సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఇటీవల హింసాత్మక ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తూర్పు లద్దాఖ్‌లో ప్రస్తుతం నెలకున్న పరిస్థితులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భారత త్రిదళాధిపతి(సీడీఎస్) బిపిన్ రావత్‌తో పాటు త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైనా దాడులను తిప్పికొట్టాలని, వారి ప్రతి కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు.
అలాగే జల, వాయు మార్గాల ద్వారా చైనా ప్రవేశించే అవకాశం ఉన్నందున గట్టి నిఘా ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించారు. సరిహద్దులో చైనా సైనికులు ఎటువంటి దాడులకు ప్రయత్నించినా ధీటుగా సమాధానం ఇవ్వాలని సూచించారు. ఎల్ఏసీ వెంబడి మరింత అప్రమత్తంగా ఉండి చైనా ఆర్మీ దురాక్రమణలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని ఆదేశాలు ఇచ్చారు. (చదవండి : సరిహద్ధు ఘర్షణ : అసలేం జరిగింది.?)
చైనా సరిహద్దుల్లో ఆర్మీకి ఫ్రీహ్యాండ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. డ్రాగన్ సైన్యం దురాక్రమణలను తిప్పికొట్టేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. చైనా కవ్విస్తే ధీటుగా బదులిచ్చేలా సైన్యాన్ని స్వేచ్ఛ ఇచ్చినట్లు సమాచారం. కాగా గాల్వన్ లోయలో ఎప్పటికప్పుడు పరిస్థితిని భద్రతా దళాలు ప్రభుత్వానికి చేరవేస్తున్నాయి. మరోవైపు గల్వాన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ 14 ప్రాంతంలో భారత సైన్యం పట్టు సాధించింది. ఇదిలావుంటే రష్యాలో నిర్వహించే విక్టరీ డే పరేడ్ కు హాజరు కావడానికి మంత్రి రాజ్‌నాథ్ సోమవారం బయలుదేరి వెళతారు. అక్కడ జూన్ 24న జరిగే పరేడ్ లో పాల్గొంటారు.
(చదవండి : గల్వాన్‌లో బయటపడ్డ చైనా కుట్రలు)
కాగా,జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెసిలిందే. ఈ ఘటనలో కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. . చైనాకు చెందిన 45 మంది సైనికులు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే చైనా మాత్రం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. (72 గంటల్లోనే గల్వాన్ నదిపై బ్రిడ్జి నిర్మాణం)
Comments
Please login to add a commentAdd a comment