చైనా సైనిక మరణాలపై అంతా గందరగోళం | Fake News About China Casualties | Sakshi
Sakshi News home page

చైనా సైనిక మరణాలపై అంతా గందరగోళం

Published Fri, Jun 19 2020 5:56 PM | Last Updated on Fri, Jun 19 2020 10:13 PM

Fake News About China Casualties - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చైనా, భారత దేశాల వాస్తవాధీన రేఖ వద్ద జూన్‌ 15వ తేదీన ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన సంఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించారని భారత సైనిక వర్గాలు, ప్రభుత్వం ధ్రువీకరించింది. చైనా వైపు ఎంత మంది మరణించారన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఘర్షణలో ఐదుగురు చైనా సైనికులు మరణించారని, 11 మంది సైనికులు గాయపడ్డారంటూ తొలుత కొన్ని మీడియా సంస్థలు, కొందరు జర్నలిస్టులు వార్తలను ప్రసారం చేశారు. ఆ సంఖ్యను ఎవరూ ధ్రువీకరించలేదు. ఆ తర్వాత 43 మంది చైనా సైనికులు మరణించారంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రకటించాయి. భారత ప్రభుత్వం కూడా ఆ సంఖ్యనే చెబుతూ వస్తోంది. చైనా ప్రభుత్వంగానీ, సైనిక వర్గాలుగా ఎంత మంది మర ణించారన్న విషయాన్ని ఇంతవరకు  చూచాయిగా కూడా వెల్లడించలేదు.

‘టైమ్స్‌ నౌ’ టెలివిజన్‌ ఛానల్‌ జూన్‌ 17వ తేదీన ‘బ్రేకింగ్‌ న్యూస్‌’ పేరిట ‘30 మంది తమ సైనికులు మరణించారన్న విషయన్ని చైనా అంగీకరించింది, ఇదిగో వారి జాబితా’ అంటూ పేర్లను చదివింది. ‘చైనాకు చెందిన గ్లోబల్‌ టైమ్స్‌’ కథనం ప్రకారం అంటూ టైమ్స్‌ నౌ టీవీ యాంకర్లు రాహుల్‌ శివశంకర్, నావికా కుమార్‌లు 30 పేర్లను చదివారు. ఎందుకైన మంచిదనుకున్నారేమో! ‘గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడించిన జాబితా కూడా నకిలీది కావొచ్చు’ అంటూ రాహుల్‌ శివశంకర్‌ ఓ నొక్కు నొక్కారు. 30 మంది మరణించరంటూ మొదట ట్వీట్లు చేసిన టైమ్స్‌ నౌ ఆ తర్వాత వాటిని తొలగించింది. (చైనా చెర నుంచి సైనికులు విడుదల..!)

చైనా సరిహద్దు వ్యవహారాలను పర్యవేక్షించే ‘వెస్టర్న్‌ థియేటర్‌ కమాండ్‌’ అధికార ప్రతినిధి కథనం ప్రకారం 30 మంది చైనా సైనికులు మరణించరంటూ ఫేస్‌బుక్, ట్విటర్‌లో కూడా 30 పేర్లు విరివిగా వైరల్‌ అయ్యాయి. ఆ పేర్లు, టైమ్స్‌ నౌ వెల్లడించిన పేర్ల జాబితా ఒకటే. వాస్తవానికి చైనాకు చెందిన గ్లోబల్స్‌ టైమ్స్, వెబ్‌సైట్స్‌లోగానీ, ట్విటర్‌లోగానీ చైనాకు చెందిన మృతుల గురించి ఎలాంటి వార్తను ప్రచురించలేదు. ఈ విషయాన్ని నకిలీ వార్తలను వెతికి పట్టుకొనే ‘ఆల్ట్‌ న్యూస్‌’ కూడా ధ్రువీకరించింది. గతంలో కూడా చైనా గ్లోబల్‌ టైమ్స్‌ పేరిట పలు నకిలీ వార్తలు ప్రసారమైనట్లు వెల్లడించింది. (బయటపడ్డ చైనా కుట్ర.. తాజా ఫొటోలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement