భారత్-చైనా సరిహద్దు వివాదంపై విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్‌లోని ఆసియా సొసైటీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌లో జై శంకర్ మాట్లాడుతూ.. 2020 నుంచి గాల్వాన్ వ్యాలీ వద్ద భారత్, చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొందని తెలిపారు. అక్కడ జరిగిన ఘర్షణలు భారత్-చైనా సంబంధాలను పూర్తిగా దెబ్బతీశాయని అన్నారు. అయితే చైనాతో సమస్య పరిష్కారానికి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.
తూర్పు లఢక్‌లో సైన్యం తొలగింపు విషయంలో భారత్-చైనా సరిహద్దు వివాద చర్చల్లో 75 శాతం పురోగతి సాధించినట్లు చెప్పారు.సరిహద్దులో హింస ఉండకూడదని, ఒకవేళ ఉద్రిక్త పరిస్థితులు ఉంటే ఇరుదేశాల సంబంధాలపై ప్రభావం చూపుతాయని అన్నారు. చైనాతో భారత్‌కు స్పష్టమైన ఒప్పందాలు ఉన్నప్పటికీ 2020లో బీజింగ్ అనేక మంది సైనికులను వాస్తవ నియంత్రణ రేఖకు తరలించిందని జైశంకర్ అన్నారు.
‘చైనాతో ఢిల్లీకి కష్టమైన చరిత్ర ఉంది. బీజింగ్‌తో మనకు స్పష్టమైన ఒప్పందాలు ఉన్నప్పటికీ, కోవిడ్ కాలంలో ఈ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా పెద్ద సంఖ్యలో బలగాలను ఎల్‌ఏసీ కి తరలించడాన్ని మనం చూశాం. దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జరిగింది కూడా. తద్వారా ఇరు దేశాలకు చెందిన అనేక మంది సైనికులు మరణించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి’ అని పేర్కొన్నారు.
కాగా ఈ నెల ప్రారంభంలో జైశంకర్ మాట్లాడుతూ.. చైనాతో సరిహద్దు చర్చల్లో భారత్ పురోగతి సాధించిందని, ఆ దేశ బలగాల ఉపసంహరణకు సంబంధించిన సమస్యలు దాదాపు 75 శాతం పరిష్కారం అయ్యాయని వెల్లడించారు. తూర్పు లడఖ్ సరిహద్దు వద్ద చైనా సైనికీకరణ పెరుగుతుండడం అతిపెద్ద సవాలుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
#WATCH | New York: During the Asia Society at the Asia Society Policy Institute, EAM Dr S Jaishankar says, "We have a difficult history with China... Despite the explicit agreements we had with China, we saw in the middle of covid that the Chinese moved large number of forces in… pic.twitter.com/vNyfWTZrJY
— ANI (@ANI) September 24, 2024
ఈ విషయాన్ని తాజాగా ప్రస్తావిస్తూ.. చైనాతో సరిహద్దు విషయంలో 75 శాతం పరిష్కరించిందని తాను చెప్పింది కేవలం బలగాల ఉపసంహరణ మాత్రమేనని తెలిపారు.. అయితే పెట్రోలింగ్ సమస్యలు కొన్ని పరిష్కరించాల్సి ఉందని,. తదుపరి చర్చల్లో వీటిని ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నారు.
ఆసియా భవిష్యత్తుకు భారత్-చైనా సంబంధాలు కీలకమని భావిస్తున్నట్లు జైశంకర్ వెల్లడించారు. ఇది కేవలం ఖండంలోనే కాకుండా యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. రెండు దేశాల సమాంతర పెరుగుదల నేటి ప్రపంచ రాజకీయాల్లో చాలా పెద్ద సమస్యగా ఉందని పేర్కొన్నారు. ఆసియా, ప్రపంచాన్ని బహుళ ధృవంగా మార్చడానికి భారతదేశం- చైనా మధ్య సంబంధాలే కీలకమని నొక్కి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment