దక్షిణాదిలో మోడీ హవా | narendra modi hawa in south | Sakshi
Sakshi News home page

దక్షిణాదిలో మోడీ హవా

Published Mon, Mar 24 2014 12:49 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

దక్షిణాదిలో మోడీ హవా - Sakshi

దక్షిణాదిలో మోడీ హవా

సాక్షి, చెన్నై:
టీ నగర్‌లోని కమలాలయంలో ఆదివారం ఎం వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలు లోక్‌సభ ఎన్నికల తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారన్నారు. మోడీ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమ ఓటును ఆయుధంగా మలుచుకునేందుకు ప్రజలు సిద్ధం అయ్యారని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
 దీన్ని బట్టి చూస్తే, కాంగ్రెస్ మీద ప్రజలు ఏ మేరకు ఆవేశంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. అవినీతి, కుంభకోణాల కాంగ్రెస్ పాలకులు దేశ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు సైతం యూపీఏపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయని, అందుకే అనేక రాష్ట్రాల్లో తమ నాయకత్వాన్ని దక్షిణాదిలో మోడీ హవా బలపరిచేందుకు సిద్ధ పడుతున్నాయని పేర్కొన్నారు.
 
 తమిళనాడులో 45 ఏళ్ల తర్వాత డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఓ మెగా కూటమి ఆవిర్భవించడం శుభసూచకంగా అభివర్ణించారు. అది కూడా బీజేపీ నేతృత్వంలో కూటమి ఆవిర్భవించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
 
 వలసలు : దేశ వ్యాప్తంగా మోడీ పవనాలు వీస్తున్నాయని, దక్షిణాదిలోనూ ఆయన ప్రభంజనం రాబోతున్నదని వెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీలోకి చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుండడమే ఇందుకు నిదర్శమన్నారు. ఇతర పార్టీల నుంచి వలసలు బయలు దేరడంతో పాటుగా సెలబ్రటీలు, ప్రజాదరణ కలిగిన వాళ్లు సైతం మోడీ పక్షాన నిలబడే దిశగా తమ గూటికి చేరుతున్నారని వివరించారు. దేశ సమగ్రాభివృద్ధి మోడీ ద్వారా సాధ్యమన్న విషయాన్ని యువత గుర్తించిందని, వారు తాము సైతం అని కదులుతున్నారని పేర్కొన్నారు.
 
 అత్యధిక సీట్ల కైవశం: జాతీయ స్థాయిలోనూ, తమిళనాడులోని బీజేపీ కూటమి అత్యధిక సీట్లను కైవశం చేసుకోవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో ఏర్పడిన కూటమి గెలుపు కూటమి అని, ఈ కూటమి అభ్యర్థులను, మోడీ ప్రభంజనాన్ని ఎదుర్కోవడం ఈ పర్యాయం అన్నాడీఎంకే, డీఎంకేలకు అంత సులభం కాదన్నారు. దేశంలో బీజేపికి 230-240 సీట్లు, మిత్రులతో కలుపుకుంటే 300 సీట్లు సాధించి తీరుతామన్నారు.
 
 మోడీ పీఎం కావడం తథ్యమని, ఇందులో ఎలాంటి మార్పు లేదని పేర్కొంటూ, కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులు కీలక భూమిక పోషించడం ఖాయం అని స్పష్టం చేశారు. తమిళనాడులోని తమ కూటమిలో ఉన్న అన్ని పార్టీలకు అన్ని నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు ఉందన్నారు.
 
 బోణీ: తమిళనాడు నుంచి బీజేపీ కూటమి ప్రతినిధులు అత్యక శాతం మంది పార్లమెంట్‌లో అడుగు పెట్టి తీరుతారని, కేరళలో తాము ఈ సారి బోణీ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. సీమాంధ్ర, తెలంగాణల్లోను అత్యధిక సీట్లను కైవశం చేసుకుంటామని, అక్కడి సమగ్రాభివృద్ధి లక్ష్యంగా బీజేపీ చర్యలు తీసుకుంటుందన్నారు. సీమాంధ్రకు కొత్త రాజధానితో పాటుగా అక్కడి జిల్లాలో అన్ని రకాల అభివృద్ధి, విద్య, వైద్య పరంగా సేవలను మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని పేర్కొన్నారు.
 హైదరాబాద్ విమానాశ్రయానికి ఎన్‌టీఆర్ పేరును మార్చి రాజీవ్ గాంధీ పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పాలన తీరు అలా ఉంటుందని వివరించారు. శ్రీలంకలోని ఈలం తమిళులకు సమన్యాయం లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని, జాలర్లపై దాడులకు ముగింపు పలుకుతామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బిజేపీలో అసంతృప్తి అన్న పదానికి ఆస్కారం లేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
 
 అసంతృప్తితో ఉన్నట్టుగా తమ సీనియర్లు ఎవరైనా ప్రెస్ మీట్‌లు పెట్టి తమరికి చెప్పారా..? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. అద్వాని, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సింగ్‌లను పార్టీ పక్కన పెట్ట లేదని, మోడీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం లేదని స్పష్టం చేశారు.
 
 వెంకయ్య నాయుడు సమక్షంలో కృష్ణగిరి, కన్యాకుమారిలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సమావేశంలో బీజేపీ మహిళా నాయకురాలు తమిళి సై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్, సీనియర్  నాయకుడు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం దక్షిణ చెన్నై పార్టీ అభ్యర్థి ఇలగణేషన్‌కు మద్దతుగా జరిగిన ప్రచార సభలో వెంకయ్య నాయుడు పాల్గొని ఓటర్లను ఆకర్షించే ప్రసంగం చేశారు.
 
 ప్రచారానికి శ్రీకారం: బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ కన్యాకుమారిలోఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ స్థానం బరిలో ఆయన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వాడ వాడల్లో ఓట్ల వేటలో పడ్డ పొన్ రాధాకృష్ణన్ కన్యాకుమారిలో హార్బర్ ఏర్పాటు చేస్తానని, విమానాశ్రయం నెలకొల్పుతానని, పర్యాటక కేంద్రాన్ని దేశంలోనే తొలి స్థానంలో నిలబెడుతానని ఓటర్లకు హామీలు గుప్పించడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement