సైనిక విన్యాసాలను సాకుగా చూపి ఏమార్చి మరీ లదాఖ్‌లోకి తన బలగాలను పంపిస్తూ వచ్చిన చైనా ఇప్పుడు ఆ ప్రాంతాలపై పట్టు సాధించింది. సరిహద్దు ప్రాంతాలకు అతి సన్నిహితంగా చైనా సైనిక కార్యకలాపాలు సాగుతున్నప్పుడు భారత విధాన నిర్ణేతలు అప్రమత్తం కావాల్సి ఉండింది. చైనా బలగాల తరలింపుపై ఇస్రో చాయాచిత్రాలను కూడా ఎవరూ పట్టించుకోలేదు. చైనా ఉద్దేశాన్ని గమనించకుండా అది ఆక్రమించిన భూభాగంలో ఒక సెక్టారును ఖాళీచేయించాలని ప్రయత్నించిన భారత సైనికులు నేరుగా చైనా ఉచ్చులో పడిపోయారు. ఈ ఘటన ఇటీవలి దశాబ్దాల్లో దేశం ఎదుర్కొన్న అతి పెద్ద సంక్షోభం అనే చెప్పాలి. ఈ సంక్షోభం రాబోయే దశాబ్దాల్లో భారతీయ విదేశీ, రక్షణ విధానాన్ని పూర్తిగా మార్చివేస్తుంది.
లదాఖ్‌లో భారత్–చైనా మధ్య వాస్తవాధీన రేఖ వద్ద తాజాగా సంభవించిన సంక్షోభాన్ని, గత కొన్ని దశాబ్దాలలో కేంద్రప్రభుత్వం ఎదుర్కొన్న అతి పెద్ద వ్యూహా త్మక, భద్రతాపరమైన సవాలుగా చెబుతున్నారు. జూన్ 15 రాత్రి చైనా ప్రజావిముక్తి సైన్య (పీఎల్‌ఏ) బలగాలు ఐరన్ రాడ్లతో, ఇనుప ముళ్లు చుట్టిన లాఠీలు, కర్రలతో చేసిన ఆకస్మిక దాడిలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గత మే నెల నుంచి చైనా ఆక్రమించి ఉన్న 40–60 చదరపు కిలోమీటర్ల భూభాగంలో ఒక సెక్షన్‌లో చైనా బలగాలు వెనుదిరిగేలా చేయాలని భారత సైనికులు ప్రయత్నించారు. ఇదే చైనా దాడికి కారణమైంది. చైనా తన దురాక్రమణను యధాతథంగా కొనసాగించి ఉంటే బీజింగ్ కైవసం చేసుకున్న ఆ భూమి ఒక నిరూపిత సత్యంగా మారి, భారత్ కూడా దాన్ని ఆమోదించాల్సి వచ్చేది. అంతే కాకుండా సరిహద్దు గస్తీకి సంబంధించిన కీలకప్రాంతాలు మన ఆధీనంలో లేకుండా పోయేవి. అంతకుమించి భారత వ్యూహాత్మక ప్రయోజనాలకు కీలకంగా ఉంటున్న దార్బక్–షియోక్–దౌలత్ బెక్ ఓల్డీ రోడ్డుపై పీఎల్‌ఏకి ఆధిపత్యం లభించేది.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీకి అందుబాటులో ఉన్న తొలి ఎంపిక ఏమిటంటే.. సైనిక బలంతో 1962 నాటి వాస్తవాధీన రేఖ వెనుకకు పోయేలా చైనా బలగాలను వెనక్కు నెట్టడమే. ఏ పరిణామాలు సంభవించినా సరే భారత్‌తో తలపడాల్సిందేనని చైనా నమ్ముతున్న నేపథ్యంలో 20 మంది భారత సైనికులు చనిపోవడం, అంతకు మూడురెట్లకు పైగా గాయపడటం జరిగింది. అయితే చైనా దూకుడు కారణంగా ఇలాంటి దాడులు మునుముందు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. అయితే సరిహద్దు ప్రాంతాల్లో భారత్, చైనా పోరాట బలగాల సంఖ్యపై ఇటీవలే చేసిన సమగ్ర అంచనా ప్రకారం, బలగాల తరలింపులో భారత్ చైనాను అధిగమించినట్లే చెప్పాలి. సరిహద్దుల్లోకి చైనా నూతన బలగాలను భారీ సంఖ్యలో తరలించినప్పటికీ భారత్ ఇప్పటికీ తన కీలక ప్రాధాన్యతా స్థానాన్ని అట్టిపెట్టుకునే ఉంటోంది. ఈ స్థితిలో భారత్ ముందున్న కొత్త అవకాశం ఏదంటే అరుణాచల్ నుంచి బయటపడి తూర్పు సెక్టా ర్‌లో చైనా భూభాగాన్ని కైవసం చేసుకోవడానికి ఒక కొత్త యుద్ధ రంగాన్ని తెరవడమే. ఇలా చేస్తే చైనా సైనిక బలగాల ఉపసంహరణ ప్రయత్నంలో న్యూఢిల్లీకి బేరసారాలాడే శక్తి సమకూరుతుంది.
అయితే, చైనా దురాక్రమణ బలగాలతో మరిన్ని ఘర్షణలకు దిగకుండా మోదీ సంయమనం పాటించడానికే ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ప్రస్తుతానికి ఘర్షణల జోలికి పోకుండా తదుపరి చర్చల్లో పైచేయి సాధించడానికి మోదీ ప్రయత్నించవచ్చు. పైగా, చైనా దురాక్రమణ తత్వం గురించి, భారత బలగాలపై చైనా పాశవిక దాడి గురించి పలు దేశాల రాయబారులకు వివరించి చెప్పడం ద్వారా చైనాను అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ట దెబ్బతీయడానికి భారత్ గ్లోబల్ దౌత్య ప్రచారానికి కూడా సిద్ధపడవచ్చు. దీంతో తన సైనిక చర్యల ఫలితంగా చైనాకు రాజకీయంగా నష్టాలు పెరగవచ్చు కూడా. 2021లో భారత్ ఆతిథ్యమివ్వనున్న బ్రిక్స్ దేశాల సదస్సులో చైనాపై ఒత్తిడి తీసుకురావచ్చు కూడా. ఒకవైపు భారత భూభాగాన్ని చైనా అక్రమించిన తరుణంలో బ్రిక్స్ దేశాల సదస్సుకు ఆ దేశాన్ని తాను ఎలా ఆహ్వానించాలి అని మోదీ బహిరంగంగా ప్రశ్నించవచ్చు కూడా. గతంలో డోక్లామ్ సంక్షోభాన్ని ముగించడానికి 2017లో చైనా ఆతిథ్యం ఇచ్చిన బ్రిక్స్ దేశాల సదస్సును భారత్ చక్కగా వినియోగించుకుంది. డోక్లామ్ సంక్షోభంపై ముందస్తు తీర్మానం చేయకుంటే ఆ సదస్సుకు తాను హాజరు కాబోనని హెచ్చరించిన భారత్ ఆ సదస్సుకు ఆతిథ్యమిచ్చిన చైనాకు బహిరంగంగానే ఇబ్బంది కలిగించగలిగింది.
సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో శాశ్వతంగా తన బలగాలను చైనా మోహరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చైనా భారత భూభాగంలోకి తన సైన్యాన్ని మోహరించిన తరుణంలో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ కనుగొన్నట్లుగా, సరిహద్దుల్లో చైనా తన కార్యకలాపాలను మరింతంగా పెంచి కొనసాగించే అవకాశం ఇక ముందు కూడా ఉంటుంది. దీనితో న్యూఢిల్లీ కూడా తన బలగాలను సరిహద్దు ప్రాంతాల్లో భారీగా మోహరించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. పైగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న బలగాలను తరచుగా యుద్ధరంగంలోకి తరలించవలసి రావచ్చు కూడా. దీనిద్వారా చైనా బలగాలు భారత సాంప్రదాయిక సైనిక బలాధిక్యతకు గండికొట్టి లాభపడకుండా అడ్డుకోవచ్చు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రకటించిన చైనా దళాల కదలికలకు చెందిన చిత్రాలను సకాలంలో గమనించడంలో మన సైన్యం వెనకబడి ఉండవచ్చు కానీ చైనా భారీస్థాయిలో తలపెట్టే సైనిక మోహరింపులను అమెరికా సులభంగా పసిగట్టి ఆ సమాచారాన్ని భారత్‌కు అందచేసి అప్రమత్తం చేసే అవకాశం కూడా ఉంది. గతంలో డోక్లామ్ సంక్షోభ సమయంలో కూడా అమెరికా, ఇస్రోల మధ్య సమాచార పంపిణీ జరిగింది.
అయితే భారత నిఘా సంస్థ పనితీరులో తీవ్రమైన లోపాలు తాజా సంక్షోభ సమయంలో స్పష్టంగా కనిపిం చాయి. సైనిక విన్యాసాలను సాకుగా చూపి ఏమార్చి మరీ లదాక్‌లోకి తన బలగాలను పంపిస్తూ వచ్చిన చైనా ఇప్పుడు ఆ ప్రాంతాలపై పట్టు సాధించింది. సరిహద్దు ప్రాంతాలకు అతి సన్నిహితంగా చైనా సైనిక కార్యకలాపాలు సాగుతున్నప్పుడు భారత విధాన నిర్ణేతలు అప్రమత్తం అయి ఉంటే భారత వాస్తవాధీన రేఖ ప్రాంతంలో గస్తీని పెంచడం, సాధారణ సైనిక సన్నాహక చర్యలను కొనసాగించడం జరిగి ఉండేది.
పలు భారతీయ నిఘా సంస్థలు 2020 ఫిబ్రవరి కంటే ముందుగానే సరిహద్దుల్లో చైనా సైనిక కార్యకలాపాలకు సంబంధించి హెచ్చరిస్తూ వచ్చాయి. అయితే నిఘాసంస్థల హెచ్చరికలపై వ్యవహరించడంలో ఆలస్యం జరిగిందా అని అడిగినప్పుడు ప్రారంభ నివేదికలు అంత స్పష్టంగా లేవని, చైనా బలగాల మోహరింపు వెనుక ఉద్దేశం స్పష్టంగా కనిపించలేదని సైన్యాధికారులు తెలపడం గమనార్హం. చైనా బలగాల చొరబాటుకు సంబంధించిన నిర్దిష్ట ప్రాంతాన్ని 2020 ఏప్రిల్‌లో మాత్రమే గుర్తించారు. కీలకమైన నిఘా హెచ్చరిక తెలిసివచ్చేసరికి భారత బలగాలకు ఎంత తక్కువ సమయం అందుబాటులో ఉండిందంటే లేహ్ ప్రాంతానికి శరవేగంగా బలగాలను తరలించాల్సి వచ్చింది. చైనా బలగాల కదలికలకు సంబంధించి అమెరికా నిఘా సమాచారం బహిరంగంగా అందుబాటులో లేదు. ఒకవేళ అమెరికా చేసిన హెచ్చరికలను న్యూడిల్లీ సకాలంలో అందుకుని ఉన్నప్పటికీ విధాన నిర్ణేతలతో సహా భారత నిఘా వ్యవస్థ మొత్తంగా ముందస్తు హెచ్చరికలు అందిన కీలక సమయంలో సమర్థంగా వ్యవహరించలేదని కొట్టొచ్చినట్లు కనబడుతోంది.
ఇంత తీవ్రస్థాయిలో నిఘా సంస్థలు విఫలం చెందినప్పుడు దానికి వ్యవస్థాగత కారణాలు, ప్రతిపాదిత సంస్కరణలపై అధికారిక సమీక్ష అవసరం ఉంది. కార్గిల్ రివ్యూ కమిటీ తరహాలో ఈ సమీక్ష జరగాల్సి ఉంది. ప్రభుత్వం స్వయంగా అలాంటి బహిరంగ విచారణకు పూనుకోకపోతే, రక్షణపై లోక్ సభ స్టాండిగ్ కమిటీనైనా నియమిం చాల్సి ఉంటుంది. ఈ విచారణకు తగిన ఆధారాలు అందివ్వడానికి నిఘా వ్యవస్థలో సుదీర్ఘ అనుభవం ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అందుబాటులో ఉండాలి. అయితే ఇలాంటి క్రాస్ పార్టీ చర్చలు, పారదర్శకత స్థాయిని మోదీ, బీజేపీల నుంచి ఆశించడం కష్టమేనని పరిశీలకులు సూచిస్తున్నారు. అయితే జూన్ 19వ తేదీనే మోదీ సరిహద్దు సంక్షోభంపై అఖిల పార్టీ సమావేశం నిర్వహించి ఆయా రాజకీయ పార్టీల నేతలకు పరిస్థితిని క్లుప్తంగా వివరించారు. చైనా బలగాలు చొరబాటు లేనేలేదని అంతకు ముందు స్పష్టం చేసిన మోదీ జూన్ 19 భేటీ తర్వాత పరిస్థితి తీవ్రతను గుర్తించి బహిరంగంగానే తమ మునుపటి ప్రకటనను సవరించుకున్నారు.
మోదీ చేసిన ముందు ప్రకటనకే కట్టుబడి ఉన్నట్లయితే, గల్వాన్ రివర్ వేలీ తనదే అంటున్న చైనా ప్రకటనను భారత్ శషభిషలు లేకుండా అంగీకరించాల్సి వచ్చేది. అయితే ఫలితాలతో నిమిత్తం లేకుండానే ఈ ఉదంతం భారతీయ దౌత్యాన్ని సమూలంగా మార్చివేయగలదు. ఈ సంక్షోభం రాబోయే దశాబ్దాల్లో భారతీయ విదేశీ, రక్షణ విధానాన్ని పూర్తిగా మార్చివేయనున్న నేపథ్యంలో, మోదీ పైన పేర్కొన్న తరహా సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసి దాని ఫలితాలను బహిరంగంగా ప్రకటించడం తప్పనిసరి. దీనివల్ల భారత నిఘా వ్యవస్థలు, సైనిక బలగాలు బలాన్ని సంతరించుకుని నూతన శకంలో సుసంఘటితం కాగలవు. మోదీ పదవి నుంచి దిగిపోయాక దశాబ్దాలపాటు ఈ కొత్త శకం కొనసాగుతుంది కూడా.
ప్రాంక్ ఒ డానెల్
వ్యాసకర్త నాన్ రెసిడెంట్ ఫెలో,
స్టిమ్సన్ సెంటర్ సౌత్ ఆసియా ప్రోగ్రామ్
Comments
Please login to add a commentAdd a comment