జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ ప్రాంతంలో భారత సైనికుల బలిదానం ఆద్యంతం భారత సైనిక నాయకత్వం తప్పు అంచనా ఫలితమనే చెప్పాల్సి ఉంటుంది. ఇది మన సైనిక నాయకత్వం నిర్లక్ష్యానికి, ఘోరమైన అసమర్థతకు ప్రతిబింబం మాత్రమే. గతంలో చైనా సైనిక చొరబాట్లతో గల్వాన్ చొరబాట్లను సమానంగా లెక్కవేసి మన సైనిక నాయకత్వం అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. చైనా దూకుడు చర్యకు తగిన సమాధానం ఇస్తామంటూ ప్రధాని నరేంద్రమోదీ జాతికి హామీ ఇచ్చారు కానీ ఆ సమాధానం సైనిక పరంగా కాకుండా ఆర్థికపరంగా, దౌత్యపరంగా మాత్రమే ఉండవచ్చు.
భారత్–చైనా బలగాల మధ్య సరిహద్దుల్లో ఘటనల క్రమం ఒక స్పష్టమైన రూపుదిద్దుకుంటున్న కొద్దీ గల్వాన్ ప్రాంతంలో ఇరుసైన్యాల మధ్య విషాదకరమైన దాడికి తీవ్రమైన తప్పుడు చర్యలే దోహదం చేసివుంటాయని విస్పష్టంగా బోధపడుతోంది. ఏటా జరిగే చైనా ప్రజావిముక్తి సైన్యం (పీఎల్‌ఏ) సైనిక విన్యాసాలతోపాటు లదాఖ్ ప్రాంతంలో భారీ స్థాయిలో చైనా దళాల కదలికలు కనిపిస్తున్నాయని భారత నిఘా సంస్థ ఏప్రిల్ మధ్యలో నివేదించింది. దీనితర్వాత గల్వాన్, హాట్ స్ప్రింగ్, ప్యాంగాంగ్ ప్రాంతాల్లో చైనా బలగాలు ట్యాంకులు, ఫిరంగులతో సహా భారీ ఎత్తున సైనిక సామగ్రిని తరలిస్తూ వచ్చాయి. మే 9 నాటికి తూర్పున 1500 మైళ్ల దూరంలో ప్యాంగాంగ్ ట్సోలోనూ, సిక్కింలోని నకు లా పరి ష్కృత సరిహద్దు వరకు చైనా బలగాలు విస్తరించాయి.
మే 15న, భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్‌ఎమ్ నరవణే ఈ దురాక్రమణలకు స్థానిక పీఎల్‌ఏ కమాండర్‌దే బాధ్యత అని ఆపాదించారు తప్పితే గల్వాన్ ప్రాంతంలో, సిక్కింలో పదే పదే చైనా బలగాలు చొరబడటానికి కారణం ఏమై ఉంటుందన్న అంశాన్ని పరిశీలించలేకపోయారు. మన ఆర్మీ నాయకత్వానికి చైనా చొరబాట్ల అసలు ఉద్దేశాన్ని గుర్తించడానికి కాస్త సమయం పట్టినా పీఎల్‌ఎ వ్యూహాత్మక కదలికలను నేటికీ గుర్తించడం లేదు. గతంలో దేప్సంగ్, చుమార్, డోక్లామ్ ప్రాంతాల్లో చైనా సైనికుల కదలికలకు, తాజా దురాక్రమణలకు పోలికే లేదన్నది స్పష్టం. చైనా దళాలు తూర్పు లదాఖ్ లోపలకి భారీ సంఖ్యలో ప్రవేశించాయని జూన్ 2న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించినప్పటికి గానీ చైనాబలగాల చొరబాట్ల స్థాయి గురించి స్పష్టం కాలేదు. జూన్ 6న, ఇరుదేశాల సైనిక జనరల్స్ మధ్య సంభాషణల ఫర్యవసానాలను కూడా మనవాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. జూన్ 9 నాటికి ఇరుదేశాల సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైందని, ఇరు పక్షాలు తమ తమ భూభాగంలోకి 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం మేరకు వెనక్కు తగ్గాయని భారత సైనిక వర్గాలు సమాచారం లీక్ చేశాయి.
జూన్ 13న డెహ్రాడూన్‌లోని భారత మిలటరీ అకాడమీని సందర్శించిన జనరల్ నరవణే, వాస్తవాధీన రేఖ పొడవునా ఇరు సైన్యాల ఉపసంహరణ దశ కొనసాగుతోందని రిపోర్టర్లకు తెలిపారు. గల్వాన్ రివర్ వేలీ ప్రాంతంలో భారీ ఎత్తున బలగాలు వెనుకకు మళ్లుతున్నాయని, పరిస్థితి నిలకడగా ఉంటూ, అదుపులోనే ఉందని ప్రకటించారు. అయితే ప్రత్యేకించి గల్వాన్ రివర్ వేలీలో భారీగా చొరబడుతూ తమ స్థానాలను బలోపేతం చేసుకుంటూ ఉండటంలో ప్రజావిముక్తి సైన్యం ఉద్దేశం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. 2010లో డర్బుక్–షియోక్ నుంచి డీబీఏ వరకు భారత వ్యూహాత్మక రహదారి నిర్మాణాన్ని తలపెట్టినప్పటినుంచి ఎన్నడూ అభ్యంతరం వ్యక్తం చేయని చైనా తాజాగా ఆ రహదారి నిర్మాణాన్ని అడ్డగించే ఉద్దేశంతో ఉన్నట్లు భారత సైన్యాధికారులకు స్ఫురించనేలేదు.
ఇక నేరుగా కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే ఐటీబీపీ తాజా పరిణామాల గురించి అప్రమత్తం చేయకపోవడం మరింత ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతోంది. ప్రమాద సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ గల్వాన్ రివర్ వేలీలో వ్యూహాత్మక రహదారి నిర్మాణ పనుల బాధ్యతను సైన్యానికి అప్పగించడాన్ని మన జాతీయ భద్రతా వ్యవస్థ కనీసం పరిశీలనకు తీసుకోకుండా ఆ ప్రాంతంలో ఐటీబీపీని గస్తీ పనులకు మాత్రమే పరిమితం చేయడంలో ఔచిత్యం ఏమిటి?
జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ ప్రాంతంలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఆ ప్రాణాంతక ఘర్షణలు భయానకమైన తప్పు అంచనాగానే కనబడుతోంది. ఏరకంగా చూసినా ఇది ఘోరమైన అసమర్థ తకు ప్రతిబింబమనే చెప్పాల్సి ఉంటుంది. పీపీ14 సెక్టార్‌లో చైనా సైన్యం ఉపసంహరణ జరుగుతోందా లేదా అని నిర్ధారించుకోవడానికి ప్రయత్నించిన భారత సైనికులు నేరుగా పీఎల్‌ఎ అక్కడ సిద్ధపర్చిన ఆంబుష్‌లో ఇరుక్కున్నారు. అక్కడే ఇరుసైనికుల మధ్య ఆయుధాలు ప్రయోగించని అనాగరికమైన, పాశవిక దాడికి రంగం సిద్ధమైంది. 16వ బిహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారిపై, అతడి రక్షణ బృందంపై చైనా సైనికులు ఐరన్ రాడ్లతో దాడిచేసి కుప్పగూల్చారు. చైనా బలగాల అసలు ఉద్దేశాన్ని గుర్తించని భారత బలగాలు పోరాటానికి సిద్ధంగా లేని స్థితిలో బలైపోయారు. పైగా వారు సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత ప్రభావానికి గురై బలైపోయారు.
బిహార్, పంజాబ్‌లకు చెందిన మూడు ఇన్ఫాంట్రీ బెటాలియన్లు చైనా దళాల ముట్టడిలో చిక్కుకున్నారని తెలుస్తోంది. వీరు ప్రధానంగా సిగ్నల్స్, ఫిరంగి విభాగాలకు చెందినవారు. ప్రధాన సైనికబలగాలకు రక్షణగా ముందున్న ప్రాంతాన్ని పరిశీలిస్తూ వెళ్లే బాధ్యతలో వీరు ఉంటారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు సహాయంగా వచ్చిన అదనపు బలగాల కిందికే వస్తారు. పీఎల్‌ఏ ట్రాప్‌లో చిక్కిన భారత సైన్యంలో 20 మంది బలికాగా, 76 మంది గాయపడ్డారు, 10 మంది బందీలుగా చిక్కి జూన్ 18న చైనా బలగాల ఆధీనం నుంచి విడుదల అయ్యారు. భారత సైనిక చరిత్రలో ఇది అత్యంత భారీ నష్టాలకు కారణమైన సైనిక ఎన్‌కౌంటర్‌గా ఇది మిగిలిపోతుంది. పైగా ఆత్మరక్షణ కోసం మన సైనికులు కనీసం ఒక్క తూటా కూడా కాల్చలేదు. ఇది కచ్చితంగా తప్పుడు ఆదేశాలు, నిబంధనల ఫలితమే. చైనాకు గుణపాఠం చెప్పడానికి ఏమీ మిగలకుండా పోయిన ఘటన ఇది.
మరోవైపున చైనా విదేశీ మంత్రిత్వ శాఖ తమ వైపు నష్టాలకు సంబంధించిన ప్రశ్నలకు ఉలుకూలేకుండా మౌనం పాటించింది. ఆ ఘర్షణలో వాడిన మారణాయుధాలు, గల్వాన్ నదిపై డామ్ నిర్మాణాన్ని అడ్డుకోవడం గురించి ఏమాత్రం సద్దులేకుండా ఉండిపోయింది. ఇరుపక్షాలూ తీవ్రమైన సమస్యను మామూలుగానే పరిష్కరించుకోవాలని అంగీరించినట్లు, ఏకాభిప్రాయ సాధనకు ఇరుపక్షాల కమాండర్ స్థాయి చర్చలు మొదలుపెడుతున్నట్లు, ఉద్రిక్తతలను సడలింపజేస్తున్నట్లు యథావిధి ప్రకటన చేసి ఊరకుండిపోయాయి. తరలించిన బలగాల మధ్య అత్యంత ఉద్రిక్తతా వాతావరణం కొనసాగుతున్నప్పటికీ సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ కూడా వాయిదా పడింది. భారత యుద్ధ సన్నద్ధత, స్పందనా యంత్రాంగంలోని సాంకేతిక లోపాలు బయటపడటమే వ్యూహాత్మక సమాచార వ్యవస్థ కూడా విఫలమైంది. 2019లో జమ్మూ కశ్మీర్‌ను పునర్వ్యవస్థీకరించడం, హోంమంత్రి అమిత్ షా అక్సాయిచిన్‌ను కూడా స్వాధీన పర్చుకుంటామని ప్రతిజ్ఞ చేయడం నేపథ్యంలో ఆగ్రహంతో రగిలిపోయిన చైనా నాయకత్వం.. లదాఖ్‌ని కేంద్రపాలిత ప్రాంత హోదా కల్పించడానికి భారత్ దేశీయ చట్టాన్ని ఏకపక్షంగా మార్చివేయడం అనేది చైనా ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని, భారత్ చర్య ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కూడా చైనా తేల్చిచెప్పింది.
చైనా ఘాతుక చర్యకు ప్రతీకారం తప్పదని ఇప్పుడు పిలుపునిస్తున్నారు. అయితే సమీప భవిష్యత్తులో అది సాధ్యపడకపోవచ్చు. చైనా అనేక పర్యాయాలు చొరబాట్లుకు సిద్ధపడి తన స్థావరాలను బలోపేతం చేసుకున్న ఘటన యుద్ధ సన్నద్ధతలో భాగమే తప్ప అదొక అవకాశ మాత్రంగా ఉండిపోదు. కాస్త ఆలస్యంగా అయినా సరే భారత్ వాస్తవాధీన రేఖ పొడవునా వివాదాస్పత ప్రాంతాలను తిరిగి కైవసం చేసుకుని, సైనిక శక్తిని పెంచుకుని చర్చలను కొనసాగించవచ్చు. కానీ కీలకమైన మందుగుండు సామగ్రి లేకపోవడం, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో సిబ్బంది కొరత, ఉన్న కొద్ది మందిని కోవిడ్ సంబంధిత సామగ్రి తయారీవైపునకు మళ్లించడం వంటి కారణాల వల్ల భారత్ చేపట్టే యుద్ధ సన్నాహక చర్యలు ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. సూత్రరీత్యా చైనాయే ప్రథమ శత్రువు అని ప్రతి భారత సైనికుడికి బోధిస్తారు కానీ పాకిస్తానే మన లక్ష్యాల్లో ప్రథమ స్థానం వహిస్తూ ఉంటుంది.
భారతీయ మీడియా యూరి, బాలాకోట్ తరహా ప్రతీకార చర్యలు తీసుకోవాలని రెచ్చగొట్టడం ఆపి, వుహాన్ స్ఫూర్తిని, ఇరుదేశాల సైనిక వ్యూహాత్మక మార్గదర్శకాలను ఉల్లంఘించిన చైనాకు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తే మంచిది. చైనా సోషల్ మీడియా మాత్రం జాతీయవాద ప్రచారంతో వెర్రెత్తిపోతోంది. ఇక పీఎల్‌ఏ అధికార వాణిగా పేర్కొనే పీఎల్‌ఏ డైలీ, పీపుల్స్ డైలీ పత్రికలు జూన్ 16న జరిగిన సైనిక ఘర్షణలను నివేదించలేదు. గ్లోబల్ టైమ్స్ మాత్రమే వెనుక పేజీలో ఆ ఘటనను క్లుప్లంగా పేర్కొంది.
గల్వాన్ ఘర్షణ భారత్–చైనా సంబంధాలపై తీవ్ర ప్రభావం వేసింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మునుపటిలా ఇక ఎన్నటికీ ఉండవు. సరిహద్దుల్లో చైనా సేనల దూకుడు చర్యకు తగిన సమాధానం ఇస్తామంటూ ప్రధాని నరేంద్రమోదీ జాతికి హామీ ఇచ్చారు కానీ ఆ సమాధానం ఆర్థికపరంగా, దౌత్యపరంగా మాత్రమే ఉండవచ్చు. సైనికపరంగా ఉండకపోవచ్చు. జూన్ మొదట్లో మోదీతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎందుకోగానీ మోదీ మంచి మూడ్‌లో లేనట్లు పేర్కొన్నారు. గల్వాన్ ఘటనల క్రమం మోదీ మానసిక స్థితిని మరింతగా దెబ్బతీయవచ్చు.
అశోక్ కె. మెహతా
వ్యాసకర్త మాజీ సైనిక జనరల్,
డిఫెన్స్ ప్లానింగ్ స్టాఫ్ మాజీ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment