ఉపాధి హామీ పథకాన్ని అడ్డుకున్న చైనా
న్యూఢిల్లీ: భారత్-చైనాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనల మధ్య భారతీయ వాయుసేన గురువారం లడఖ్ లో సీ-17 గ్లోబ్ మాస్టర్ విమానాన్ని ల్యాండ్ చేసింది. ఎంఎన్ఆర్ఈజీఏ పథకం కింద జరుగుతున్న పనులను లడఖ్ లో చైనా జవానులు అడ్డుకున్న మరుసటి రోజు ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ల్యాండ్ చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చిన చైనా జవానులు పనులు నిలిపివేయాలంటూ వర్కర్లపై అరిచినట్లు ఓ వార్త సంస్ధ ప్రచురించింది. దీంతో రంగంలోకి దిగిన 70 మంది భారత జవానులు ఆ ప్రదేశానికి వెళ్లి చైనా జవానుల కవాతును అడ్డుకున్నట్లు తెలిసింది. పనుల గురించి అభ్యంతరాలు చెప్పడం, అందుకు వివరణలు ఇవ్వడం జరిగినట్లు ఓ అధికారి తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ లోని మెచుకా ప్రాంతంలోని విమానం ల్యాండయిన ప్రదేశం చైనా బోర్డర్ కు కేవలం 29 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేవలం 4200 అడుగుల పొడవు కలిగిన రన్ వేపై సీ-17ను ల్యాండ్ చేసి అత్యవసర సమయాల్లో మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకోగల సామర్ధ్యం ఉందని వాయుసేన నిరూపించుకుంది.
మెచుకా నుంచి రోడ్డు మార్గం ద్వారా డిబ్రూఘర్ కు చేరుకోవాలంటే(500 కిలోమీటర్ల దూరం) కనీసం రెండు రోజుల సమయం పడుతుంది. ఈ మార్గంలో రోడ్లు తరచూ పాడవుతూ ఉంటాయి. సీ-17 ల్యాండింగ్ పై మాట్లాడిన భారతీయ వాయుసేన అధికారులు రోడ్డు మార్గం క్లిష్టతరంగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైన వాటిని వేగంగా తరలించేందుకు ఈ సామర్ధ్యం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ లలో అత్యధిక ఎత్తు నుంచి విమానాలను ల్యాండ్ చేయడంలో వాయుసేన పాలుపంచుకుంటోంది.