సాక్షి, హైదరాబాద్: నగరంలో కల్తీ ఆహారం కారణంగా ఆస్పత్రులకు వెళ్తున్నవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. జీహెచ్‌ఎంసీతో పాటు ఏ ప్రభుత్వ విభాగం కూడా దీనిపై శ్రద్ధ చూపకపోవడంతో నగరంలో కల్తీకి అడ్డుకట్ట పడటం లేదు. వివిధ రంగాల్లో ముందంజలో నిలుస్తున్న హైదరాబాద్ నగరం కల్తీలో కూడా నెంబర్‌వన్‌గా మారనుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నగరంలో స్ట్రీట్‌ఫుడ్ కేంద్రాలు లెక్కకు మించి ఉండటం తెలిసిందే. వారు సరైన శుచి శుభ్రత పాటించకపోవడంతో తాగే నీటి నుంచి తినే ఆహారపదార్థాల వరకు కలుషితమవుతున్నాయి.
కొనుగోలుకు ముందే పప్పులు ఉప్పుల నుంచి నూనెల దాకా జరుగుతున్న కల్తీ వల్ల పరిస్థితులు మరింత విషమంగా మారుతున్నాయి. కల్తీ నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన జీహెచ్‌ఎంసీ, ఐపీఎంలలోని ఫుడ్‌సేఫ్టీ అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో జీహెచ్‌ఎంసీలో కేవలం ముగ్గురు మాత్రమే ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఉండేవారు.
కోటికి జనాభా ఉన్న నగరానికి ముగ్గురు సరిపోనందునే ఆహారకల్తీని కట్టడి చేయలేకపోతున్నామని ఉన్నతాధికారులు పేర్కొనేవారు. పరిస్థితిని గ్రహించిన ప్రభుత్వం కొత్తగా ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్లను నియమించడంతో వారి సంఖ్య 22కు పెరిగింది. అయినా పరిస్థితి గతం కంటే భిన్నంగా కనిపించడం లేదు. లెక్కల్లో మాత్రం తనిఖీల సంఖ్య పెరిగినప్పటికీ, గుర్తించిన కల్తీదారులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ ఉన్నప్పటికీ..
- కల్తీ నిరోధానికి ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ) ఉన్నప్పటికీ అది అమలవుతున్న దాఖలాల్లేవు. ఈ యాక్ట్ మేరకు, అన్ని ఆహార విక్రయ కేంద్రాలతోపాటు ఉత్పత్తి కేంద్రాల వివరాలు జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాలి. నిరీ్ణత వ్యవధుల్లో తనిఖీలు జరగాలి. కల్తీని బట్టి కఠిన చర్యలుండాలి. ఉత్పత్తి స్థానం నుంచి ప్యాకింగ్, రవాణా, విక్రయం, వినియోగం వరకు ఎక్కడా కల్తీ జరగకుండా ఉండాలంటే తగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థ ఉండాలి. కానీ ఇందులో ఏదీ అమలు జరగడం లేదు.
- కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే రూ. 10 లక్షల వరకు జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి జీవిత ఖైదు వరకు జైలుశిక్ష విధించవచ్చు.
- కల్తీని నిర్ధారించేందుకు తగినన్ని పరీక్షల కేంద్రాలుండాలి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఒకే పరీక్షా కేంద్రం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా పరీక్షాకేంద్రమంటూ లేకపోవడాన్ని జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలోనూ సభ్యులు ప్రస్తావించారు
- వీటిల్లో కల్తీ ఎక్కువ..
- కల్తీ ఎక్కువగా జరిగేందుకు ఆస్కారమున్న వాటిల్లో టీ పొడి నుంచి నూనెల దాకా ఎన్నో ఉన్నాయి. పాలు, తేనె, మసాలా దినుసులు, ఐస్‌క్రీమ్స్, తృణధాన్యాలు, పిండి, కాఫీ, టొమాటో సాస్, విజిటబుల్ ఆయిల్స్, నెయ్యి తదితరమైనవి వీటిల్లో ఉన్నాయి. ఈ కల్తీవల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు.
- జంతు కళేబరాలు, కొవ్వు , ఎముకల నుంచి తయారు చేస్తున్న కల్తీనూనె నగరంలో ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్లకు తెలిసినా పట్టించుకోవడం లేదు.
- చర్యలే లేవు..
- పెద్దహోటళ్లనుంచి చిన్నతోపుడు బండ్ల దాకా ఆహారకల్తీపై కానీ.. పరిసరాల పరిశుభ్రత గురించి కానీ పట్టించుకుంటున్నవారు లేరు. పనిఒత్తిడి , వంట చేసుకునే సమయంలేక ఆన్‌లైన్‌ద్వారా బుక్ చేసుకుంటున్న వారు పెరిగిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో పాడైపోయిన, తినడానికి పనికిరాని ఆహారాన్నే పంపిణీ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడంతో శుచి లేకపోవడం, కల్తీ వంటివి నిరాటంకంగా జరుగుతున్నాయి.
– భూషణ్‌చారి, అంబర్‌పేట
Comments
Please login to add a commentAdd a comment