
న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్‌లోని పాన్‌గాంగ్ త్సో నుంచి చైనా సైనికులు పూర్తిగా వెనక్కి మళ్లాల్సిందేనని భారత్ తేల్చిచెప్పింది. మరో రెండు వివాదాస్పద ప్రాంతాల్లో తిష్టవేసిన చైనా బలగాలు సైతం వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేసింది. ఆదివారం వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)వద్ద చైనా భూభాగం వైపు భారత్–చైనా సీనియర్ సైనిక కమాండర్ల మధ్య 11 గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఇవి ఐదో దఫా చర్చలు. సాధ్యమైనంత త్వరగా చైనా సైనికులు వెనక్కి తగ్గితేనే సరిహద్దుల్లో శాంతి సాధ్యమని భారత అధికారులు స్పష్టం చేశారు.
మే 5వ తేదీ ముందు నాటి పరిస్థితిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చర్చల్లో భారత్ తరపు బృందానికి లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించారు. సైనిక, దౌత్యపరమైన చర్చలు జరుగుతుండగా, తూర్పు లద్ధాఖ్‌లోని కీలక ప్రాంతాల్లో భారత సైన్యం మోహరించింది. రానున్న శీతాకాలంలో చైనా నుంచి కవ్వింపు చర్యలు తప్పకపోవచ్చని అంచ నా వేస్తున్నారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలకు ఇప్పట్లో పరిష్కార మార్గాలు సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తూర్పు లద్ధాఖ్‌లో సైన్యాన్ని కొనసాగించడమే మేలని భారత సైనిక అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment