![Shelling in east Ukraine, Russia nuclear drill raises fear of war breaking out - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/21/2002158-UKRAINE-TENSIONS.jpg.webp?itok=ieMT6Rde)
తూర్పు ఉక్రెయిన్‌లో తుపాకీ తూటాల దెబ్బకు శిథిలమైన గోడ ముందు సైనికుడు
కీవ్: యూరప్‌లో యుద్ధ ఘంటికలు మోగుతున్నాయి. సైన్యానికి, రష్యా అనుకూల రెబెల్స్‌కు మధ్య నానాటికీ పెరుగుతున్న కాల్పుల మోతతో తూర్పు ఉక్రెయిన్ సరిహద్దులు దద్దరిల్లుతున్నాయి. వీటికి తోడు గత 24 గంటల్లో ఇరువైపులా కనీసం 1,500కు పైగా పేలుళ్లు జరిగినట్టు తెలుస్తోంది. దాంతో రెబల్స్ ఆక్రమిత ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు రష్యా బాట పడుతున్నారు. ఉక్రెయిన్‌కు మూడువైపులా రష్యా సైనిక మోహరింపులు రెండు లక్షలకు చేరాయన్న వార్తలు యూరప్ దేశాలను మరింత ఆందోళన పరుస్తున్నాయి.
శనివారం నాటి అణు, సంప్రదాయ సైనిక విన్యాసాలకు కొనసాగింపుగా నల్లసముద్ర తీరంలో రష్యా జోరుగా నావికా విన్యాసాలకు కూడా దిగింది. బెలారస్‌తో ఆదివారం ముగియాల్సిన సంయుక్త సైనిక విన్యాసాలు మరికొద్ది రోజులు కొనసాగుతాయని ప్రకటించి ఉద్రిక్తతలను మరింత పెంచింది. విన్యాసాలను పొడిగించినట్టే ఏదో సాకుతో రష్యా యుద్ధానికీ దిగుతుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆరోపించారు. దాన్ని నివారించేందుకు పుతిన్‌తో ఎక్కడైనా, ఎలాంటి రూపంలోనైనా చర్చలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సిద్ధమన్నారు.
తూర్పు ఉక్రెయిన్‌లోని తమ పౌరుల భద్రత ప్రమాదంలో పడిందనే నెపంతో యుద్ధానికి దిగవచ్చని నాటో దేశాలంటున్నాయి. అక్కడ రష్యన్లను ఊచకోత కోస్తున్నారని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల ఆరోపిస్తుండటమే ఇందుకు రుజువంటున్నాయి. పుతిన్ చెప్పిన చోట చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించినా రష్యా స్పందించలేదు. రష్యా అసలు చర్చలకు సిద్ధంగా ఉందా అన్నది అసలు ప్రశ్న అని యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మైఖేల్ అన్నారు.
దూకుడుగా క్షిపణి పరీక్షలు, దళాల మోహరింపులకు దిగుతున్న వాళ్లముందు చర్చల మంత్రం పఠించడం వృథా అని అభిప్రాయపడ్డారు. ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. అమెరికా, రష్యా విదేశాంగ మంత్రు లు ఆంటోనీ బ్లింకెన్, సెర్గీ లవ్రోవ్ 24న భేటీ కానున్నారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడు యూరప్ అంతటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొం టోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి తెగబడితే దానిపై అత్యంత కఠినమైన ఆంక్షలు విధించే విషయంలో యూరప్ దేశాలన్నీ కలిసి రావాలి.
– అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్
వెనక్కు వచ్చేయండి
ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి భారత దౌత్య సిబ్బంది కుటుంబీకులంతా వెంటనే వచ్చేయాలని కేంద్రం సూచించింది. అక్కడున్న భారతీయులంతా కూడా తక్షణం స్వదేశానికి వచ్చేయాలని మరోసారి చెప్పింది. ‘‘అందుబాటులో ఉన్న కమర్షియల్, చార్టర్డ్ ఫ్లైట్లలో బయల్దేరండి. వివరాల కోసం ఎంబసీని సంప్రదించండి.’’ అని పేర్కొంది. మంగళ, గురు, శనివారాల్లో ఉక్రెయిన్ నుంచి భారత్‌కు ఎయిరిండియా విమానాలున్నందున సిబ్బంది కుటుంబీకుల కోసం ప్రత్యేక విమానం పంపే ఆలోచనేదీ లేదని అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment