Ashok Mehta
-
Agnipath: బంధాలను తెంచుతున్న అగ్నిపథ్
‘చావుకు భయపడటం లేదని ఏ సైనికుడు అయినా అన్నాడంటే, అతడు అబద్ధమాడుతూ ఉండాలి, లేదా గోర్ఖా అయి ఉండాలి’ అని ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్షా చెప్పేవారు. పిరికివాడిగా ఉండటం కంటే చావడం మేలనేది వీరి ఆదర్శం. స్వాతంత్య్ర కాలం నుంచీ వీరు భారత సైన్యంలో విడదీయలేని శక్తిగా ఉంటున్నారు. సాహసానికి పేరొందిన నేపాలీ గోర్ఖాలకు ఇప్పటికీ తొలి ప్రాధాన్యం సైన్యంలో చేరడమే. వీరంతా నేపాల్‌లో బలమైన భారత్ అనుకూల బృందంగా ఉంటున్నారు. 1947లో భారత్, బ్రిటన్, నేపాల్ మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందానికి తీవ్ర ప్రభావం కలిగిస్తూ, గోర్ఖా యువత ఆకాంక్షలను దెబ్బ తీయబోతున్న అగ్నిపథ్ పథకం గురించి నేపాల్‌ను భారత్ సంప్రదించలేదు. గోర్ఖా జానీ, గోర్ఖా సాథీ, లహురే... పేరు ఏదైనా కావొచ్చు; కీర్తి, సంపద ఆర్జించడం కోసం వీరు మహారాజా రంజిత్ సింగ్ సైన్యంలో చేరడానికి అప్పట్లో లాహోర్ వరకు వెళ్లారు. వీరిని నేపాలీ అమ్మాయిలు ఏరికోరి పెళ్లాడేవారు. ఇప్పటికీ చేసుకుంటున్నారు. ‘గోర్ఖాలు మీతో యుద్ధానికి దిగారు’ అనేది వీరి సమర నినాదం. పిరికివాడిగా ఉండటం కంటే చావడం మేలనేది వీరి ఆదర్శం. అలా వీరి పేర్లలో బహదూర్ (సాహసి), జంగ్ (సమరం) అనేవి వచ్చి కలిసేవి. ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్షాకు ‘శామ్ బహదూర్’ అని గుర్తింపు ఉండటం తెలిసిందే. తాను చావుకు భయపడటం లేదని ఏ సైనికుడు అయినా మీతో అన్నాడంటే, అతడు అబద్ధమాడుతూ ఉండాలి, లేదా గోర్ఖా అయివుండాలి అని మానెక్షా చెప్పేవారు. ఇండియన్ మిలిటరీ అకాడెమీలో నన్ను ఇష్టమైన మూడు ఆయుధాలు ఎంచుకొమ్మ న్నప్పుడు... నేను గోర్ఖాలు, గోర్ఖాలు, గోర్ఖాలు అని చెప్పేవాడిని. ఇప్పుడు చరిత్రలో మొదటిసారిగా వారిని అగ్నిపథ్ గోర్ఖాలు అని పిలవనున్నారు. ఈ బిరుదు, లేదా గుర్తింపు వారికి ఏమాత్రం సరిపోనిది అనే చెప్పాలి. ‘కిరాయి’ సైనికులు కాదు దేశ విభజనకు ముందు భారతీయ అధికార్లను గోర్ఖాల్లో చేరడానికి బ్రిటిష్ అధికార్లు అనుమతించేవారు కాదు. 1947 తర్వాత అంటే గోర్ఖా ట్రూప్ కమాండ్‌ను భారతీయ అధికారులు ప్రారంభించిన తర్వాతే బ్రిటిష్, ఇండియన్ ఆర్మీల మధ్య గోర్ఖా రెజిమెంట్లను విభజించారు. 1947లో కుదిరిన త్రైపాక్షిక రిక్రూట్మెంట్ ఒప్పందం... బ్రిటిష్, ఇండియన్, నేపాలీ సైన్యాల్లో నేపాలీ గోర్ఖాలను చేరడానికి అనుమతించింది. అయితే వేతనాలు, పెన్షన్లలో తేడాలు ఉండేవి. గోర్ఖాలను కిరాయి సైనికులు అని పిలవవద్దని నేపాల్ షరతు పెట్టడమే ఈ ఒప్పందంలోని చివరి అంశం. నేపాలీ గోర్ఖాలు ఇప్పుడు ఫ్రెంచ్ ఆర్మీలో చేరుతున్నారు. అనేకమంది రిటైరయిన గోర్ఖాలు ప్రైవేట్ కాంట్రాక్టర్లుగా చేరుతున్నారు. సారాంశంలో, మాతృ బెటాలియన్లతో సాంప్రదాయ వారసత్వ బంధం కారణంగా గోర్ఖాలు ఇప్పటికీ భారతీయ రెజిమెంట్లలో చేరుతున్నారు. మన సైన్యంలోని 1,3,4,5,8 సంఖ్యలు గల గోర్ఖా రెజిమెంట్లు ప్రధానంగా మాగర్లు, గురుంగులతోనూ; 9వ గోర్ఖా రెజిమెంట్ ఛెత్రీలు, ఠాకూర్లతోనూ; 11వ గోర్ఖా రెజిమెంట్ రాయిలు, లింబూలతోనూ ఉంటున్నాయి. వీళ్లందరూ భారతీయ సైన్యంలో భాగంగా ఉంటున్నారు. దివంగత భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ 11వ గోర్ఖా రైఫిల్స్‌కి చెందిన 5వ బెటాలియన్‌కి నాయకత్వం వహించేవారు. బ్రిటిష్ ఆర్మీ నాయకత్వం 1947 తర్వాత 2, 6, 7, 10 రెజిమెంట్లను తమతో తీసుకుపోయింది. వాటిని ఇప్పుడు కేవలం రెండు బెటాలియన్లుగా కుదించారు. గోర్ఖా రెజిమెంట్లలోకి నియామకాలను ప్రారంభంలో భారత్–నేపాల్ సరిహద్దులోని భైర్హవా సమీపంలోని నౌతన్వాలో జరిగేవి. తర్వాత కుంరాఘాట్, గోరఖ్‌పూర్, డార్జిలింగ్ సమీపంలోని ఘూమ్ ప్రాంతాలను శాశ్వత ప్రాంతాలుగా ఎంపిక చేశారు. ఈ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్లకు యువ గోర్ఖాలను తీసుకురావడానికి గల్లా వాలాస్ అని పిలిచే నేపాలీ రిక్రూటర్లను ఉపయోగించుకునే వారు. భారతీయ సైన్యంలో భర్తీ కావడం కోసం వీరు 20 నుంచి 24 రోజులపాటు ట్రెక్కింగ్ చేసి వచ్చేవారు. శారీరక, వైద్య పరీక్షలు అనంతరం ఎంపికైన∙వారిని రెజిమెంటల్ శిక్షణా కేంద్రాలకు పంపించేవారు. వ్యూహాత్మక సంపద తర్వాతి కాలంలో భారతీయ సైన్య నియామక బృందాలు నేపాల్ మారుమూల ప్రాంతాలకు వెళ్లి రాటుదేలిన యువత కోసం ప్రయత్నించడంతో సైనిక రిక్రూట్మెంట్ వ్యవస్థ మారిపోయింది. నేపాల్ పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లోని పోఖ్రా, ధరాన్ తదితర చోట్ల రిక్రూట్మెంట్ ర్యాలీలను నిర్వహించేవారు. నియామక వ్యవస్థ పూర్తి పారదర్శకంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు దానికి రాత పరీక్షను కూడా చేర్చారు. మొదట్లో నేపాల్ నుంచే 100 శాతం చేర్చుకునేవారు. తర్వాత దీన్ని కాస్త మార్చి, నేపాల్ దేశస్థులైన గోర్ఖాల నుంచి 70 శాతం, భారతీయ గోర్ఖాల నుంచి 30 శాతం రిక్రూట్ చేస్తూ వచ్చారు. కోవిడ్ మహమ్మారి రిక్రూట్‌మెంట్‌ను అడ్డుకున్నప్పుడు రిక్రూట్మెంట్ విభాగాలు 60:40 నిష్పత్తిలో చేర్చుకున్నాయి. 2018లో 6/1 గోర్ఖా రైఫిల్స్‌ని పూర్తిగా భారతీయ గోర్ఖాల నుంచే తీసుకున్నారు. సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో నేపాల్‌కు రాజకీయ సందేశాన్ని ఇవ్వడమే దీని ఉద్దేశం. నేపాల్‌లోని కమ్యూనిస్టులు కూడా 1990లో పాలక పక్షానికి విధించిన తమ 40 పాయింట్ల డిమాండ్లలో ఒకటి, భారత సైన్యంలో నేపాలీల చేరికను ఆపడం. కానీ సైనికుడు కావాలన్న కోరిక గోర్ఖాల్లో ఇప్పటికీ అలాగే ఉంది. 1970లలో భారత సైన్యం నుంచి గోర్ఖాలను తొలగించాలంటూ వచ్చిన సంకుచిత ప్రతిపాదనను భారత్ తోసి పుచ్చింది. నాటి ఆర్మీ చీఫ్ జనరల్ గోపాల్ బెవూర్ నాటి ప్రధాని ఇందిరాగాంధీకి గోర్ఖాలు మనకు వ్యూహాత్మక సంపద అని నొక్కి చెప్పారు. భారత అనుకూల బృందం రెజిమెంటల్ వ్యవస్థను కొనసాగిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే అగ్నిపథ్ పథకం నేపాలీ గోర్ఖాలకు కూడా వర్తిస్తుంది. భారతీయ సైన్యంలో 38 ఇన్ఫాంట్రీ బెటాలియన్లు, రెండు రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్లు, రెండు టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లు, ఆర్టిల్లరీకి చెందిన 64 ఫీల్డ్ రెజిమెంట్లు మొత్తం గోర్ఖాలతో కూడి ఉన్నాయి. అందుకే భారత గోర్ఖా బ్రిగేడ్ అతిపెద్ద రెజిమెంట్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం భారతీయ సైన్యంలో పనిచేస్తున్న, రిటైర్ అయిన గోర్ఖాలు 17 లక్షల మంది ఉన్నారని అంచనా. వీరంతా నేపాల్‌లో బలమైన భారత్ అనుకూల బృందంగా ఉంటున్నారు. చైనా ప్రభావంలో ఉన్న నేపాల్‌తో ప్రత్యేక సంబంధాలు కొనసాగించడానికి, ఆ దేశంతో పూర్వ ప్రాధాన్యతా స్థానం పొందడానికి ఈ బృందం చాలా అవసరం. మాజీ సైనికులు నేపాల్ వ్యాప్తంగా ఇండియన్ రెజిమెంటల్ అసోసియేషన్లను ఏర్పర్చుకున్నారు. బెటాలియన్లలో తాము ఎదిగిన రోజులను తల్చుకుంటూ, యుద్ధ గౌరవాలను అందుకుంటూ ఇండియా సైనికులతో వీరు పరస్పర సంబంధాలు కొనసాగిస్తున్నారు. సైన్యంలో తాత్కాలిక నియామకాలకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై నేపాల్ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు. 1947లో త్రైపాక్షిక ఒప్పందంపై తీవ్ర ప్రభావం కలిగిస్తూ, గోర్ఖా యువత ఆకాంక్షలను దెబ్బ తీయబోతున్న అగ్నిపథ్ పథకం గురించి నేపాల్‌ను భారత్ సంప్రదించలేదు. అగ్నిపథ్ ఒక పెద్ద అసంతృప్తి పథకంగా కనబడుతోంది. నాలుగేళ్లపాటు నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖల వద్ద ప్రాణాలు పణంగా పెట్టి సైన్యంలో పనిచేయటం కంటే, ఏ దుబాయ్‌లోనో మరింతగా సంపాదించగలరు. మొత్తం మీద చూస్తే, ఏదో ఒకరోజున గోర్ఖా వారసత్వానికి ముగింపు పలకాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోంది. 2014లో నేపాల్‌ని తొలిసారిగా సందర్శించినప్పుడు గోర్ఖా సైనికుల త్యాగాలను ఎత్తిపడుతూ తానాడిన మాటల్ని ప్రధాని నరేంద్రమోదీ అప్పుడే మర్చిపోయినట్లు కనబడుతోంది. భారత్‌తో గోర్ఖా బంధాన్ని అగ్నిఫథ్ బలహీనపరుస్తుంది. అశోక్ కె. మెహతా వ్యాసకర్త ఆర్మీ మేజర్ జనరల్ (రిటైర్డ్) (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘ఉపసంహరణల’తో ఎవరికి మేలు?
వాస్తవాధీన రేఖ వద్ద భారత్–చైనా సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ భారత్ వ్యూహాత్మక తప్పిదం కానుందని పలువురు రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వివాదంలో తానాశించిన వాటిని చాలావరకు చైనా సాధించుకోగా, భారత్ తనకు పట్టు ఉన్న పర్వత ప్రాంతాలనుంచి కూడా వైదొలగాల్సి వచ్చింది. భారత్ కీలకమైన డెస్పాంగ్ ప్రాంతాన్ని చైనా తన ఆధీనంలోనే ఉంచుకుంది. సరిహద్దు చర్చలు ఒకడుగు వెనక్కి, రెండడుగులు ముందుకు అనే చైనా వైఖరికి అనుగుణంగానే ముగిశాయి. వాస్తవాధీన రేఖపై యధాతథ స్థితిని పునరుద్ధరించడం అనే భారత్ కల ఇక ఫలించనట్లేనా? సైనికుడి తర్వాత సైనికుడిని, ఆయుధం తర్వాత ఆయుధాన్ని మోహరిస్తూ, శిఖరం తర్వాత శిఖరాన్ని అధిరోహిస్తూ భారత సైన్యం లద్దాఖ్ సరిహద్దుప్రాంతంలో చైనా సైనిక బలగాలను సాహసోపేతంగా నిలువరించడానికి ప్రయత్నించినప్పుడు ప్రాణత్యాగాల మధ్యే మన వాళ్ల తెగువను చూసి పులకించిపోయాం. చాలా కాలం తర్వాత భారత ప్రభుత్వం ప్రదర్శించిన కఠిన వైఖరిని ప్రశంసలతో ముంచెత్తాం. కానీ బీజింగ్ ఒత్తిడి కారణంగా ఇంత తెగువ కూడా ఇప్పుడు బీటలువారిపోతున్నట్లు కనిపిస్తోంది. పార్లమెంటులో కాస్త ఆందోళనా స్వరంతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటన వాస్తవాధీన రేఖ వద్ద 2020 ఏప్రిల్‌కి ముందునాటి య«థాతథ స్థితిపై పెద్దగా హామీని ఇవ్వలేకపోయింది. ఈ సందర్భంగా రాజకీయాలను పక్కన పెట్టి, ప్రస్తుతం వాస్తవాధీన రేఖవద్ద ఇరుదేశాల సైనిక బలగాల ఉపసంహరణ పథకంపై ప్రశ్నలు సంధిం చాల్సిన అవసరం వచ్చిపడింది. వాస్తవాధీన రేఖ వద్ద సంక్లిష్ట పరిస్థితిని అధిగమించడానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని నిపుణులు ఊహించిన భయాలన్నీ ఇప్పుడు వాస్తవమయ్యాయి. మరోవైపున 1959లో తాను ప్రకటించిన రేఖనే అంగీకరించాలని పట్టుబట్టడంతో సహా ఈ వివాదంలో తాను ఆశించిన వాటిలో చాలావరకు చైనా సాధించుకున్నట్లేనని చెప్పాలి. చైనాతో సరిహద్దు ఘర్షణను ఎదుర్కొన్న సమయంలో భారత్ నిఘాపరమైన, సైనిక చర్యలపరమైన, ఇప్పుడు చర్చలపరమైన తప్పులు చేసింది. భారత భూభాగంలో 8 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకొచ్చిన చైనా బలగాలను ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 ప్రాంతానికి ఉపసంహరించుకునేలా చేసే క్రమంలో తనవంతుగా భారత్ అత్యంత కీలకమైన పర్వత శిఖరాలనుంచి తన బలగాలను ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇంతటితో ఇది పూర్తి కాలేదు. భారత బలగాలు ఇప్పుడు ఫింగర్ 4 ప్రాంతం నుంచి ఫింగర్ 3 పశ్చిమానికి తరలిపోవలసి ఉంది. ఇలా ఖాళీ చేసిన స్థలం బఫర్ జోన్‌గా ఉంటుంది. అంటే ఇక్కడ సాధారణ గస్తీని కూడా సస్పెండ్ చేస్తారన్నమాట. మరోవైపున డెస్పాంగ్ ప్రాంతంలో చైనా బలగాలు 18 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకురావడమే కాకుండా అక్కడ భారత బలగాల గస్తీపై కూడా నిషేధం విధించాయి. తాజాగా బలగాల ఉపసంహరణపై కుదిరిన ఒప్పందం గురించి కంఠశోష వచ్చేలా మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్ భారత్ ఎలాంటి భూభాగాన్ని చైనా పరం చేయలేదని పార్లమెంటుకు స్పష్టపరిచారు. చైనా భారత భూభాగంలోకి చొరబడలేదని, భారత్ తన భూభాగంలో దేన్నీ కోల్పోలేదని గతంలో కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటనతో ఈ తాజా ప్రకటనను పోల్చవచ్చు. వాస్తవాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే చైనా భారత్‌పై గల్వాన్ నమూనా ఉపసంహరణను మోపింది. భారత్‌కు పట్టు ఉన్న కైలాష్ పర్వత శిఖరాలపై ఉన్న వ్యూహాత్మక ప్రదేశాన్ని వదిలేసుకుంటూ దాన్ని ఫింగర్స్ ప్రాంతాల నుంచి సైనిక బలగాల ఉపసంహరణతో ఎలా ముడిపెట్టగలదు? పైగా వాస్తవాధీన రేఖ వద్ద భారత సైనికుల కదలికలే లేకుండా చేయడం కూడా ఏదీ ఇచ్చేయలేదు అనే ప్రకటనలో భాగమేనా? 2020 సెప్టెంబర్‌లో ఎంపిక చేసుకున్న ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణను చైనా ప్రతిపాదించింది. అయితే ఆగస్టు 29–30 తేదీల్లో భారత్ చుషుల్ పర్వత శిబిరాలను ఆక్రమించినందున అక్కడి నుంచి భారత్ వెనక్కు తగ్గాలని, ఆ తర్వాతే ఫింగర్ 4, ఫింగర్8 ప్రాంతాల నుంచి తాను వెనక్కు తగ్గుతానని చైనా పేర్కొంది. గల్వాన్ ఘర్షణలో దెబ్బ తిన్నతర్వాత కీలకమైన పర్వత శిఖరాలను కైవసం చేసుకోవడం ద్వారా ఆధిపత్య స్థానాన్ని పొందిన భారత్ చైనా ఉచ్చులో పడొద్దని ఆ సమయంలోనే పలు రక్షణ, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. సుదీర్ఘ కాలం పునరాలోచన చేసిన తర్వాత ఏకకాలంలో బలగాల ఉపసంహరణకు చైనా అంగీకరించింది. అయితే కైలాష్ పర్వత శ్రేణిని భారత్ ముందుగా ఆక్రమించింది కాబట్టి భారత దేశమే మొదటగా బలగాలను ఉపసంహరించుకోవాలని చైనా షరతు పెట్టింది. స్పష్టంగానే చైనా యధాతథ స్థితిని పునరుద్ధరించాలనే డిమాం డును పక్కన పెట్టింది. ఈ పదబంధాన్ని చైనా ఎన్నడూ ఉపయోగించలేదు. దానికి బదులుగా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సామరస్యాన్ని పునరుద్ధరించాలని మాత్రమే చైనా పేర్కొంది. ఇంతవరకు, దౌలత్ బెగ్ ఓల్టీలోని భారత్ వ్యూహాత్మక సైనిక శిబిరాన్ని నిర్బంధించడమేకాక ఉంచిన డెస్పాంగ్ ప్రాంతంపై చర్చకు చైనా పదేపదే తిరస్కరిస్తూ వచ్చింది. రాజ్‌నాథ్ సింగ్ దీన్నే పార్లమెంటులో ప్రస్తావించారు. తూర్పు లడాఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ పొడవునా సైనిక బలగాల మోహరింపు, గస్తీకి సంబంధించిన కొన్ని కీలక అంశాలు ఇంకా పెండింగులో ఉన్నాయని రక్షణమంత్రి చెప్పారు. అయితే డెస్పాంగ్ ప్రాంతం గురించి మంత్రి పేర్కొనలేదు. ఇది దౌలత్ బేగ్ ఓల్డీకి చెందిన కీలక ప్రాంతం. దీన్ని వశపర్చుకోవడం అనేది చాలా దీర్ఘకాలిక సైనిక చర్యల ఎజెండాలో భాగమై ఉంటోంది. 5,180 చదరపు కిలోమీటర్ల పొడవైన షాక్స్‌గామ్ లోయతో ముడిపడిన ఈ దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతాన్ని పాకిస్తాన్ 1963లోనే చైనాకు అప్పగించింది. ఇది చైనా పాకిస్తాన్ ఆర్థిక క్యారిడార్‌తో అనుసంధానమైంది. దౌలత్ బేగ్ ఓల్డీని కోల్పోవడం అంటే పాకిస్తాన్ బలగాలను, చైనా పీఎల్ఏను వేరు చేస్తున్న భారత్ స్వాధీనంలోని సియాచిన్ మంచుగోడను బలహీనపరుస్తుంది. వాస్తవాధీన రేఖ వద్ద సాంప్రదాయికంగా ఉన్న తమ గస్తీ కేంద్రాలకు భారత్ బలగాలు తరలిపోకుండా డెస్పాంగ్ వద్ద చైనా ఏకపక్షంగా అవరోధాలు కల్పించింది. అందుకే ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే ఇరుదేశాల సైనిక బలగాల ఉపసంహరణపై కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని నిలదీసింది. 2020 ఏప్రిల్ నాటి యధాతథ పరిస్థితిని నెలకొల్పడంపై రక్షణమంత్రి ప్రకటన కనీస హామీని ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. చైనా నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని డిమాండ్ చేయకుండానే భారత్‌కు ఆధిపత్యం ఉన్న పర్వతశిఖరాల నుంచి తన బలగాలను ఉపసంహరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంపై కాంగ్రెస్ తీవ్రవిచారం ప్రకటించింది. ఈ అంశంపై వివరణను కోరడానికి కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి ప్రయత్నించినప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ మెఘ్వాల్ ఆయన్ని అడ్డుకుని దేశ రక్షణ బలగాలను చూసి గర్వపడుతున్నానని పేర్కొనడం అతిపెద్ద వింత. చైనాతో బలగాల ఉపసంహరణ ఒప్పందంలో దాగిన ప్రయోజనాలను వివరించడానికి బదులుగా జాతీయ రక్షణ త్రయం రక్షణ మంత్రి, విదేశాంగమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు నైపుణ్యాల గురించి వల్లెవేస్తూ కధలల్లడానికి ప్రభుత్వాధికారులు సిద్ధమైపోయారు. వీరి సమిష్టి కృషి వల్లే సరిహద్ధు ఘర్షణల్లో స్తబ్దతను తొలగించగలిగామని రక్షణ, దౌత్యం, అంతర్జాతీయ భాగస్వామ్యంపై భారత్ ప్రతిష్టను పునరుద్ధరించామని అధికారులు గప్పాలు కొట్టసాగారు. అదే సమయంలో తమ లక్ష్యాలను మార్చుకోవడం చైనీయుల ప్రవృత్తిలో భాగమైంది. ముందుగా పురోగమించిన వారే మొదటగా ఉపసంహరించుకోవాలనే సూత్రాన్ని గుర్తు చేస్తూ పైచేయి సాధిం చారు. సరిహద్దు చర్చలు ఒకడుగు వెనక్కి, రెండడుగులు ముందుకు అనే చైనా వైఖరికి అనుగుణంగానే ముగిశాయి. కీలకమైన డెస్పాంగ్ ప్రాంతాన్ని అది తన ఆధీనంలోనే ఉంచుకుంది. పాంగాగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా అధమస్థాయితో కూడిన రంగాల వారీ ఉపసంహరణకు అమోదం తెలుపడం ద్వారా కొన్ని ఫింగర్ ప్రాంతాలపై పట్టు కోసం చూసల్ పర్వత శ్రేణిలో మనకున్న ఆధిపత్య స్థానాన్ని వదులుకోవడం అనేది వ్యూహాత్మక విజయం కాదు వ్యూహాత్మక తప్పిదమే అవుతుంది. మొత్తం మీద చూస్తే వాస్తవాధీన రేఖపై యధాతథ స్థితిని పునరుద్ధరించడం అనే భారత కల ఎన్నటికీ ఫలించనిదిగా ఉండిపోతుంది. మేజర్ జనరల్ అశోక్ కె. మెహతా వ్యాసకర్త -
అప్రమత్తతకు అల్లంతదూరంలో!
జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ ప్రాంతంలో భారత సైనికుల బలిదానం ఆద్యంతం భారత సైనిక నాయకత్వం తప్పు అంచనా ఫలితమనే చెప్పాల్సి ఉంటుంది. ఇది మన సైనిక నాయకత్వం నిర్లక్ష్యానికి, ఘోరమైన అసమర్థతకు ప్రతిబింబం మాత్రమే. గతంలో చైనా సైనిక చొరబాట్లతో గల్వాన్ చొరబాట్లను సమానంగా లెక్కవేసి మన సైనిక నాయకత్వం అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. చైనా దూకుడు చర్యకు తగిన సమాధానం ఇస్తామంటూ ప్రధాని నరేంద్రమోదీ జాతికి హామీ ఇచ్చారు కానీ ఆ సమాధానం సైనిక పరంగా కాకుండా ఆర్థికపరంగా, దౌత్యపరంగా మాత్రమే ఉండవచ్చు. భారత్–చైనా బలగాల మధ్య సరిహద్దుల్లో ఘటనల క్రమం ఒక స్పష్టమైన రూపుదిద్దుకుంటున్న కొద్దీ గల్వాన్ ప్రాంతంలో ఇరుసైన్యాల మధ్య విషాదకరమైన దాడికి తీవ్రమైన తప్పుడు చర్యలే దోహదం చేసివుంటాయని విస్పష్టంగా బోధపడుతోంది. ఏటా జరిగే చైనా ప్రజావిముక్తి సైన్యం (పీఎల్ఏ) సైనిక విన్యాసాలతోపాటు లదాఖ్ ప్రాంతంలో భారీ స్థాయిలో చైనా దళాల కదలికలు కనిపిస్తున్నాయని భారత నిఘా సంస్థ ఏప్రిల్ మధ్యలో నివేదించింది. దీనితర్వాత గల్వాన్, హాట్ స్ప్రింగ్, ప్యాంగాంగ్ ప్రాంతాల్లో చైనా బలగాలు ట్యాంకులు, ఫిరంగులతో సహా భారీ ఎత్తున సైనిక సామగ్రిని తరలిస్తూ వచ్చాయి. మే 9 నాటికి తూర్పున 1500 మైళ్ల దూరంలో ప్యాంగాంగ్ ట్సోలోనూ, సిక్కింలోని నకు లా పరి ష్కృత సరిహద్దు వరకు చైనా బలగాలు విస్తరించాయి. మే 15న, భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవణే ఈ దురాక్రమణలకు స్థానిక పీఎల్ఏ కమాండర్దే బాధ్యత అని ఆపాదించారు తప్పితే గల్వాన్ ప్రాంతంలో, సిక్కింలో పదే పదే చైనా బలగాలు చొరబడటానికి కారణం ఏమై ఉంటుందన్న అంశాన్ని పరిశీలించలేకపోయారు. మన ఆర్మీ నాయకత్వానికి చైనా చొరబాట్ల అసలు ఉద్దేశాన్ని గుర్తించడానికి కాస్త సమయం పట్టినా పీఎల్ఎ వ్యూహాత్మక కదలికలను నేటికీ గుర్తించడం లేదు. గతంలో దేప్సంగ్, చుమార్, డోక్లామ్ ప్రాంతాల్లో చైనా సైనికుల కదలికలకు, తాజా దురాక్రమణలకు పోలికే లేదన్నది స్పష్టం. చైనా దళాలు తూర్పు లదాఖ్ లోపలకి భారీ సంఖ్యలో ప్రవేశించాయని జూన్ 2న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించినప్పటికి గానీ చైనాబలగాల చొరబాట్ల స్థాయి గురించి స్పష్టం కాలేదు. జూన్ 6న, ఇరుదేశాల సైనిక జనరల్స్ మధ్య సంభాషణల ఫర్యవసానాలను కూడా మనవాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. జూన్ 9 నాటికి ఇరుదేశాల సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైందని, ఇరు పక్షాలు తమ తమ భూభాగంలోకి 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం మేరకు వెనక్కు తగ్గాయని భారత సైనిక వర్గాలు సమాచారం లీక్ చేశాయి. జూన్ 13న డెహ్రాడూన్‌లోని భారత మిలటరీ అకాడమీని సందర్శించిన జనరల్ నరవణే, వాస్తవాధీన రేఖ పొడవునా ఇరు సైన్యాల ఉపసంహరణ దశ కొనసాగుతోందని రిపోర్టర్లకు తెలిపారు. గల్వాన్ రివర్ వేలీ ప్రాంతంలో భారీ ఎత్తున బలగాలు వెనుకకు మళ్లుతున్నాయని, పరిస్థితి నిలకడగా ఉంటూ, అదుపులోనే ఉందని ప్రకటించారు. అయితే ప్రత్యేకించి గల్వాన్ రివర్ వేలీలో భారీగా చొరబడుతూ తమ స్థానాలను బలోపేతం చేసుకుంటూ ఉండటంలో ప్రజావిముక్తి సైన్యం ఉద్దేశం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. 2010లో డర్బుక్–షియోక్ నుంచి డీబీఏ వరకు భారత వ్యూహాత్మక రహదారి నిర్మాణాన్ని తలపెట్టినప్పటినుంచి ఎన్నడూ అభ్యంతరం వ్యక్తం చేయని చైనా తాజాగా ఆ రహదారి నిర్మాణాన్ని అడ్డగించే ఉద్దేశంతో ఉన్నట్లు భారత సైన్యాధికారులకు స్ఫురించనేలేదు. ఇక నేరుగా కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే ఐటీబీపీ తాజా పరిణామాల గురించి అప్రమత్తం చేయకపోవడం మరింత ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతోంది. ప్రమాద సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ గల్వాన్ రివర్ వేలీలో వ్యూహాత్మక రహదారి నిర్మాణ పనుల బాధ్యతను సైన్యానికి అప్పగించడాన్ని మన జాతీయ భద్రతా వ్యవస్థ కనీసం పరిశీలనకు తీసుకోకుండా ఆ ప్రాంతంలో ఐటీబీపీని గస్తీ పనులకు మాత్రమే పరిమితం చేయడంలో ఔచిత్యం ఏమిటి? జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ ప్రాంతంలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఆ ప్రాణాంతక ఘర్షణలు భయానకమైన తప్పు అంచనాగానే కనబడుతోంది. ఏరకంగా చూసినా ఇది ఘోరమైన అసమర్థ తకు ప్రతిబింబమనే చెప్పాల్సి ఉంటుంది. పీపీ14 సెక్టార్లో చైనా సైన్యం ఉపసంహరణ జరుగుతోందా లేదా అని నిర్ధారించుకోవడానికి ప్రయత్నించిన భారత సైనికులు నేరుగా పీఎల్ఎ అక్కడ సిద్ధపర్చిన ఆంబుష్‌లో ఇరుక్కున్నారు. అక్కడే ఇరుసైనికుల మధ్య ఆయుధాలు ప్రయోగించని అనాగరికమైన, పాశవిక దాడికి రంగం సిద్ధమైంది. 16వ బిహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారిపై, అతడి రక్షణ బృందంపై చైనా సైనికులు ఐరన్ రాడ్లతో దాడిచేసి కుప్పగూల్చారు. చైనా బలగాల అసలు ఉద్దేశాన్ని గుర్తించని భారత బలగాలు పోరాటానికి సిద్ధంగా లేని స్థితిలో బలైపోయారు. పైగా వారు సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత ప్రభావానికి గురై బలైపోయారు. బిహార్, పంజాబ్‌లకు చెందిన మూడు ఇన్ఫాంట్రీ బెటాలియన్లు చైనా దళాల ముట్టడిలో చిక్కుకున్నారని తెలుస్తోంది. వీరు ప్రధానంగా సిగ్నల్స్, ఫిరంగి విభాగాలకు చెందినవారు. ప్రధాన సైనికబలగాలకు రక్షణగా ముందున్న ప్రాంతాన్ని పరిశీలిస్తూ వెళ్లే బాధ్యతలో వీరు ఉంటారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు సహాయంగా వచ్చిన అదనపు బలగాల కిందికే వస్తారు. పీఎల్ఏ ట్రాప్‌లో చిక్కిన భారత సైన్యంలో 20 మంది బలికాగా, 76 మంది గాయపడ్డారు, 10 మంది బందీలుగా చిక్కి జూన్ 18న చైనా బలగాల ఆధీనం నుంచి విడుదల అయ్యారు. భారత సైనిక చరిత్రలో ఇది అత్యంత భారీ నష్టాలకు కారణమైన సైనిక ఎన్‌కౌంటర్‌గా ఇది మిగిలిపోతుంది. పైగా ఆత్మరక్షణ కోసం మన సైనికులు కనీసం ఒక్క తూటా కూడా కాల్చలేదు. ఇది కచ్చితంగా తప్పుడు ఆదేశాలు, నిబంధనల ఫలితమే. చైనాకు గుణపాఠం చెప్పడానికి ఏమీ మిగలకుండా పోయిన ఘటన ఇది. మరోవైపున చైనా విదేశీ మంత్రిత్వ శాఖ తమ వైపు నష్టాలకు సంబంధించిన ప్రశ్నలకు ఉలుకూలేకుండా మౌనం పాటించింది. ఆ ఘర్షణలో వాడిన మారణాయుధాలు, గల్వాన్ నదిపై డామ్ నిర్మాణాన్ని అడ్డుకోవడం గురించి ఏమాత్రం సద్దులేకుండా ఉండిపోయింది. ఇరుపక్షాలూ తీవ్రమైన సమస్యను మామూలుగానే పరిష్కరించుకోవాలని అంగీరించినట్లు, ఏకాభిప్రాయ సాధనకు ఇరుపక్షాల కమాండర్ స్థాయి చర్చలు మొదలుపెడుతున్నట్లు, ఉద్రిక్తతలను సడలింపజేస్తున్నట్లు యథావిధి ప్రకటన చేసి ఊరకుండిపోయాయి. తరలించిన బలగాల మధ్య అత్యంత ఉద్రిక్తతా వాతావరణం కొనసాగుతున్నప్పటికీ సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ కూడా వాయిదా పడింది. భారత యుద్ధ సన్నద్ధత, స్పందనా యంత్రాంగంలోని సాంకేతిక లోపాలు బయటపడటమే వ్యూహాత్మక సమాచార వ్యవస్థ కూడా విఫలమైంది. 2019లో జమ్మూ కశ్మీర్‌ను పునర్వ్యవస్థీకరించడం, హోంమంత్రి అమిత్ షా అక్సాయిచిన్‌ను కూడా స్వాధీన పర్చుకుంటామని ప్రతిజ్ఞ చేయడం నేపథ్యంలో ఆగ్రహంతో రగిలిపోయిన చైనా నాయకత్వం.. లదాఖ్‌ని కేంద్రపాలిత ప్రాంత హోదా కల్పించడానికి భారత్ దేశీయ చట్టాన్ని ఏకపక్షంగా మార్చివేయడం అనేది చైనా ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని, భారత్ చర్య ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కూడా చైనా తేల్చిచెప్పింది. చైనా ఘాతుక చర్యకు ప్రతీకారం తప్పదని ఇప్పుడు పిలుపునిస్తున్నారు. అయితే సమీప భవిష్యత్తులో అది సాధ్యపడకపోవచ్చు. చైనా అనేక పర్యాయాలు చొరబాట్లుకు సిద్ధపడి తన స్థావరాలను బలోపేతం చేసుకున్న ఘటన యుద్ధ సన్నద్ధతలో భాగమే తప్ప అదొక అవకాశ మాత్రంగా ఉండిపోదు. కాస్త ఆలస్యంగా అయినా సరే భారత్ వాస్తవాధీన రేఖ పొడవునా వివాదాస్పత ప్రాంతాలను తిరిగి కైవసం చేసుకుని, సైనిక శక్తిని పెంచుకుని చర్చలను కొనసాగించవచ్చు. కానీ కీలకమైన మందుగుండు సామగ్రి లేకపోవడం, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో సిబ్బంది కొరత, ఉన్న కొద్ది మందిని కోవిడ్ సంబంధిత సామగ్రి తయారీవైపునకు మళ్లించడం వంటి కారణాల వల్ల భారత్ చేపట్టే యుద్ధ సన్నాహక చర్యలు ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. సూత్రరీత్యా చైనాయే ప్రథమ శత్రువు అని ప్రతి భారత సైనికుడికి బోధిస్తారు కానీ పాకిస్తానే మన లక్ష్యాల్లో ప్రథమ స్థానం వహిస్తూ ఉంటుంది. భారతీయ మీడియా యూరి, బాలాకోట్ తరహా ప్రతీకార చర్యలు తీసుకోవాలని రెచ్చగొట్టడం ఆపి, వుహాన్ స్ఫూర్తిని, ఇరుదేశాల సైనిక వ్యూహాత్మక మార్గదర్శకాలను ఉల్లంఘించిన చైనాకు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తే మంచిది. చైనా సోషల్ మీడియా మాత్రం జాతీయవాద ప్రచారంతో వెర్రెత్తిపోతోంది. ఇక పీఎల్ఏ అధికార వాణిగా పేర్కొనే పీఎల్ఏ డైలీ, పీపుల్స్ డైలీ పత్రికలు జూన్ 16న జరిగిన సైనిక ఘర్షణలను నివేదించలేదు. గ్లోబల్ టైమ్స్ మాత్రమే వెనుక పేజీలో ఆ ఘటనను క్లుప్లంగా పేర్కొంది. గల్వాన్ ఘర్షణ భారత్–చైనా సంబంధాలపై తీవ్ర ప్రభావం వేసింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మునుపటిలా ఇక ఎన్నటికీ ఉండవు. సరిహద్దుల్లో చైనా సేనల దూకుడు చర్యకు తగిన సమాధానం ఇస్తామంటూ ప్రధాని నరేంద్రమోదీ జాతికి హామీ ఇచ్చారు కానీ ఆ సమాధానం ఆర్థికపరంగా, దౌత్యపరంగా మాత్రమే ఉండవచ్చు. సైనికపరంగా ఉండకపోవచ్చు. జూన్ మొదట్లో మోదీతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎందుకోగానీ మోదీ మంచి మూడ్‌లో లేనట్లు పేర్కొన్నారు. గల్వాన్ ఘటనల క్రమం మోదీ మానసిక స్థితిని మరింతగా దెబ్బతీయవచ్చు. అశోక్ కె. మెహతా వ్యాసకర్త మాజీ సైనిక జనరల్, డిఫెన్స్ ప్లానింగ్ స్టాఫ్ మాజీ సభ్యుడు -
సపోర్ట్ టు పారా అథ్లెట్స్
విధి చేతిలో ఓడిన అతను.. ఇప్పుడు విధిని ఎదిరిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో ఓ కాలు కోల్పోయినా.. సైక్లింగ్‌లో సత్తా చాటుతున్నాడు. అంతేకాదు.. తోటి పారా అథ్లెట్లకు ఆసరాగా నిలుస్తున్నాడు విజయవాడకు చెందిన అశోక్ మెహతా. ఆదిత్య మెహతా ఫౌండేషన్ (ఏఎంఎఫ్) పేరుతో పారా అథ్లెట్లకు సహకారం అందిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రెడ్ స్పేస్‌లో శనివారం పారా అథ్లెట్లకు కావలసిన పరికరాలను సినీ నటి అక్కినేని అమల చేతుల మీదుగా అందజేశారు. విజయవాడకు చెందిన పారా స్వివ్ముర్ శ్రీనివాస్ నాయుుడు, కోల్‌కతాకు చెందిన పారా సైక్లిస్ట్ అలోక్ వుండల్,నగరానికి చెందిన పారా సైక్లిస్ట్ అభిషేక్‌లకు కృత్రివు అవయువాలు, సైకిళ్లను పంపిణీ చేశారు. ‘రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన అశోక్ మెహతా సైక్లింగ్‌లో రాణించడమే కాకుండా తోటి పారా అథ్లెట్లకు సహాయం చేయడం గర్వించదగ్గ విషయం’ అని అమల అన్నారు.