c-17 landing
-
ఆపరేషన్ గంగాకి మోదీ పిలుపు..ముమ్మరంగా తరలింపు చర్యలు!
IAF C-17 Aircraft Bring back Indian Nationals: చర్చలు విఫలమైన నేపథ్యంలో ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ చర్యలు మరింత వేగవంతం చేసింది. అంతేకాదు రష్యా నేరుగా జనావాసాలపై దాడి చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో యుద్ధం మరింత తీవ్రమవుతోందంటూ ఉక్రెయిన్లోని రాయబార కార్యాలయం విద్యార్థులను తక్షణమే కైవ్ని విడిచి వచ్చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రధాని మోదీ ఉక్రెయిన్లోని భారతీయుల తరలింపు చర్యలను మరింత వేగవంతం చేసేలా ఆపరేషన్ గంగా చేపట్టాలని నిర్ణయించారు. ఆపరేషన్ గంగాలో భాగంగా సీ-17 భారత వైమానిక దళం తరలింపు ప్రయత్నాలు పాలుపంచుకోవాలని మోదీ పిలుపునిచ్చారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఐఏఎఫ్ సీ-17 విమానం సుమారు 336 మందిని తీసుకువెళ్లగలదు. అంతేకాదు దీన్ని అఫ్గనిస్తాన్ తరలింపులో ఉపయోగించారు. మానవతా సాయాన్ని మరింత సమర్థవంతంగా అందించడంలో ఇది సహయపడుతుందని అంటున్నారు. అంతేకాదు ఈ భారత వైమానిక దళం ఈ రోజు నుంచే ఆపరేషన్ గంగాలో భాగంగా సీ-17 విమానాలు మోహరించే అవకాశం ఉందని చెప్పారు. ప్రదాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు ఈ సమావేశంలో మోదీ ఉక్రెయిన్లోని భారతీయుల భద్రతకు ప్రభుత్వం 24 గంటలూ పని చేస్తుందని చెప్పారని అన్నారు. ఇంకోవైపు ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు తాజా సలహాను జారీ చేసింది. కైవ్ను అత్యవసరంగా వదిలివేయాలని, అందుబాటులో ఉన్న రైళ్లలో లేదా మరేదైనా మార్గంలో వెళ్లాలని కోరింది. మరోవైపు భారత్ ఆపరేషన్ గంగా కింద తరలింపు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తోంది. అంతేకాదు ఉక్రెయిన్ చుట్టుపక్కల సరిహద్దుల నుండి తరలింపు ప్రక్రియను సమన్వయం చేయడానికి, వేగవంతం చేయడానికి ప్రభుత్వం నలుగురు కేంద్ర మంత్రులను పంపింది. ఈ మేరకు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు, జనరల్ వీకే సింగ్ సరిహద్దుల వద్ద మొత్తం ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. (చదవండి: అమ్మా నాకు చాలా కష్టంగా ఉంది!..రష్యన్ సైనికుడి చివరి సందేశం) -
రికార్డు సంఖ్యలో ప్రయాణం.. 640 మంది కాదు..823 మంది!
వాషింగ్టన్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ నుంచి గత ఆదివారం బయలుదేరిన విమానంలో అంచనా వేసిన దాని కంటే చాలా ఎక్కువ మందే ప్రయాణించినట్లు అమెరికా ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. సీ–17 విమానంలో జనం కిక్కిరిసి కూర్చున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆ విమానంలో 640 మంది ప్రయాణికులున్నట్లు అప్పట్లో అంచనా వేశారు. కానీ, వాస్తవానికి ఆ రోజు ఆ విమానంలో 183 మంది చిన్నారులు సహా మొత్తం 823 మంది ప్రయాణించినట్లు ఎయిర్ మొబిలిటీ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. చిన్నారులంతా పెద్ద వారి భుజాలపైన, వీపుమీద కూర్చుని ఉన్నారని, వారిని ఇప్పటి దాకా లెక్కలోకి తీసుకోలేదని పేర్కొంది. సీ–17లో ఇంతమంది జనం ప్రయాణించడం కొత్త రికార్డని తెలిపింది. గత ఆదివారం కాబూల్లోకి తాలిబన్లు అడుగు పెట్టడంతో భీతిల్లిన విదేశీయులు, స్థానికులు అమెరికా వైమానిక దళానికి చెందిన విమానంలో చోటు సంపాదించేందుకు ప్రాణాలకు తెగించారు. ఎలాగైనా సరే, దేశం నుంచి బయటపడాలనే ఆత్రుతలో కొందరు విమానం పైన కూడా ఎక్కి కూర్చున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
ఉపాధి హామీ పథకాన్ని అడ్డుకున్న చైనా
న్యూఢిల్లీ: భారత్-చైనాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనల మధ్య భారతీయ వాయుసేన గురువారం లడఖ్ లో సీ-17 గ్లోబ్ మాస్టర్ విమానాన్ని ల్యాండ్ చేసింది. ఎంఎన్ఆర్ఈజీఏ పథకం కింద జరుగుతున్న పనులను లడఖ్ లో చైనా జవానులు అడ్డుకున్న మరుసటి రోజు ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ల్యాండ్ చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చిన చైనా జవానులు పనులు నిలిపివేయాలంటూ వర్కర్లపై అరిచినట్లు ఓ వార్త సంస్ధ ప్రచురించింది. దీంతో రంగంలోకి దిగిన 70 మంది భారత జవానులు ఆ ప్రదేశానికి వెళ్లి చైనా జవానుల కవాతును అడ్డుకున్నట్లు తెలిసింది. పనుల గురించి అభ్యంతరాలు చెప్పడం, అందుకు వివరణలు ఇవ్వడం జరిగినట్లు ఓ అధికారి తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ లోని మెచుకా ప్రాంతంలోని విమానం ల్యాండయిన ప్రదేశం చైనా బోర్డర్ కు కేవలం 29 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేవలం 4200 అడుగుల పొడవు కలిగిన రన్ వేపై సీ-17ను ల్యాండ్ చేసి అత్యవసర సమయాల్లో మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకోగల సామర్ధ్యం ఉందని వాయుసేన నిరూపించుకుంది. మెచుకా నుంచి రోడ్డు మార్గం ద్వారా డిబ్రూఘర్ కు చేరుకోవాలంటే(500 కిలోమీటర్ల దూరం) కనీసం రెండు రోజుల సమయం పడుతుంది. ఈ మార్గంలో రోడ్లు తరచూ పాడవుతూ ఉంటాయి. సీ-17 ల్యాండింగ్ పై మాట్లాడిన భారతీయ వాయుసేన అధికారులు రోడ్డు మార్గం క్లిష్టతరంగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైన వాటిని వేగంగా తరలించేందుకు ఈ సామర్ధ్యం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ లలో అత్యధిక ఎత్తు నుంచి విమానాలను ల్యాండ్ చేయడంలో వాయుసేన పాలుపంచుకుంటోంది.