Colonel killed
-
Colonel Manpreet Singh Funeral: జై హింద్ పాపా!
చండీగడ్: వయసు నిండా ఆరేళ్లే. ఇంకా ముక్కు పచ్చలే ఆరలేదు. కళ్లెదుట కన్న తండ్రి పార్థివ దేహం. అయినా సరే, వీర మరణం పొందిన తండ్రికి అంతే వీరోచితమైన వీడ్కోలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడో ఏమో.. అంతటి అంతులేని దుఃఖాన్నీ పళ్ల బిగువున అదిమిపెట్టాడు. యుద్ధానికి సిద్ధమయ్యే సైనిక వీరుల యూనిఫాం ధరించాడు. త్రివర్ణ పతాకం కప్పి ఉన్న తండ్రి శవపేటికను మౌనంగా సమీపించాడు. ఆ పేటికనే చిట్టి చేతులతో బిగియారా కౌగిలించుకున్నాడు. ఆ సమయాన ఆ చిన్ని మనసులో ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలయ్యాయో! ఎన్నెన్ని భావాలు చెలరేగాయో! ఎంతటి దుఃఖం పొంగుకొచ్చిందో! అవేవీ పైకి కనిపించనీయలేదు. కన్నీటిని కనీసం కంటి కొసలు కూడా దాటి రానివ్వలేదు. తండ్రి పార్థివ దేహం ముందు సగౌరవంగా ప్రణమిల్లాడు. రుద్ధమైన కంఠంతోనే, ‘జైహింద్ పాపా‘ అంటూ తుది వీడ్కోలు పలికాడు. అందరినీ కంట తడి పెట్టించాడు...! చండీగఢ్: కశ్మీర్ లోయలో ఉగ్ర ముష్కరులను ఏరిపారేసే క్రమంలో వీర మరణం పొందిన సైనిక వీరులు కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ దోంచక్ అంత్యక్రియలు శుక్రవారం అశ్రు నయనాల నడుమ ముగిశాయి. పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో మన్‌ప్రీత్ స్వగ్రామం బహరౌన్ జియాన్‌లో ఉదయం నుంచే సందర్శకుల ప్రవాహం మొదలైంది. చూస్తుండగానే జనం ఇసుకేస్తే రాలనంతగా పెరిగిపోయారు. వారందరి సమక్షంలో పూర్తి సైనిక లాంఛనాల నడుమ మన్ ప్రీత్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ సందర్భంగా కుమారుడు కబీర్ సింగ్ కనబరిచిన గుండె దిటవు, ’జైహింద్ పాపా’ అంటూ తండ్రికి తుది సెల్యూట్ చేసిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది. గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ తో పాటు రాష్ట్ర మంత్రులు, మాజీ సైనికాధిపతి వేదప్రకాశ్ మాలిక్, సైనిక ఉన్నతాధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మేజర్ ఆశిష్ అంత్యక్రియలు కూడా హరియాణాలోని పానిపట్‌లో పూర్తి సైనిక లాంఛనాలతో జరిగాయి. బుధవారం కశ్మీర్‌లోని కోకొర్ నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో కల్నల్ మన్ ప్రీత్, మేజర్ ఆశిష్‌తో పాటు మొత్తం ముగ్గురు సైనిక సిబ్బంది, ఒక డీఎస్పీ అసువులు బాయడం తెలిసిందే. గుండెలవిసేలా రోదించిన భార్య మన్ ప్రీత్ అంత్యక్రియల సందర్భంగా గుండెలవిసేలా రోదించిన ఆయన భార్యను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. గవర్నర్, మంత్రులు తదితరులు మన్ ప్రీత్ భార్య, తల్లి తదితరులను ఓదార్చారు. అంత్యక్రియల సందర్భంగా భారత్ మాతా కీ జై నినాదాలతో ఊరంతా మారుమోగింది. మన్ ప్రీత్ చిన్నప్పటి నుంచే అసాధారణ ప్రతిభావంతుడని ఆయన చిన్ననాటి గురువులు గుర్తు చేసుకున్నారు. తమ అభిమాన శిష్యుని అంత్యక్రియల సందర్భంగా వారంతా వెక్కి వెక్కి రోదించారు. ‘మేము వర్ణనాతీతమైన బాధ అనుభవిస్తున్నాం. అదే సమయంలో, దేశం కోసం ప్రాణాలను ధార పోసిన మా శిష్యుణ్ణి చూసి గర్వంగానూ ఉంది‘ అని మన్‌ప్రీత్‌కు ఒకటో తరగతిలో పాఠాలు చెప్పిన ఆశా చద్దా అనే టీచర్ చెప్పారు. మూడో తరం సైనిక వీరుడు మన్‌ప్రీత్ తన కుటుంబంలో మూడో తరం సైనిక వీరుడు. ఆయనత తాత సైన్యంలో పని చేశారు. ఆయన తండ్రి సైన్యం నుంచి రిటైరయ్యాక తొమ్మిదేళ్ల క్రితం మరణించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లి తన కుమారుని పార్థివ దేహం కోసం ఉదయం నుంచే ఇంటి ముందు వేచి చూస్తూ గడిపింది. సైనిక వాహనం నుంచి శవపేటిక దిగగానే కుప్పకూలింది! -
యుద్ధంలో రష్యాకు ఊహించని షాక్ .. టెన్షన్లో పుతిన్!
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం కొనసాగుతోంది. నెల రోజులుగా జరుగుతున్న దాడుల ఇరు దేశాల సైనికులు, రక్షణ శాఖకు చెందిన కీలక అధికారులు మృతి చెందారు. యుద్ధంలో ఉక్రెయిన్‌తో పోలిస్తే రష్యాకు చెందిన కమాండర్లు ఎక్కువ మంది చనిపోయినట్టు ఉక్రెయిన్ వార్తా సంస్థలు చెబుతున్నాయి. తాజాగా యుద్ధంలో రష్యా సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ యాకోవ్ రెజాంట్సేవ్ మరణించినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. అయితే, ఖెర్సాన్ సమీపంలోని చోర్నోబైవ్కా వైమానిక స్థావరం వద్ద చోటుచేసుకున్న దాడుల్లో జనరల్ రెజాంట్సేవ్ మరణించినట్లు ఉక్రెయిన్ శుక్రవారం వెల్లడించింది. కాగా, ఈ స్థావరాన్ని రష్యా కమాండ్ పోస్ట్‌గా ఉపయోగిస్తోంది. మరోవైపు.. తాజాగా రష్యాకు చెందిన లెఫ్టినెంట్ జనరల్ ఆండ్రీ మోర్డ్విచెవ్ కూడా ఈ స్థావరంపై ఉక్రెయిన్ సైన్యం జరిపిన దాడుల్లో మృతిచెందినట్టు నివేదికలు తెలుపుతున్నాయి. యుక్రేనియన్ చేసిన దాడిలో మరణించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అయితే, ఇప్పటి వరకు 1,351 మంది సైనికులు మరణించారని రష్యా చెబుతుండగా.. సంఖ్య ఎక్కువగా ఉందని ఉక్రెయిన్ మీడియా పేర్కొంటోంది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రష్యాకు చెందిన ఏడుగురు అత్యున్నత స్థాయి అధికారులు మరణించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రెండో ప్రపంచయుద్ధం తర్వాత రష్యా ఈ స్థాయిలో సైనిక జనరల్స్‌ను ఎప్పుడూ కోల్పోలేదు. చెచెన్యా యుద్ధంలోనూ, ఆఫ్ఘనిస్థాన్‌లో పోరులోనూ రష్యాకు ఇంత నష్టం జరగలేదని సమాచారం. మృతి చెందిన రష్యా జనరల్స్ వీరే.. - ఒలేగ్ మిత్యేవ్: కమాండర్, 150వ రైఫిల్ డివిజన్, - ఆండ్రీ కొలెస్నికోవ్: కమాండర్, 29వ కంబైన్డ్ ఆర్మీ, - విటాలీ గెరాసిమోవ్: చీఫ్ ఆఫ్ స్టాఫ్, 41వ కంబైన్డ్ ఆర్మీ, - ఆండ్రీ సుఖోవెట్స్కీ: డిప్యూటీ కమాండర్, 41వ కంబైన్డ్ ఆర్మీ, - యాకోవ్ రెజాంట్సేవ్: కమాండర్, 49వ కంబైన్డ్ ఆర్మీ, - ఆండ్రీ మోర్డ్విచెవ్: కమాండర్, 8వ కంబైన్డ్ ఆర్మీ. -
అడ్డుకున్న సంతోష్ నేతృత్వంలోని దళం
న్యూఢిల్లీ: చైనా, భారత్ సరిహద్దుల్లోని గాల్వన్ లోయలోని ఒక చిన్న పర్వత పాదంపై నిఘా కేంద్రాన్ని చైనా ఏర్పాటు చేయడమే తాజా ఘర్షణలకు కారణమని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘర్షణల్లో భారత్, చైనాల సైనికులు భారీగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. భారత భూభాగంలో గాల్వన్ నది దక్షిణ తీరంలో చైనా ఆ పోస్ట్‌ను ఏర్పాటు చేయడాన్ని కల్నల్ సంతోష్ నాయకత్వంలోని భారత దళాలు అడ్డుకున్నాయి. ఆ పోస్ట్ ను తొలగించేందుకు సోమవారం సాయంత్రం ప్రయత్నించాయి. ఆ కేంద్రంలో ఉన్న కొద్దిమంది చైనా సైనికులు భారత సైనికులను అడ్డుకున్నారు. కానీ, కాసేపటికి వాస్తవాధీన రేఖకు ఆవల ఉన్న చైనా భూభాగం వైపు వెళ్లిపోయారు. ఈలోపు, భారత్ వైపు నుంచి మరిన్ని బలగాలు అక్కడికి చేరుకుని చైనా ఏర్పాటు చేసిన పోస్ట్‌ను కూల్చేయడం ప్రారంభించాయి. కాసేపటికి, మరిన్ని బలగాలతో చైనా సైనికులు మళ్లీ వచ్చారు. రాళ్లు, మేకులు కుచ్చిన కర్రలు, ఇనుప రాడ్లతో భారత సైనికులపై దాడికి తెగబడ్డారు. కొన్ని గంటల పాటు పరస్పర దాడులు కొనసాగాయి. దాడుల సమయంలో రెండు దేశాలకు చెందిన కొందరు సైనికులు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో నీరున్న గాల్వన్ నదిలో పడిపోయారు. చైనా బలగాల దాడిలో కల్నల్ సంతోష్ చనిపోయారు. కొందరు భారత సైనికులను చైనా బందీలుగా తీసుకువెళ్లిందని, అయితే, కాసేపటికి వారిని వదిలివేసిందని సమాచారం. అయితే, ఇంకా పది మంది భారత సైనికులు బందీలుగా ఉన్నట్లు ప్రముఖ రక్షణ రంగ విశ్లేషకుడు అజయ్ శుక్లా అభిప్రాయపడ్డారు. -
ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో ఆర్మీ కల్నల్ మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లాలోని మణిగావ్ అడవుల్లో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ఒక ఆర్మీ కల్నల్ వీరమరణం పొందారు. ఉదయం ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్లో ఆ అధికారికి బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో ఆయన ప్రాణాలు విడిచారు. ఈ ప్రాంతంలో ముగ్గురు, నలుగురు ఉగ్రవాదుల్లో అడవుల్లో నక్కి.. వారి కోసం గాలిస్తున్న భద్రతా దళాలపై కాల్పులకు దిగారు. గతవారం ఇదే ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు భద్రతా దళాలను ఎదుర్కొన్న ఉగ్రవాదులే.. తాజాగా ఎన్కౌంటర్లోనూ పాల్గొన్నట్టు తెలుస్తున్నది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి సరిహద్దులు దాటి వచ్చిన ఉగ్రవాదుల బృందమే భద్రతాదళాలతో ఎదురుకాల్పులకు దిగుతున్నట్టు సైనిక వర్గాలు తెలిపాయి.