
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని మిగిలిన ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ వేగంగా జరగాలని భారత్ స్పష్టం చేయనుంది. భారత్– చైనా మధ్య 19వ విడత చర్చలు ఈ నెల 14న జరగనున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రెండు దేశాల కార్ప్స్ కమాండర్ స్థాయి చివరి దఫా చర్చలు నాలుగు నెలల క్రితం జరిగాయి. రేపు జరిగే చర్చల్లో మిగిలిన ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ పూర్తిగా జరగాలని భారత ప్రతినిధి బృందం పట్టుబడ్టనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
రెండు దేశాల మధ్య పలు విడతలుగా జరిగిన చర్చల ఫలితంగా తూర్పులద్దాఖ్‌లోని కొన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి ఇరు పక్షాలు బలగాలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. 18వ విడత చర్చల్లో ప్రధానంగా డెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలంటూ భారత్ గట్టిగా డిమాండ్ చేసింది. తాజా చర్చలు చుషుల్–మోల్డో సరిహద్దు పాయింట్‌లోని భారత భూభాగంలో జరుగుతాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భారత బృందానికి లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలి, చైనా కు సౌత్ జిన్‌జియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ నాయకత్వం వహించే అవకాశాలున్నాయి.