దాడి చేసి తప్పించుకోవడం ఇక సులువు కాదు
సాక్షి, సిటీబ్యూరో: ఆస్పత్రులపై దాడి చేసిన వారు ఇకపై తప్పించుకోలేరు. క్షణికావేశానికి లోనై దాడులకు పాల్పడితే.. ఎంతటివారైనా ఇకపై కటకటాలు లెక్కపెట్టాల్సిందే. వైద్యపరమైన నిర్లక్ష్యం, తప్పుడు వైద్యంతో రోగులు చనిపోతే వినియోగదారుల ఫోరం, పోలీసులను, కోర్టులను ఆశ్రయించాలే కానీ.. ఆగ్రహంతో వైద్యులపై దాడి చేయడం, ఆస్తుల విధ్వంసానికి పూనుకోవడం వల్ల రోగుల బంధువలే ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ వయలెన్స్ అండ్ డ్యామేజ్ టు ప్రాపర్టీ 2008 యాక్ట్ ఇదే అంశాన్ని స్పష్టం చేస్తుంది. సంతోష్‌నగర్‌కు చెందిన షమీమ్‌బేగం (45) శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతుండగా, బంధువులు ఆమెను చికిత్స కోసం వారం రోజుల క్రితం లక్డికాపూల్‌లోని గ్లెనిగల్ గ్లోబల్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. వైద్య పరీక్షల్లో ఆమెకు హెచ్1ఎన్1 స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కావడం, సోమవారం రాత్రి ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందడం, ఆగ్రహించిన మృతురాలి కుమారులు, ఇతర బంధువులు ఆస్పత్రిపై దాడి చేసి, ఆస్తుల విధ్వంసానికి దిగడం, అడ్డుకోబోయిన పోలీసులపై దాడికి యత్నించిడం, ఈ అంశాన్ని ఇరువర్గాలు సీరియస్‌గా తీసుకోవడం తెలిసిందే.
చట్టం నుంచి తప్పించుకోలేరు..
ఇప్పటికే ఆసుపత్రి ముఖ్య భద్రతాధికారి మహ్మద్ అబ్దుల్ ఘనీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పో లీసులు మృతురాలి కుమారులు అహ్మద్ అలీ, బ ర్కత్ అలీ, ముస్తఫా అలీతో పాటు మరికొందరిపై 148, 324, 332, 353, 427, ఆర్/డబ్ల్యూ 149 ఐ పీసీతో పాటు ‘తెలంగాణ మెడికేర్ సర్వీస్ ప ర్సన్స్, ఇనిస్టిట్యూషన్స్ సెక్షన్ 4 ప్రకారం’ నాన్ బె యిలబుల్ కేసులను నమోదు చేశారు. తెలంగాణ మెడికేర్ సర్వీస్ పర్సన్ అండ్ మెడికేర్ సర్వీస్ ఇనిస్టిట్యూషన్స్ యాక్ట్–2008ని తొలిసారిగా అమలు చేశారు. మృతురాలి తరపు బంధువులు దాడి చే సినట్లు నేరం రుజువైతే మూడేళ్ల జైలు శిక్షతో పా టు ధ్వంసమైన ఆస్తులకు రెండింతలు చెల్లించా లని ఈ చట్టం చెబుతోంది. ఒక వేళ నష్ట పరిహారా న్ని చెల్లించేందుకు నిందితుల వద్ద డబ్బు లే కపోతే.. రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను అ మలు చేసి, వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే అ వకాశం కూ డా ఉంది. ఇదిలా ఉంటే మృతురాలి తనయుల ఫిర్యాదు మేరకు ఆసుపత్రి నిర్వాహకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసుపత్రిలో సీసీటీవీ ఫుటేజీను, డిజిటల్ వీడియో రికార్డింగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నింధితులను అదుపులోకి తీసుకున్నారు.
నిరసనకు దిగిన వైద్యులు ..
రోగి తరపు బంధువులు ఆస్పత్రిపై దాడి చేసి, ఆస్తులను ధ్వంసం చేయడంపై వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆస్పత్రి ముందు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ‘సేవ్ డాక్టర్స్ సేవ్ లైఫ్స్’ అంటూ నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని వివిధ ఆస్పత్రులకు చెందిన పలువురు వైద్యులు ఇందులో పాల్గొన్నారు.
అభద్రతా భావానికి గురికావద్దు: ఏసీపీ
వైద్యుల నిరసన విషయం తెలుసుకున్న సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి ఆస్పత్రి వద్దకు చేరుకుని వైద్యులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. నింధితులపై ఇప్పటికే క్రైం నం 691/2018 అండర్ సెక్షన్ 178, 324, 332 పోలీసులను అడ్డుకోవడం, 427 రెడ్ విత్ 149 ఐపీసీ సెక్షన్ 4 ఆఫ్ తెలంగాణ మెడికేర్ సర్వీస్ పర్సన్స్, మెడికేర్ సర్వీస్ ఇనిస్టిట్యూషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ వయోలెన్స్ ఆఫ్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ 2008 ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాంమని తెలిపారు. డాక్టర్లు అభద్రతా భావానికి లోనుకావాల్సిన పనిలేదని ఏసీపీ తెలిపారు.
వైద్యుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు
లక్టీకపూల్లోని గ్లెనిగల్ గ్లోబల్ ఆస్పత్రిపై దాడి అత్యంత హేయమైన చర్య అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ నర్సింగ్ హోమ్స్ అసోషియేషన్లు సంయుక్తంగా ప్రకటించాయి. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ప్రతాప్‌రెడ్డి, హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రవీందర్రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీఎన్.రెడ్డి, డాక్టర్ సంపత్‌రావులతో కూడిన బృందం మాట్లాడింది.
రోగి బంధువుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అన్నారు. దాడుల వల్ల వైద్యుల ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క వైద్యుడు కూడా రోగిని కాపాడేందుకే యత్నిస్తాడని, ఉద్దేశ పూర్వకంగా ఎవరూ రోగి మృతికి కారణం కారని స్పష్టం చేశారు. హెచ్1ఎన్1తో మృతి చెందిన షమీమ్‌బేగం(45) బంధువులు తొలుత ఏమాత్రం సహాకరించక పోయినా మానవతా ధృక్పథంతో వారు వైద్యసేవలు అందించారని, బాధితురాలిని కాపాడేందుకు వారు అన్ని ప్రయత్నాలు చేశారని, ఆరో గ్యపరిస్థితి విషమించి ఆకస్మిక గుండెపోటుతో ఆమె మృతి చెందింద న్నారు. ఈ సమయంలో సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం కానీ, చికిత్సల్లో లోపాలు కానీ లేవని తమ పరిశీలనలోనూ తేలిందన్నారు.