Research Lab
-
షాకింగ్ రిపోర్ట్: కరోనాను మించిన వైరస్ తయారీలో పాక్-చైనా!
ఇస్లామాబాద్: ప్రాణాంతక కోవిడ్-19 వైరస్ యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ చైనాలోని వ్యూహాన్ ల్యాబ్‌లో అభివృద్ధి చేసినట్లు మొదట్లో వార్తలు వచ్చినా.. అందుకు తగిన ఆధారాలు లభించలేదు. అయితే, కరోనాను మించిన ప్రాణాంతక వైరస్‌ను పాకిస్థాన్-చైనాలు కలిసి సీక్రెట్‌గా సిద్ధం చేస్తున్నాయని ఓ నివేదిక షాకింగ్ విషయాలు వెల్లడించింది. పాకిస్థాన్‌లోని రావల్పిండి పరిశోధన ల్యాబ్‌లో సీక్రెట్‌గా ఈ ప్రాణాంతక వైరస్‌ను ఇరుదేశాల భాగస్వామ్యంతో అభవృద్ధి చేస్తున్నట్లు సంచలన విషయాలు వెల్లడించింది. ఈ మేరకు ‘జియోపాలిటిక్’ను సూచిస్తూ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కథనం వెలువరించింది. ఈ ప్రత్యేక ప్రాజెక్టును వుహాన్ ఇన్స్టిట్యూట్, డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్(డీఎస్‌టీఓ)లు సంయుక్తంగా చేపడుతున్నట్లు పేర్కొంది. ఈ డీఎస్‌టీఓను పాకిస్థాన్ ఆర్మీ నిర్వహిస్తోంది. అయితే, ప్రాణాంతక వైరస్‌ను రూపొందించేందుకు స్పెషల్ ప్రాజెక్టును చేపట్టారన్న నివేదకలను 2020లోనే తిరస్కరించింది పాకిస్థాన్. మరోవైపు.. పాకిస్థాన్ ల్యాబ్ బయోసెఫ్టీ లెవల్-3కి సంబంధించి ఎలాంటి రహస్య ప్రాజెక్టులు లేవని పాక్ విదేశాంగ శాఖ తెలిపినట్లు జియోపాలిటిక్ తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదికలో పేర్కొన్న పరిశోధన కేంద్రం రావల్పిండిలోని చక్లాలా కంటోన్మెంట్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఉన్నాయని, దీనికి 2 స్టార్ జనరల్ అధ్యక్షత వహిస్తున్నట్లు నివేదిక తెలిపింది. మరోవైపు.. కరోనా మహమ్మారులను మించిన ప్రాణాంతక వైరస్‌లను రూపొందించటంలో చైనా నిమగ్నమైనట్లు పలు మీడియా కథనాలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ వస్తోంది చైనా. కానీ, వూహాన్ ల్యాబ్‌పై చాలా దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కరోనా వైరస్‌ను సైతం వూహాన్ ల్యాబ్‌లోనే అభివృద్ది చేసి ఉంటారని పేర్కొన్నాయి. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 10సార్లు ఎమ్మెల్యే, కీలక నేత రాజీనామా -
పాక్ అణు శాస్త్రవేత్త ఖదీర్ ఖాన్ కన్నుమూత
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు చెందిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త, ఆ దేశ అణు పితామహుడిగా పేరు తెచ్చుకున్న అబ్దుల్ ఖదీర్‌ఖాన్ (85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖదీర్ ఖాన్ ఆదివారం ఉదయం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ప్రభుత్వం తెలిపింది. 1936లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో ఖదీర్ ఖాన్ జన్మించారు. దేశ విభజన సమయంలో 1947లో ఖదీర్ ఖాన్ కుటుంబం పాకిస్తాన్‌కు వలసవెళ్లింది. కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఆగస్ట్ 26వ తేదీన ఇస్లామాబాద్‌లోని ఖాన్ రీసెర్చ్ లేబొరేటరీ(కేఆర్ఎల్) ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి రావల్పిండిలోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు. కోవిడ్ నుంచి కోలుకున్నాక డిశ్చార్జి చేశారు. ఆదివారం ఉదయం స్వల్ప అనారోగ్యానికి గురి కావడంతో కేఆర్‌ఎల్‌కి తీసుకు రాగా అక్కడే ఆయన కన్నుమూశారని మీడియా తెలిపింది. ఇస్లామాబాద్‌లోని ఫైసల్ మసీదులో అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఖదీర్‌ఖాన్ మృతికి అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. పాకిస్తాన్ 1998లో అణు పరీక్ష నిర్వహించడంతో ఖదీర్ ఖాన్ పేరు మారుమోగిపోయింది. ముస్లిం దేశాల్లో మొట్టమొదటి సారిగా అణు బాంబు తయారీ సామర్థ్యం సొంతం చేసుకున్న దేశంగా పాకిస్తాన్ నిలిచిపోయింది. అయితే, పాకిస్తాన్ నుంచి ఇరాన్, ఉత్తరకొరియాలకు అణు పరిజ్ఞానం బదిలీ చేసినట్లు బహిరంగంగా అంగీకరించడం ఆయన ప్రతిష్టను దెబ్బతీసింది. 2004 నుంచి ఐదేళ్లపాటు ప్రభుత్వం ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచింది. -
కదన రంగంలో ‘ఏఐ’ రోబోలు
వాషింగ్టన్: భవిష్యత్‌లో యుద్ధ రంగంలో సైనికులకు సాయపడే రోబోల కోసం కృత్రిమ మేథ(ఏఐ) సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. కదనరంగంలో సైనికుడి మెదడు ప్రతిస్పందనల ఆధారంగా ఈ సాంకేతికతకు తుదిరూపు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయమై ఆర్మీ రీసెర్చ్ ల్యాబొరేటరీ(ఏఆర్ఎల్)కి చెందిన సీనియర్ న్యూరో సైంటిస్ట్ జీన్ వెటెల్ మాట్లాడుతూ.. ఓ సైనికుడి ప్రవర్తనను అంచనా వేసే సాంకేతికతల ఆధారంగా సమర్థవంతమైన బృందాన్ని తయారుచేయొచ్చని తెలిపారు. ఏఆర్ఎల్తో పాటు యూనివర్సిటీ ఆఫ్ బఫెలో శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. పరిశోధనలో భాగంగా వేర్వేరు పనులు చేసే సమయంలో ఓ సైనికుడి మెదడు పనితీరుతో పాటు అందులోని వేర్వేరు భాగాల మధ్య సమన్వయాన్ని అధ్యయనం చేశామని జీన్ అన్నారు. ‘మిలటరీ ఆపరేషన్లు చేపట్టినప్పుడు సైనికులు చాలా పనుల్ని ఏకకాలంలో చేయాల్సి ఉంటుంది. వేర్వేరు వర్గాల నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషించి, ఎదురయ్యే ముప్పుపై అప్రమత్తంగా ఉంటూ ముందుకు కదలాల్సి ఉంటుంది. అదే సమయంలో తోటి సైనిక బృందాలతో సమన్వయం చేసుకుంటూ చిన్నచిన్న బృందాలుగా సైనికులు ముందుకు సాగుతారు. ఇలా చేయాలంటే ప్రతీ సైనికుడు వేర్వేరు అంశాలపై చాలావేగంగా దృష్టిసారించాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగానే ఒక్కో పనికి మెదడులోని ఒక్కో భాగం ఉత్తేజితం అవుతూ ఉంటుంది’ అని జీన్ వివరించారు. నాడీతంతుల మ్యాపింగ్ పరిశోధన కోసం తాము 30 మంది సైనికులను ఎంపిక చేసుకున్నామని జీన్ తెలిపారు. ‘సాధారణంగా మెదడులోని నాడీకణాలను కలుపుతూ నాడీ తంతులు ఉంటాయి. వీటిని వైట్ మ్యాటర్‌గా వ్యవహరిస్తాం. మా పరిశోధనలో భాగంగా 30 మంది జవాన్ల మెదళ్లలోని వేర్వేరు భాగాలు ఈ నాడీ తంతుల సాయంతో ఎలా అనుసంధానమయ్యాయో మ్యాపింగ్ చేపట్టాం. ఒకవేళ మెదడులోని ఏదైనా ఓ భాగాన్ని ఉత్తేజితం చేస్తే ఏమవుతుందో ప్రత్యేకంగా రూపొందించిన కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా విశ్లేషించాం. అలాగే వేర్వేరు పనుల సందర్భంగా మెదడు సమన్వయంతో వ్యవహరించడాన్ని గుర్తించాం’ అని వెల్లడించారు. ఈ పరిశోధనలో సైనికుల మెదడు పనితీరును విడివిడిగానే విశ్లేషించామని పేర్కొన్నారు. ఒకవేళ కృత్రిమ మేథతో పనిచేసే రోబోలు, సైనికుల మధ్య సమన్వయాన్ని అధ్యయనం చేయగలిగితే నిజంగా అద్భుతంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. మెదడు పనితీరు డేటా ఆధారంగా ఓ సైనికుడు ఏ పని చేస్తున్నాడో విశ్లేషించవచ్చనీ, తద్వారా ఏఐతో పనిచేసే రోబోల సాయంతో వారికి పనిలో సాయపడొచ్చని జీన్ అభిప్రాయపడ్డారు. -
రిమ్స్‌కు వైరాలజీ రీసెర్చ్ ల్యాబ్
రిమ్స్ (కడప అర్బన్): కడప రిమ్స్‌కు త్వరలో వైరాలజీ రీసెర్చి ల్యాబ్ అందుబాటులోకి రానుంది. డెంగీ, మలేరియా లాంటి భయంకరమైన, దీర్ఘకాలిక వ్యాధులు ఏ వ్యాధి కారక క్రిముల నుంచి వస్తాయో, ఏ విధంగా వ్యాపిస్తాయో సమగ్ర పరిశోధన జరగనుంది. ఇలా పరిశోధనలు సమగ్రంగా జరిగితే సదరు వ్యాధి కారక క్రిములను రానీయకుండా, వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా వైద్య బృందం అప్రమత్తం అవుతుంది. రాష్ట్రంలోని రిమ్స్‌లలో కడప రిమ్స్‌కు మైక్రో బయాలజీలోని వైరాలజీ విభాగంలో నూతన అధ్యాయం మొదలు కానుంది. ఇందుకోసం వైరాలజీ విభాగం పరిశీలనకు ఢిల్లీ నుంచి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తరుపున ప్రత్యేక వైద్య బృందం సోమవారం కడప రిమ్స్‌కు వచ్చింది. రిమ్స్ డెరైక్టర్ డాక్టర్‌సిద్దప్ప గౌరవ్‌ను కలిసిన బృందం వైరాలజీ డిపార్టుమెంటును పరిశీలించారు. మైక్రో బయాలజీ హెచ్ఓడీ డాక్టర్ శశిధర్, వైద్య సిబ్బంది ఈ బృందానికి సహకరించారు. తరగతి గదులు, ఎగ్జిబిషన్ హాలు, ప్రస్తుతం నిర్వహిస్తున్న ల్యాబ్, పరికరాలు అన్నింటినీ పరిశీలించారు. ఈ బృందంలో వేలూరులోని నారాయణి వైద్య కళాశాల తరుపున వచ్చిన డాక్టర్లు శ్రీధర్, సతీష్, మహేష్ ఉన్నారు. అన్ని సంతృప్తిగా ఉన్నాయని, ఆ మేరకు నివేదిక పంపనున్నట్లు సమాచారం. త్వరలో రూ.6.2 కోట్లు మంజూరు కడప రిమ్స్‌లో మైక్రో బయాలజీ డిపార్టుమెంటు పరిధిలోని వైరాలజీ విభాగం రీసెర్చి ల్యాబ్‌కు ప్రభుత్వం రూ.6.2 కోట్లు మంజూరు చేయనుంది. ప్రాథమిక దశగా ఐసీఎంఆర్ బృందం విచ్చేసి పరిశీలించారు. ఈ సందర్బంగా రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ సిద్దప్ప గౌరవ్‌మాట్లాడుతూ మైక్రో బయాలజీలోని వైరాలజీ రీసెర్చి ల్యాబ్ త్వరలో కడప రిమ్స్‌కు అందుబాటులోకి రానుందన్నారు. బృందం నివేదిక మేరకు త్వరలోనే నిధులు వస్తాయన్నారు. కార్యక్రమంలో రిమ్స్ వైద్య బృందం పాల్గొన్నారు.