china soldiers
-
చైనాను నమ్మలేం... అప్రమత్తతే రక్ష!
2020 జూన్ 15, 16 తేదీలలో జరిగిన గాల్వాన్ ఘర్షణ 21వ శతాబ్దంలో భారత్–చైనా సంబంధాలలో మూలమలుపు లాంటిది. ఈ ఘటనతో భారత్ చేదు పాఠం నేర్చుకుంది. ఈ సున్నితమైన సరిహద్దు పోస్ట్‌లలో పెట్రోలింగ్‌కు ఎక్కువ మంది సిబ్బందిని నియమించింది. ఇప్పుడు సరిహద్దులో ఐదు పాయింట్ల వద్ద ఇరు సైనికుల ఉనికి లేదు. ఈ ప్రదేశాలలో సైనికరహిత బఫర్ జోన్లను ఏర్పాటు చేశారు. కానీ ఈ బఫర్ జోన్లు సరికొత్త వివాదానికి తెర తీశాయి. ఇలా బఫర్ జోన్లకు అంగీకరించడమంటే భారత్ తన భూభాగాన్ని కోల్పోవడమే తప్ప మరొకటి కాదని భారత వ్యూహాత్మక సంస్థ పేర్కొనడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో రెండు దేశాలూ సరిహద్దుల సమీపంలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చుకోవటం ఆందోళనకరం. భారతదేశం, అమెరికా, చైనా అంతర్జాతీయ యవనికపై మూడు ముఖ్యమైన పాత్ర ధారులు. వీటి ఆసక్తులు పరస్పరం లోతుగా పొందుపర్చుకుని ఉన్నాయి. ఈ వాస్తవం క్రమానుగత వ్యవధిలో ఇతరులతో పోలిస్తే వారి ఎంపికలను తూకం వేసి చూసుకునేలా వారిని బలవంతం చేస్తోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా ఎదుగుదలకు చెక్ పెట్టేందుకు అమెరికా ఆసక్తితో ఉంది. కాగా, భారతదేశం చైనాతో 4000 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును, దాంతోపాటు 61 ఏళ్ల సరిహద్దు వివాదాన్ని పంచుకుంటోంది. ఇక చైనా విషయానికి వస్తే 2049 నాటికి నంబర్ వన్ అగ్రరాజ్యం కావాలని కోరుకుంటోంది. అది జననేత మావో సేటుంగ్ నేతృత్వంలో చైనాలో కమ్యూనిస్టు విప్లవం విజయం పొందిన శతాబ్ది సంవత్సరం మరి. ఆసియాలో చైనాకు ప్రత్యక్ష పొరుగు దేశమైన భారతదేశం, చైనా ప్రాదేశిక ఆకాంక్షల గురించి ఎల్లప్పుడూ ఆందోళన చెందుతూ ఉంది. ఇన్ని దశల చర్చలు జరిగినా నేటికీ భారత్–చైనా సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. మూడేళ్ల క్రితం గాల్వాన్ ప్రాంతంలో చైనాతో భారత్‌కు తీవ్ర వైరం ఏర్పడింది. ఇటీవల 2023 జూన్‌లో గాల్వాన్ ప్రతిష్టంభన మూడవ వార్షికోత్సవం సందర్భంగా, చాలామంది పండితులు, మాజీ దౌత్యవేత్తలు... దురాశాపూరిత చైనా పట్ల ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 1950ల నాటి నుండి భారత్ – చైనా సరిహద్దు వివాదం ప్రజర్విల్లుతోంది. ‘హిందీ–చినీ భాయ్ భాయ్’ అని భారత ప్రజలు నినదిస్తున్న వేళ, భారత భూభాగాల్లోకి చైనా సైనికులు కవాతు చేస్తున్నప్పుడు మనదేశం అకస్మాత్తుగా మేల్కొంది. భారత సైన్యం చవిచూసిన ఘోర పరాభవం ఇది. అప్పటి నుండి సరిహద్దు వివా దాన్ని పరిష్కరించడానికి లెక్కలేనన్ని ప్రయత్నాలు, చర్చలు జరి గాయి. కానీ ఫలించలేదు. ఇక 2020 జూన్ దగ్గరకు వద్దాం. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఉన్న గాల్వాన్ లోయలో చైనా సైన్యం చేతిలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. చైనా సేనలను తమ ట్రాక్‌లో నిలిపివేసి నప్పటికీ, వారు యథాతథ స్థితితో సంతోషంగా లేరనీ, తమకు అనుకూలమైన మార్పు కోసం ఆసక్తిగా ఉన్నారనీ చైనా వైపు నుండి సందేశం స్పష్టంగా కనబడుతోంది. 2020లో అవకాశాన్ని కోల్పోయి నప్పటికీ, వారు తమ ప్రణాళికను కచ్చితంగా వదులుకున్నారని దీని అర్థం కాదు. సరిహద్దు సమస్యను చైనా ఎప్పటికప్పుడు లేవనెత్తుతోంది. 2022 డిసెంబర్ లో, చైనా తవాంగ్‌లో ఒక ఫార్వర్డ్ పోస్ట్‌ను ప్రారంభించింది. కానీ ఈ ప్రయత్నాన్ని కూడా భారతీయ సైనికులు అడ్డుకున్నారు. 2020 జూన్ 15, 16 తేదీలలో జరిగిన గాల్వాన్ ఘర్షణ 21వ శతాబ్దంలో భారత్–చైనా సంబంధాలను మూలమలుపు తిప్పిన ఘటన. నిజానికి ఇరు దేశాల సైనికులు పరస్పరం ఘర్షణ పడడం ఇదే తొలిసారి. 1975 అక్టోబరులో చివరగా వాస్తవిక ఘర్షణ జరిగింది. ఆయుధాల వినియోగ నిషేధ ఒప్పందం ఒకటి భారత్, చైనాల మధ్య ఉంది. గాల్వాన్‌లో చైనా సైనికులు మేకులున్న కర్రలను ఉపయోగించారు. భారతీయులు ఫైబర్‌గ్లాస్ లాఠీలతో ప్రతిస్పందించారు. కొన్ని సందర్భాల్లో రాళ్లను కూడా ఉపయోగించారు. భారతీయుల కంటే చైనీయులు ఎక్కువ మంది సైనికులను కోల్పోయారని కొన్ని స్వతంత్ర నివేదికలు నొక్కి చెప్పాయి. ఈ ఘటనతో భారత్ చేదు పాఠం నేర్చుకుంది. ఈ సున్నితమైన పోస్ట్‌లలో పెట్రోలింగ్‌కు ఎక్కువ మంది సిబ్బందిని నియమించింది కూడా! ఇప్పుడు ఐదు పాయింట్ల వద్ద ఇరు సైనికుల ఉనికి లేదు. ఈ ప్రదేశాలలో సైనికరహిత బఫర్ జోన్లు ఏర్పాటయ్యాయి. కానీ ఈ బఫర్ జోన్లు కొత్త వివాదాస్పద అంశంగా మారాయి. వీటి ఏర్పాటుకు ఒప్పుకోవడం అంటే భారత్ తన భూభాగాన్ని కోల్పోవడమే తప్ప మరొకటి కాదని భారత వ్యూహాత్మక సంస్థ పేర్కొనడం ఇక్కడ గమనార్హం. ఇది చాలదన్నట్లు సైనికులనూ, సైనిక సామగ్రినీ సులభంగా తరలించడానికి చైనా తన వైపు రెండు వంతెనలను కలిగి ఉన్న ప్రాంతంలో మౌలిక సదుపాయాలను నిర్మించడంలో బిజీగా ఉంది. భారత దేశం కూడా రోడ్లు, వంతెనలు, సొరంగాలు, హెలిప్యాడ్లు వంటివి ఉన్న తన భూభాగం వైపున మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తోంది. ఏదేమైనప్పటికీ, ఇది ఈ ప్రాంతంలో శాంతికి శుభ సూచన కాదు. ఇంత ఘర్షణపూరిత వాతావరణం ఉన్నప్పటికీ, చైనా–భారత్‌ల మధ్య వాణిజ్యం వృద్ధి చెందుతోంది. భారతదేశం హిమాలయ పొరుగు దేశం నుండి ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. భారత – చైనా బంధం విషయంలో ఎల్లప్పుడూ నిరంతర పరిశీలన అవసర మని భారత నాయకులు గమనించాలి. చైనా తన వ్యూహాత్మక ప్రయోజనాలకు, దీర్ఘకాలిక ఆకాంక్షలకు సరిపోయే దానికంటే తక్కువగా దేనితోనూ సమాధానపడదని గుర్తుంచుకోవాలి. 21వ శతాబ్దంలో, అమెరికా కూడా చైనా ఎదుగుదల, దాని ఆకాంక్షల గురించి ఆందోళన చెందుతోంది. పైగా చైనాను సవాలు చేయడానికి భారతదేశాన్ని తన విలువైన భాగస్వామిగా చూస్తోంది. అందుకే ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీకి అమెరికా ఎర్ర తివాచీ పరిచింది. జపాన్ లాగా, ఇప్పుడు భారత దేశం... అమెరికా వ్యూహాత్మక చింతనలో ముఖ్యమైన స్థానాన్ని పొందింది. ఒబామా వైట్‌హౌస్‌లో ఉన్న రోజుల నుండి, యూఎస్ –ఇండియా సంబంధాల సంగతి ‘21వ శతాబ్దాన్ని నిర్వచించే సంబంధాల’లో ఒకటిగా అమెరికా మాట్లాడుతోంది. 2023 జూన్ మొదటి వారంలో, అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన 2016 నుండి అమెరికా ‘ప్రధాన రక్షణ భాగస్వామి’గా ఉంటున్న భారతదేశం గురించి మాట్లాడారు. ‘క్వాడ్’ సభ్యులందరిలో, చైనాతో భారీ భూ–సరిహద్దు కలిగి ఉన్న ఏకైక దేశం భారతదేశం మాత్రమే అని అమెరికా ప్రభుత్వ యంత్రాంగానికి బాగా తెలుసు. 2023 జూన్ మొదటి వారంలో దాని 20వ ఎడిషన్‌ను ముగించిన వార్షిక ‘షాంగ్రి–లా డైలాగ్ ’... ఆసియాలో మారుతున్న ఈ ధోరణులను గుర్తించింది. అయితే భారతదేశం ఈ ప్రాంతంలో యూఎస్ క్లయింట్ స్టేట్‌గా ఉండలేదు. లేదా దిగ్గజ చైనాపై ఒక స్థాయికి మించి భారత్ ఆగ్రహం ప్రదర్శించలేదు. దూకుడుకు, అతివాగుడుకు చోటు లేని ఉన్నత స్థాయి దౌత్య నైపుణ్యం దీనికి అవసరం. చైనాతో సంబంధాలు భారతదేశంలో అంతర్–పార్టీ స్పర్థ కోణాన్ని జోడించాయి. 1962 అక్టోబరులో చైనా భారతదేశంపై దాడి చేసినప్పుడు, బీజేపీని అసహ్యించుకునే పండిట్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలో ఉండేది. కాబట్టి నెహ్రూను ఢీకొట్టే ఒక్క అవకాశాన్ని కూడా కాషాయ పార్టీ వదులుకోదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంటూండగా, బీజేపీ అధికారంలో ఉంది. ఈ 2023 జూన్ 20వ తేదీ సోమవారం, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనాతో సరిహద్దు పరిస్థితిపై కాంగ్రెస్ శ్వేతపత్రాన్ని డిమాండ్ చేయడంలో ఆశ్చర్యం లేదు. 2020 జూన్ 19 నాటి అఖిలపక్ష సమావేశంలో ‘ఎవరూ మన సరిహద్దులోకి ప్రవేశించలేదు లేదా ఏ సరిహద్దు ప్రాంతం కూడా ఇతరుల అధీనంలో లేదు’ అని మోదీ చేసిన వ్యాఖ్యలను తరచుగా ప్రస్తావించడం ద్వారా ప్రధానిని మరింత ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. అవన్నీ పక్కన పెడితే, చైనాను నిరంతరం పరిశీలిస్తూండటం మనకు ఎంతో అవసరం. భారత్ అప్రమత్తంగా మెలుగుతూ ఉండాలి. అవినాష్ కోల్హే వ్యాసకర్త రిటైర్డ్ ప్రొఫెసర్, ముంబయ్ -
భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ.. ఇరు వర్గాలకు గాయాలు!
ఈటానగర్: సరిహద్దులో భారత్-చైనా బలగాల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖ వద్ద ఇరు వర్గాలు బాహాబాహీకి దిగినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 9న జరిగిన ఈ ఘటనలో రెండు దేశాల సైనికులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఘర్షణ అనంతరం భారత్-చైనా బలగాలు ఆ ప్రాంతం నుంచి వెనుదిరిగినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే చైనా సైనికులే వాస్తవాధీన రేఖను చేరుకోవడంతో భారత బలగాలు ప్రతిఘటించినట్లు సమాచారం. దాదాపు 300 మంది చైనా సైనికులు 17,000 అడుగుల ఎత్తులోని భారత పోస్టును తమ అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. మన సైనికులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరు వర్గాలు గొడవపడ్డాయి. ఈ ఘర్షణలో ఆరుగురు భారత సైనికులకు గాయలవ్వగా.. వారిని చికిత్స నిమిత్తం గువహటి ఆస్పత్రికి తరలించినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో భారత సైనికుల కంటే చైనా సైనికులే ఎక్కువ సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. 2020 జూన్ 15న జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రాంతం గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ హింసాత్మక ఘటనలో ఇరు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అనేక మార్లు చర్చల అనంతరం సరిహద్దులో బలగాల ఉపసంహరణ జరిగింది. ఇప్పుడు మళ్లీ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా మరోమారు కయ్యానికి కాలు దువ్వుతోంది. చదవండి: త్వరలో రూ.2,000 నోట్లు రద్దు! బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు.. -
లద్దాఖ్‌లోకి చొరబడిన చైనీయులు..
న్యూఢిల్లీ: లద్దాఖ్‌లోని డెమ్‌చుక్ ప్రాంతంలోకి కొందరు చైనా సైనికులు, పౌరులు చొరబడ్డారు. సింధు నది అవతలి వైపు ఉన్న ఈ ప్రాంతంలో చైనా జాతీయ పతాకం, పలు బ్యానర్లు పట్టుకొని చైనీయులు కనిపించారు. అక్కడి భారతీయ గ్రామాల్లోని ప్రజలు దలైలామా పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడాన్ని నిరసిస్తూ వాళ్లు ఇలా చేశారు. ఈ ఘటన ఈ నెల 6వ తేదీన జరిగింది. వీళ్లంతా ఐదు వాహనాల్లో వచ్చి గ్రామంలోని కమ్యూనిటీ సెంటర్ దగ్గర ఇలా నిరసన తెలిపారు. ఇదిలా ఉంటే, గత వారం ప్రధాని మోదీ దలైలామాకు 86వ పుట్టిన రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 2014లో మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దలైలామాతో మాట్లాడినట్లు అంగీకరించడం ఇదే తొలిసారి. కాగా, చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ 100వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపని భారత ప్రభుత్వం.. దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపడం చైనాకు మింగుడుపడడం లేదు. 2019లో మోదీ రెండోసారి గద్దెనెక్కిన తర్వాత కూడా దలైలామా పుట్టిన రోజుని అంశంగా తీసుకుని చైనీయులు ఇలానే నిరసన తెలిపారు. -
ఎల్ఏసీ వద్ద పాకిస్తాన్ సైనికులు!
న్యూఢిల్లీ/లేహ్: భారత్–చైనా సరిహద్దు అయిన వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనా సైన్యంతోపాటు దాని సన్నిహిత మిత్ర దేశం పాకిస్తాన్ సైనికులు కూడా తిష్ట వేశారా? చైనాకు మద్దతుగా వారు కూడా పహారా కాస్తున్నారా? చైనా జర్నలిస్టు షెన్ షెవీ శనివారం షేర్ చేసిన ఓ వీడియోను గమనిస్తే ఇది నిజమేనని స్పష్టమవుతోంది. 52 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో చైనా సైనికులతోపాటు గుబురు గడ్డంతో ఉన్న మరో సిపాయి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాడు. అతడి రూపురేఖలు, ఎత్తు, దేహ దారుఢ్యం వంటివి చైనా పౌరుల కంటే పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎల్ఏసీ వద్ద చైనాకు సాయంగా పాకిస్తాన్ సైన్యం సైతం రంగంలోకి దిగిందని పలువురు భావిస్తున్నారు. అలాగే పాకిస్తాన్ సైనికులకు చైనా శిక్షణ ఇస్తోందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సరిహద్దులో భారత్–చైనా సైనికుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 12న భారత్–చైనా ఆర్మీ ఏడో రౌండ్ చర్చలు న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించుకునే దిశగా భారత్–చైనా ఆర్మీ ఏడో దఫా చర్చలు ఈ నెల 12వ తేదీన జరగనున్నాయి.తూర్పు లద్దాఖ్‌లోని ఉద్రిక్త ప్రాంతాల నుంచి ఇరు దేశాలు సైన్యాలను ఉపసంహరించుకునే కచ్చితమైన రోడ్ మ్యాప్ రూపొందించడమే ఈ సమావేశం ఎజెండా అని విశ్వసనీయ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 21వ తేదీన జరిగిన చర్చల్లో సరిహద్దుల్లోకి మరిన్ని అదనపు బలగాలను పంపించరాదనే నిర్ణయంతోపాటు పలు కీలక అంశాల్లో ఏకాభిప్రాయం సాధించారు. సైన్యం, వైమానిక దళం ఉమ్మడి కార్యాచరణ తూర్పు లద్దాఖ్‌లో చైనా సైన్యం దూకుడును అడ్డుకోవాలని భారత సైన్యం నిర్ణయించింది. వైమానిక దళంతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని భావి స్తోంది. సరిహద్దులో చెలరేగిపోతున్న చైనా సైనికులకు తగిన గుణపాఠం నేర్పడానికి భారత సైన్యం, వైమానిక దళం సన్నద్ధమ వుతున్నాయి. త్రివిధ దళాలను ఎప్పటి కప్పుడు సమన్వయ పరుస్తూ ముందుకు నడిపించడానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సూచనలతోనే సైన్యం, వైమానిక దళం కలిసి పని చేయనున్నాయి. లేహ్ ఎయిర్ ఫీల్డ్‌లో ఇప్పటికే వైమానిక దళం యుద్ధ విమానాలను మోహరించింది. వాస్తవా« దీన రేఖ(ఎల్ఏసీ) వద్ద పరిస్థితి మరింత దిగజారితే వెంటనే ఉమ్మడిగా కొన్ని ఆపరేషన్లు చేపట్టడానికి సైన్యం, వైమానిక దళం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
మళ్లీ చైనా కాల్పులు
న్యూఢిల్లీ/జమ్మూ: భారత సైనికులను బెదిరించే ఉద్దేశంతో ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర తీరం వద్ద చైనా సైనికులు గతవారం మరోసారి గాలిలో కాల్పులు జరిపారు. భారత్, చైనా దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యిల మధ్య రష్యా రాజధాని మాస్కోలో చర్చలు జరగడానికి ముందు ఫింగర్ 4 రిడ్జ్‌లైన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వ్యూహాత్మకంగా కీలకమైన ఆ ప్రాంతంలో ఉన్న భారత జవాన్ల వైపు భారీ సంఖ్యలో చైనా సైనికులు దూకుడుగా వచ్చారని, అయితే, భారత జవాన్లు దీటుగా ఎదుర్కోవడంతో వెనక్కు వెళ్లారని వివరించాయి. వెనక్కు వెళ్తూ.. భారత సైనికులను బెదిరించేందుకు గాలిలో 100 నుంచి 200 రౌండ్లు కాల్పులు జరిపారని వెల్లడించాయి. 45 ఏళ్ల తరువాత తొలిసారి సెప్టెంబర్ 7న తూర్పు లద్దాఖ్‌లోని చైనా సరిహద్దుల్లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని రెజాంగ్ లా రిడ్జ్‌లైన్ వద్ద ఉన్న భారత జవాన్లను బెదిరించే లక్ష్యంతో చైనా సైనికులు గాలిలో పలు రౌండ్లు కాల్పులు జరిపారు. మనవాళ్లే మెరుగు తూర్పు లద్దాఖ్‌లో ప్రతికూల వాతావరణం ఉండే చలి కాలంలో కూడా.. చైనాతో పూర్తి స్థాయి యుద్ధానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ రిటైర్డ్ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. యుద్ధం తప్పని పరిస్థితులనే చైనా కల్పిస్తే.. సుశిక్షితులైన, సంసిద్ధంగా ఉన్న, మానసికంగా ధృఢంగా ఉన్న భారత బలగాలను వారు ఎదుర్కోవాల్సి ఉంటుందని బ్రిగేడియర్(రిటైర్డ్) హేమంత్ మహాజన్ హెచ్చరించారు. మానసికంగా, శారీరకంగా చైనా సైనికుల కన్నా.. భారత జవాన్లు దృఢమైనవారన్నారు. చైనా సైనికులు ప్రధానంగా పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన సున్నితమైన వారని, విధుల్లో భాగంగా సంక్లిష్ట క్షేత్ర పరిస్థితుల్లో ఎక్కువకాలం ఉన్నవారు కాదని వివరించారు. మొదట బుధవారం ఉదయం ఈ ప్రకటన భారత సైన్యం నార్తర్న్ కమాండ్ ప్రజా సంబంధాల అధికారి(పీఆర్ఓ) నుంచి మీడియాకు వచ్చింది. కానీ, ఆ తరువాత ఆ ప్రకటనలోని అంశాలు నార్తర్న్ కమాండ్ లేదా ఇండియన్ ఆర్మీ అభిప్రాయాలు కావని ఆ పీఆర్ఓ వివరణ ఇచ్చారు. ఈ వివరాలన్నీ పదవీ విరమణ చేసిన బ్రిగేడియర్ హేమంత్ మహాజన్‌వని వివరించారు. శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉన్నాం భారత్ సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉన్నామని చైనా ప్రకటించింది. భారత్‌తో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో తమ దేశ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో చేసిన ప్రకటనపై స్పందించాలన్న మీడియా ప్రశ్నకు.. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బుధవారం పై విధంగా స్పందించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తాము కారణంకాదని చైనా తెలిపింది. దీర్ఘకాల మోహరింపునకు సిద్ధం బ్రిగేడియర్(రిటైర్డ్) హేమంత్ మహాజన్ వాదన ప్రకారం.. సరిహద్దుల్లో దీర్ఘకాలం మోహరించేందుకు భారత దళాలు సిద్ధమై ఉన్నాయి. లద్దాఖ్ అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలున్న ప్రాంతం. ఇక్కడ నవంబర్ తరువాత 40 అడుగుల వరకు మంచు పేరుకుపోయే పరిస్థితి ఉంటుంది. మైనస్ 30 నుంచి మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఇక్కడ సర్వసాధారణం. దానికి తోడు చలిగాలులు పరిస్థితిని మరింత దిగజారుస్తాయి. రోడ్లను మంచు కమ్మేస్తుంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ.. భారత్‌కు ఉన్న సానుకూల అంశం సుశిక్షితులైన మన సైనికులే. చలి కాలంలో యుద్ధం సాగించేందుకు అవసరమైన అనుభవం మన సైనికులకు ఉంది. స్వల్ప వ్యవధిలోనే రంగంలోకి దిగగల మనోస్థైర్యం కూడా మనవారికి ఉంది. చైనా సరిహద్దుల కన్నా దారుణమైన వాతావరణ పరిస్థితులు ఉండే సియాచిన్‌లో నెలల తరబడి ఉన్న అనుభవం మన సైనికులకు ఉంది. లద్దాఖ్‌కు చేరుకునేందుకు ఇప్పటివరకు రెండు మార్గాలు ఉన్నాయి. తాజాగా ‘దార్చా టు లేహ్’ మార్గం అందుబాటులోకి రావడంతో యుద్ధ, సహాయక సామగ్రి తరలింపు మరింత సులభమైంది.పెద్ద సంఖ్యలో ఎయిర్‌బేస్‌లు ఉండటం భారత్‌కు కలసివచ్చే అంశం. -
పూర్తిగా వెనక్కి మళ్లాల్సిందే
న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్లోని పాన్‌గాంగ్ త్సో నుంచి చైనా సైనికులు పూర్తిగా వెనక్కి మళ్లాల్సిందేనని భారత్ తేల్చిచెప్పింది. మరో రెండు వివాదాస్పద ప్రాంతాల్లో తిష్టవేసిన చైనా బలగాలు సైతం వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేసింది. ఆదివారం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)వద్ద చైనా భూభాగం వైపు భారత్–చైనా సీనియర్ సైనిక కమాండర్ల మధ్య 11 గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఇవి ఐదో దఫా చర్చలు. సాధ్యమైనంత త్వరగా చైనా సైనికులు వెనక్కి తగ్గితేనే సరిహద్దుల్లో శాంతి సాధ్యమని భారత అధికారులు స్పష్టం చేశారు. మే 5వ తేదీ ముందు నాటి పరిస్థితిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చర్చల్లో భారత్ తరపు బృందానికి లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించారు. సైనిక, దౌత్యపరమైన చర్చలు జరుగుతుండగా, తూర్పు లద్ధాఖ్లోని కీలక ప్రాంతాల్లో భారత సైన్యం మోహరించింది. రానున్న శీతాకాలంలో చైనా నుంచి కవ్వింపు చర్యలు తప్పకపోవచ్చని అంచ నా వేస్తున్నారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలకు ఇప్పట్లో పరిష్కార మార్గాలు సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తూర్పు లద్ధాఖ్‌లో సైన్యాన్ని కొనసాగించడమే మేలని భారత సైనిక అధికారులు చెబుతున్నారు. -
తెరపైకి మరో ఘర్షణ వీడియో
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకునే దిశగా భారత్, చైనాల మధ్య దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగుతున్న సమయంలోనే.. సరిహద్దుల్లో భారత, చైనా సైనికుల ఘర్షణకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. మంచు కొండల నేపథ్యంలో భారత సైనికులు చైనా జవాన్లను వెనక్కు నెడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. అయితే, ఆ వీడియో ఏ రోజు తీసిందనే వివరాలు అందులో లేవు. భారత సైనికుల బృందం చైనా ఆర్మీ అధికారులు, జవాన్లు ఉన్న మరో బృందంతో ఘర్షణ పడుతూ, వారిని వెనక్కు నెట్టివేస్తూ ఉన్న దృశ్యాలు అందులో ఉన్నాయి. అలాగే, వెనక్కు వెళ్లిపోవాలంటూ చైనా జవాన్లను భారత సైనికులు గట్టిగా చెబుతున్న మాటలు కూడా వినిపించాయి. ఆ తరువాత వారు బాహాబాహీకి దిగినట్లుగా కనిపించింది. భారత సైనికుల మాటను వినకుండా, చైనా జవాన్లు అక్కడే ఉండటం, పైగా, భారత సైనికులపై వారు దాడి చేయడం 5.30 నిమిషాలున్న ఆ వీడియోలో కనిపించింది. ఆ వీడియో దృశ్యాల్లో డేట్, టైమ్ లేవు కానీ, సైనికులు మాస్క్‌లు ధరించి ఉండటం కనిపించింది. దాన్నిబట్టి ఆ వీడియో కరోనా ముప్పు ప్రారంభమైన తరువాత తీసిన వీడియోగానే భావించవచ్చు. అక్కడి భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే.. ఆ ఘటన సిక్కింలో జరిగి ఉండొచ్చని ఆర్మీ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. అక్కడ కూడా మే తొలి వారం నుంచి ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మే 9న సిక్కింలోని నకూ లా ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ అయి ఉండవచ్చనుకుంటున్నారు. ये सही था सर पहले पटक के चीनियों को बलभर कचर दिए फिर बोले Don't fight... don't fight 😂 https://t.co/sDoSZVjqI3 — Abhinav Pandey (@AbhinavABP) June 22, 2020 -
చైనా సైనిక మరణాలపై అంతా గందరగోళం
సాక్షి, న్యూఢిల్లీ : చైనా, భారత దేశాల వాస్తవాధీన రేఖ వద్ద జూన్ 15వ తేదీన ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన సంఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించారని భారత సైనిక వర్గాలు, ప్రభుత్వం ధ్రువీకరించింది. చైనా వైపు ఎంత మంది మరణించారన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఘర్షణలో ఐదుగురు చైనా సైనికులు మరణించారని, 11 మంది సైనికులు గాయపడ్డారంటూ తొలుత కొన్ని మీడియా సంస్థలు, కొందరు జర్నలిస్టులు వార్తలను ప్రసారం చేశారు. ఆ సంఖ్యను ఎవరూ ధ్రువీకరించలేదు. ఆ తర్వాత 43 మంది చైనా సైనికులు మరణించారంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రకటించాయి. భారత ప్రభుత్వం కూడా ఆ సంఖ్యనే చెబుతూ వస్తోంది. చైనా ప్రభుత్వంగానీ, సైనిక వర్గాలుగా ఎంత మంది మర ణించారన్న విషయాన్ని ఇంతవరకు చూచాయిగా కూడా వెల్లడించలేదు. ‘టైమ్స్ నౌ’ టెలివిజన్ ఛానల్ జూన్ 17వ తేదీన ‘బ్రేకింగ్ న్యూస్’ పేరిట ‘30 మంది తమ సైనికులు మరణించారన్న విషయన్ని చైనా అంగీకరించింది, ఇదిగో వారి జాబితా’ అంటూ పేర్లను చదివింది. ‘చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్’ కథనం ప్రకారం అంటూ టైమ్స్ నౌ టీవీ యాంకర్లు రాహుల్ శివశంకర్, నావికా కుమార్‌లు 30 పేర్లను చదివారు. ఎందుకైన మంచిదనుకున్నారేమో! ‘గ్లోబల్ టైమ్స్ వెల్లడించిన జాబితా కూడా నకిలీది కావొచ్చు’ అంటూ రాహుల్ శివశంకర్ ఓ నొక్కు నొక్కారు. 30 మంది మరణించరంటూ మొదట ట్వీట్లు చేసిన టైమ్స్ నౌ ఆ తర్వాత వాటిని తొలగించింది. (చైనా చెర నుంచి సైనికులు విడుదల..!) చైనా సరిహద్దు వ్యవహారాలను పర్యవేక్షించే ‘వెస్టర్న్ థియేటర్ కమాండ్’ అధికార ప్రతినిధి కథనం ప్రకారం 30 మంది చైనా సైనికులు మరణించరంటూ ఫేస్బుక్, ట్విటర్లో కూడా 30 పేర్లు విరివిగా వైరల్ అయ్యాయి. ఆ పేర్లు, టైమ్స్ నౌ వెల్లడించిన పేర్ల జాబితా ఒకటే. వాస్తవానికి చైనాకు చెందిన గ్లోబల్స్ టైమ్స్, వెబ్సైట్స్లోగానీ, ట్విటర్లోగానీ చైనాకు చెందిన మృతుల గురించి ఎలాంటి వార్తను ప్రచురించలేదు. ఈ విషయాన్ని నకిలీ వార్తలను వెతికి పట్టుకొనే ‘ఆల్ట్ న్యూస్’ కూడా ధ్రువీకరించింది. గతంలో కూడా చైనా గ్లోబల్ టైమ్స్ పేరిట పలు నకిలీ వార్తలు ప్రసారమైనట్లు వెల్లడించింది. (బయటపడ్డ చైనా కుట్ర.. తాజా ఫొటోలు!) -
ఉపాధి హామీ పథకాన్ని అడ్డుకున్న చైనా
న్యూఢిల్లీ: భారత్-చైనాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనల మధ్య భారతీయ వాయుసేన గురువారం లడఖ్ లో సీ-17 గ్లోబ్ మాస్టర్ విమానాన్ని ల్యాండ్ చేసింది. ఎంఎన్ఆర్ఈజీఏ పథకం కింద జరుగుతున్న పనులను లడఖ్ లో చైనా జవానులు అడ్డుకున్న మరుసటి రోజు ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ల్యాండ్ చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చిన చైనా జవానులు పనులు నిలిపివేయాలంటూ వర్కర్లపై అరిచినట్లు ఓ వార్త సంస్ధ ప్రచురించింది. దీంతో రంగంలోకి దిగిన 70 మంది భారత జవానులు ఆ ప్రదేశానికి వెళ్లి చైనా జవానుల కవాతును అడ్డుకున్నట్లు తెలిసింది. పనుల గురించి అభ్యంతరాలు చెప్పడం, అందుకు వివరణలు ఇవ్వడం జరిగినట్లు ఓ అధికారి తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ లోని మెచుకా ప్రాంతంలోని విమానం ల్యాండయిన ప్రదేశం చైనా బోర్డర్ కు కేవలం 29 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేవలం 4200 అడుగుల పొడవు కలిగిన రన్ వేపై సీ-17ను ల్యాండ్ చేసి అత్యవసర సమయాల్లో మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకోగల సామర్ధ్యం ఉందని వాయుసేన నిరూపించుకుంది. మెచుకా నుంచి రోడ్డు మార్గం ద్వారా డిబ్రూఘర్ కు చేరుకోవాలంటే(500 కిలోమీటర్ల దూరం) కనీసం రెండు రోజుల సమయం పడుతుంది. ఈ మార్గంలో రోడ్లు తరచూ పాడవుతూ ఉంటాయి. సీ-17 ల్యాండింగ్ పై మాట్లాడిన భారతీయ వాయుసేన అధికారులు రోడ్డు మార్గం క్లిష్టతరంగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైన వాటిని వేగంగా తరలించేందుకు ఈ సామర్ధ్యం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ లలో అత్యధిక ఎత్తు నుంచి విమానాలను ల్యాండ్ చేయడంలో వాయుసేన పాలుపంచుకుంటోంది.