యుద్ధ నౌకలు, విమానాలతో భారీ సైనిక విన్యాసాలు
చైనాలో అంతర్భాగమని అంగీకరించాలని హెచ్చరికలు
తైపీ: డ్రాగన్ దేశం చైనా సోమవారం తైవాన్ జలసంధిలో భారీ సైనిక విన్యాసాలకు తెరతీసింది. విమాన వాహక నౌక, యుద్ద నౌకలు, అత్యాధునిక యుద్ధ విమానాలతో తైవాన్‌ను, చుట్టుపక్కల దీవులను చుట్టుముట్టింది. కమ్యూనిస్ట్ చైనాలో అంతర్భాగమని అంగీకరించబోమంటూ తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్–తె ఇటీవల చేసిన ప్రకటనకు సమాధానంగానే విన్యాసాలు చేపట్టినట్లు చైనా ప్రకటించింది.
నాలుగు రోజుల క్రితం జరిగిన జాతీయ ఉత్సవాల్లో అధ్యక్షుడు లాయ్ చింగ్–తె మాట్లాడుతూ.. తైవాన్ తమదేనంటూ చైనా చేస్తున్న వాదనను ఖండించారు. చైనా బెదిరింపులను, దురాక్రమణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారం నచ్చని చైనా తాజాగా భారీ సైనిక విన్యాసాలు చేపట్టింది. విమాన వాహక నౌక లియోనింగ్ నుంచి జె–15 యుద్ధ విమానం టేకాఫ్ తీసుకుంటున్న వీడియోను అధికార టీవీ ప్రసారం చేసింది. అయితే, విన్యాసాలు ఎన్ని రోజులు కొనసాగుతాయనే విషయం తెలపలేదు.
నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, మిస్సైల్ బలగాలు కలిసికట్టుగా ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆరీ్మ(పీఎల్‌ఏ) ఈస్టర్న్ థియేటర్ కమాండ్ ప్రకటించింది. తైవాన్ స్వాతంత్య్రానికి మద్దతిచ్చే వారికి ఇదో హెచ్చరికని పేర్కొంది. దీనిపై తైవాన్ స్పందించింది. గుర్తించిన ప్రాంతాల్లో యుద్ధ నౌకలను, మొబైల్ మిస్సైళ్లను మోహరించామని, రాడార్లతో గట్టి నిఘా ఉంచామని తైవాన్ రక్షణ శాఖ తెలిపింది.
25 వరకు చైనా యుద్ధ విమానాలు, ఏడు యుద్ధ నౌకలను, మరో నాలుగు చైనా ప్రభుత్వ నౌకలను రాడార్లు గుర్తించాయని తైవాన్ పేర్కొంది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో చైనా 125 సైనిక విమానాలను విన్యాసాలకు పంపిందని తైవాన్ తెలిపింది. వీటిలో 90 వరకు విమానాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు తమ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్‌లోనే కనిపించాయంది. చైనా మేలోనూ ఇదే రకంగా మిలటరీ విన్యాసాలను చేపట్టింది. 2022లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ సారథ్యంలోని బృందం తైవాన్ సందర్శన సమయంలో కూడా చైనా భారీ సైనిక విన్యాసాలతో తైవాన్‌ను దిగ్బంధంలో ఉంచింది.
ఇలా ఉండగా, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చైనాలో విలీనం కాకమునుపు తైవాన్ జపాన్ వలసప్రాంతంగా ఉండేది. చైనా ప్రధాన భూభాగంపై మావో జెడాంగ్ నేతృత్వంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పటయ్యాక 1949లో చియాంగ్ కై షేక్ నాయకత్వంలోని నేషనలిస్ట్ పార్టీ తైవాన్‌లో స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment