గస్తీలో భారత సైనికుడు
చైనాకు లదాఖ్ ఎందుకంత ముఖ్యం అన్న ప్రశ్నకు సమాధానం వెతకగలిగితే సరిహద్దు సమస్యలకు సమాధానం దొరుకుతుంది. టిబెట్ అటానమస్ రీజియన్‌ను క్సిన్జియాంగ్ అటానమస్ రీజియన్‌తో అనుసంధానించే ప్రాంతంలో లదాఖ్‌లోని అక్సాయ్ చిన్ ఉంది. చైనా తన పశ్చిమ, ఉత్తర, నైరుతి దిక్కుల్లో ఉన్న సరిహద్దులకు సైన్యాన్ని తరలించడానికి ఉన్న మార్గాలు ఇవి మాత్రమే.
చైనా ఉత్పత్తి చేసే 157 రకాల ఖనిజాల్లో దాదాపు 138 రకాల ఖనిజాలు ఈ ప్రాంతంలో దొరుకుతాయి. ఈ పరిస్థితుల్లో భారత్‌తో ఉన్న సరిహద్దులపై చైనా ఇంకా దృష్టి పెడుతుంది. అతి నిర్ణయాత్మకమైన ధోరణిని అవలంబించే బలమైన ప్రభుత్వం మాత్రమే చైనా దూకుడును ఎదుర్కోగలదు.
ఈ సంవత్సరం జనవరి 20–22 తేదీల్లో ఢిల్లీలో ‘కంచె లేని భూసరిహద్దుకు సంబంధించిన భద్రతా సమస్యలు’ అనే అంశంపై ఇంటలిజెన్స్ బ్యూరో నిర్వహించిన సమావేశంలో లదాఖ్‌లో చైనాతో ఉన్న సరిహద్దుకు సంబంధించిన విషయాలు చర్చకు వచ్చి, అవి మీడియాలో కూడా అనేక చర్చలకు దారితీశాయి.
ప్రధాని, హోంమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు పాల్గొన్న ఈ సమావేశంలో ముందుకు వచ్చిన ఒక నివేదిక ప్రకారం– ఈ ప్రాంతంలో కారకోరం పాస్ నుండి చుమూర్ గ్రామం వరకు ప్రస్తుతం ఉన్న 65 పాట్రోలింగ్ పాయింట్స్‌లో 26 పాయింట్స్ అంటే పాయింట్ నంబర్ 5 నుండి 17, 24 నుండి 32, 37, 51, 52, 62 అనే పాయింట్స్ ఇండియా కోల్పోయిందనీ, చైనా పాటించే సలామి స్లైస్ వ్యూహంలో(చిన్న దాడులతో పెద్ద ఫలితం రాబట్టడం) ఇవి చిక్కుకున్నాయనీ వెల్లడయిన విషయాలు ఆందోళన కలిగించేవే! అయినప్పటికీ ఈ ప్రాంతంపై చైనాకు ఉన్న ఆర్థిక రాజకీయ వ్యూహాత్మక భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఇది ఊహించదగ్గదే.
ఇండియా, చైనా మధ్య 2020 ఏప్రిల్ నుండి ఇప్పటివరకూ సుమారు 17 రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ, వాటి ఫలితాలు ఏమాత్రం అనుకూలంగా రాలేదు. రెండు దేశాల సైన్యాలు బాహాబాహీకి దిగుతున్న సంఘటనలు, నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలు, రహదారులు, మిలిటరీ స్టేషన్స్, జనావాసాలు... ఎన్ని రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ 2020 సంవత్సరానికి పూర్వం ఉన్న పరిస్థితులు పునరుద్ధరించడం కష్టమేనన్న భావన కలిగిస్తున్నాయి.
దానికి తోడు జనవరి 20వ తేదీన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ లదాఖ్ ప్రాంతంలోని చైనా సైనికులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన సమావేశంలో ఎల్లవేళలా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చాడు. చైనాకు ఈ ప్రాంతం ఎందుకంత ముఖ్యం అన్న ప్రశ్నకు సమాధానం వెతకగలిగితే ఈ సరిహద్దు సమస్యలకు సమాధానం దొరుకుతుంది.
గత మూడు దశాబ్దాల్లో చైనా విదేశీ విధానంలో, దాని రూపకల్పనలో సైన్యం పోషించే పాత్రలో చాలా మార్పులు వచ్చాయి. తొంభయ్యో దశకంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించకుండా అతిగోప్యతను పాటించడం, ఇతర దేశాల్లో ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం ముఖ్యమైన విధానంగా ఉంటే, కొత్త సహస్రాబ్దిలో చైనా సాధించిన ఆర్థిక విజయాలు ఈ విధానంలో సమూల మార్పులకు దోహద పడ్డాయి.
అందులో భాగంగా తన ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవడానికి సైన్యం కీలక పాత్ర పోషించవలసిన అవసరం ఉందని గుర్తించింది. దూకుడైన విధానాలు, బలమైన, టెక్నాలజీ సపోర్ట్‌తో కూడిన రక్షణ వ్యవస్థలను నిర్మించడంపై దృష్టి పెట్టింది. జిన్‌పింగ్ కాలంలో విదేశీ విధానాల రూపకల్పనలో సైన్యం పాత్ర మరింత పెరగటం గమనించవచ్చు.
జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చాక 2013లో చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో భాగంగా చైనా వాణిజ్యం పెంచే ఎగుమతులు దిగుమతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా కొనసాగించడానికి రక్షణ చర్యలు తీసుకొనవలసిన అవసరం ఏర్పడింది. 2016 నుండి తన పశ్చిమ సరిహద్దుల్లో ముఖ్యంగా సెంట్రల్ అసియా, అఫ్గానిస్తాన్‌లో పెరుగుతున్న తీవ్రవాదం ప్రభావం తన ఉగెర్, క్సిన్జియాంగ్ ప్రాంతాల్లో పడకుండా ఉండడానికి ఆ ప్రాంతాల్లో మిలిటరీ ఉనికిని పెంచడమే కాకుండా, తన వెస్ట్రన్ కమాండ్‌ను మొత్తంగా పునరుద్ధరించింది. ఈ చర్యలు అటు క్సిన్జియాంగ్ ప్రోవిన్సుతో పాటు, టిబెట్ ప్రావిన్స్ లలో సైన్యం కదలికలు పెరిగి ఎన్నడూ లేని విధంగా ఆ ప్రాంతాల్లోని సరిహద్దులపై దృష్టి పెట్టేందుకు దోహదపడ్డాయి.
గత రెండు దశాబ్దాల్లో చైనా విధానాల్లో వచ్చిన మరొక ముఖ్యమైన మార్పు, తాను నిర్దేశించుకున్న ‘మూల ప్రయోజనాలు’. తొంభయ్యో దశకం వరకు ఆర్థిక అభివృద్ధి, దేశ సమగ్రత ముఖ్య లక్ష్యాలయితే, అది కొత్త మిలీనియంలో విదేశాల్లో ఆర్థిక ప్రయోజనాలతో పాటు, ఆయా దేశాల్లో ఉన్న సహజ వనరులను ఉపయోగించుకునేందుకు, అందుకు అవసరమైతే మిలిటరీ తదితర శక్తుల ప్రదర్శన చేయడంగా రూపాంతరం చెందింది.
అయితే ఢిల్లీలో జరిగిన సమీక్ష సమావేశంలో చైనాకు లదాఖ్ ప్రాంతంలో ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నట్టు పేర్కొన్నప్పటికీ, అవి ఏమిటన్నది వెల్లడించలేదు. ఈ ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని పరిశీలిస్తే చైనాకు ఇది అత్యంత కీలకమైన ప్రాంతమని గోచరిస్తుంది. చైనాకు ఈ ప్రాంతంతో మూడు రకాల ప్రయోజనాలున్నాయి.
ఒకటి: చైనాలో ఉన్న టిబెట్ అటానమస్ రీజియన్‌ను క్సిన్జియాంగ్ అటానమస్ రీజియన్‌తో అనుసంధానించే ప్రాంతంలో లదాఖ్‌లోని అక్సాయ్ చిన్ ఉంది. ఈ ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న నగరి డ్యామ్ ద్వారా సింధు నదీ జలాల ప్రవాహాన్ని నియంత్రించడమే కాకుండా, వాటిని తన రక్షణ దళాల అవసరాలకు మళ్ళించుకోవడానికీ, ఆప్రాంతానికి కావలసిన విద్యుత్ ఉత్పత్తి చేయడానికీ అక్సాయ్ చిన్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై చైనాకు పూర్తి నియంత్రణ అవసరం.
రెండు: క్సిన్జియాంగ్ ప్రావిన్స్ను టిబెట్ ప్రావిన్స్తో కలిపే ఎ219 హైవే, కషుగర్ నగరాన్ని సెంట్రల్ చైనా నుండి బీజింగ్‌తో కలిపే ఎ314 హైవే... ఈ రెండింటి భద్రతకు అక్సాయ్ చిన్, లదాఖ్ ప్రాంతాలు చైనాకు అతి ముఖ్యమైనవి. చైనా తన పశ్చిమ, ఉత్తర, నైరుతి దిక్కుల్లో ఉన్న సరిహద్దులకు సైన్యాన్ని తరలించడానికి ఉన్న మార్గాలు ఇవి మాత్రమే.
ఈ ప్రాంతంలో ఇండియా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా రహదారులు, దౌలత్ ఓల్డ్ బేగ్ లాంటి వైమానిక స్థావరాలతో చైనా భద్రతకు, అందునా చైనా– పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌ను కషుగర్ సిటీతో కలిపే కారకోరం హైవేకు ప్రమాదం ఏర్పడుతుందని చైనా అంచనా.
మూడు: ఈ ప్రాంతంలో 1913లో జరిగిన డి ఫిలిపె ఎక్స్‌పెడీషన్, ఆ తర్వాత సోవియెట్ యూనియన్ జరిపిన భౌగోళిక సర్వేలో అత్యంత విలువైన థోరియం, యురేనియం, బోరోక్స్, సల్ఫర్, నికెల్, పాదరసం, ఇనుము, బంగారం, బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. 2019లో చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ప్రచురించిన నివేదికలో చైనా ఉత్పత్తి చేసే 157 రకాల ఖనిజాల్లో దాదాపు 138 రకాల ఖనిజాలు ఈ ప్రాంతంలో దొరుకుతాయని పేర్కొన్నారు.
ఇప్పటికే వీటి వెలికితీత కార్యక్రమాలు, శుద్ధిచేసే ప్లాంట్ల నిర్మాణాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ ఖనిజ సంపదతో తన తూర్పు ప్రాంతానికి సమానంగా పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చనీ, ఉగెర్ ప్రాంతంలో నెలకొని ఉన్న పేదరికాన్ని, వేర్పాటువాదాన్ని ఎదుర్కొనవచ్చనీ చైనా వ్యూహం.
ఈ పరిస్థితుల మధ్య భారత్‌తో ఉన్న సరిహద్దులపై చైనా ఇంకా దృష్టి పెడుతుందనీ, భవిష్యత్తులో మరింత దూకుడుగా ఉంటుందనీ అంచనా వేయవచ్చు. ఇంతకు ముందులా కాకుండా భారత్ కూడా లదాఖ్ నుండి అరుణాచల్ వరకు ఉన్న తన సరిహద్దుల వెంబడి అనేక మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, సైనిక దళాలకు కావలసిన వసతులను వేగంగా అభివృద్ధి చేసుకుంటున్నది.
చైనాకు ఉన్న ప్రయోజనాల దృష్ట్యా, అది వ్యవహరిస్తున్న తీరును బట్టి, భవిష్యత్తులో మరిన్ని ఘర్షణలు తలెత్తవచ్చని చెప్పవచ్చు. అతి నిర్ణయాత్మకమైన ధోరణిని అవలంబించే బలమైన ప్రభుత్వం మాత్రమే చైనా దూకుడును ఎదుర్కోగలదు.
వ్యాసకర్త సహాయ ఆచార్యులు, సిక్కిం సెంట్రల్ యూనివర్సిటీ
డాక్టర్ గద్దె ఓంప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment