గర్జించిన చెఫ్‌ | Ukraine Russia War: Wagner group Yevgeny Prigozhin about the Russian private military company | Sakshi
Sakshi News home page

గర్జించిన చెఫ్‌

Jun 25 2023 5:15 AM | Updated on Jun 25 2023 7:26 AM

Ukraine Russia War: Wagner group Yevgeny Prigozhin about the Russian private military company - Sakshi

2011లో మాస్కోలోని రెస్టారెంట్‌లో ప్రిగోజిన్‌తో పుతిన్‌

ఉక్రెయిన్‌ సహా వివిధ దేశాల మిలటరీ ఆపరేషన్లలో రష్యా అధినేత పుతిన్‌కు అండదండగా ఉన్న ప్రైవేట్‌ సైనిక సంస్థ వాగ్నర్‌ చీఫ్‌ యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ హఠాత్తుగా రష్యన్‌ సైన్యంపై తిరుగుబాటు చేయడానికి ఎన్నో కారణాలున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రలోవాగ్నర్‌ సంస్థకి తగిన గుర్తింపు రాలేదు. గుర్తింపు అంతా రక్షణ మంత్రి షొయిగు కొట్టేస్తున్నారని  రగిలిపోతున్నారు.

ఈ ఏడాది జనవరిలో ఉక్రెయిన్‌లో డొనెట్‌స్క్‌ ప్రాంతంలో సొలెడార్‌ను ఆక్రమించడంలో వాగ్నర్‌ సైనికులు ప్రాణాలు పణంగా పెడితే రష్యా రక్షణ శాఖ దానిని తమ ప్రతిభగా ప్రచారం చేసుకోవడం ప్రిగోజిన్‌ సహించలేకపోయారు. ఉక్రెయిన్‌లో ఇతర నగరాలు స్వా«దీనం చేసుకోవడానికి తాను సైన్యాన్ని సిద్ధం చేసినప్పటికీ రష్యా టాప్‌ జనరల్‌ వలెరి గెరసిమోవ్‌ మారణాయుధాల్ని సరఫరా చేయడంలో విఫలం కావడం కూడా ఆయనని అసహనానికి లోను చేసింది.

రక్షణ మంత్రి షొయిగు ఆదేశాల మేరకు వాగ్నర్‌ సంస్థ సైనిక శిబిరాలపై జరిగిన దాడుల్లో వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో తిరుగుబాటుకు సిద్ధమయ్యానని ప్రిగోజిన్‌ విడుదల చేసిన వీడియోల్లో ఆగ్రహంతో ఊగిపోతూ చెబుతున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని రష్యా సమరి్థంచుకునే స్థితిలో లేదని అందుకే మిలటరీ నాయకత్వాన్ని కూల్చేస్తామని వారి్నంగ్‌ ఇచ్చారు. ‘యుద్ధం అవసరం ఉంది. అందుకే సెర్గీ మార్షల్‌ అయ్యారు. ఆయన రెండో హీరోగా పతకాలు అందుకోవచ్చు. కానీ ఉక్రెయిన్‌ నిస్సైనీకరణ కు యుద్ధం అవసరం లేదు’అని ప్రిగోజిన్‌ చెబుతున్నారు. తాను చేస్తున్నది సైనిక తిరుగుబాటు కాదు, న్యాయ పోరాటమన్నది ప్రిగోజిన్‌ వాదనగా ఉంది.  

ఎవరీ ప్రిగోజిన్‌?  
ఒకప్పుడు అధ్యక్షుడు పుతిన్‌ దగ్గర చెఫ్‌. విదేశీ ప్రముఖులు ఎవరైనా వస్తే స్వయంగా గరిటె పట్టి వండి వడ్డించేవారు. ఇప్పుడు తుపాకీ పట్టుకొని ఎదురు తిరుగుతున్నారు. ఒక రెస్టారెంట్‌తో మొదలైన ఆయన ప్రయాణం ఒక దేశంపైనే తిరుగుబాటు చేసే స్థాయికి ఎదిగింది.  
► 1961 జూన్‌ 1న లెనిన్‌గ్రాడ్‌ (ప్రస్తుతం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌)లో జని్మంచారు.  
► టీనేజీలోనే దొంగతనాలు, దోపిడీలు చేసి 13 ఏళ్లపాటు జైల్లో ఉండి 1990లో బయటకు వచ్చాడు.  
► జైలు నుంచి బయటకి వచ్చాక ఫుడ్‌ బిజినెస్‌ మొదలు పెట్టారు. ధనికులు ఉండే ప్రాం­తంలో ఒక రెస్టారెంట్‌ ప్రారంభించారు.
► సంపన్నులతో పరిచయాలు పెంచుకొని వ్యాపారంలో ఎదిగారు.
► ప్రిగోజిన్‌కు చెందిన ఒక రెస్టారెంట్‌కు పుతిన్‌ వస్తూ ఉండడంతో ఆయనతో పరిచయమైంది. ఆ తర్వాత ప్రొగోజిన్‌ జీవితమే మారిపోయింది.  
► అప్పట్లో రష్యా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పుతిన్‌ ద్వారా రష్యా ప్రభుత్వం ఇచ్చే అధికారిక విందుల్ని ఏర్పాటు చేసే కాంట్రాక్ట్‌ లభించింది.
► 2001లో పుతిన్‌ అధ్యక్షుడయ్యాక ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాలల్లో ఫుడ్‌ కాంట్రాక్ట్‌లు కూడా ప్రిగోజిన్‌కే దక్కాయి. అధికారంలో ఉన్న వారితో ఎలా మెలగాలో ప్రిగోజిన్‌కు వెన్నతో పెట్టిన విద్య.  
► 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ రష్యాలో పర్యటించి విందుని ఆస్వాదించాక ప్రిగోజిన్‌ను ‘పుతిన్‌ చెఫ్‌’అని పిలిచారు. అప్పట్నుంచి అదే పేరు స్థిరపడింది.
► రష్యా సందర్శనకు విదేశీ ప్రముఖులు ఎవరు వచి్చనా పుతిన్‌తో వారు దిగిన ఫొటోల్లో ప్రొగోజిన్‌ తప్పనిసరిగా కనిపించేవారు. ఆతిథ్య రంగంలో కోట్లాది రూపాయల కాంట్రాక్ట్‌లు అతని సొంతమయ్యాయి.  
► 2012లో ప్రభుత్వ స్కూళ్లకు కేటరింగ్‌ నడపడం కోసమే 105 కోట్ల రూబుల్స్‌ కాంట్రాక్ట్‌ దక్కింది.
► అలా వచి్చన డబ్బులతో ప్రిగోజిన్‌ వాగ్నర్‌ అనే కిరాయి సైన్యాన్ని ఏర్పాటు చేశారు.  
► మొదట్లో వాగ్నర్‌ సంస్థ తనదేనని ఆయన బాహాటంగా చెప్పుకోలేదు. చిట్టచివరికి 2021లో వాగ్నర్‌ సంస్థ తనదేనని అంగీకరించారు.  
► 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కి అనుకూలంగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేయించింది ప్రొగోజిన్‌ అనే అనుమానాలున్నాయి. అప్పట్నుంచి
అమెరికా అతనిపై నిషేధం విధించింది.  


వాగ్నర్‌ సంస్థ ఏం చేస్తుందంటే..?  
► 2014లో క్రిమియాని ఆక్రమించాలని పుతిన్‌ ప్రణాళికలు సిద్ధం చేసినప్పుడు యెవ్‌గెనీ ప్రిగోజిన్‌తో తానే ఈ సంస్థను ఏర్పాటు చేయించారన్న ప్రచారమైతే ఉంది.
► క్రిమియా ఆక్రమణలో తమ చేతికి మట్టి అంటకుండా ఉండడానికే ఈ ప్రైవేటు సైన్యాన్ని పుతిన్‌ రంగంలోకి దింపారన్న ప్రచారం ఉంది.  
► రష్యాలో ప్రైవేటు సైన్యం చట్ట విరుద్ధం. అయినప్పటికీ రష్యా రక్షణ శాఖ కిరాయి సైన్యాన్ని చూసి చూడనట్టుగా వదిలేసేది.
► క్రిమియా తర్వాత తూర్పు ఉక్రెయిన్‌లో దాన్‌బాస్‌లో రష్యా అనుకూల వర్గానికి మద్దతుగా పని చేసి ఆ ఆపరేషన్‌లో విజయం సాధించింది.అలా వాగ్నర్‌ కార్యకలాపాలు విస్తరించాయి.
► సిరియాలో రష్యా అనుకూల బషర్‌ అల్‌ అసాద్‌ ప్రభుత్వాన్ని కాపాడడంలో కీలకంగా వ్యవహరించింది.  
► లిబియా, మొజాంబిక్, మాలి, సూడాన్, ది సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్, వెనెజులా ఇలా ఎక్కడ ఘర్షణలు అట్టుడికినా రష్యా జోక్యం ఉంటే అక్కడ తప్పకుండా వాగ్నర్‌ గ్రూప్‌ ప్రత్యక్షమయ్యేది.
► ఓ రకంగా వాగ్నర్‌ పుతిన్‌కు చెందిన కిరాయి సైన్య#గామారింది.
► ఈ గ్రూపులో మాజీ సైనికులే సభ్యులుగా ఉంటారు. బ్లూమ్‌బర్గ్‌ సంస్థ లెక్కల ప్రకారం ఈ గ్రూపులో 60 వేల మంది సైనికులు ఉన్నారు.  


ఉక్రెయిన్‌ యుద్ధంలో కీలకం  
ఏడాదిన్నర క్రితం ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలు పెట్టినప్పట్నుంచి వార్నర్‌ సైనికులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రెండు వారాల్లో నెగ్గేస్తామన్న పుతిన్‌ భ్రమలు తొలగిపోవడంతో వాగ్నర్‌ సైనికులు మరింత దూకుడుగా ముందుకెళ్లారు. ప్రొగోజిన్‌ వారు తన సైనికులేనంటూ బహిరంగంగా అంగీకరించడమే కాకుండా యుద్ధాన్ని ముమ్మరం చేశారు. ౖ ఖైదీలను సైనికులుగా చేర్చుకున్నారు. ఈ యుద్ధంలో సంస్థకు చెందిన 50 వేల మంది  పాల్గొన్నారు. కీలక నగరాల స్వా«దీనంలో వీరే  ముందున్నారు. బఖ్‌ముత్‌æ కోసం జరిగిన పోరులో 20 వేల మంది మరణించారు.     

– సాక్షి నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement