Kabir
-
Colonel Manpreet Singh Funeral: జై హింద్ పాపా!
చండీగడ్: వయసు నిండా ఆరేళ్లే. ఇంకా ముక్కు పచ్చలే ఆరలేదు. కళ్లెదుట కన్న తండ్రి పార్థివ దేహం. అయినా సరే, వీర మరణం పొందిన తండ్రికి అంతే వీరోచితమైన వీడ్కోలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడో ఏమో.. అంతటి అంతులేని దుఃఖాన్నీ పళ్ల బిగువున అదిమిపెట్టాడు. యుద్ధానికి సిద్ధమయ్యే సైనిక వీరుల యూనిఫాం ధరించాడు. త్రివర్ణ పతాకం కప్పి ఉన్న తండ్రి శవపేటికను మౌనంగా సమీపించాడు. ఆ పేటికనే చిట్టి చేతులతో బిగియారా కౌగిలించుకున్నాడు. ఆ సమయాన ఆ చిన్ని మనసులో ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలయ్యాయో! ఎన్నెన్ని భావాలు చెలరేగాయో! ఎంతటి దుఃఖం పొంగుకొచ్చిందో! అవేవీ పైకి కనిపించనీయలేదు. కన్నీటిని కనీసం కంటి కొసలు కూడా దాటి రానివ్వలేదు. తండ్రి పార్థివ దేహం ముందు సగౌరవంగా ప్రణమిల్లాడు. రుద్ధమైన కంఠంతోనే, ‘జైహింద్ పాపా‘ అంటూ తుది వీడ్కోలు పలికాడు. అందరినీ కంట తడి పెట్టించాడు...! చండీగఢ్: కశ్మీర్ లోయలో ఉగ్ర ముష్కరులను ఏరిపారేసే క్రమంలో వీర మరణం పొందిన సైనిక వీరులు కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ దోంచక్ అంత్యక్రియలు శుక్రవారం అశ్రు నయనాల నడుమ ముగిశాయి. పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో మన్‌ప్రీత్ స్వగ్రామం బహరౌన్ జియాన్‌లో ఉదయం నుంచే సందర్శకుల ప్రవాహం మొదలైంది. చూస్తుండగానే జనం ఇసుకేస్తే రాలనంతగా పెరిగిపోయారు. వారందరి సమక్షంలో పూర్తి సైనిక లాంఛనాల నడుమ మన్ ప్రీత్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ సందర్భంగా కుమారుడు కబీర్ సింగ్ కనబరిచిన గుండె దిటవు, ’జైహింద్ పాపా’ అంటూ తండ్రికి తుది సెల్యూట్ చేసిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది. గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ తో పాటు రాష్ట్ర మంత్రులు, మాజీ సైనికాధిపతి వేదప్రకాశ్ మాలిక్, సైనిక ఉన్నతాధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మేజర్ ఆశిష్ అంత్యక్రియలు కూడా హరియాణాలోని పానిపట్‌లో పూర్తి సైనిక లాంఛనాలతో జరిగాయి. బుధవారం కశ్మీర్‌లోని కోకొర్ నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో కల్నల్ మన్ ప్రీత్, మేజర్ ఆశిష్‌తో పాటు మొత్తం ముగ్గురు సైనిక సిబ్బంది, ఒక డీఎస్పీ అసువులు బాయడం తెలిసిందే. గుండెలవిసేలా రోదించిన భార్య మన్ ప్రీత్ అంత్యక్రియల సందర్భంగా గుండెలవిసేలా రోదించిన ఆయన భార్యను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. గవర్నర్, మంత్రులు తదితరులు మన్ ప్రీత్ భార్య, తల్లి తదితరులను ఓదార్చారు. అంత్యక్రియల సందర్భంగా భారత్ మాతా కీ జై నినాదాలతో ఊరంతా మారుమోగింది. మన్ ప్రీత్ చిన్నప్పటి నుంచే అసాధారణ ప్రతిభావంతుడని ఆయన చిన్ననాటి గురువులు గుర్తు చేసుకున్నారు. తమ అభిమాన శిష్యుని అంత్యక్రియల సందర్భంగా వారంతా వెక్కి వెక్కి రోదించారు. ‘మేము వర్ణనాతీతమైన బాధ అనుభవిస్తున్నాం. అదే సమయంలో, దేశం కోసం ప్రాణాలను ధార పోసిన మా శిష్యుణ్ణి చూసి గర్వంగానూ ఉంది‘ అని మన్‌ప్రీత్‌కు ఒకటో తరగతిలో పాఠాలు చెప్పిన ఆశా చద్దా అనే టీచర్ చెప్పారు. మూడో తరం సైనిక వీరుడు మన్‌ప్రీత్ తన కుటుంబంలో మూడో తరం సైనిక వీరుడు. ఆయనత తాత సైన్యంలో పని చేశారు. ఆయన తండ్రి సైన్యం నుంచి రిటైరయ్యాక తొమ్మిదేళ్ల క్రితం మరణించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లి తన కుమారుని పార్థివ దేహం కోసం ఉదయం నుంచే ఇంటి ముందు వేచి చూస్తూ గడిపింది. సైనిక వాహనం నుంచి శవపేటిక దిగగానే కుప్పకూలింది! -
మోదీ.. మరో తప్పు!
లక్నో : ఉత్తరప్రదేశ్ పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెట్టారు. గురువారం మఘర్‌లో జరిగిన ప్రవక్త, కవి సంత్ కబీర్దాస్ 500వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. ‘శాంతి, సామరస్యంతో ఎలా జీవించాలనే సందేశాన్ని మహత్మ కబీర్ బోధించారు. నిర్వాణ్ గడ్డపై పుట్టినందుకు నేను మరోసారి ఆ మహానుభావునికి వందనాలు చేస్తున్నాను. కబీర్, గురు నానక్, బాబా గోరఖ్నాథ్లు కలసి ఆధ్యాత్మికతపై చర్చించేవార’ని తెలిపారు. కబీర్, గురు నానక్, గోరఖ్నాథ్లు కలసి చర్చించేవారని మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మోదీ చేసిన ప్రసంగంలో తప్పులున్నాయని.. ఆయన చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని అంటున్నారు. వారి వాదన ప్రకారం.. ‘వీరు ముగ్గురు వేరువేరు కాలాల చెందిన వారు. కానీ మోదీ వీరు ముగ్గురు చర్చలు జరిపారని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. గోరఖ్‌నాథ్ కబీర్ ముందుతరం వారయితే.. గురు నానక్ కబీర్ తర్వాతి తరానికి చెందినవారు. గోరఖ్‌నాథ్ 11వ శతాబ్దంలో జన్మిస్తే.. కబీర్ 1398-1539 మధ్య కాలానికి చెందినవారు. అలాగే గోరఖ్‌నాథ్ 1469-1539 మధ్య జీవించారు. ఒకవేళ గోరఖ్‌నాథ్, కబీర్ చర్చలు జరిపే అవకాశం ఉన్నప్పటికీ.. వారు ఇరువురు ఆధ్యాత్మికతపై చర్చించారని చెప్పడం కాస్త నమ్మశక్యంగా లేదు’. కాగా, గతంలో కూడా మోదీ చేసిన వ్యాఖ్యల్లో తప్పులు దొర్లిన సంగతి తెలిసిందే. 2013లో పట్నాలో జరిగిన ర్యాలీలో బిహార్ గొప్పతనం గురించి మాట్లాడుతూ.. అశోక చక్రవర్తి, నలంద, తక్షశిల పేర్లను ఊదహరించారు. గతంలో పంజాబ్ భూభాగమైన తక్షశిల ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. అలాగే యూఎస్‌లో మోదీ ప్రసంగిస్తూ కోణార్క్ సూర్య దేవాలయం 2 వేల సంవత్సరాల పురాతనమైనదని తెలిపారు. కానీ అది 700 ఏళ్ల కిందట నిర్మితమైన కట్టడమని చర్రిత పుటల్లో ఉంది. చదవండి: మోదీకి చరిత్ర చెప్పే మగాడే లేడా?! -
‘నాకు టోపీ పెట్టకండి’
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మరోసారి విపక్షాలకు మాట్లాడే అవకాశం కల్పించారు. హిందుత్వకి మారుపేరుగా చెప్పుకునే యోగి.. మఘర్‌లో ఉన్న ప్రసిద్ధ ప్రవక్త, కవి కబీర్ సమాధిని సందర్శించడానికి వెళ్లినప్పుడు ముస్లింలు ధరించే టోపీ / పగడీ ధరించడానికి నిరాకరించి విపక్షాలకు పని కల్పించారు. వివరాల ప్రకారం గురువారం(నేడు) కబీర్ ప్రవక్త 500వ వర్ధంతి వేడుకల సందర్భంగా ఆ మహాత్మునికి నివాళులు అర్పించడానికి ప్రధాని నరేంద్ర మోదీ మఘర్‌కు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది యూపీ ప్రభుత్వం. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు యోగినే స్వయంగా మఘర్‌కు వెళ్లారు. ఆ సయంలో సమాధి నిర్వహకుడు ముస్లింలు ధరించే టోపీని యోగి తలపై పెట్టడానికి ముందుకు వచ్చాడు. కానీ టోపీ ధరించడానికి ఇష్టపడక వద్దని సున్నితంగా యోగి వారించారు. ముఖ్యమంత్రి చర్యను విపక్షాలు విమర్శిస్తున్నాయి. మతం పేరుతో యోగి సమాజాన్ని విడదీస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ‘ఆ టోపీ ఏ మతానికి చెందినది కాదు. అది కేవలం మర్యాదను సూచిస్తుంది. ముఖ్యమంత్రి అన్నాక అందరిని కలుపుకుపోవాలి. యోగి టోపీని ధరిస్తే బాగుండేద’ని కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ తివారి అన్నారు. అయితే యూపీ మంత్రి వర్గంలోని ఏకైక ముస్లిం మంత్రి మొహ్సిన్ రాజా మాత్రం యోగీకి మద్దతు తెలిపారు. ‘ముఖ్యమంత్రికి టోపీ ఇవ్వడం.. ఆయన దాన్ని ధరించకపోవడం.. దాన్ని ప్రతిపక్షాలు ఇలా ప్రచారం చేయడం వీటన్నింటిని చూస్తుంటే మీరు ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నారో జనాలకు అర్ధం అవుతుంది. మీరు ప్రజలకు ఏ సందేశం ఇద్దామనుకుంటున్నారు? నేను ఒక ముస్లింనే. కానీ నేను ఎప్పుడు టోపీ ధరించలేదు. అంతమాత్రాన నేను ముస్లింను కానా? టోపీని ధరించకపోవడం పెద్ద నేరమా? ఈ విషయం గురించి మాట్లాడేవారు ఆలయాలకు వెళ్లి ప్రజలతో పాటు నిల్చుని, వారిని శుభాకాంక్షలు తెలుపుతున్నారా? ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలను విలువివ్వడం... మతాన్ని అవమానించడం ఎలా అవుతుంది. ముందు మనం మన ఆలోచనల్ని మార్చుకోవాలి’ అన్నారు. -
అనుమానం.. పెనుభూతమై..
భార్యను హతమార్చిన భర్త మృతురాలి బంధువుల ఆందోళన పోలీసుల రాకతో సద్దుమణిగిన గొడవ ధర్మాపురం(దేవరుప్పుల) : అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను దారుణంగా హత్య చేసిన సంఘటన మండలంలోని ధర్మాపురంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. మండలంలోని ధర్మాపురం శివారు పడమటితండాకు చెందిన జాటోత్ సుగుణ బీకోజీ కూతురు భారతి(31)కి 16 ఏళ్ల క్రితం ఇదే తండా సమీపంలోని లకావత్‌తండాకు చెందిన జక్కమ్మ, హర్యానాయక్ కుమారుడు కబీర్‌తో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు జన్మించగా ఇటీవల కుటుంబ కలహాలు మొదలయ్యూరుు. భారతికి వివాహేతర సంబంధాలు ఉన్నాయనే ఆరోపిస్తూ భార్యతో తరచూ గొడవకు దిగుతున్నట్లు తండావాసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి తల్లిగారింటికి వెళ్లొచ్చిన భారతి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కబీర్ మళ్లీ గొడవకు దిగాడు. కొడవలితో కడుపు చీరగా పేగులు బయటపడి విలవిలలాడుతూ మృతిచెందినట్లు ప్రత్యక్ష సాక్షి ఎనిమిదేళ్ల కొడుకు శ్రవణ్ ఏడ్చుకుంటూ చెప్తున్న తీరు స్థానికులను కలచివేసింది. భార్యను హతమార్చిన కబీర్తోపాటు అత్తమామలు తెల్లారేసరికే పరారీ కావడంతో మృతురాలి బంధువులు చేరుకుని ఇంట్లోని వస్తువులు ధ్వంసం చేశారు. ఎస్సై కె.సూర్యప్రసాద్ చేరుకుని శాంతింపజేసే యత్నం చేసినా మహిళలు ప్రతీకార చర్య తీసుకుంటామని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పాలకుర్తి సీఐ తిరుపతి పాలకుర్తి, కొడకండ్ల ఎస్సైలు ఉస్మానీ అలీ, శ్రీనివాస్‌తో చేరుకుని బాధితులను శాంతింపజేశారు. మూడు గంటల ఉద్రిక్తత పరిస్థితుల అనంతరం మృతురాలి తల్లిదండ్రులు సుగుణ,బీకోజీ ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేశారు. తల్లి మృతదేహాన్ని చూసి కూతుర్లు స్వాతి, జ్యోతి, కుమారుడు శ్రవణ్ రోదిస్తున్న తీరు గ్రామస్తులను కలచివేసింది.