వాషింగ్టన్: భారత్, చైనా మధ్య జరుగుతున్న సరిహద్దు సమస్యను నిశితంగా గమనిస్తున్నామని, ఈ సమస్య ముదరకూడదని కోరుతున్నామని ట్రంప్ ప్రభుత్వంలో సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. భారత్‌కు తమ ప్రభుత్వం ఆయుధాల విక్రయాలు, సంయుక్త మిలటరీ విన్యాసాలు, సమాచార పంపిణీలాంటి పలు రూపాల్లో సహకరిస్తోందన్నారు. కేవలం హిమాలయ ప్రాంత సమస్యల విషయంలోనే కాకుండా భారత్‌కు అన్ని అంశాల్లో తాము సహకరిస్తున్నామని చెప్పారు. లద్దాఖ్ తదితర సరిహద్దు ప్రాంతాల్లో భారత్, చైనా మధ్య టెన్షన్లు పెరిగిన సంగతి తెలిసిందే. ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో అన్ని వ్యవహారాల్లో భారత్ మరింత పాత్ర పోషించాలని తాము భావిస్తున్నట్లు అమెరికా అధికారి చెప్పారు.
ఈ ప్రాంతంలో చైనా దూకుడుకు అడ్డుకట్టవేసేందుకు క్వాడ్ పేరిట భారత్, యూఎస్‌తోపాటు ఆస్ట్రేలియా, జపాన్‌లు జట్టుకట్టాయి. చైనా ఇటీవల కాలంలో దక్షిణ, తూర్పు సముద్రాల్లో అన్ని పొరుగుదేశాలతో వివాదాలు పడుతోంది. తన ద్వీపాల్లో భారీగా మిలటరీ మోహరింపులు చేస్తోంది. ఈ సముద్ర జలాల్లో యూఎస్‌కు ఎలాంటి వాటా లేకున్నా, చైనా ఆధిపత్యం పెరగకుండా ఉండేందుకు ఆయా దేశాలకు సాయం చేస్తోంది. చైనాకు సవాలు విసురుతున్నట్లుగా ఈ సముద్ర జలాల్లో అమెరికా వార్‌షిప్పులు, ఫైటర్ జెట్లను మోహరిస్తోంది. అంతర్జాతీయ స్వేచ్ఛా నౌకాయానానికి భంగం కలగకుండా ఉండేందుకే తాము ఈ జలాల్లో ప్రవేశిస్తున్నామని అమెరికా చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment