Military Operations
-
శత్రు సైన్యంపై మూషికాస్త్రం!
యుద్ధ క్షేత్రంలో శత్రు శిబిరం ఎత్తుగడలు, రహస్యాలను తెలుసుకోవడానికి సైన్యం రకరకాల మార్గాల్లో ప్రయత్నించడం తెలిసిందే. శత్రువులు ఎక్కడెక్కడ ఏయే ఆయుధాలు మోహరించారో తెలుసుకోవడం యుద్ధంలో కీలకం. ఇలాంటివి పసిగట్టే ఎలుకలపై భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) నిర్విరామంగా ప్రయోగాలు సాగిస్తోంది. డీఆర్డీఓలో అంతర్భాగమైన అసిమ్మెట్రిక్ టెక్నాలజీ ల్యాబ్ ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమైంది. మొదటి దశను విజయవంతంగా పూర్తిచేసి, రెండో దశలోకి ప్రవేశించింది. ఏమిటీ ప్రయోగం? సైనికులు జంతువులు, పక్షులను ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదు. రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే ఎలుకలను రంగంలోకి దించాలన్నదే భారత సైన్యం వ్యూహం. ఇవి ఏమాత్రం అనుమానం రాకుండా శత్రు సైనికుల శిబిరాల్లోకి వెళ్లి, అక్కడి సమాచారాన్ని అందిస్తాయి. ఆ సమాచారం ఆధారంగా సైన్యం వ్యూహాలు సిద్ధం చేసుకోవచ్చు. ఈ ఎలుకలను యానిమల్ ౖసైబర్గ్స్ అని పిలుస్తున్నారు. ఏడాదిన్నర క్రితమే ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. దీనిగురించి ఇటీవల జరిగిన 108వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో డీఆర్డీఓ సైంటిస్టు పి.శివప్రసాద్ ఒక ప్రజంటేషన్ ఇచ్చారు. యానిమల్ సైబర్గ్స్ అంటే? జీవించి ఉన్న ఎలుకల సామర్థ్యాన్ని మరింత పెంచుతారు. ఇందుకోసం ఎలక్ట్రికల్, మెకానికల్ పరికరాలు ఉపయోగిస్తారు. సాధారణ ఎలుకలు చేయలేని ఎన్నో పనులను ఇవి సులువుగా చేసేస్తాయి. కేవలం సైన్యంలోనే కాదు, పరిశోధనలు, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, భూమిల పాతిపెట్టిన బాంబుల జాడ కనుక్కోవడంతోపాటు శస్త్రచికిత్సల్లోనూ యానిమల్ సైబర్గ్స్ సేవలను వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ జంతువుల్లో మార్పులు చేయడాన్ని జంతు ప్రేమికులు, జంతు హక్కుల సంఘాల కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. జంతువుల్లోని సహజ సామర్థ్యాలను దూరం చేయడం వాటిని బాధకు గురిచేయడమే అవుతుందని అంటున్నారు. ఎలుకలే ఎందుకు? భారత్‌లో ఎలుకలపై మొదటి దశ ప్రయోగాలు ముగిశాయి. ఎలుకల కదలికలను నియంత్రించడానికి సర్జరీల ద్వారా వాటి శరీరంలో ఎలక్ట్రోడ్లు అమర్చారు. ఇక సాధారణ వాతావరణ పరిస్థితుల్లో వాటిని పరీక్షించబోతున్నారు. కొండలను ఎంత వరకు అధిరోహించగలవో చూస్తారు. మొదటి దశ ప్రయోగంలో ఎలుకలు కొంత ఇబ్బందికి గురయ్యాయని డీఆర్డీఓ సైంటిస్టు పి.శివప్రసాద్ వెల్లడించారు. కార్యాచరణకు సిద్ధమైన ఎలుకలను రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించవచ్చు. ఏ దిశగా వెళ్లాలి? ఎంత దూరంగా వెళ్లాలి? ఎక్కడ ఆగాలి? ఎంతసేపు ఆగాలి? అనేదానిపై వాటి మెదడుకు ఎప్పటికప్పుడు సంకేతాలు అందిస్తారు. ప్రయోగానికి ఎలుకలనే ఎన్నుకోవడానికి కారణంగా ఏమిటంటే.. అవి వేగంగా కదులుతాయి. లోతైన బొరియల్లోకి సైతం తేలిగ్గా వెళ్లగలవు. గోడలు, చెట్లు ఎక్కగలవు. యానిమల్ ౖౖసైబర్గ్స్ను చైనాలో ఇప్పటికే అభివృద్ధి చేశారు. యానిమల్ సైబర్గ్స్ సినిమాల్లో కూడా ఉన్నాయి. స్టార్‌వార్స్ సినిమాలోని చ్యూబాకా కూడా ఇలాంటిదే. ఒళ్లంతా రోమాలతో కనిపించే వింత జంతువు చ్యూబాకాలో శరీరం లోపల ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ -
Crimea: క్రిమియా నుంచి క్రిమియా వరకు..
రష్యా, ఉక్రెయిన్ మధ్య పోరు మరోసారి క్రిమియా చుట్టూ తిరుగుతోంది. రష్యా దండయాత్రను మొదట్నుంచి ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ ఇకపై చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమైంది. క్రిమియాని తిరిగి స్వాధీనం చేసుకుంటే యుద్ధానికి తెర పడుతుందన్న భావనలో ఉక్రెయిన్ ఉంది. ఇందుకోసం తన యుద్ధ వ్యూహాలను మార్చుకుంటూ క్రిమియా లక్ష్యంగా గత కొద్ది రోజులుగా డ్రోన్లతో దాడులకు పాల్పడుతోంది. క్రిమియాతో మొదలైన యుద్ధం క్రిమియాతోనే ముగుస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆగస్టు రెండో వారం నుంచి క్రిమియా లక్ష్యంగా ఉక్రెయిన్ యుద్ధ వ్యూహాలకు పదును పెడుతోంది. క్రిమియాలో రష్యాకు చెందిన రెండు వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ దాడులు చేసింది. ఒక ఆయుధాగారంలో పేలుళ్లు జరిపింది. రష్యా, క్రిమియాను కలిపి ఉంచే కెర్చ్ స్ట్రెయిట్ వంతెనను కూల్చివేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేవలం వారం వ్యవధిలో ఉక్రెయిన్ క్రిమియాలో రెండు వైమానిక స్థావరాలపై దాడులు జరపడం కలకలం రేపుతోంది. సాకి వైమానిక స్థావరంపై జరిపిన దాడిలో రష్యాకు చెందిన ఎనిమిది మిలటరీ విమానాలు ధ్వంసమయ్యాయి. గెరిల్లా దాడులకి సన్నాహాలు క్రిమియాలో గెరిల్లా తరహా దాడులకు ఉక్రెయిన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రత్యేక దళాలను క్రిమియాలో మోహరించింది. ఉక్రెయిన్ నుంచే క్రిమియాపై దాడులు చేసేటంత క్షిపణి బలం ఉక్రెయిన్‌కి లేదు. అందుకే కొత్త వ్యూహాలకు తెర తీసి గెరిల్లా తరహా దాడులకు దిగనున్నట్టు ఉక్రెయిన్ మిలటరీలో పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక జనరల్ వెల్లడించారు. ఉక్రెయిన్ చేస్తున్న వరస దాడులతో క్రిమియా వాసులు వణికి పోతున్నారు. చాలా మంది ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రస్తుతం అత్యంత అభద్రతలో ఉన్న ప్రాంతంగా క్రిమియా నిలిచింది. ఉక్రెయిన్ దాడుల్ని తక్కువ చేసి చూపించాలని రష్యా ప్రయత్నిస్తున్నప్పటికీ అంతర్గతంగా ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్రిమియాలో ఉన్న బ్లాక్ సీ ఫ్లీట్ కమాండర్‌ను మార్చేసినట్టు వార్తలు వస్తున్నాయి. క్రిమియాను రష్యా ఎలా వినియోగించుకుంది? ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకి దక్షిణం వైపు నుంచి ముట్టడి క్రిమియా మీదుగా సాగింది. రష్యాకు చెందిన బ్లాక్ సీ ఫ్లీట్ ఇక్కడే ఉండడంతో మిలటరీ కార్యకలాపాలన్నింటీ ఈ గడ్డ మీద నుంచి సాగిస్తోంది. క్రిమియాలోని సేవాస్టోపల్ నగరం అత్యంత కీలకమైన రేవు పట్టణం. నావికా శక్తికి మరోపేరుగా నిలుస్తుంది. ఈ సముద్ర ప్రాంతాన్ని రష్యా బ్లాక్ చేయడంతో ఉక్రెయిన్ పోర్టులకు వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. క్రిమియా నుంచి రష్యాకు ఒక వంతెన ద్వారా రాకపోకలు సాగించవచ్చు. రెండు ప్రధాన రైల్వే లైన్లు ఉన్నాయి. రష్యా ఈ రైళ్ల ద్వారానే యుద్ధానికి అవసరమయ్యే భారీ మిలటరీ పరికరాలను క్రిమియాకి తరలించింది.ఇటు ఉక్రెయిన్ కూడా క్రిమియాని అధికారానికి, ఆధిపత్యానికి చిహ్నంగా చూస్తుంది. ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభమైన దగ్గర్నుంచి రష్యా దళాలకు క్రిమియా నుంచే ఆహారం, ఆయుధాలు వంటివి వెళ్లాయి. యుద్ధ విమానాలు ఇక్కడ్నుంచి వెళ్లి ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులతో దాడి చేశాయి. ఇప్పుడు తిరిగి క్రిమియాను ఆక్రమించుకోవడం ద్వారా రష్యాపై పై చేయి సాధించాలని ఉక్రెయిన్ ఆరాటపడుతోంది. క్రిమియాలో రష్యా భాష మాట్లాడే ప్రజలే అధికంగా ఉన్నారు. 2014లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా రష్యాలో విలీనం కావడానికే ఇష్టపడ్డారు. దీంతో ఇక్కడ ప్రజల్లో ఉక్రెయిన్‌పై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉండడంతో ఈ మొత్తం వ్యవహారం సంక్లిష్టంగా మారింది. వ్యూహాత్మకంగా క్రిమియాయే కీలకం క్రిమియాను రష్యన్లు అత్యంత పవిత్రమైన స్థలంగా చూస్తారు. అదొక విలాసవంతమై నగరం. బీచ్‌లు, రిసార్ట్‌లతో అలరారుతూ ఉంటుంది. సమశీతోష్ణస్థితి వాతావరణం కలిగి ఉండడంతో రష్యాలో ధనవంతులకు వేసవి విడిదిగా మారింది. ఈ నగరంలో 20 లక్షల మంది నివసిస్తారు. ఒకప్పుడు ఉక్రెయిన్‌లో అంతర్భాగంగా ఉండే క్రిమియాను 2014లో రష్యా స్వాధీనం చేసుకుంది. అయితే పశ్చిమ దేశాలు క్రిమియాని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నగరంగానే ఇప్పటికీ గుర్తిస్తున్నాయి. రష్యా మిత్రదేశాలు క్యూబా వంటివి మాత్రమే ఈ ద్వీపకల్పంలో రష్యా సార్వభౌమాధికారాన్ని గుర్తించాయి. క్రిమియాలో నల్ల సముద్రం, సహజసిద్ధంగా ఏర్పడిన రేవులు వ్యూహాత్మకంగా కీలకంగా మార్చాయి. రష్యాకి అత్యంత కీలకమైన సైనిక, నావికా స్థావరం క్రిమియా .రష్యా, ఉక్రెయిన్ విభజన సమయంలోనే క్రిమియాని కీలక స్థావరంగా రష్యా వినియోగించుకోవడానికి ఇరుపక్షాల మధ్య ఒప్పందం కూడా జరిగింది. రష్యాకు చెందిన సైనిక బలగాలు 25 వేలు, 24 శతఘ్ని వ్యవస్థలు, 132 సాయుధ వాహనాలు క్రిమియాలోనే ఉంటాయి. బ్లాక్ సీ ఫ్లీట్ వ్యవస్థ కలిగి ఉండడం రష్యాకు కలిసొచ్చే అంశం. అపార ప్రాణనష్టం రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఇప్పటికి ఆరు నెలలు గడిచింది. ఇన్నాళ్లలో రష్యా వైపు ఎక్కువగా నష్టం సంభవించింది. అమెరికా అంచనాల ప్రకారం రష్యా సైనికులు 70 నుంచి 80 వేల మంది మరణించారు. అయితే ఉక్రెయిన్ చెబుతున్న లెక్కలు వేరేలా ఉన్నాయి. ఇప్పటివరకు రష్యాకు చెందిన 45,400 మంది మరణించారు. ఆ దేశానికి చెందిన 234 యుద్ధ విమానాలు, 198 హెలికాప్టర్లు, 1919 యుద్ధ ట్యాంకులు 15 నౌకలు, 194 క్రూయిజ్ క్షిపణులు, 4230 సాయుధ వాహనాలు, 1032 శతఘ్ని వ్యవస్థ ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. ఇక ఉక్రెయిన్ వైపున దాదాపుగా 9 వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ మిలటరీ వెల్లడించింది. యుధ్దానికి సామాన్య పౌరులు కూడా వెళ్లడంతో ఎంతమంది సైనికులు మరణించారో నిర్ధారణగా తెలీడం లేదు. ఐక్యరాజ్యసమితి ఉక్రెయిన్‌లో 5,587 మంది సాధారణ పౌరులు మరణించారని, 7,890 మంది గాయపడ్డారని చెబుతోంది. ఇక ఈ యుద్ధంతో ఉక్రెయిన్‌లో వెయ్యి మందివరకు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని యూనిసెఫ్ అంచనా వేసింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
చైనా, తైవాన్ మధ్య యుద్ధ మేఘాలు! పెలోసీ పర్యటనపై డ్రాగన్ కంట్రీ కన్నెర్ర
తైపీ: చైనాను రెచ్చగొడుతూ, ఉద్రిక్తతలను మరింతగా పెంచుతూ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ (82) తైవాన్ పర్యటన బుధవారం ముగిసింది. ‘‘తైవాన్‌కు అమెరికా అన్నివిధాలా అండగా నిలుస్తుంది. అందుకు మేం కట్టుబడ్డామని ఈ పర్యటనతో మరోసారి చాటిచెప్పాం’’ అని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. తైవాన్ తన భూభాగమేనని, దానితో ఏ దేశమూ సంబంధాలు పెట్టుకోరాదని చెబుతున్న చైనా ఈ పరిణామంపై మండిపడింది. ‘‘పెలోసీ నిప్పుతో చెలగాటమాడారు. అది అమెరికానే కాల్చేస్తుంది. తీవ్ర పరిణామాలుంటాయి. చేతులు ముడుచుకుని కూర్చోం’’ అంటూ చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి జీ ఫెంగ్ స్పందించారు. ఈ తప్పిదానికి అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘‘చైనా సార్వభౌమాధికారాల పరిధిని, ప్రాదేశిక సమగ్రతను అమెరికా ఉల్లంఘించింది. తైవాన్ జలసంధి వద్ద శాంతిభద్రతలను పూర్తిగా దెబ్బతీసింది’’ అని విమర్శించారు. ‘‘చైనాను నిలువరించేందుకు తైవాన్ అంశాన్ని వాడుకోవడాన్ని అమెరికా ఇకనైనా కట్టిపెట్టాలి. తైవాన్ స్వాతంత్య్ర డిమాండ్లకు మద్దతివ్వొద్దు’’ అని డిమాండ్ చేశారు. చైనాలోని అమెరికా రాయబారి నికోలస్ బర్న్స్‌ను మంగళవారం రాత్రి పిలిపించి పెలోసీ పర్యటనపై తీవ్ర అభ్యంతరం, అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనాతో కయ్యానికి కాలు దువ్వొద్దని హెచ్చరించారు. తైవాన్‌పై ఆంక్షలకూ చైనా తెర తీసింది. పళ్లు, చేపల దిగుమతులు, ఇసుక ఎగుమతులపై నిషేధం విధించింది. నిబద్ధత చాటుకున్నాం: పెలోసీ దక్షిణ కొరియా బయల్దేరే ముందు తైవాన్ అధ్యక్షురాలు సై ఇంగ్ వెన్‌తో పెలోసీ భేటీ అయ్యారు. తైవాన్లోనూ, ప్రపంచంలో ఇతర చోట్లా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న అమెరికా సంకల్పం మరింత బలపడిందంటూ సంఘీభావ ప్రకటన చేశారు. తమకు చిరకాలంగా మద్దతుగా నిలుస్తున్నందుకు పెలోసీకి వెన్ కృతజ్ఞతలు తెలిపారు. తైవాన్ అధ్యక్షురాలు సై ఇంగ్ వెన్‌తో పెలోసీ(ఎడమ) తైవాన్ చుట్టూరా సైనిక విన్యాసాలు పెలోసీ పర్యటనకు సమాధానంగా తైవాన్ను లక్ష్యంగా చేసుకుని మంగళవారం రాత్రి తెరతీసిన భారీ సైనిక విన్యాసాలను చైనా మరింత తీవ్రతరం చేసింది. తైవాన్ జలసంధిలోకి మరిన్ని యుద్ధ నౌకలను తరలించింది. దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్షలు, విన్యాసాల జోరు పెంచి అమెరికాకు హెచ్చరిక సంకేతాలు పంపింది. చైనా ఫైటర్ జెట్లు తైవాన్ గగనతలం సమీపంలో విన్యాసాలకు దిగాయి. గురువారం నుంచి నాలుగు రోజుల పాటు తైవాన్ ద్వీపం చుట్టూ మరిన్ని సైనిక విన్యాసాలుంటాయని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా ప్రకటించింది. ఇవి యుద్ధానికి దిగడంతో సమానమని పరిశీలకులంటున్నారు. బలప్రయోగంతోనైనా తైవాన్ను తనలో కలిపేసుకునే చర్యలకు చైనా దిగనుందనేందుకు ఇవి సంకేతాలేనంటున్నారు. చైనా చర్యలను తైవాన్ తీవ్రంగా నిరసించింది. ‘‘మేం జడిసేది లేదు. సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకుని తీరతాం’’ అని తైవాన్ అధ్యక్షురాలు ఇంగ్ వెన్ అన్నారు. -
ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. బుద్ధి బయటపెట్టిన ఇమ్రాన్ ఖాన్
మాస్కో: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన కుత్సిత బుద్ధిని మరోసారి బయటపెట్టారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఆయన సమర్ధించారు. ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ తన యుద్ధోన్మాదాన్ని చాటుకున్నారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సంతోషాన్ని కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు. సరైన సమయంలో రష్యాలో అడుగు పెట్టానని, రష్యా యుద్ధం ఎంతో ఆసక్తిని కలిగిస్తుందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Imran Khan in Russia as Russia invades Ukraine: What a time I have come, so much excitement pic.twitter.com/9T3SuU9KFA — Yusuf Unjhawala 🇮🇳 (@YusufDFI) February 24, 2022 కాగా రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇమ్రాన్ ఖాన్ బుధవారం రష్యా బయల్దేరారు. దాదాపు రెండు దశాబ్ధాల తరువాత ముఖ్య నేత రష్యా వెళ్లడం ఇదే తొలిసారి. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు, ఇంధన రంగంలో సహకారాన్ని విస్తరించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఇమ్రాన్ చర్చలు జరపనున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వేళ ఆయన అక్కడకు వెళ్లడం ఆసక్తి రేపుతోంది. రష్యాకు చైనా, పాక్ పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు కొన్ని రోజులుగా సందేహాలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. చదవండి: ఉక్రెయిన్‌తో యుద్ధం.. రష్యాకు షాక్!.. 5 విమానాలు, హెలికాప్టర్ కూల్చివేత ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్‌లోని కీవ్ ఎయిర్‌పోర్టు రష్యా సైన్యం అధీనంలోకి వచ్చేసింది. రష్యా యుద్ధ విమనాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రష్యా దాడిలోఉక్రెయిన్లో 300 మంది పౌరులు మృతి చెందారు. ఉక్రెయిన్‌లో నిత్యావసరల కోసం జనాలు బారులు తీరారు. పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు క్యూ పెరిగింది. సంబంధిత వార్త: Russia Ukraine War Updates: ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యా సైన్యం -
భారత్‌పై చైనా దుందుడుకు వైఖరి
వాషింగ్టన్: భారత్ సహా సరిహద్దు దేశాలపై చైనా కవ్వింపు చర్యలకు దిగుతోందని అమెరికా తీవ్రంగా విమర్శించింది. బలవంతంగా సైనిక చర్యలు చేపడుతూ మిలటరీని మోహరిస్తూ దురుసుగా ప్రవర్తిస్తోందని గురువారం అధ్యక్షభవనం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఎల్లో సీ, తూర్పు, దక్షిణ చైనా సముద్రాలు, తైవాన్ జలసంధి, భారత్ చైనా సరిహద్దుల్లో చైనా చేస్తున్న పనులకు, చెబుతున్న మాటలకి పొంతన లేదని ఆ నివేదికలో అగ్రరాజ్యం ధ్వజమెత్తింది. ‘చైనా పట్ల అమెరికా వ్యూహాత్మక ధోరణి’పేరుతో రచిం చిన ఈ నివేదికను అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్‌కు సమర్పించింది. చైనాను ఎదుర్కోవడానికి వివిధ దేశాలు, సంస్థలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆ నివేదిక అభిప్రాయపడింది. బలమైన శక్తిగా అవతరిస్తోన్న చైనా తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిని గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తోందని మండిపడింది. చైనా కమ్యూనిస్టు పార్టీ పొరుగు దేశాలపై దురుసుగా ప్రవర్తిస్తోందని విమర్శించింది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకువచ్చి ప్రపంచ దేశాల సమాచారాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చైనా చూస్తోందని, ఈ చట్టం ద్వారా అందరి డేటాని తస్కరించే పనిలో ఉందని పేర్కొంది. ఇటీవలి కాలంలో భారత్, చైనా సరిహద్దుల్లో సైనికుల మధ్య ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో అధ్యక్షభ వనం ఈ నివేదికను కాంగ్రెస్‌కి సమర్పించడం గమనార్హం. భారత్‌తో చర్చలు జరపాలి దక్షిణ చైనా సముద్రంలో చైనా చేపడుతున్న ఆపరేషన్లకు అదుపులేకుండా పోయిందని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పదవి నుంచి వైదొలగనున్న అలీస్ వెల్స్ అన్నారు. సరిహద్దు దేశాలపై కవ్వింపు చర్యల కు దిగుతూ య« దాతథ స్థితిని, సరిహద్దుల్ని మార్చడానికి చైనా ప్రయత్నిస్తోందని ఆమె మండిపడ్డారు. చైనా ఇప్పటికైనా ఇలాంటి చర్యల్ని కట్టిపెట్టిæ భారత్‌తో చర్చలు జరపాలని అన్నారు. చైనా భారత్‌తో చర్చలు జరిపి సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. మిషిగాన్‌లో కరోనా ఫేస్ షీల్డ్ ధరించిన ట్రంప్ -
కదన రంగంలో ‘ఏఐ’ రోబోలు
వాషింగ్టన్: భవిష్యత్‌లో యుద్ధ రంగంలో సైనికులకు సాయపడే రోబోల కోసం కృత్రిమ మేథ(ఏఐ) సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. కదనరంగంలో సైనికుడి మెదడు ప్రతిస్పందనల ఆధారంగా ఈ సాంకేతికతకు తుదిరూపు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయమై ఆర్మీ రీసెర్చ్ ల్యాబొరేటరీ(ఏఆర్ఎల్)కి చెందిన సీనియర్ న్యూరో సైంటిస్ట్ జీన్ వెటెల్ మాట్లాడుతూ.. ఓ సైనికుడి ప్రవర్తనను అంచనా వేసే సాంకేతికతల ఆధారంగా సమర్థవంతమైన బృందాన్ని తయారుచేయొచ్చని తెలిపారు. ఏఆర్ఎల్తో పాటు యూనివర్సిటీ ఆఫ్ బఫెలో శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. పరిశోధనలో భాగంగా వేర్వేరు పనులు చేసే సమయంలో ఓ సైనికుడి మెదడు పనితీరుతో పాటు అందులోని వేర్వేరు భాగాల మధ్య సమన్వయాన్ని అధ్యయనం చేశామని జీన్ అన్నారు. ‘మిలటరీ ఆపరేషన్లు చేపట్టినప్పుడు సైనికులు చాలా పనుల్ని ఏకకాలంలో చేయాల్సి ఉంటుంది. వేర్వేరు వర్గాల నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషించి, ఎదురయ్యే ముప్పుపై అప్రమత్తంగా ఉంటూ ముందుకు కదలాల్సి ఉంటుంది. అదే సమయంలో తోటి సైనిక బృందాలతో సమన్వయం చేసుకుంటూ చిన్నచిన్న బృందాలుగా సైనికులు ముందుకు సాగుతారు. ఇలా చేయాలంటే ప్రతీ సైనికుడు వేర్వేరు అంశాలపై చాలావేగంగా దృష్టిసారించాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగానే ఒక్కో పనికి మెదడులోని ఒక్కో భాగం ఉత్తేజితం అవుతూ ఉంటుంది’ అని జీన్ వివరించారు. నాడీతంతుల మ్యాపింగ్ పరిశోధన కోసం తాము 30 మంది సైనికులను ఎంపిక చేసుకున్నామని జీన్ తెలిపారు. ‘సాధారణంగా మెదడులోని నాడీకణాలను కలుపుతూ నాడీ తంతులు ఉంటాయి. వీటిని వైట్ మ్యాటర్‌గా వ్యవహరిస్తాం. మా పరిశోధనలో భాగంగా 30 మంది జవాన్ల మెదళ్లలోని వేర్వేరు భాగాలు ఈ నాడీ తంతుల సాయంతో ఎలా అనుసంధానమయ్యాయో మ్యాపింగ్ చేపట్టాం. ఒకవేళ మెదడులోని ఏదైనా ఓ భాగాన్ని ఉత్తేజితం చేస్తే ఏమవుతుందో ప్రత్యేకంగా రూపొందించిన కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా విశ్లేషించాం. అలాగే వేర్వేరు పనుల సందర్భంగా మెదడు సమన్వయంతో వ్యవహరించడాన్ని గుర్తించాం’ అని వెల్లడించారు. ఈ పరిశోధనలో సైనికుల మెదడు పనితీరును విడివిడిగానే విశ్లేషించామని పేర్కొన్నారు. ఒకవేళ కృత్రిమ మేథతో పనిచేసే రోబోలు, సైనికుల మధ్య సమన్వయాన్ని అధ్యయనం చేయగలిగితే నిజంగా అద్భుతంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. మెదడు పనితీరు డేటా ఆధారంగా ఓ సైనికుడు ఏ పని చేస్తున్నాడో విశ్లేషించవచ్చనీ, తద్వారా ఏఐతో పనిచేసే రోబోల సాయంతో వారికి పనిలో సాయపడొచ్చని జీన్ అభిప్రాయపడ్డారు. -
రంజాన్‌లో మిలటరీ ఆపరేషన్లు నిలిపివేత
న్యూఢిల్లీ/శ్రీనగర్: పవిత్ర రంజాన్ మాసంలో జమ్మూకశ్మీర్‌లో మిలటరీ ఆపరేషన్లను నిలిపివేయాలని భద్రతాబలగాలను కేంద్రం ఆదేశించింది. రంజాన్‌ను ముస్లింలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఒకవేళ భద్రతాబలగాలపై దాడి జరిగితే తిప్పికొట్టేందుకు, ప్రజల్ని రక్షించే పూర్తి స్వేచ్ఛ బలగాలకు ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్రం నిర్ణయాన్ని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీకి తెలియజేసినట్లు పేర్కొన్నారు. అర్థంలేని హింసతో ఇస్లాంకు చెడ్డపేరు తీసుకొస్తున్న ఉగ్రమూకలను ఏకాకి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రంజాన్‌ను ముస్లింలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరుపుకునేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రధాని మోదీ శనివారం కశ్మీర్లో పర్యటించనున్న వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
రక్షణకు 11 లక్షల కోట్లు
బీజింగ్: భారత్ సహా వివిధ దేశాలతో సరిహద్దు వివాదాలను ఎదుర్కొంటున్న చైనా ఈ ఏడాది తన రక్షణ, సైనిక కార్యకలాపాల కోసం బడ్జెట్లో భారీగా నిధులను కేటాయించింది. బడ్జెట్ నివేదికను చైనా ప్రధాన మంత్రి లీ కెఖియాంగ్ ఆ దేశ పార్లమెంటు ఎన్పీసీ (నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్)కి సమర్పించారు. 6.5 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును ఈ ఏడాదికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు బడ్జెట్ నివేదికలో చైనా పేర్కొంది. రక్షణ కోసం 175 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11.40 లక్షల కోట్లు) నిధులను కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది 8.1 శాతం ఎక్కువ. అమెరికా తర్వాత రక్షణ విభాగానికి అత్యధికంగా నిధులు కేటాయిస్తున్న దేశం చైనాయే. భారత్ తన బడ్జెట్లో రక్షణ విభాగానికి కేటాయించిన నిధుల (46 బిలియన్ డాలర్లు– దాదాపు రూ.2.99 లక్షల కోట్లు) కన్నా చైనా బడ్జెట్ దాదాపు మూడున్నర రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. బహుళ పార్టీ వ్యవస్థతో అర్థం లేని పోటీ బహుళ పార్టీ ప్రజాస్వామ్యంతో పార్టీల మధ్య ‘అనారోగ్యకర పోటీ’ నెలకొంటుందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. చైనా అనుసరిస్తున్న ఏక పార్టీ వ్యవస్థే మంచిదన్నారు. చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (సీపీపీసీసీ) సదస్సులో జిన్‌పింగ్ మాట్లాడారు. ‘చైనా వ్యవస్థ కొత్తది. ఎందుకంటే ఇది అన్ని రాజకీయ పార్టీలను, పార్టీల ప్రమేయం లేని ప్రజలను ఉమ్మడి లక్ష్యం కోసం ఏకం చేస్తుంది. అధికార మార్పి డి, పార్టీల మధ్య అనారోగ్యకర పోటీతో వచ్చే నష్టాలు లేకుండా చేస్తుంది’అని అన్నారు. -
కాల్పులపై భారత్ ఆగ్రహం
* ఇరుదేశాల సైనికాధికారుల మధ్య హాట్‌లైన్ సంభాషణ * త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి జైట్లీ సమావేశం ఇస్లామాబాద్/న్యూఢిల్లీ/శ్రీనగర్: సరిహద్దుల్లో పాక్ కాల్పుల ఉల్లంఘనలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. హాట్లైన్లో ప్రతీ మంగళవారం ఇరుదేశాల మిలిటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ జనరల్(డీజీఎంవో)ల మధ్య జరిగే చర్చల్లో ఈ సారి సరిహద్దుల్లో కాల్పుల అంశం ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుత పరిస్థితిని చర్చించి, ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఇరుదేశాల ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌లు క్షేత్రస్థాయిలో భేటీ కావాలని భారత డీజీఎంఓ లెఫ్ట్‌నెంట్ జనరల్ పీఆర్ కుమార్, పాక్ డీజీఎంఓ మేజర్ జనరల్ అమీర్ రియాజ్‌లు నిర్ణయించారు. ఇటీవలికాలంలో పాక్ నుంచి 95 సార్లు కాల్పుల ఉల్లంఘనలు జరగడంపై భారత డీజీఎంఓ నిరసన తెలిపారని సైనిక వర్గాలు తెలిపాయి. మరోవైపు త్రివిధ దళాల అధిపతులతో రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ సమావే శమయ్యారు. పాక్ కవ్వింపు చర్యల నేపథ్యంలో నియంత్రణ రేఖ వద్ద తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే చైనా సరిహద్దుల్లో జరుగుతున్న నిర్మాణాల గురించి సైనికాధికారులు మంత్రికి వివరించారు. అటు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ రాహీల్ షరీఫ్ భేటీ అయ్యారు. దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంతో పాటు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులపై ఇరువురూ చర్చించారు. జాతి ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడినట్లు సమాచారం. కాగా, గత పక్షం రోజుల్లో తొలిసారిగా మంగళవారం సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. పాక్ వైపు నుంచి ఎలాంటి కాల్పులు చోటుచేసుకోలేదని సైనికాధికారులు తెలిపారు. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు తిరిగి తమ నివాసాలకు చేరుకుంటున్నారు. 1971 తరువాత ఇవే భారీ స్థాయి కాల్పులు 1971 యుద్ధం తర్వాత సరిహద్దుల్లో ఇంత భారీ స్థాయిలో ఎప్పుడూ కాల్పులు జరగలేదని బీఎస్ఎఫ్ చీఫ్ డీకే పాఠక్ వ్యాఖ్యానించారు. పాక్ కాల్పులకు తాము కూడా దీటుగా స్పందిస్తున్నామన్నారు. ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దులో దాదాపు 25 చోట్ల మిలిటెంట్లు భారతభూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఇంటలిజెన్స్ సమాచారం తమవద్ద ఉందన్నారు. కాగా, జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భారత సైనిక దళాల చేతిలో మంగళవారం ఒక మిలిటెంట్ హతమయ్యాడు. ఇక భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి కూడా స్పందించింది. ఇరు దేశాలు చర్చల ద్వారా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సమితి ప్రధానకార్యదర్శి బాన్‌కీ మూన్ సూచించారు.