China Has 175 Territorial Disputes With Its Neighbours, On Land And Seas, More Details Inside - Sakshi
Sakshi News home page

తంపులమారి చైనా..15 దేశాలతో కయ్యం 

Published Tue, Jun 20 2023 5:24 AM | Last Updated on Tue, Jun 20 2023 9:04 AM

China has 175 territorial disputes with its neighbours, on land and seas - Sakshi

దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి:
 
చైనా పీపుల్స్‌ రిపబ్లిక్‌ దేశంగా ఏర్పడిన నాటి నుంచి సరిహద్దుల విషయంలో భారత్‌తో గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే ఉంది. రెండు దేశాల మధ్య ఉన్న 3,488 కిలోమీటర్ల సరిహద్దుకు సంబంధించి అనేక చోట్ల వివాదాలు సృష్టిస్తోంది. మన దేశంలో చైనాతో సరిహద్దు ఉన్న జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో అనేక భూభాగాలు తమవేనంటూ చైనా వాదిస్తోంది.

1950లో టిబెట్‌ను ఆక్రమించుకున్న చైనా అటుపిమ్మట భారత్‌లోని అనే భాగాలు టిబెట్‌కు చెందినవని, వాటిని తమకు అప్పగించాలని ఒత్తిడి చేస్తూనే ఉంది. 1962లో భారత్‌తో జరిపిన యుద్ధం ఫలితంగా ప్రస్తుత కేంద్ర పాలిత ప్రాంతం లద్ధాఖ్‌లోని భాగమైన 37,244 చదరపు కిలోమీటర్ల అక్సాయ్‌చిన్‌ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. అంతేకాదు జమ్మూకశీ్మర్‌ లోయలోని మరో 5,300 చదరపు కిలోమీటర్ల భూభాగం కూడా తమదేనంటూ ఘర్షణలకు దిగుతూనే ఉంది.

2020 మే నెలాఖరులో చైనా సైన్యం గల్వాన్‌ లోయ ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడినప్పుడు జరిగిన ఘర్షణలో ఇరువైపులా అనేకమంది సైనికులు మరణించారు. 1967లో సిక్కింలోని నాథులా, చోవా ప్రాంతాల్లో కూడా చైనా సైన్యం సరిహద్దుల వెంబడి అనేక చోట్ల భారత సైన్యంతో ఘర్షణలకు దిగింది. ఆ తరువాత కూడా చైనా ఘర్షణలకు పాల్పడుతూనే ఉంది. మరోవైపు అరుణాచల్‌ప్రదేశ్‌ తమ దేశ అంతర్భాగమని డ్రాగన్‌ దేశం వాదిస్తోంది.

మొదట్లో దాదాపు 90,000 చదరపు కిలోమీటర్లు.. అంటే మొత్తం అరుణాచల్‌ప్రదేశ్‌ తమదేనని అని వాదించిన చైనా ఇప్పుడు తొలుత 8,000 చదరపు కిలోమీటర్ల భూభాగంపై వివాదాన్ని పరిష్కరించుకుందామని భారత్‌తో బేరాలాడుతోంది.  ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాల పేర్లను చైనా భాష మాండరిన్‌లోకి మార్చేసింది. వీటిలో 8 పేర్లు పట్టణాలు, 2 పేర్లు నదులు, 5 పేర్లు పర్వతాలకు సంబంధించినవి ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌ను చైనా తన భూభాగమైన జంగ్‌నన్‌గా సంబోధిస్తోంది.
  
అర్థం లేని ఆధారాలు  
పొరుగు దేశాలతో నెలకొన్న వివాదాలకు చైనా ప్రత్యక్ష ఆధారాలు చూపడం లేదు. తన విస్తరణవాదానికి పూర్వకాలం నాటి రాజవంశçస్తుల పాలనా క్షేత్రాన్ని రుజువుగా చూపిస్తోంది. మధ్య యుగాలనాటి హన్, తంగ్, యువాన్, క్వింగ్‌ రాజవంశీకులు పరిపాలించిన ప్రాంతాలంటూ ఇతర దేశాలతో సరిహద్దుల విషయంలో జగడానికి దిగుతోంది. అందుకోసం ఆయా ప్రాంతాల పేర్లను పూర్వకాలంలో పేర్కొన్న పేర్లుగా మార్చేస్తోంది. అంతర్జాతీయంగా జరిగిన ఏ ఒక్క ఒప్పందాన్ని కూడా చైనా అంగీకరించడం లేదు. దక్షిణ చైనా సముద్ర జలాలపై, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలపై ఆధిపత్యం తమదేనంటూ తాను సృష్టించిన గీతల మ్యాప్‌లను చారిత్రక ఆధారాలుగా చూపుతోంది.

ఆరు మహాయుద్ధాలు!   
2020 నుంచి 2050 మధ్యకాలంలో ఆరు మహాయుద్ధాలు జరుగుతాయని చైనాకు చెందిన సోహు అనే పోర్టల్‌లో  గతంలో పేర్కొన్నట్లు యురేíÙన్‌ టైమ్స్‌ అనే ఆన్‌లైన్‌ పత్రిక వెల్లడించింది. దాని ప్రకారం 2025 నాటికి తైవాన్, 2030 నాటికి అన్ని దీవులను, 2040 నాటికి అరుణాచల్‌ప్రదేశ్‌ను, 2050 నాటికి జపాన్‌కు చెందిన దీవులను స్వా«దీనం చేసుకోవడానికి యుద్ధా్దలు జరుగుతాయని పోర్టల్‌ చెబుతోంది. తంపులమారి చైనా మాదిరిగానే భారతదేశం కూడా మౌర్య, చోళ వంశçస్తుల పరిపాలనా క్షేత్రాన్ని ఆధారంగా చూపితే అనేక దేశాలను అఖండ్‌ భారత్‌లో అంతర్భాగంగా చెప్పొచ్చు.  మౌర్య, చోళ వంశస్థుల పరిపాలనకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి.    

అందరితోనూ తగువే  
భారత్‌ మాత్రమే కాకుండా 15 దేశాలతో చైనాకు సరిహద్దు తగాదాలు కొనసాగుతున్నాయి. వీటిలో తైవాన్, ఫిలిప్పైన్స్, ఇండోనేíసియా, వియత్నాం, జపాన్, ద.కొరియా, కొరియా, సింగపూర్, బ్రూనై, నేపాల్, భూటాన్, లావోస్, మంగోలియా, మయన్మార్‌ తదితర దేశాలు ఉన్నాయి. దక్షిణ చైనా సముద్రం అంతా తమ ఏలుబడిలోనే ఉండాలంటూ అంతర్జాతీయ సమాజాన్ని డ్రాగన్‌ సవాలు చేస్తోంది.  

► తైవాన్‌ విషయంలో ఆ దేశమంతా తమకు చెందినదేనన్నది చైనా వాదన. అయితే, ప్రస్తుతానికి మెకలిస్‌ బ్యాంక్, చైనా ఆక్రమణలో ఉన్న దీవులు, సౌత్‌చైనా సముద్రంలో కొంత భూభాగం విషయంలో రెండు దేశాలు ఘర్షణ పడుతున్నాయి.    
► ఫిలిప్పైన్స్‌ విషయంలో కూడా స్కార్‌బరో కొండలు, మరికొన్ని దీవులపై చైనా వివాదం సృష్టించింది. వీటివిషయంలో ఫిలిప్పైన్స్‌తో తరచుగా ఘర్షణలకు పాల్పడుతోంది.   
► ఇండోనేసియాకు సంబంధించి నతునా దీవులు, సౌత్‌ చైనా సముద్రంలో కొంతభాగం తమదేనంటూ చైనా తగువులు సృష్టిస్తోంది.  
► వియత్నాం విషయానికి వస్తే అనేక భాగాలను తమకు అప్పగించాలని చైనా ఒత్తిడి పెంచుతోంది. పలు ద్వీపాలతోపాటు సముద్ర జలాల్లో ఆధిపత్యం కోసం కాలుదువ్వుతోంది. చైనా నౌకాదళం ఇటీవల వియత్నాంకు చెందిన చేపల వేట పడవను సముద్రంలో ముంచేసింది.  
► మలేíసియాతోనూ కొన్ని దీవులు, సముద్ర జల్లాల విషయంలో చైనా జగడం ఆడుతోంది. మలేíÙయా చమురు అన్వేషణ నౌకలను అడ్డుకుంటోంది. ఇటీవల అమెరికా, ఆ్రస్టేలియా యుద్దనౌకలు మలేíÙయాకు అండగా రావడంతో చైనా నౌకాదళం తోకముడిచి వెనక్కి వెళ్లిపోయింది.  
► జపాన్‌కు చెందిన రెండు ద్వీప సముదాయాలపై చైనా కన్నుపడింది. అవి సెన్కాకు దీవులు, ర్యూక్యు దీవులు. ఈ దీవుల్లో చమురు నిక్షేపాలు బయటపడినప్పటి నుంచి చైనా వీటి విషయంలో జపాన్‌తో తగువు పడుతోంది.  
► దక్షిణ చైనా సముద్రంలో కొంతమేరకు మునిగిపోయిన సొకొట్రా రాక్‌పై దక్షిణ కొరియాతో వివాదానికి దిగింది చైనా. ఈ రాక్‌ కొరియాకు 149 కిలోమీటర్ల దూరంలో ఉండగా, చైనాకు 287 కిలోమీటర్ల దూరంలో ఉంది.  
► దాదాపు 1,400 కిలోమీటర్ల సరిహద్దు ఉన్న ఉత్తర కొరియాతో సీ ఆఫ్‌ జపాన్‌ సముద్ర జలాల్లో హద్దుల అంశంపై చైనా వివాదం సృష్టించింది.  
► దక్షిణ చైనా సముద్ర జలాల విషయమై సింగపూర్‌తో చైనా తగువులాడుతోంది.  
► అతిచిన్న ఇస్లామిక్‌ దేశమైన బ్రూనైతో కూడా కొన్ని దీవులు, సముద్ర జలాలపై చైనా గొడవ పెట్టుకుంది.  
► తమ భూభాగంలో కొంత భాగాన్ని చైనా ఆక్రమించుకున్నట్లు నేపాల్‌ ప్రభుత్వం ఇటీవలే గుర్తించింది. పశి్చమ నేపాల్‌లోని హుమ్లా జిల్లాలో చైనా ఆక్రమణలకు పాల్పడింది.  
► దాదాపు 290 మైళ్లకుపైగా సరిహద్దు ఉన్న భూటాన్‌తో అనేక చోట్ల హద్దుల విషయంలో చైనా వివాదాలు సృష్టించింది. 1980 నుంచి వీటి విషయంలో రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి.  
► లావోస్‌లో అత్యధిక భాగం తమదేనని చైనా వాదిస్తోంది. అందుకు యువాన్‌ రాజవంశ పరిపాలనను రుజువుగా చూపిస్తోంది.  
► సరిహద్దు వివాదం కారణంగా తమ దేశంలోని ఓ చెక్‌పాయింట్‌పై దాడి జరిగిందని చైనా చెబుతోంది. ఈ ప్రాంతం విషయంలో మంగోలియాకు, చైనాలోని గాన్సు ప్రాంత ప్రజలకు మధ్య వివాదం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement