డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ప్రధానిని విమర్శించే అర్హత లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరం అన్నారు. వేలూరు జిల్లా అరక్కోణం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్‌కు మద్దతుగా ఆర్కాడులో ఆయన ప్రచార సభ నిర్వహించారు.
వేలూరు, న్యూస్‌లైన్: డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ప్రధానిని విమర్శించే అర్హత లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరం అన్నారు. వేలూరు జిల్లా అరక్కోణం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్‌కు మద్దతుగా ఆర్కాడులో ఆయన ప్రచార సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పాలనను అందించిందన్నారు. అయితే రాష్ట్ర పార్టీలు ఏవైనా ఏనాటికీ దేశాన్ని పరిపాలించే అవకాశం ఉండదన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశ ప్రజల కోసం పాటు పడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. పదేళ్లలో పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ బినామిగా ఉన్న భారతీయ జనతా పార్టీకి దేశాన్ని పాలించే అర్హత లేదన్నారు. మతతత్వ పార్టీ బీజేపీకి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్రంలో నరేంద్రమోడి గాలి వీస్తోందని పలు పార్టీలు చెబుతున్నాయని, అయితే రాష్ట్ర ప్రజలకు నరేంద్రమోడి ఎవరనేది తెలియదనే విధంగా ఉన్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు లేరని కొన్ని ప్రాంతాల్లో చెబుతున్నారని, కార్యకర్తల గుండెల్లో కాంగ్రెస్ పార్టి చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. సంక్షేమ పథకాలను గుర్తించుకుని ప్రతి ఒక్కరు చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే జ్ఞానశేఖరన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.