
బీజింగ్: చైనా- భారత్ సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని.. ఇరు దేశాలు చర్చలకే మొగ్గుచూపే అవకాశం ఉందని చైనా సోమవారం వెల్లడించింది. పరస్పర సంప్రదింపులతో సామరస్యపూర్వకంగా సమస్యకు పరిష్కార మార్గం కనుగొనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ మాట్లాడుతూ.. ‘‘మా సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే సరిహద్దు వివాదాల్లో ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరేవిధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయి. చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నాం’’ అని స్పష్టం చేశారు.(సరిహద్దుల్లో తొలగని ప్రతిష్టంభన)
కాగా చైనాతో శాంతియుత చర్చల ద్వారానే సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుంటామన్న భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించిన నేపథ్యంలో జావో ఈ పైవిధంగా బదులిచ్చారు. ఇక గత కొన్నిరోజులుగా తూర్పు లదాఖ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తూర్పు లదాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న తమ తమ స్థావరాలకు భారత్- చైనాలు భారీ సామగ్రి, ఆయుధ సంపత్తిని తరలిస్తున్నాయి. పాంగోంగ్ త్సో, గాల్వాన్ లోయ తదితర ప్రాంతాల్లో పూర్వపు పరిస్థితులు నెలకొనే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇరు దేశాలు స్పష్టం చేసిన క్రమంలో జావో వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.(కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు?)
Comments
Please login to add a commentAdd a comment