నాన్న నీకు ఇదే నా జోహార్, తండ్రి పార్థివ దేహానికి సెల్యూట్ చేస్తున్న కబీర్
చండీగడ్: వయసు నిండా ఆరేళ్లే. ఇంకా ముక్కు పచ్చలే ఆరలేదు. కళ్లెదుట కన్న తండ్రి పార్థివ దేహం. అయినా సరే, వీర మరణం పొందిన తండ్రికి అంతే వీరోచితమైన వీడ్కోలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడో ఏమో.. అంతటి అంతులేని దుఃఖాన్నీ పళ్ల బిగువున అదిమిపెట్టాడు. యుద్ధానికి సిద్ధమయ్యే సైనిక వీరుల యూనిఫాం ధరించాడు.
త్రివర్ణ పతాకం కప్పి ఉన్న తండ్రి శవపేటికను మౌనంగా సమీపించాడు. ఆ పేటికనే చిట్టి చేతులతో బిగియారా కౌగిలించుకున్నాడు. ఆ సమయాన ఆ చిన్ని మనసులో ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలయ్యాయో! ఎన్నెన్ని భావాలు చెలరేగాయో! ఎంతటి దుఃఖం పొంగుకొచ్చిందో! అవేవీ పైకి కనిపించనీయలేదు. కన్నీటిని కనీసం కంటి కొసలు కూడా దాటి రానివ్వలేదు. తండ్రి పార్థివ దేహం ముందు సగౌరవంగా ప్రణమిల్లాడు. రుద్ధమైన కంఠంతోనే, ‘జైహింద్ పాపా‘ అంటూ తుది వీడ్కోలు పలికాడు. అందరినీ కంట తడి పెట్టించాడు...!
చండీగఢ్: కశ్మీర్ లోయలో ఉగ్ర ముష్కరులను ఏరిపారేసే క్రమంలో వీర మరణం పొందిన సైనిక వీరులు కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ దోంచక్ అంత్యక్రియలు శుక్రవారం అశ్రు నయనాల నడుమ ముగిశాయి. పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో మన్‌ప్రీత్ స్వగ్రామం బహరౌన్ జియాన్‌లో ఉదయం నుంచే సందర్శకుల ప్రవాహం మొదలైంది. చూస్తుండగానే జనం ఇసుకేస్తే రాలనంతగా పెరిగిపోయారు. వారందరి సమక్షంలో పూర్తి సైనిక లాంఛనాల నడుమ మన్ ప్రీత్ అంత్యక్రియలు ముగిశాయి.
ఈ సందర్భంగా కుమారుడు కబీర్ సింగ్ కనబరిచిన గుండె దిటవు, ’జైహింద్ పాపా’ అంటూ తండ్రికి తుది సెల్యూట్ చేసిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది. గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ తో పాటు రాష్ట్ర మంత్రులు, మాజీ సైనికాధిపతి వేదప్రకాశ్ మాలిక్, సైనిక ఉన్నతాధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మేజర్ ఆశిష్ అంత్యక్రియలు కూడా హరియాణాలోని పానిపట్‌లో పూర్తి సైనిక లాంఛనాలతో జరిగాయి. బుధవారం కశ్మీర్‌లోని కోకొర్ నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కల్నల్ మన్ ప్రీత్, మేజర్ ఆశిష్తో పాటు మొత్తం ముగ్గురు సైనిక సిబ్బంది, ఒక డీఎస్పీ అసువులు బాయడం తెలిసిందే.
గుండెలవిసేలా రోదించిన భార్య
మన్ ప్రీత్ అంత్యక్రియల సందర్భంగా గుండెలవిసేలా రోదించిన ఆయన భార్యను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. గవర్నర్, మంత్రులు తదితరులు మన్ ప్రీత్ భార్య, తల్లి తదితరులను ఓదార్చారు. అంత్యక్రియల సందర్భంగా భారత్ మాతా కీ జై నినాదాలతో ఊరంతా మారుమోగింది. మన్ ప్రీత్ చిన్నప్పటి నుంచే అసాధారణ ప్రతిభావంతుడని ఆయన చిన్ననాటి గురువులు గుర్తు చేసుకున్నారు. తమ అభిమాన శిష్యుని అంత్యక్రియల సందర్భంగా వారంతా వెక్కి వెక్కి రోదించారు. ‘మేము వర్ణనాతీతమైన బాధ అనుభవిస్తున్నాం. అదే సమయంలో, దేశం కోసం ప్రాణాలను ధార పోసిన మా శిష్యుణ్ణి చూసి గర్వంగానూ ఉంది‘ అని మన్‌ప్రీత్‌కు ఒకటో తరగతిలో పాఠాలు చెప్పిన ఆశా చద్దా అనే టీచర్ చెప్పారు.
మూడో తరం సైనిక వీరుడు
మన్‌ప్రీత్ తన కుటుంబంలో మూడో తరం సైనిక వీరుడు. ఆయనత తాత సైన్యంలో పని చేశారు. ఆయన తండ్రి సైన్యం నుంచి రిటైరయ్యాక తొమ్మిదేళ్ల క్రితం మరణించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లి తన కుమారుని పార్థివ దేహం కోసం ఉదయం నుంచే ఇంటి ముందు వేచి చూస్తూ గడిపింది. సైనిక వాహనం నుంచి శవపేటిక దిగగానే కుప్పకూలింది!
Comments
Please login to add a commentAdd a comment