ను తొలగించే ప్రయత్నంలో ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఆ టెంట్‌ను వెంటనే తొలగించాలని భారత జవాన్లు సూచించగానే, పెట్రోలింగ్ పాయింట్ 14 పై భాగం నుంచి చైనా జవాన్లు రాళ్లు విసరడం ప్రారంభించారు. ఇనుప రాడ్లతో దాడికి దిగారు. ఆరుగంటలపాటూ జరిగిన తోపులాటలోపక్కనే ఉన్న గాల్వన్‌లోయలో కూడా కొందరు సైనికులు పడిపోయారు. ఎముకలు కొరికే చలి, హైపోథెర్మియాతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ ఘటనలో గాయపడిన భారత జవాన్లను మిలటరీ ఆసుపత్రికి తరలించారు. పెట్రోలింగ్ పాయింట్ 14 గాల్వన్, ష్యోక్ నదుల సంగమ ప్రాంతం సమీపంలోనే ఉంది. ఈ ఘర్షణలో ఇప్పటివరకు కల్నల్ సహా 20 మంది భారత సైనికులు మరణించగా, తాజాగా మరో నలుగురి జవాన్ల పరిస్థితి విషమంగా మారడంతో భారత్- చైనా సరిహద్దులో యుద్ద వాతావరణం నెలకొంది. ('వారి ప్రాణత్యాగం మనోవేదనకు గురి చేసింది')