సాక్షి, అమరావతి: పేదలు పస్తులుండకుండా.. ఆహార భద్రత ప్రమాదంలో పడకుండా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. మరోవైపు మానవాళి మనుగడకు వ్యవసాయం కీలకమని గ్రహించి రైతుల పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేస్తోంది. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఒకవైపు పేదలకు ఆహార భద్రత కింద భరోసా కల్పించడం.. మరోవైపు రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండటంతో పేదలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: జనవరి 1 నుంచి ఇళ్ల వద్దకే నాణ్యమైన బియ్యం)
ధాన్యం ‘ఏ’ గ్రేడ్ రకం క్వింటాల్‌కు రూ.1,888, సాధారణ రకం క్వింటాల్‌కు రూ.1,868 ప్రకారం కేంద్రం మద్దతు ధరలు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వమే రైతుల కళ్లాల వద్దకు వెళ్లి మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. పేదల ఆకలి తీర్చేందుకు.. ఆహార భద్రత చట్టం అమలుకు వేల కోట్లు ఖర్చు చేసేందుకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెనుకాడటం లేదు. వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు బియ్యం కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల చొప్పున కిలో రూ.1కే బియ్యం పంపిణీ చేస్తోంది. అంత్యోదయ అన్నయోజన కార్డున్న కుటుంబానికి నెలకు 35 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు 6 నెలల నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు అంగన్‌వాడీల ద్వారా ఉచిత పౌష్టికాహారం అందిస్తోంది. ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థలు నిర్వహించే పాఠశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. (చదవండి: పెట్టుబడి.. గిట్టుబాటు కావాలి: సీఎం జగన్)
ప్రతి నెలా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ
ఆహార భద్రత చట్టం అమలు కోసం ప్రభుత్వం ఏటా రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో 1.52 కోట్లకు పైగా బియ్యం కార్డులున్నాయి. వీటి కోసం ప్రతి నెలా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తోంది. ఆహార భద్రత చట్టం ప్రకారం.. పట్టణాల్లో 40 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం కార్డుదారులకు మాత్రమే కేంద్రం సబ్సిడీ ఇస్తోంది. మిగిలిన వారికి సొంత ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తోంది. దీంతో ఏటా రూ.5 వేల కోట్ల వరకు ప్రభుత్వంపై భారం పడుతోంది.
కొనసాగుతున్న ఉచిత సరుకుల పంపిణీ
కోవిడ్ సమయంలో ఉపాధి లేక పేదలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నెలకు ఒక్కో వ్యక్తికి 10 కిలోల బియ్యం, కుటుంబానికి రెండు కిలోల పప్పు దినుసులు ఏప్రిల్ నుంచి ఉచితంగా పంపిణీ చేస్తోంది. బియ్యం కార్డుల్లో నమోదై ఉన్న 4.47 కోట్లకు పైగా కుటుంబ సభ్యులకు ఉచితంగా సరుకులు అందుతున్నాయి. ఇప్పటికే రూ.13 వేల కోట్ల విలువ చేసే బియ్యం, రూ.1,500 కోట్ల విలువ చేసే పప్పు దినుసులు పేదల ఇళ్లకు ఉచితంగా చేరాయి. ప్రస్తుతం 15వ విడత ఉచిత సరుకుల పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల 20 నుంచి 16వ విడత ఉచిత సరుకులను పంపిణీ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment