మళ్లీ చైనా కాల్పులు | China Fired 100-200 Warning Shots At Pangong In Early September | Sakshi
Sakshi News home page

మళ్లీ చైనా కాల్పులు

Published Thu, Sep 17 2020 3:58 AM | Last Updated on Thu, Sep 17 2020 8:07 AM

China Fired 100-200 Warning Shots At Pangong In Early September - Sakshi

బుధవారం లేహ్‌కు చేరుకున్న భారత వాయుసేనకు చెందిన యుద్ధవిమానం

న్యూఢిల్లీ/జమ్మూ: భారత సైనికులను బెదిరించే ఉద్దేశంతో ప్యాంగాంగ్‌ సరస్సు ఉత్తర తీరం వద్ద చైనా సైనికులు గతవారం మరోసారి గాలిలో కాల్పులు జరిపారు. భారత్, చైనా దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్‌ యిల మధ్య రష్యా రాజధాని మాస్కోలో చర్చలు జరగడానికి ముందు ఫింగర్‌ 4 రిడ్జ్‌లైన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

వ్యూహాత్మకంగా కీలకమైన ఆ ప్రాంతంలో ఉన్న భారత జవాన్ల వైపు భారీ సంఖ్యలో చైనా సైనికులు దూకుడుగా వచ్చారని, అయితే, భారత జవాన్లు దీటుగా ఎదుర్కోవడంతో వెనక్కు వెళ్లారని వివరించాయి. వెనక్కు వెళ్తూ.. భారత సైనికులను బెదిరించేందుకు గాలిలో 100 నుంచి 200 రౌండ్లు కాల్పులు జరిపారని వెల్లడించాయి. 45 ఏళ్ల తరువాత తొలిసారి సెప్టెంబర్‌ 7న తూర్పు లద్దాఖ్‌లోని చైనా సరిహద్దుల్లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ప్యాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరంలోని రెజాంగ్‌ లా రిడ్జ్‌లైన్‌ వద్ద ఉన్న భారత జవాన్లను బెదిరించే లక్ష్యంతో చైనా సైనికులు గాలిలో పలు రౌండ్లు కాల్పులు జరిపారు.

మనవాళ్లే మెరుగు
తూర్పు లద్దాఖ్‌లో ప్రతికూల వాతావరణం ఉండే చలి కాలంలో కూడా.. చైనాతో పూర్తి స్థాయి యుద్ధానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ రిటైర్డ్‌ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. యుద్ధం తప్పని పరిస్థితులనే చైనా కల్పిస్తే.. సుశిక్షితులైన, సంసిద్ధంగా ఉన్న, మానసికంగా ధృఢంగా ఉన్న భారత బలగాలను వారు ఎదుర్కోవాల్సి ఉంటుందని బ్రిగేడియర్‌(రిటైర్డ్‌) హేమంత్‌ మహాజన్‌ హెచ్చరించారు.

 మానసికంగా, శారీరకంగా చైనా సైనికుల కన్నా.. భారత జవాన్లు దృఢమైనవారన్నారు. చైనా సైనికులు ప్రధానంగా పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన సున్నితమైన వారని, విధుల్లో భాగంగా సంక్లిష్ట క్షేత్ర పరిస్థితుల్లో ఎక్కువకాలం ఉన్నవారు కాదని వివరించారు. మొదట బుధవారం ఉదయం ఈ ప్రకటన భారత సైన్యం నార్తర్న్‌ కమాండ్‌ ప్రజా సంబంధాల అధికారి(పీఆర్‌ఓ) నుంచి మీడియాకు వచ్చింది. కానీ, ఆ తరువాత ఆ ప్రకటనలోని అంశాలు నార్తర్న్‌ కమాండ్‌ లేదా ఇండియన్‌ ఆర్మీ అభిప్రాయాలు కావని ఆ పీఆర్‌ఓ వివరణ ఇచ్చారు. ఈ వివరాలన్నీ పదవీ విరమణ చేసిన బ్రిగేడియర్‌ హేమంత్‌ మహాజన్‌వని వివరించారు.

శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉన్నాం
భారత్‌ సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉన్నామని చైనా ప్రకటించింది. భారత్‌తో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో తమ దేశ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభలో చేసిన ప్రకటనపై స్పందించాలన్న మీడియా ప్రశ్నకు.. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ బుధవారం పై విధంగా స్పందించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తాము కారణంకాదని చైనా తెలిపింది.

దీర్ఘకాల మోహరింపునకు సిద్ధం
బ్రిగేడియర్‌(రిటైర్డ్‌) హేమంత్‌ మహాజన్‌ వాదన ప్రకారం.. సరిహద్దుల్లో దీర్ఘకాలం మోహరించేందుకు భారత దళాలు సిద్ధమై ఉన్నాయి. లద్దాఖ్‌ అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలున్న ప్రాంతం. ఇక్కడ నవంబర్‌ తరువాత 40 అడుగుల వరకు మంచు పేరుకుపోయే పరిస్థితి ఉంటుంది. మైనస్‌ 30 నుంచి మైనస్‌ 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఇక్కడ సర్వసాధారణం. దానికి తోడు చలిగాలులు పరిస్థితిని మరింత దిగజారుస్తాయి. రోడ్లను మంచు కమ్మేస్తుంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ.. భారత్‌కు ఉన్న సానుకూల అంశం సుశిక్షితులైన మన సైనికులే.

చలి కాలంలో యుద్ధం సాగించేందుకు అవసరమైన అనుభవం మన సైనికులకు ఉంది. స్వల్ప వ్యవధిలోనే రంగంలోకి దిగగల మనోస్థైర్యం కూడా మనవారికి ఉంది. చైనా సరిహద్దుల కన్నా దారుణమైన వాతావరణ పరిస్థితులు ఉండే సియాచిన్‌లో నెలల తరబడి ఉన్న అనుభవం మన సైనికులకు ఉంది. లద్దాఖ్‌కు చేరుకునేందుకు ఇప్పటివరకు రెండు మార్గాలు ఉన్నాయి. తాజాగా ‘దార్చా టు లేహ్‌’ మార్గం అందుబాటులోకి రావడంతో యుద్ధ, సహాయక సామగ్రి తరలింపు మరింత సులభమైంది.పెద్ద సంఖ్యలో ఎయిర్‌బేస్‌లు ఉండటం భారత్‌కు కలసివచ్చే అంశం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement