అమెరికా డేటాపై అతి స్పందన
అమెరికా డేటాపై అతి స్పందన
Published Sat, Aug 17 2013 3:12 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం వల్లే దేశీ మార్కెట్లు శుక్రవారం భారీగా పతనమయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారు. అమెరికాలో డేటాపై దేశీ మార్కెట్లు మరీ అంతగా స్పందించాల్సిన అవసరం లేదని, దేశీ పరిస్థితులకు అనుగుణంగా వర్తించాలని ఆర్థిక మంత్రి పి. చిదంబరం వ్యాఖ్యానించారు. మార్కెట్లో ప్రశాంత వాతావరణం నెలకొన్న అనంతరం ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని గుర్తించగలరనడంలో తనకెలాంటి సందేహమూ లేదన్నారు. ‘ఇది ప్రశాంత ంగా ఉండాల్సిన తరుణం. ఇప్పటిదాకా ఏం చేశామో ఒకసారి మననం చేసుకోవాలి.
వచ్చే వారం ఎలా ఉంటుందో చూడాలి’ అని చిదంబరం చెప్పారు. జాతీయ నైపుణ్య సర్టిఫికేషన్ పథకం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. బుధవారం నుంచి శుక్రవారం ఉదయం దాకా భారత ఎకానమీలో ఎలాంటి పెనుమార్పులు లేకపోయినప్పటికీ.. మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయని, దాని ప్రభావం రూపాయిపై కూడా కనిపించిందని వివరించారు. పరిస్థితులు చక్కబడేందుకు ఇప్పటిదాకా అనేక చర్యలు తీసుకున్నామని, ఇంకా అనేకం తీసుకుంటూనే ఉన్నామని చిదంబరం పేర్కొన్నారు. తొలి త్రైమాసిక వృద్ధి రేటు ఎలా ఉందో చూసిన తర్వాత మరిన్ని నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు.
ఫండమెంటల్స్ మారిపోవు..
అమెరికాలో ఉద్యోగకల్పన గణాంకాల వల్ల భారత్ ఎకానమీ ఫండమెంటల్స్ ఒక్కసారిగా ఎలా మారిపోతాయని చిదంబరం ప్రశ్నించారు. అమెరికాలో ఉద్యోగాలు పెరిగినా, తగ్గినా దేశీ ఆర్థిక వ్యవస్థకు సంబంధం లేని అంశమన్నారు. అయినా సరే మార్కెట్లు మాత్రం అమెరికా నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చినా స్పందించేస్తుంటాయని చిదంబరం చెప్పారు. ఇలాంటివి చూస్తుంటే అసలెందుకు రియాక్ట్ అయ్యాయన్న దానిపై కొన్ని సార్లు తనకే ఆశ్చర్యం వేస్తుంటుందని ఆయన పేర్కొన్నారు. గురువారం సెలవు కావడంతో రెండు రోజులు జరగాల్సిన పతనం ఒకే రోజున జరగడంతో ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.
Advertisement
Advertisement