సాక్షి ప్రతినిధి, చెన్నై/మదురై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఆయా పార్టీల నేతలు మహిళలను దారుణంగా అవమానిస్తున్నారని ఆరోపించారు. ఆయన శుక్రవారం మదురై, కన్యాకుమారిలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ సమగ్రాభివృద్ధి, సౌభాగ్యవంతమైన సమాజం కోసం కలలుగన్నారని, ఆయన దార్శనికత తమకు స్ఫూర్తినిస్తోందని చెప్పారు. డీఎంకే, కాంగ్రెస్ కూటమికి ఒక అజెండా అంటూ లేదని ఎద్దేవా చేశారు. ఆ కూటమి అధికారంలోకి వస్తే శాంతిభద్రతలు పూర్తిగా క్షీణిస్తాయని, ప్రజల రక్షణ, గౌరవానికి గ్యారంటీ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు మూర్ఖులు కాదని, అబద్ధాలు చెప్పడం మానుకోవాలని డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు హితవు పలికారు.
కాంగ్రెస్, డీఎంకేలు సిగ్గుపడాలి
‘‘నారీశక్తి, మహిళల సాధికారతతో మదురై ప్రాంతం ముడిపడి ఉంది. మహిళల ప్రగతిని కాంక్షిస్తూ ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్ వంటి పథకాలను అమలు చేస్తున్నాం. డీఎంకే, కాంగ్రెస్ నేతలు మహిళలను పదేపదే అవమానిస్తున్నారు. శాంతిభద్రతలకు మారుపేరైన మదురైని మాఫియా రాజ్యంగా మార్చేందుకు గతంలో డీఎంకే ప్రయత్నించింది. 2011లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం జల్లికట్టు క్రీడలను నిషేధించింది. అప్పుడే డీఎంకే నేతలు కేంద్రంలో మంత్రులుగా ఉన్నప్పటికీ నోరు మెదపలేదు. జల్లికట్టును కాంగ్రెస్ నేత ఒకరు క్రూరమైన క్రీడగా అభివర్ణించారు. అందుకు కాంగ్రెస్, డీఎంకేలు సిగ్గుపడాలి. తమిళ ప్రజల మనోభావాలు మాకు తెలుసు.
జల్లికట్టును కొనసాగిస్తూ ఏఐఏడీఎంకే ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను మేము(కేంద్రం) ఆమోదించాం. ప్రజల కోసం పని చేసేవారిపై అబద్ధాలను ప్రచారం చేసే విద్యలో కాంగ్రెస్, డీఎంకే ఆరితేరాయి. ఆ పార్టీలు చాలా ఏళ్లు అధికారంలో ఉన్నాయి. మదురైకి ఎయిమ్స్‌ను తీసుకురావాలన్న ఆలోచన చేయలేకపోయాయి. మా ప్రభుత్వం మదురైకి ఎయిమ్స్‌ను మంజూరు చేసింది. తమిళనాడుతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 130 కోట్ల భారతీయులకు నిజాయతీగల మార్పును అందించింది.
ప్రతి భారతీయుడి స్వేదంతోనే జాతి నిర్మాణం ప్రజలకు సేవ చేసే విషయంలో వారి కులం, నమ్మకాలను మేము చూడం. మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడుతాం. ప్రస్తుతం తమిళ జాలర్లు ఎవరూ శ్రీలంక అదుపులో లేరు. కాంగ్రెస్, డీఎంకే పెద్దలు వారి కుమారులు, కుమార్తెలు, మనవళ్లను పదవుల్లో కూర్చోబెట్టాలని ఆరాటపడుతున్నారు. ప్రజల కుమారులు, కుమార్తెల గురించి వారు పట్టించుకోవడం లేదు. ప్రతి భారతీయుడి స్వేదంతోనే జాతి నిర్మాణం జరిగింది. కేవలం ఒకటి రెండు కుటుంబాలకు చెందిన నాలుగు తరాలతో కాదు. కుటుంబ, వారసత్వ రాజకీయాలను దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారు’’ అని ప్రధాని మోదీ వివరించారు.
మహిళలను అవమానిస్తారా?
Published Sat, Apr 3 2021 4:35 AM | Last Updated on Sat, Apr 3 2021 5:52 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment