వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద ఏం జరుగుతున్నదో వెల్లడించాలంటూ కొన్నాళ్లుగా విపక్షాలు నిల దీస్తున్న తరుణంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం లోక్‌సభలో అందుకు సంబంధించి ఒక ప్రకటన చేశారు. చైనా భారీగా సైన్యాన్ని మోహరించడంతో లద్దాఖ్ ప్రాంతంలో మనం పెను సవాల్‌ని ఎదుర్కొంటున్నామని ఆయన అంగీకరించారు. దీన్ని దీటుగా ఎదుర్కొంటామని ప్రకటిం చారు. చైనా సైన్యం మన భూభాగంలోకి చొచ్చుకొచ్చిందా, మన భూభాగాన్ని ఆక్రమించిందా అన్న విషయంలో ఇందులో వివరణ లేదు. సరిగ్గా ఈ అంశంపైనే విపక్షాలు ఆదినుంచీ నిలదీస్తున్నాయి. ఎల్‌ఏసీ వద్ద చైనా సైన్యం చొచ్చుకురావడం, కల్నల్ సంతోష్‌బాబుతోసహా మన జవాన్లు 21 మందిని కొట్టిచంపడం వంటి ఘటనలు జరిగాక చైనా సైనికులు ప్యాంగాంగ్ సో తదితర ప్రాంతాల్లో మన భూభాగాన్ని దురాక్రమించారన్న వార్తలొచ్చాయి. ‘ఎవరూ మన భూభాగంలోకి రాలేదు... దేన్నీ స్వాధీనం చేసుకోలేద’ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశాక కూడా ఎవరికీ సంతృప్తి కలగ లేదు. అటు తర్వాత ఎల్‌ఏసీలో కాల్పుల ఘటన కూడా చోటుచేసుకుంది.
గత నెలాఖరున మన దళాలు చైనా సైన్యంపై పైచేయి సాధించాయన్న కథనాలు కూడా వచ్చాయి. ఇలా వివిధ సంద ర్భాల్లో వస్తున్న కథనాలపై ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత లేదు. రాజ్‌నాథ్‌సింగ్ తాజా ప్రకటన కొంతమేరకు వివరణ ఇచ్చిందనే అనాలి. ఎందుకంటే మన ‘లోపలి ప్రాంతాల్లోకి’ వారు చొచ్చు కొచ్చారన్న మాట ఆయన ఉపయోగించారు. అలాగే ఎల్‌ఏసీని ఏకపక్షంగా మార్చడానికి చైనా ప్రయ త్నించిందని ఆరోపించారు. అయితే ఆ సందర్భంగా తాత్కాలికంగానైనా వారి స్వాధీనంలోకి ఏ ప్రాంతమైనా వెళ్లిందా లేదా అనిగానీ... ఆగస్టు నెలాఖరున మన దళాలు కూడా దూకుడు ప్రదర్శించి ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ ప్రాంతాన్ని కైవసం చేసుకున్నాయా అన్నదిగానీ వివరించలేదు. మన జవాన్ల మరణానికి దారికి తీసిన ఘర్షణల స్వభావం ఎటువంటిదో, ఏ క్రమంలో అవి చోటు చేసుకున్నాయో కూడా ఆ ప్రకటన వివరించలేదు. రాజ్‌నాథ్ ప్రకటనపై చర్చించడానికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఇలాంటి అంశాలు తెలిసే అవకాశం లేదు. కేంద్రం చెబుతున్నట్టు ఇది సున్నితమైన సమస్యే కావొచ్చు... కానీ కనీసం మన జవాన్ల ప్రాణం తీసిన ఉదంతంలో ఏం జరిగిందో స్పష్టతనిచ్చివుంటే బాగుండేది.
భారత–చైనాల మధ్య సైన్యం స్థాయిలో చర్చలు జరగడంతోపాటు ఈ నెల మొదట్లో రెండు దేశాల రక్షణమంత్రులు, విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. ఆ భేటీల్లో అవగాహన కుదిరింది. సామరస్య వాతావరణం ఏర్పడుతుందన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. కానీ రెండు మూడు రోజులుగా తీరుమారింది. కోర్ కమాండర్ల స్థాయి చర్చలపై చైనా మౌనం వహిస్తోందన్న వార్తలొస్తున్నాయి. ఇది కలవరపరుస్తుంది. తొలుత అనుకున్న ప్రకారం ఈ వారం మొదట్లో కోర్ కమాండర్ల మధ్య చర్చలుండాలి. ప్యాంగాంగ్ సో సరస్సు దక్షిణ ప్రాంతంలోని పర్వత ప్రాంతం మన దళాల నియంత్రణలోకొచ్చిందని, అక్కడినుంచి వారిని పంపేయడానికి చైనా పథకాలు పన్ను తోందని చెబుతున్నారు. రెండు పక్కలా సైన్యాల మోహరింపు, వాటికి అవసరమైన సైనిక సామగ్రి, యుద్ధ విమానాలు, విమాన విధ్వంసక క్షిపణులు, ఆహారం వగైరాలు లద్దాఖ్ ప్రాంతంలోకి చేర డంతో అక్కడ ఏమైనా జరగొచ్చునన్న అనుమానాలున్నాయి. బహుశా కేంద్రం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే లోక్‌సభలో చర్చకు అంగీకరించకపోయి వుండొచ్చు. సాధారణంగా సైన్యం మోహరింపు దానికదే ఘర్షణలకు దారితీయదు. ఆత్మరక్షణ కోసం, తాము సంసిద్ధంగా వున్నామని అవతలి పక్షానికి చెప్పడం కోసం ఎక్కువ సందర్భాల్లో సైన్యం మోహరింపు వుంటుంది. సరిహద్దులపై జరిగే చర్చల్లో బేరసారాలు జరపడానికి అది ఉపయోగపడుతుంది. కానీ సుదీర్ఘకాలం ఎదురుబొదురుగా సైన్యాలుంటే ఏ చిన్నపాటి వివాదమైనా సాయుధ ఘర్షణలకు దారితీసే ప్రమాదం కూడా వుంటుంది.
లద్దాఖ్‌లోనూ, అక్కడికి సమీపంలోని మరికొన్ని సెక్టార్లలోనూ ఎల్‌ఏసీ ఎక్కడన్న అంశంలో భారత, చైనాల మధ్య మొదటినుంచీ విభేదాలున్నాయి. సిక్కిం సెక్టార్‌లో అక్కడక్కడ కొన్నిచోట్ల కొన్ని మీటర్ల తేడా మాత్రమే వుంది. కానీ మరికొన్నిచోట్ల 20, 30 కిలోమీటర్ల ప్రాంతం మాదంటే మాదన్న పోటీ వుంది. ఇరు దేశాల విదేశాంగమంత్రులు మాస్కోలో సమావేశమైనప్పుడు కోర్ కమాండర్ల స్థాయిలో సమస్య పరిష్కారానికి కృషి చేద్దామన్న విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది. ఘర్షణలు మరింత ముదరకుండా వుండాలంటే సత్వరం పరిష్కారం కుదరాలి. అయితే కమాండర్లు వారంతట వారే ఇంత జటిలమైన సమస్యను పరిష్కరించలేరు. ప్రభుత్వాధినేతల నుంచి స్పష్టమైన ఆదేశాలొస్తే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు సొంతంగా నిర్ణయం తీసుకునేది వుండదు. ఇరు దేశాధినేతల భేటీ జరిగినప్పుడే అది సాధ్యమవుతుంది. మన సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దృఢంగా కాపాడుకుంటూనే శాంతియుత పరిష్కారానికి కృషి చేస్తామని రాజ్‌నాథ్ తాజా ప్రకటన చెబుతోంది. అది సాకారమై ఉద్రిక్తతలు సాధ్యమైనంత త్వరలో సడలాలని అందరూ ఆశిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment