కాల్పులపై భారత్ ఆగ్రహం
* ఇరుదేశాల సైనికాధికారుల మధ్య హాట్‌లైన్ సంభాషణ
* త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి జైట్లీ సమావేశం
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ/శ్రీనగర్: సరిహద్దుల్లో పాక్ కాల్పుల ఉల్లంఘనలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. హాట్‌లైన్లో ప్రతీ మంగళవారం ఇరుదేశాల మిలిటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ జనరల్(డీజీఎంవో)ల మధ్య జరిగే చర్చల్లో ఈ సారి సరిహద్దుల్లో కాల్పుల అంశం ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుత పరిస్థితిని చర్చించి, ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఇరుదేశాల ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌లు క్షేత్రస్థాయిలో భేటీ కావాలని భారత డీజీఎంఓ లెఫ్ట్‌నెంట్ జనరల్ పీఆర్ కుమార్, పాక్ డీజీఎంఓ మేజర్ జనరల్ అమీర్ రియాజ్‌లు నిర్ణయించారు. ఇటీవలికాలంలో పాక్ నుంచి 95 సార్లు కాల్పుల ఉల్లంఘనలు జరగడంపై భారత డీజీఎంఓ నిరసన తెలిపారని సైనిక వర్గాలు తెలిపాయి. మరోవైపు త్రివిధ దళాల అధిపతులతో రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ సమావే శమయ్యారు.
పాక్ కవ్వింపు చర్యల నేపథ్యంలో నియంత్రణ రేఖ వద్ద తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే చైనా సరిహద్దుల్లో జరుగుతున్న నిర్మాణాల గురించి సైనికాధికారులు మంత్రికి వివరించారు. అటు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ రాహీల్ షరీఫ్ భేటీ అయ్యారు. దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంతో పాటు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులపై ఇరువురూ చర్చించారు. జాతి ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడినట్లు సమాచారం. కాగా, గత పక్షం రోజుల్లో తొలిసారిగా మంగళవారం సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. పాక్ వైపు నుంచి ఎలాంటి కాల్పులు చోటుచేసుకోలేదని సైనికాధికారులు తెలిపారు. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు తిరిగి తమ నివాసాలకు చేరుకుంటున్నారు.
1971 తరువాత ఇవే భారీ స్థాయి కాల్పులు
1971 యుద్ధం తర్వాత సరిహద్దుల్లో ఇంత భారీ స్థాయిలో ఎప్పుడూ కాల్పులు జరగలేదని బీఎస్‌ఎఫ్ చీఫ్ డీకే పాఠక్ వ్యాఖ్యానించారు. పాక్ కాల్పులకు తాము కూడా దీటుగా స్పందిస్తున్నామన్నారు. ఎల్‌ఓసీ, అంతర్జాతీయ సరిహద్దులో దాదాపు 25 చోట్ల మిలిటెంట్లు భారతభూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఇంటలిజెన్స్ సమాచారం తమవద్ద ఉందన్నారు. కాగా, జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైనిక దళాల చేతిలో మంగళవారం ఒక మిలిటెంట్ హతమయ్యాడు. ఇక భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి కూడా స్పందించింది. ఇరు దేశాలు చర్చల ద్వారా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సమితి ప్రధానకార్యదర్శి బాన్‌కీ మూన్ సూచించారు.