Ukraine Russia War: Zelenskyy Vows To Retake Crimea - Sakshi
Sakshi News home page

Crimea: క్రిమియా నుంచి క్రిమియా వరకు..

Published Wed, Aug 24 2022 4:12 AM | Last Updated on Wed, Aug 24 2022 12:26 PM

Ukraine Russia War: Zelenskyy Vows To Retake Crimea - Sakshi

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య పోరు మరోసారి క్రిమియా చుట్టూ తిరుగుతోంది. రష్యా దండయాత్రను మొదట్నుంచి ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌ ఇకపై చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమైంది. క్రిమియాని తిరిగి స్వాధీనం చేసుకుంటే యుద్ధానికి తెర పడుతుందన్న భావనలో ఉక్రెయిన్‌ ఉంది. ఇందుకోసం తన యుద్ధ వ్యూహాలను మార్చుకుంటూ క్రిమియా లక్ష్యంగా గత కొద్ది రోజులుగా డ్రోన్లతో దాడులకు పాల్పడుతోంది. క్రిమియాతో మొదలైన యుద్ధం క్రిమియాతోనే ముగుస్తుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

ఆగస్టు రెండో వారం నుంచి క్రిమియా లక్ష్యంగా ఉక్రెయిన్‌ యుద్ధ వ్యూహాలకు పదును పెడుతోంది. క్రిమియాలో రష్యాకు చెందిన రెండు వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్‌ దాడులు చేసింది. ఒక ఆయుధాగారంలో పేలుళ్లు జరిపింది. రష్యా, క్రిమియాను కలిపి ఉంచే కెర్చ్‌ స్ట్రెయిట్‌ వంతెనను కూల్చివేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేవలం వారం వ్యవధిలో ఉక్రెయిన్‌ క్రిమియాలో రెండు వైమానిక స్థావరాలపై దాడులు జరపడం కలకలం రేపుతోంది. సాకి వైమానిక స్థావరంపై జరిపిన దాడిలో రష్యాకు చెందిన ఎనిమిది మిలటరీ విమానాలు ధ్వంసమయ్యాయి.


గెరిల్లా దాడులకి సన్నాహాలు  

క్రిమియాలో గెరిల్లా తరహా దాడులకు ఉక్రెయిన్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రత్యేక దళాలను క్రిమియాలో మోహరించింది. ఉక్రెయిన్‌ నుంచే క్రిమియాపై దాడులు చేసేటంత క్షిపణి బలం ఉక్రెయిన్‌కి లేదు. అందుకే కొత్త వ్యూహాలకు తెర తీసి గెరిల్లా తరహా దాడులకు దిగనున్నట్టు ఉక్రెయిన్‌ మిలటరీలో పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక జనరల్‌ వెల్లడించారు. ఉక్రెయిన్‌ చేస్తున్న వరస దాడులతో క్రిమియా వాసులు వణికి పోతున్నారు. చాలా మంది ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రస్తుతం అత్యంత అభద్రతలో ఉన్న ప్రాంతంగా క్రిమియా నిలిచింది. ఉక్రెయిన్‌ దాడుల్ని తక్కువ చేసి చూపించాలని రష్యా ప్రయత్నిస్తున్నప్పటికీ  అంతర్గతంగా ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ క్రిమియాలో ఉన్న బ్లాక్‌ సీ ఫ్లీట్‌ కమాండర్‌ను మార్చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 


క్రిమియాను రష్యా ఎలా వినియోగించుకుంది?  

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకి దక్షిణం వైపు నుంచి ముట్టడి క్రిమియా మీదుగా సాగింది. రష్యాకు చెందిన బ్లాక్‌ సీ ఫ్లీట్‌ ఇక్కడే ఉండడంతో మిలటరీ కార్యకలాపాలన్నింటీ ఈ గడ్డ మీద నుంచి సాగిస్తోంది. క్రిమియాలోని సేవాస్‌టోపల్‌ నగరం అత్యంత కీలకమైన రేవు పట్టణం. నావికా శక్తికి మరోపేరుగా నిలుస్తుంది. ఈ సముద్ర ప్రాంతాన్ని రష్యా బ్లాక్‌ చేయడంతో ఉక్రెయిన్‌ పోర్టులకు వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. క్రిమియా నుంచి రష్యాకు ఒక వంతెన ద్వారా రాకపోకలు సాగించవచ్చు. రెండు ప్రధాన రైల్వే లైన్లు ఉన్నాయి.

రష్యా ఈ రైళ్ల ద్వారానే యుద్ధానికి అవసరమయ్యే భారీ మిలటరీ పరికరాలను క్రిమియాకి తరలించింది.ఇటు ఉక్రెయిన్‌ కూడా క్రిమియాని అధికారానికి, ఆధిపత్యానికి చిహ్నంగా చూస్తుంది. ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభమైన దగ్గర్నుంచి రష్యా దళాలకు క్రిమియా నుంచే ఆహారం, ఆయుధాలు వంటివి వెళ్లాయి. యుద్ధ విమానాలు ఇక్కడ్నుంచి వెళ్లి ఉక్రెయిన్‌ నగరాలపై క్షిపణులతో దాడి చేశాయి. ఇప్పుడు తిరిగి క్రిమియాను ఆక్రమించుకోవడం ద్వారా రష్యాపై పై చేయి సాధించాలని ఉక్రెయిన్‌ ఆరాటపడుతోంది. క్రిమియాలో రష్యా భాష మాట్లాడే ప్రజలే అధికంగా ఉన్నారు. 2014లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా రష్యాలో విలీనం కావడానికే ఇష్టపడ్డారు. దీంతో ఇక్కడ ప్రజల్లో ఉక్రెయిన్‌పై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉండడంతో ఈ మొత్తం వ్యవహారం సంక్లిష్టంగా మారింది.  

వ్యూహాత్మకంగా క్రిమియాయే కీలకం  
క్రిమియాను రష్యన్లు అత్యంత పవిత్రమైన స్థలంగా చూస్తారు. అదొక విలాసవంతమై నగరం. బీచ్‌లు, రిసార్ట్‌లతో అలరారుతూ ఉంటుంది. సమశీతోష్ణస్థితి వాతావరణం కలిగి ఉండడంతో రష్యాలో ధనవంతులకు వేసవి విడిదిగా మారింది. ఈ నగరంలో 20 లక్షల మంది నివసిస్తారు.  ఒకప్పుడు ఉక్రెయిన్‌లో అంతర్భాగంగా  ఉండే క్రిమియాను 2014లో రష్యా స్వాధీనం చేసుకుంది. అయితే పశ్చిమ దేశాలు క్రిమియాని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నగరంగానే ఇప్పటికీ గుర్తిస్తున్నాయి.

రష్యా మిత్రదేశాలు క్యూబా వంటివి మాత్రమే ఈ ద్వీపకల్పంలో రష్యా సార్వభౌమాధికారాన్ని గుర్తించాయి. క్రిమియాలో నల్ల సముద్రం, సహజసిద్ధంగా ఏర్పడిన రేవులు వ్యూహాత్మకంగా కీలకంగా మార్చాయి. రష్యాకి అత్యంత కీలకమైన సైనిక, నావికా స్థావరం క్రిమియా .రష్యా, ఉక్రెయిన్‌ విభజన సమయంలోనే క్రిమియాని కీలక స్థావరంగా రష్యా వినియోగించుకోవడానికి ఇరుపక్షాల మధ్య ఒప్పందం కూడా జరిగింది. రష్యాకు చెందిన సైనిక బలగాలు 25 వేలు, 24 శతఘ్ని వ్యవస్థలు, 132 సాయుధ వాహనాలు క్రిమియాలోనే ఉంటాయి.  బ్లాక్‌ సీ ఫ్లీట్‌ వ్యవస్థ కలిగి ఉండడం రష్యాకు కలిసొచ్చే అంశం.


అపార ప్రాణనష్టం  

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ప్రారంభమై ఇప్పటికి ఆరు నెలలు గడిచింది. ఇన్నాళ్లలో రష్యా వైపు ఎక్కువగా నష్టం సంభవించింది. అమెరికా అంచనాల ప్రకారం రష్యా సైనికులు 70 నుంచి 80 వేల మంది మరణించారు. అయితే  ఉక్రెయిన్‌ చెబుతున్న లెక్కలు వేరేలా ఉన్నాయి. ఇప్పటివరకు రష్యాకు చెందిన 45,400 మంది మరణించారు. ఆ దేశానికి చెందిన 234 యుద్ధ విమానాలు, 198 హెలికాప్టర్లు, 1919 యుద్ధ ట్యాంకులు 15 నౌకలు, 194 క్రూయిజ్‌ క్షిపణులు, 4230 సాయుధ వాహనాలు, 1032 శతఘ్ని వ్యవస్థ ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్‌ వెల్లడించింది.

ఇక ఉక్రెయిన్‌ వైపున దాదాపుగా 9 వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ మిలటరీ వెల్లడించింది. యుధ్దానికి సామాన్య పౌరులు కూడా వెళ్లడంతో ఎంతమంది సైనికులు మరణించారో నిర్ధారణగా తెలీడం లేదు. ఐక్యరాజ్యసమితి ఉక్రెయిన్‌లో 5,587 మంది సాధారణ పౌరులు మరణించారని, 7,890 మంది గాయపడ్డారని చెబుతోంది. ఇక ఈ యుద్ధంతో ఉక్రెయిన్‌లో వెయ్యి మందివరకు  చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని యూనిసెఫ్‌ అంచనా వేసింది.   
– నేషనల్‌ డెస్క్, సాక్షి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement