బీజింగ్: భారత్ సహా వివిధ దేశాలతో సరిహద్దు వివాదాలను ఎదుర్కొంటున్న చైనా ఈ ఏడాది తన రక్షణ, సైనిక కార్యకలాపాల కోసం బడ్జెట్‌లో భారీగా నిధులను కేటాయించింది. బడ్జెట్ నివేదికను చైనా ప్రధాన మంత్రి లీ కెఖియాంగ్ ఆ దేశ పార్లమెంటు ఎన్‌పీసీ (నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్)కి సమర్పించారు. 6.5 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును ఈ ఏడాదికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు బడ్జెట్ నివేదికలో చైనా పేర్కొంది.
రక్షణ కోసం 175 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11.40 లక్షల కోట్లు) నిధులను కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది 8.1 శాతం ఎక్కువ. అమెరికా తర్వాత రక్షణ విభాగానికి అత్యధికంగా నిధులు కేటాయిస్తున్న దేశం చైనాయే. భారత్ తన బడ్జెట్‌లో రక్షణ విభాగానికి కేటాయించిన నిధుల (46 బిలియన్ డాలర్లు– దాదాపు రూ.2.99 లక్షల కోట్లు) కన్నా చైనా బడ్జెట్ దాదాపు మూడున్నర రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.
బహుళ పార్టీ వ్యవస్థతో అర్థం లేని పోటీ
బహుళ పార్టీ ప్రజాస్వామ్యంతో పార్టీల మధ్య ‘అనారోగ్యకర పోటీ’ నెలకొంటుందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. చైనా అనుసరిస్తున్న ఏక పార్టీ వ్యవస్థే మంచిదన్నారు. చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (సీపీపీసీసీ) సదస్సులో జిన్‌పింగ్ మాట్లాడారు. ‘చైనా వ్యవస్థ కొత్తది. ఎందుకంటే ఇది అన్ని రాజకీయ పార్టీలను, పార్టీల ప్రమేయం లేని ప్రజలను ఉమ్మడి లక్ష్యం కోసం ఏకం చేస్తుంది. అధికార మార్పి డి, పార్టీల మధ్య అనారోగ్యకర పోటీతో వచ్చే నష్టాలు లేకుండా చేస్తుంది’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment