వాషింగ్టన్: భవిష్యత్‌లో యుద్ధ రంగంలో సైనికులకు సాయపడే రోబోల కోసం కృత్రిమ మేథ(ఏఐ) సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. కదనరంగంలో సైనికుడి మెదడు ప్రతిస్పందనల ఆధారంగా ఈ సాంకేతికతకు తుదిరూపు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయమై ఆర్మీ రీసెర్చ్ ల్యాబొరేటరీ(ఏఆర్‌ఎల్)కి చెందిన సీనియర్ న్యూరో సైంటిస్ట్ జీన్ వెటెల్ మాట్లాడుతూ.. ఓ సైనికుడి ప్రవర్తనను అంచనా వేసే సాంకేతికతల ఆధారంగా సమర్థవంతమైన బృందాన్ని తయారుచేయొచ్చని తెలిపారు. ఏఆర్‌ఎల్‌తో పాటు యూనివర్సిటీ ఆఫ్ బఫెలో శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు.
పరిశోధనలో భాగంగా వేర్వేరు పనులు చేసే సమయంలో ఓ సైనికుడి మెదడు పనితీరుతో పాటు అందులోని వేర్వేరు భాగాల మధ్య సమన్వయాన్ని అధ్యయనం చేశామని జీన్ అన్నారు. ‘మిలటరీ ఆపరేషన్లు చేపట్టినప్పుడు సైనికులు చాలా పనుల్ని ఏకకాలంలో చేయాల్సి ఉంటుంది. వేర్వేరు వర్గాల నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషించి, ఎదురయ్యే ముప్పుపై అప్రమత్తంగా ఉంటూ ముందుకు కదలాల్సి ఉంటుంది. అదే సమయంలో తోటి సైనిక బృందాలతో సమన్వయం చేసుకుంటూ చిన్నచిన్న బృందాలుగా సైనికులు ముందుకు సాగుతారు. ఇలా చేయాలంటే ప్రతీ సైనికుడు వేర్వేరు అంశాలపై చాలావేగంగా దృష్టిసారించాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగానే ఒక్కో పనికి మెదడులోని ఒక్కో భాగం ఉత్తేజితం అవుతూ ఉంటుంది’ అని జీన్ వివరించారు.
నాడీతంతుల మ్యాపింగ్
పరిశోధన కోసం తాము 30 మంది సైనికులను ఎంపిక చేసుకున్నామని జీన్ తెలిపారు. ‘సాధారణంగా మెదడులోని నాడీకణాలను కలుపుతూ నాడీ తంతులు ఉంటాయి. వీటిని వైట్ మ్యాటర్‌గా వ్యవహరిస్తాం. మా పరిశోధనలో భాగంగా 30 మంది జవాన్ల మెదళ్లలోని వేర్వేరు భాగాలు ఈ నాడీ తంతుల సాయంతో ఎలా అనుసంధానమయ్యాయో మ్యాపింగ్ చేపట్టాం. ఒకవేళ మెదడులోని ఏదైనా ఓ భాగాన్ని ఉత్తేజితం చేస్తే ఏమవుతుందో ప్రత్యేకంగా రూపొందించిన కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా విశ్లేషించాం.
అలాగే వేర్వేరు పనుల సందర్భంగా మెదడు సమన్వయంతో వ్యవహరించడాన్ని గుర్తించాం’ అని వెల్లడించారు. ఈ పరిశోధనలో సైనికుల మెదడు పనితీరును విడివిడిగానే విశ్లేషించామని పేర్కొన్నారు. ఒకవేళ కృత్రిమ మేథతో పనిచేసే రోబోలు, సైనికుల మధ్య సమన్వయాన్ని అధ్యయనం చేయగలిగితే నిజంగా అద్భుతంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. మెదడు పనితీరు డేటా ఆధారంగా ఓ సైనికుడు ఏ పని చేస్తున్నాడో విశ్లేషించవచ్చనీ, తద్వారా ఏఐతో పనిచేసే రోబోల సాయంతో వారికి పనిలో సాయపడొచ్చని జీన్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment