2020 జూన్ 15, 16 తేదీలలో జరిగిన గాల్వాన్ ఘర్షణ 21వ శతాబ్దంలో భారత్–చైనా సంబంధాలలో మూలమలుపు లాంటిది. ఈ ఘటనతో భారత్ చేదు పాఠం నేర్చుకుంది. ఈ సున్నితమైన సరిహద్దు పోస్ట్‌లలో పెట్రోలింగ్‌కు ఎక్కువ మంది సిబ్బందిని నియమించింది. ఇప్పుడు సరిహద్దులో ఐదు పాయింట్ల వద్ద ఇరు సైనికుల ఉనికి లేదు.
ఈ ప్రదేశాలలో సైనికరహిత బఫర్ జోన్‌లను ఏర్పాటు చేశారు. కానీ ఈ బఫర్ జోన్‌లు సరికొత్త వివాదానికి తెర తీశాయి. ఇలా బఫర్ జోన్‌లకు అంగీకరించడమంటే భారత్ తన భూభాగాన్ని కోల్పోవడమే తప్ప మరొకటి కాదని భారత వ్యూహాత్మక సంస్థ పేర్కొనడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో రెండు దేశాలూ సరిహద్దుల సమీపంలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చుకోవటం ఆందోళనకరం.
భారతదేశం, అమెరికా, చైనా అంతర్జాతీయ యవనికపై మూడు ముఖ్యమైన పాత్ర ధారులు. వీటి ఆసక్తులు పరస్పరం లోతుగా పొందుపర్చుకుని ఉన్నాయి. ఈ వాస్తవం క్రమానుగత వ్యవధిలో ఇతరులతో పోలిస్తే వారి ఎంపికలను తూకం వేసి చూసుకునేలా వారిని బలవంతం చేస్తోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా ఎదుగుదలకు చెక్ పెట్టేందుకు అమెరికా ఆసక్తితో ఉంది.
కాగా, భారతదేశం చైనాతో 4000 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును, దాంతోపాటు 61 ఏళ్ల సరిహద్దు వివాదాన్ని పంచుకుంటోంది. ఇక చైనా విషయానికి వస్తే 2049 నాటికి నంబర్ వన్ అగ్రరాజ్యం కావాలని కోరుకుంటోంది. అది జననేత మావో సేటుంగ్ నేతృత్వంలో చైనాలో కమ్యూనిస్టు విప్లవం విజయం పొందిన శతాబ్ది సంవత్సరం మరి.
ఆసియాలో చైనాకు ప్రత్యక్ష పొరుగు దేశమైన భారతదేశం, చైనా ప్రాదేశిక ఆకాంక్షల గురించి ఎల్లప్పుడూ ఆందోళన చెందుతూ ఉంది. ఇన్ని దశల చర్చలు జరిగినా నేటికీ భారత్–చైనా సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. మూడేళ్ల క్రితం గాల్వాన్ ప్రాంతంలో చైనాతో భారత్‌కు తీవ్ర వైరం ఏర్పడింది. ఇటీవల 2023 జూన్‌లో గాల్వాన్ ప్రతిష్టంభన మూడవ వార్షికోత్సవం సందర్భంగా, చాలామంది పండితులు, మాజీ దౌత్యవేత్తలు... దురాశాపూరిత చైనా పట్ల ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
1950ల నాటి నుండి భారత్ – చైనా సరిహద్దు వివాదం ప్రజర్విల్లుతోంది. ‘హిందీ–చినీ భాయ్ భాయ్’ అని భారత ప్రజలు నినదిస్తున్న వేళ, భారత భూభాగాల్లోకి చైనా సైనికులు కవాతు చేస్తున్నప్పుడు మనదేశం అకస్మాత్తుగా మేల్కొంది. భారత సైన్యం చవిచూసిన ఘోర పరాభవం ఇది. అప్పటి నుండి సరిహద్దు వివా దాన్ని పరిష్కరించడానికి లెక్కలేనన్ని ప్రయత్నాలు, చర్చలు జరి గాయి. కానీ ఫలించలేదు.
ఇక 2020 జూన్ దగ్గరకు వద్దాం. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఉన్న గాల్వాన్ లోయలో చైనా సైన్యం చేతిలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. చైనా సేనలను తమ ట్రాక్‌లో నిలిపివేసి నప్పటికీ, వారు యథాతథ స్థితితో సంతోషంగా లేరనీ, తమకు అనుకూలమైన మార్పు కోసం ఆసక్తిగా ఉన్నారనీ చైనా వైపు నుండి సందేశం స్పష్టంగా కనబడుతోంది. 2020లో అవకాశాన్ని కోల్పోయి నప్పటికీ, వారు తమ ప్రణాళికను కచ్చితంగా వదులుకున్నారని దీని అర్థం కాదు.
సరిహద్దు సమస్యను చైనా ఎప్పటికప్పుడు లేవనెత్తుతోంది. 2022 డిసెంబర్ లో, చైనా తవాంగ్‌లో ఒక ఫార్వర్డ్ పోస్ట్‌ను ప్రారంభించింది. కానీ ఈ ప్రయత్నాన్ని కూడా భారతీయ సైనికులు అడ్డుకున్నారు.
2020 జూన్ 15, 16 తేదీలలో జరిగిన గాల్వాన్ ఘర్షణ 21వ శతాబ్దంలో భారత్–చైనా సంబంధాలను మూలమలుపు తిప్పిన ఘటన. నిజానికి ఇరు దేశాల సైనికులు పరస్పరం ఘర్షణ పడడం ఇదే తొలిసారి. 1975 అక్టోబరులో చివరగా వాస్తవిక ఘర్షణ జరిగింది. ఆయుధాల వినియోగ నిషేధ ఒప్పందం ఒకటి భారత్, చైనాల మధ్య ఉంది. గాల్వాన్‌లో చైనా సైనికులు మేకులున్న కర్రలను ఉపయోగించారు. భారతీయులు ఫైబర్‌గ్లాస్ లాఠీలతో ప్రతిస్పందించారు.
కొన్ని సందర్భాల్లో రాళ్లను కూడా ఉపయోగించారు. భారతీయుల కంటే చైనీయులు ఎక్కువ మంది సైనికులను కోల్పోయారని కొన్ని స్వతంత్ర నివేదికలు నొక్కి చెప్పాయి. ఈ ఘటనతో భారత్ చేదు పాఠం నేర్చుకుంది. ఈ సున్నితమైన పోస్ట్‌లలో పెట్రోలింగ్‌కు ఎక్కువ మంది సిబ్బందిని నియమించింది కూడా! ఇప్పుడు ఐదు పాయింట్ల వద్ద ఇరు సైనికుల ఉనికి లేదు.
ఈ ప్రదేశాలలో సైనికరహిత బఫర్ జోన్‌లు ఏర్పాటయ్యాయి. కానీ ఈ బఫర్ జోన్‌లు కొత్త వివాదాస్పద అంశంగా మారాయి. వీటి ఏర్పాటుకు ఒప్పుకోవడం అంటే భారత్ తన భూభాగాన్ని కోల్పోవడమే తప్ప మరొకటి కాదని భారత వ్యూహాత్మక సంస్థ పేర్కొనడం ఇక్కడ గమనార్హం.
ఇది చాలదన్నట్లు సైనికులనూ, సైనిక సామగ్రినీ సులభంగా తరలించడానికి చైనా తన వైపు రెండు వంతెనలను కలిగి ఉన్న ప్రాంతంలో మౌలిక సదుపాయాలను నిర్మించడంలో బిజీగా ఉంది. భారత దేశం కూడా రోడ్లు, వంతెనలు, సొరంగాలు, హెలిప్యాడ్‌లు వంటివి ఉన్న తన భూభాగం వైపున మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తోంది. ఏదేమైనప్పటికీ, ఇది ఈ ప్రాంతంలో శాంతికి శుభ సూచన కాదు.
ఇంత ఘర్షణపూరిత వాతావరణం ఉన్నప్పటికీ, చైనా–భారత్‌ల మధ్య వాణిజ్యం వృద్ధి చెందుతోంది. భారతదేశం హిమాలయ పొరుగు దేశం నుండి ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. భారత – చైనా బంధం విషయంలో ఎల్లప్పుడూ నిరంతర పరిశీలన అవసర మని భారత నాయకులు గమనించాలి. చైనా తన వ్యూహాత్మక ప్రయోజనాలకు, దీర్ఘకాలిక ఆకాంక్షలకు సరిపోయే దానికంటే తక్కువగా దేనితోనూ సమాధానపడదని గుర్తుంచుకోవాలి.
21వ శతాబ్దంలో, అమెరికా కూడా చైనా ఎదుగుదల, దాని ఆకాంక్షల గురించి ఆందోళన చెందుతోంది. పైగా చైనాను సవాలు చేయడానికి భారతదేశాన్ని తన విలువైన భాగస్వామిగా చూస్తోంది. అందుకే ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీకి అమెరికా ఎర్ర తివాచీ పరిచింది. జపాన్ లాగా, ఇప్పుడు భారత దేశం... అమెరికా వ్యూహాత్మక చింతనలో ముఖ్యమైన స్థానాన్ని పొందింది.
ఒబామా వైట్‌హౌస్‌లో ఉన్న రోజుల నుండి, యూఎస్ –ఇండియా సంబంధాల సంగతి ‘21వ శతాబ్దాన్ని నిర్వచించే సంబంధాల’లో ఒకటిగా అమెరికా మాట్లాడుతోంది. 2023 జూన్ మొదటి వారంలో, అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన 2016 నుండి అమెరికా ‘ప్రధాన రక్షణ భాగస్వామి’గా ఉంటున్న భారతదేశం గురించి మాట్లాడారు. ‘క్వాడ్’ సభ్యులందరిలో, చైనాతో భారీ భూ–సరిహద్దు కలిగి ఉన్న ఏకైక దేశం భారతదేశం మాత్రమే అని అమెరికా ప్రభుత్వ యంత్రాంగానికి బాగా తెలుసు.
2023 జూన్ మొదటి వారంలో దాని 20వ ఎడిషన్‌ను ముగించిన వార్షిక ‘షాంగ్రి–లా డైలాగ్ ’... ఆసియాలో మారుతున్న ఈ ధోరణులను గుర్తించింది. అయితే భారతదేశం ఈ ప్రాంతంలో యూఎస్ క్లయింట్ స్టేట్‌గా ఉండలేదు. లేదా దిగ్గజ చైనాపై ఒక స్థాయికి మించి భారత్ ఆగ్రహం ప్రదర్శించలేదు. దూకుడుకు, అతివాగుడుకు చోటు లేని ఉన్నత స్థాయి దౌత్య నైపుణ్యం దీనికి అవసరం.
చైనాతో సంబంధాలు భారతదేశంలో అంతర్–పార్టీ స్పర్థ కోణాన్ని జోడించాయి. 1962 అక్టోబరులో చైనా భారతదేశంపై దాడి చేసినప్పుడు, బీజేపీని అసహ్యించుకునే పండిట్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలో ఉండేది. కాబట్టి నెహ్రూను ఢీకొట్టే ఒక్క అవకాశాన్ని కూడా కాషాయ పార్టీ వదులుకోదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంటూండగా, బీజేపీ అధికారంలో ఉంది.
ఈ 2023 జూన్ 20వ తేదీ సోమవారం, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనాతో సరిహద్దు పరిస్థితిపై కాంగ్రెస్ శ్వేతపత్రాన్ని డిమాండ్ చేయడంలో ఆశ్చర్యం లేదు. 2020 జూన్ 19 నాటి అఖిలపక్ష సమావేశంలో ‘ఎవరూ మన సరిహద్దులోకి ప్రవేశించలేదు లేదా ఏ సరిహద్దు ప్రాంతం కూడా ఇతరుల అధీనంలో లేదు’ అని మోదీ చేసిన వ్యాఖ్యలను తరచుగా ప్రస్తావించడం ద్వారా ప్రధానిని మరింత ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. అవన్నీ పక్కన పెడితే, చైనాను నిరంతరం పరిశీలిస్తూండటం మనకు ఎంతో అవసరం. భారత్ అప్రమత్తంగా మెలుగుతూ ఉండాలి.
అవినాష్ కోల్హే
వ్యాసకర్త రిటైర్డ్ ప్రొఫెసర్, ముంబయ్
Comments
Please login to add a commentAdd a comment