brigadier
-
పాక్‌లో బ్రిగేడియర్‌గా తొలిసారి... మైనారిటీ మహిళ
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మైనారిటీ వర్గానికి చెందిన తొలి మహిళా బ్రిగేడియర్‌గా హెలెన్ మేరీ రాబర్ట్స్ చరిత్ర నెలకొల్పారు. ఆమె 26 ఏళ్లుగా సైన్యంలో పని చేస్తున్నారు. ప్రస్తుతం మెడికల్ కార్ప్స్లో సీనియర్ పాథాలజిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పాక్ జనాభాలో 96.47 శాతం మంది ముస్లింలే. హిందువులు 2.14%, క్రైస్తవులు 1.27% దాకా ఉంటారు. -
రాజా చారికి బ్రిగేడియర్ జనరల్ హోదా
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ వ్యోమగామి, కల్నల్ రాజా జె.చారి(45) ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ హోదాకు ఎంపికయ్యారు. ఈ హోదాకు ఆయన్ను ఎంపిక చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ గురువారం ఒక ప్రకటన చేశారు. ఈ నియమాకాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంది. అధ్యక్షుడు జరిపే అన్ని పౌర, సైనిక నియామకాలపై సెనేట్ సాధారణంగా ఆమోదముద్ర వేస్తుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రాజా చారి టెక్సాస్‌లోని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్లో క్రూ–3 కమాండర్, ఆస్ట్రోనాట్‌గా ఉన్నారు. రాజా చారి తండ్రి శ్రీనివాసా చారి తెలంగాణకు చెందిన వారు. ఆయన హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదివి అమెరికాకు చేరుకున్నారు. వాటర్లూలోని జాన్ డీర్ సంస్థలో పనిచేశారు. రాజా చారి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, మేరీల్యాండ్‌లోని యూఎస్ నేవల్ టెస్ట్ పైలట్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 461వ ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్ కమాండర్‌గా, ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఎఫ్–35 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫోర్స్‌కు డైరెక్టర్‌గాను వ్యవహరించారు. రాజా చారి తన కెరీర్లో 2,500 గంటలకు పైగా ఫ్టైట్ టైంను సాధించారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో బ్రిగేడియర్ జనరల్(బీడీ) ఒన్ స్టార్ జనరల్ ఆఫీసర్ స్థాయి. ఇది కల్నల్‌కు ఎక్కువ, మేజర్ జనరల్ స్థాయికి తక్కువ. -
ప్రమోషన్ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు
న్యూఢిల్లీ: జనరల్ బిపిన్ రావత్‌కు సహాయక సిబ్బందిగా ఏడాదికాలంగా విధుల్లో ఉన్న సెకండ్ జనరేషన్ ఆర్మీ అధికారి, బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిడ్డర్ పదోన్నతి అర్ధంతరంగా ఆగింది. బుధవారం హెలికాప్టర్లో రావత్‌తో పాటు ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారిలో లఖ్వీందర్ ఉన్నారు. హరియాణాలోని పంచకులకు చెందిన లఖ్వీందర్ గతంలో కశ్మీర్లో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లలో, చైనాతో సరిహద్దు వెంట ఆర్మీ బ్రిగేడ్‌కు నేతృత్వం వహించారు. కజక్‌స్తాన్‌లో భారత సైనిక బృందంలో పనిచేశారు. సేనా మెడల్, విశిష్ట్ సేవా మెడల్ ఆయనను వరించాయి. త్రివిధ దళాల విధుల్లో విశేష అనుభవముంది. దాంతో రావత్‌కు సహాయక సిబ్బందిలో డిఫెన్స్ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. సెకండ్ జనరేషన్ ఆర్మీ ఆఫీసర్‌గా ఉన్న ఆయనకు త్వరలోనే మేజర్ జనరల్ పదవిని కట్టబెట్టనున్నారు. ప్రమోషన్ జాబితాలో ఉన్న ఆయన ఆ పదోన్నతి పొందకుండానే వీరమరణం పొందారు. లఖ్వీందర్‌కు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. (చదవండి: బెంగళూరు ఆస్పత్రికి వరుణ్ తరలింపు.. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం) విహార యాత్రకు తీసుకెళ్తామన్నారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన హవాల్దార్ సత్పాల్ రాయ్ సొంతూరు పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా తక్దాలో విషాదం అలుముకుంది. రాయ్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు సైన్యంలో పనిచేస్తున్నారు. ‘చివరిసారిగా దీపావళికి వచ్చారు. ఏప్రిల్‌లో వస్తానని మాట ఇచ్చారు. అందర్నీ విహారయాత్రకు తీసుకెళ్తానన్నారు. ఇంతలో ఘోరం జరిగింది’ అని రాయ్ భార్య కన్నీటిపర్యంతమయ్యారు. మరోవైపు, ప్రమాదంలో మరణించిన కో–పైలట్, స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్ అంత్యక్రియల ఏర్పాట్లు రాజస్తాన్‌లోని సొంతూరు ఘర్దానా ఖుర్ద్‌లో మొదలయ్యాయి. కాగా, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనున్నాయి. (చదవండి: సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్‌కు వెళ్లాడా’’) 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టారు ఒక సోదరి ముంబైలో ఉండటంతో ఇన్నాళ్లూ కుదరక, ఎట్టకేలకు ముగ్గురు అక్కలతో కలసి 31 ఏళ్ల తర్వాత ఇటీవల రాఖీ పండుగ జరుపుకున్న తన కుమారుడు ఇప్పుడు లేడని, హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్ తండ్రి వాపోయారు. ఐదుగురు సంతానంలో ఇతనే చిన్నవాడని పృథ్వీ జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పృథ్వీ కుటుంబం ప్రస్తుతం ఆగ్రాలో నివసిస్తోంది. పృథ్వీ 2000లో హైదరాబాద్‌లో భారత వాయుసేనలో చేరారు. -
మళ్లీ చైనా కాల్పులు
న్యూఢిల్లీ/జమ్మూ: భారత సైనికులను బెదిరించే ఉద్దేశంతో ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర తీరం వద్ద చైనా సైనికులు గతవారం మరోసారి గాలిలో కాల్పులు జరిపారు. భారత్, చైనా దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యిల మధ్య రష్యా రాజధాని మాస్కోలో చర్చలు జరగడానికి ముందు ఫింగర్ 4 రిడ్జ్‌లైన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వ్యూహాత్మకంగా కీలకమైన ఆ ప్రాంతంలో ఉన్న భారత జవాన్ల వైపు భారీ సంఖ్యలో చైనా సైనికులు దూకుడుగా వచ్చారని, అయితే, భారత జవాన్లు దీటుగా ఎదుర్కోవడంతో వెనక్కు వెళ్లారని వివరించాయి. వెనక్కు వెళ్తూ.. భారత సైనికులను బెదిరించేందుకు గాలిలో 100 నుంచి 200 రౌండ్లు కాల్పులు జరిపారని వెల్లడించాయి. 45 ఏళ్ల తరువాత తొలిసారి సెప్టెంబర్ 7న తూర్పు లద్దాఖ్‌లోని చైనా సరిహద్దుల్లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని రెజాంగ్ లా రిడ్జ్‌లైన్ వద్ద ఉన్న భారత జవాన్లను బెదిరించే లక్ష్యంతో చైనా సైనికులు గాలిలో పలు రౌండ్లు కాల్పులు జరిపారు. మనవాళ్లే మెరుగు తూర్పు లద్దాఖ్‌లో ప్రతికూల వాతావరణం ఉండే చలి కాలంలో కూడా.. చైనాతో పూర్తి స్థాయి యుద్ధానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ రిటైర్డ్ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. యుద్ధం తప్పని పరిస్థితులనే చైనా కల్పిస్తే.. సుశిక్షితులైన, సంసిద్ధంగా ఉన్న, మానసికంగా ధృఢంగా ఉన్న భారత బలగాలను వారు ఎదుర్కోవాల్సి ఉంటుందని బ్రిగేడియర్(రిటైర్డ్) హేమంత్ మహాజన్ హెచ్చరించారు. మానసికంగా, శారీరకంగా చైనా సైనికుల కన్నా.. భారత జవాన్లు దృఢమైనవారన్నారు. చైనా సైనికులు ప్రధానంగా పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన సున్నితమైన వారని, విధుల్లో భాగంగా సంక్లిష్ట క్షేత్ర పరిస్థితుల్లో ఎక్కువకాలం ఉన్నవారు కాదని వివరించారు. మొదట బుధవారం ఉదయం ఈ ప్రకటన భారత సైన్యం నార్తర్న్ కమాండ్ ప్రజా సంబంధాల అధికారి(పీఆర్ఓ) నుంచి మీడియాకు వచ్చింది. కానీ, ఆ తరువాత ఆ ప్రకటనలోని అంశాలు నార్తర్న్ కమాండ్ లేదా ఇండియన్ ఆర్మీ అభిప్రాయాలు కావని ఆ పీఆర్ఓ వివరణ ఇచ్చారు. ఈ వివరాలన్నీ పదవీ విరమణ చేసిన బ్రిగేడియర్ హేమంత్ మహాజన్‌వని వివరించారు. శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉన్నాం భారత్ సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉన్నామని చైనా ప్రకటించింది. భారత్‌తో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో తమ దేశ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో చేసిన ప్రకటనపై స్పందించాలన్న మీడియా ప్రశ్నకు.. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బుధవారం పై విధంగా స్పందించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తాము కారణంకాదని చైనా తెలిపింది. దీర్ఘకాల మోహరింపునకు సిద్ధం బ్రిగేడియర్(రిటైర్డ్) హేమంత్ మహాజన్ వాదన ప్రకారం.. సరిహద్దుల్లో దీర్ఘకాలం మోహరించేందుకు భారత దళాలు సిద్ధమై ఉన్నాయి. లద్దాఖ్ అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలున్న ప్రాంతం. ఇక్కడ నవంబర్ తరువాత 40 అడుగుల వరకు మంచు పేరుకుపోయే పరిస్థితి ఉంటుంది. మైనస్ 30 నుంచి మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఇక్కడ సర్వసాధారణం. దానికి తోడు చలిగాలులు పరిస్థితిని మరింత దిగజారుస్తాయి. రోడ్లను మంచు కమ్మేస్తుంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ.. భారత్‌కు ఉన్న సానుకూల అంశం సుశిక్షితులైన మన సైనికులే. చలి కాలంలో యుద్ధం సాగించేందుకు అవసరమైన అనుభవం మన సైనికులకు ఉంది. స్వల్ప వ్యవధిలోనే రంగంలోకి దిగగల మనోస్థైర్యం కూడా మనవారికి ఉంది. చైనా సరిహద్దుల కన్నా దారుణమైన వాతావరణ పరిస్థితులు ఉండే సియాచిన్‌లో నెలల తరబడి ఉన్న అనుభవం మన సైనికులకు ఉంది. లద్దాఖ్‌కు చేరుకునేందుకు ఇప్పటివరకు రెండు మార్గాలు ఉన్నాయి. తాజాగా ‘దార్చా టు లేహ్’ మార్గం అందుబాటులోకి రావడంతో యుద్ధ, సహాయక సామగ్రి తరలింపు మరింత సులభమైంది.పెద్ద సంఖ్యలో ఎయిర్‌బేస్‌లు ఉండటం భారత్‌కు కలసివచ్చే అంశం. -
‘ఒక్క ట్వీట్ చేస్తారు.. పూర్తిగా మర్చిపోతారు’
న్యూఢిల్లీ: గాల్వన్ లోయలో భారత్-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగింది అనే వార్త తెలిసినప్పటి నుంచి రిటైర్డ్ బ్రిగేడియర్ సీకే సూద్ స్థిమితంగా ఉండలేకపోతున్నారు. 20 మంది సైనికులు చనిపోయారని తెలిసినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఎంత విలవిల్లాడిపోయారో.. సూద్ కూడా అలానే బాధపడ్డారు. ఈ ఘటన ఆయన కుమారుడిని గుర్తు చేసింది. సీకే సూద్ కుమారుడు మేజర్ అంజు సూద్ కూడా గత నెల 2న కశ్మీర్ హంద్వారా ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో అసువులు బాశారు. ఉగ్రవాదుల చేతిలో చిక్కుకున్న పౌరులను కాపాడే క్రమంలో అంజు సూద్ మరణించారు. ఈ ఘటనలో మొత్త ఐదుగురు చనిపోయారు. కొడుకు మరణించిన విషాదం నుంచి బయటపడక ముందే మరో 20 మంది సరిహద్దులో నెలకొరిగారనే విషయం ఆయనను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. (చైనా చెర నుంచి సైనికులు విడుదల..!) ఈ సందర్భంగా సీకే సూద్ మాట్లాడుతూ.. ‘నా కుమారుడు మరణించాడనే వార్త నాకు ఒక రోజు తర్వాత తెలిసింది. ఆలోపే ఈ వార్త అన్ని వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది’ అన్నారు. రాజకీయ నాయకులు అమర జవాన్ల మృతికి సంతాపంగా ఓ ట్వీట్ చేసి చేతులు దులుపుకుంటున్నారని.. ఆ తర్వాత వీరుల కుటుంబాలను పట్టించుకునే నాదుడు లేరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అమరుల కుటుంబాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సీకే సూద్ గత నెల 30న Change.org అనే ఆన్లైన్ పిటీషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీకే సూద్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం మన హీరోల త్యాగాన్ని ఎలా గుర్తిస్తుందో మీకు తెలుసా.. ఓ ట్వీట్‌తో. ఒక ట్వీట్ అంటే కేవలం 140 అక్షరాల్లో. వారు ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో ఐదుగురు వీర జవాన్లు మృతి చెందారని తెలుపుతారు. కానీ వారి పేర్లును వెల్లడించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. (బాయ్‌కాట్ చైనా) ఈ పిటీషన్లో (Change.org/MartyrsOfIndia) సీకే సూద్ దేశ ప్రధాని / రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ.. అమరులైన జవాన్ల త్యాగాన్ని గుర్తు చేస్తూ వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరపున ఓ మెమోంటో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘ఒక బలమైన కారణం కోసం ప్రతి ఏడాది ఎందరో జవాన్లు అమరులవుతున్నారు. వారిని ఒక్క సారి స్మరించుకుని తర్వాత మర్చిపోతారు. వారి కుటుంబాలను అస్సలు పట్టించుకోరు. ఈ పద్దతి మారాలి’ అన్నారు. ఇందుకు జనాలు తనకు మద్దతివ్వాల్సిందిగా కోరారు. ఈ ఆన్లైన్ పిటీషన్ ఇప్పటికే 19,800 సంతకాలు సేకరించింది... వీటి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. -
‘వార్ హీరో’ కుల్దీప్సింగ్ కన్నుమూత
చండీగఢ్: 1971 భారత్–పాక్ యుద్ధం సందర్భంగా కేవలం 120 మందితో పాకిస్తాన్ సైనిక పటాలాన్ని నిలువరించిన బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ చంద్‌పురి(78) కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న కుల్దీప్ మొహాలీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కుల్దీప్ నేతృత్వంలో భారత సైన్యం రాజస్తాన్‌లోని లాంగేవాలా ఆర్మీ పోస్ట్వద్ద ప్రదర్శించిన ధైర్య సాహసాలపై 1997లో ‘బోర్డర్’ అనే సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. ‘బ్యాటిల్ ఆఫ్ లాంగేవాలా’గా పేరుగాంచిన ఈ ఘటన 1971, డిసెంబర్ 4న చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటం నేపథ్యంలో భారత్‌పై మెరుపుదాడి చేయాలని పాక్ ఆర్మీ ప్రణాళిక రచించింది. 2,000 మంది జవాన్లతో పాటు భారీగా యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలతో పాక్ ఆర్మీ భారత సరిహద్దువైపు కదలడం ప్రారంభించింది. అప్పటి లాంగేవాలా పోస్ట్ ఇన్చార్జ్గా ఉన్న మేజర్ కుల్దీప్ సింగ్ చంద్‌పురి ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. అయితే మరో 6 గంటలవరకూ అదనపు బలగాలు అక్కడకు చేరుకోలేవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అక్కడే ఉండి ఆరు గంటలపాటు పాక్ సైన్యాన్ని నిలువరించడమా? లేక వ్యూహాత్మ కంగా వెనక్కితగ్గడమా? అన్న విషయాన్ని కుల్దీప్కు విడిచిపెట్టారు. దీంతో పాక్ బలగాలను నిలువరించేందుకే ఆయన నిర్ణయించుకున్నారు. కేవలం 120 మంది సైనికులు, మెషీన్ గన్లు, చిన్నస్థాయి శతఘ్నులతో పాక్ సైన్యానికి ఉచ్చుపన్నారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో భారత భూభాగంలోకి అడుగుపెట్టిన పాక్ ఆర్మీపై గుళ్ల వర్షం కురిపించారు. భారత ఆర్మీ మోహరింపుపై సరైన నిఘా సమాచారం లేకపోవడంతో ఈ మెరుపుదాడిలో పాక్ సైన్యం కకావికలమైంది. ఈ పోస్ట్‌ను గస్తీకాస్తున్న పంజాబ్ రెజిమెంట్‌లోని 23వ బెటాలియన్ వ్యూహాత్మకంగా అమర్చిన ల్యాండ్మైన్లు పేలడంతో పలు యుద్ధ ట్యాంకర్లు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. కేవలం 120 మంది భారత సైనికులు ఏకంగా 2 వేల మంది పాక్ ఆర్మీని, యుద్ధ ట్యాంకులను ఎదుర్కొన్నారు. మరుసటిరోజు ఉదయం అదనపు బలగాలతో పాటు భారత వాయుసేన రంగంలోకి దిగడంతో పాక్ తోకముడిచింది. ‘బ్యాటిల్ ఆఫ్ లాంగేవాలా’గా పిలిచే ఈ ఘటనలో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు. పాక్ మాత్రం 200 మంది సైనికులను, 36 యుద్ధ ట్యాంకులు, 500కుపైగా వాహనాలను నష్టపోయింది. ఈ యుద్ధంలో కుల్దీప్ చూపిన ధైర్యసాహసాలకుగానూ రెండో అత్యున్నత సైనిక పురస్కారమైన మహావీర్ చక్ర ఆయనకు లభించింది. కుల్దీప్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుల్దీప్సింగ్ అంత్యక్రియలను సోమవారం సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. పంజాబ్‌లో పుట్టి... అవిభక్త భారత్‌లోని పంజాబ్ రాష్ట్రంలో 1940, నవంబర్ 22న కుల్దీప్సింగ్ చంద్‌పురి జన్మించారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి 1963లో ఉత్తీర్ణులయ్యారు. అనంతరం పంజాబ్ రెజిమెంట్‌లోని 23వ బెటాలియన్‌లో చేరారు. ఆయన 1965 భారత్–పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి అత్యవసర దళం (యూఎన్ఈఎఫ్)లో ఏడాదిపాటు పనిచేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇన్ఫాంట్రీ స్కూల్లో శిక్షకుడిగా రెండుసార్లు పనిచేశారు. ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక 2006–11 మధ్యకాలంలో చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుడిగానూ పనిచేశారు. యువత డ్రగ్స్ మత్తు నుంచి బయటపడేందుకు ఆటలపై దృష్టి సారించాలనీ, ఇందుకోసం మైదానాలు నిర్మించాలని గట్టిగా వాదించారు. కాగా, కుల్దీప్ మృతిపై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుల్దీప్ వీరోచిత పోరాటం ఆర్మీలో చేరే యువ అధికారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. -
అమెరికా డాక్టర్‌పై భారత బ్రిగెడియర్ అత్యాచారం!!
అమెరికాలో ఒక వైద్యురాలిపై అత్యాచారం చేసిన కేసులో భారత ఆర్మీ బ్రిగెడియర్పై విచారణ మొదలైంది. ప్రస్తుతం ఆర్మీ వార్ కాలేజిలో పనిచేస్తున్న బ్రిగెడియర్ మనోజ్ తివారీపై 'కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ' మొదలుపెట్టారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్‌కు మిలటరీ అటాచీగా ఉన్న సమయంలో న్యూయార్క్ నగరానికి చెందిన ఓ వైద్యురాలిపై అత్యాచారం చేసినట్లు ఆయనపై ఆరో్పణలు వచ్చాయి. ఆమె వైద్యురాలిగా ఉండి, తర్వాత వ్యాపారవేత్తగా మారారు. అప్పటికి కర్నల్‌గా ఉన్న తివారీ, తనకు పెళ్లి కాలేదని చెప్పి, ఆమెకు డ్రగ్స్ ఇచ్చి ఆ తర్వాత తన కార్యాలయంలోనే ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాతి కాలంలో భారతదేశానికి తిరిగొచ్చిన తివారీకి బ్రిగెడియర్గా ప్రమోషన్ లభించింది. అప్పటికి భారత సైన్యానికి ఇంకా అత్యాచారం ఫిర్యాదు అందలేదు. తనను పెళ్లి చేసుకుంటానని అతడు మాట ఇచ్చాడని, సంఘటన గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారని ఆమె ఆరోపించారు.