మాజీ సైనికులకు వరం
* ఇకపై ర్యాంకులవారీగా సమాన పెన్షన్
* చిరకాల డిమాండ్‌కు కేంద్రం అంగీకారం
* 30 లక్షల మంది మాజీ సైనికులకు లబ్ధి
న్యూఢిల్లీ: ఒక ర్యాంకుకు ఒకే రకమైన పెన్షన్ ఉండాలన్న సాయుధ బలగాల దీర్ఘకాలిక డిమాండ్‌కు కేంద్రం అంగీకారం తెలిపింది. సోమవారం మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి చిదంబరం ఈ మేరకు ప్రకటన చేశారు. దీని అమలు కోసం 2014-15లో రూ.500 కోట్లను రక్షణ బడ్జెట్ ఖాతాకు బదిలీ చేస్తున్నట్టు తెలిపారు. దాదాపుగా 30 లక్షల మంది మాజీ సైనికులకు ఈ నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది. ఒకే ర్యాంకు, ఒకే సర్వీసున్న మాజీ సైనికులకు వారెప్పుడు రిటైరయ్యారన్న దానితో నిమిత్తం లేకుండా ఇకపై సమాన పెన్షన్ లభించనుంది. 2006కు ముందు రిటైరైన సైనికోద్యోగులకు ఆ తర్వాత రిటైరైన వారితో పోలిస్తే ప్రస్తుతం తక్కువ పెన్షన్ లభిస్తోంది.
అది వారికంటే తక్కువ ర్యాంకుతో రిటైరైన వారికిస్తున్న పెన్షన్ కంటే కూడా తక్కువగా ఉంది! ఈ తేడాలను సరిచేస్తూ తీసుకున్న తాజా నిర్ణయం 2014-15 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈ నిర్ణయంపై మాజీ సైనికోద్యోగులు పెదవి విరుస్తున్నారు. పథకాన్ని పూర్తిగా అమలు చేసేందుకు కనీసం రూ.2,500 కోట్లు కావాల్సి ఉంటే రూ.500 కోట్లు ఏ మూలకు చాలతాయని ప్రశ్నిస్తున్నారు. పైగా ఈ నిర్ణయాన్ని 2006 నుంచి వర్తించేలా అమలు చేయకపోవడాన్ని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
రాహుల్ వల్లే: కాంగ్రెస్
లోక్‌సభ ఎన్నికల దృష్టితో తీసుకున్న ఈ నిర్ణయం తాలూకు ఘనతను సబ్సిడీ సిలిండర్ల సంఖ్య పెంపు మాదిరిగానే రాహుల్‌గాంధీకే కట్టబెట్టేలా కాంగ్రెస్ ముందే వ్యూహరచన చేసింది. అందులో భాగంగా ఆయన నోట ముందుగానే ఈ డిమాండ్‌ను విన్పించింది. ఒక ర్యాంకు, ఒకే పెన్షన్ విధానం వీలైనంత త్వరగా అమలయ్యేలా కృషి చేస్తానని ఫిబ్రవరి 14న మాజీ సైనికోద్యోగులకు రాహుల్ హామీ ఇచ్చారు. తర్వాత మూడు రోజులకే చిదంబరం నోట ఆ మేరకు విధాన ప్రకటన వెలువడింది! ఆ వెంటనే సోనియా నివాసం 10, జన్‌పథ్‌లో రాహుల్ విలేకరులతో మాట్లాడారు. ఈ నిర్ణయంపై హర్షం వెలిబుచ్చడంతో పాటు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఇదో చరిత్రాత్మక నిర్ణయం. దేశం కోసం పోరాడేందుకు నిత్యం సన్నద్ధంగా ఉండే బలగాలకు అన్నిరకాలుగా మద్దతుగా నిలవడం మన కర్తవ్యం’’ అన్నారు.
రాహుల్ చొరవ వల్లే ఈ నిర్ణయం వచ్చిందంటూ కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా స్తోత్రపాఠాలు వల్లెవేశారు. గృహావసరాల సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను ఏడాదికి 9 నుంచి 12కు పెంచాల్సిందేనని ఏఐసీసీ సదస్సు వేదికగా గత నెలలో రాహుల్ డిమాండ్ చేయడం, ఆ మేరకు పెంచేస్తున్నామంటూ అదే వేదిక నుంచి పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ నాటకీయ ఫక్కీలో ప్రకటన చేయడం తెలిసిందే. భారత సైన్యంలో ప్రస్తుతం 14 లక్షల మంది సైనికులున్నారు. రిటైరైన సైనికుల సంఖ్య 24 లక్షలు. హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానాల్లో వీరిది బలమైన ఓటు బ్యాంకు కావడం లోక్‌సభ ఎన్నికల్లో ఆయా చోట్ల తనకు కలిసొస్తుందన్నది కాంగ్రెస్ అంచనా.
‘రక్షణ’పై శీతకన్నే
న్యూఢిల్లీ: 2014-15 మధ్యంతర బడ్జెట్‌లో రక్షణ శాఖకు కేటాయింపులు 10 శాతం పెరిగాయి. గతేడాది రూ.2.03 లక్షల కోట్లున్న కేటాయింపులను తాజాగా రూ.2.24 లక్షల కోట్లకు చిదంబరం పెంచారు. అయితే బలగాల ఆధునికీకరణలో భాగంగా తెర తీసిన పలు ఆయుధ సేకరణ ఒప్పందాలు కొలిక్కి వస్తున్న తరుణంలో ఈ మొత్తం ఏ మేరకు చాలుతుందన్నది సందేహమే. పైగా ఆధునికీకరణ కోసం అదనంగా రూ.40 వేల కోట్లు కేటాయించాలన్న రక్షణ శాఖ విజ్ఞప్తిని గతేడాదిలాగే ఈసారీ చిదంబరం తోసిపుచ్చారు. ఏడాది కాలంగా తెర పైకి వచ్చిన పలు రక్షణ కుంభకోణాల నేపథ్యం లో ఈ రంగాన్ని దేశీ బాట పట్టించాలని, అందులో భాగంగా సాయుధ సంపత్తి దిగుమతిని వీలైనంతగా తగ్గించాలని ఇటీవల నిర్ణయించారు. అయినా పలు దేశాలతో పలు ఆయుధ కొనుగోలు ఒప్పందాలు ఇప్పటికే తుది దశలో ఉన్నాయి.
వాటిలో కొన్ని:
- 126 బహుళార్థ సాధక యుద్ధ విమానాలు
- 22 అపాచీ యుద్ధ హెలికాప్టర్లు
- 15 చింకూ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లు
- 126 రాఫెల్ యుద్ధ విమానాలు
- రష్యాతో ఐదో తరం యుద్ధ విమాన ఒప్పందం తుది దశ చర్చల్లో ఉంది. దీనిపై వచ్చే 10 నుంచి 15 ఏళ్లలో ఏకంగా రూ.1.5 లక్షల కోట్లు వెచ్చించాలని సంకల్పించారు!
లోక్‌పాల్‌కు రూ. 2 కోట్లే
దేశంలో అవినీతి నిరోధానికి ఉద్దేశించిన లోక్‌పాల్‌కు ఈ బడ్జెట్‌లో నామమాత్రంగా కేవలం రూ. 2 కోట్లనే కేటాయించింది. లోక్‌పాల్ బిల్లుకు ఈ ఏడాది జనవరి 1న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సంస్థాగత ఖర్చులకు ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు ప్రణాళికేతర పద్దుల కింద రూ.20.35 కోట్లను కేటాయించింది.