పాపమంతా ప్రభుత్వానిదే: దువ్వూరి
పాపమంతా ప్రభుత్వానిదే: దువ్వూరి
Published Fri, Aug 30 2013 2:46 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM
ముంబై: మరో వారం రోజుల్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ)గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రభుత్వంపైనా, ఆర్థిక మంత్రి పీ చిదంబరంపైనా తన విమర్శనాస్త్రాలకు మరింత పదును పెంచారు. వృద్ధిని పణంగా పెట్టి మరీ కఠిన పరపతి విధానాన్ని పాటిస్తున్నారంటూ ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. ప్రస్తుత ఆర్థిక కష్టాలకు ప్రభుత్వం అసంబద్ధ ఆర్థిక విధానాలే కారణమని విమర్శించారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటనల వల్లే రూపాయి కుప్పకూలిందంటూ తప్పంతా ఫెడ్‌పై నెట్టేసేందుకు ప్రయత్నిస్తే తప్పుదారి పట్టించినట్లే అవుతుందన్నారు. దేశీయంగా వ్యవస్థాగత అంశాలే రూపాయి క్షీణతకు మూలకారణమని దువ్వూరి చెప్పారు. ఉద్దీపన ప్యాకేజీలు ఉపసంహరిస్తామన్న ఫెడ్ ప్రకటనలు దీనికి మరింత ఆజ్యం మాత్రమే పోశాయన్నారు. ‘సమస్యలకు మూలకారణం దేశీయంగా వ్యవస్థాగత అంశాలే అన్న విషయాన్ని అంగీకరించలేకపోతే.. వ్యాధి నిర్థారణలోను, చికిత్సలోను మనం ఘోరంగా విఫలమవుతాం’ అని దువ్వూరి వ్యాఖ్యానించారు.
వృద్ధి గురించి ఆలోచించే కఠిన వైఖరి..: వృద్ధిని గురించి ఆలోచించబట్టే కఠిన పరపతి విధానం పాటించాల్సి వచ్చిందని దువ్వూరి చెప్పారు. అధిక వడ్డీ రేట్ల వల్ల వృద్ధి కాస్త మందగించినా.. అది స్వల్పకాలికమేనన్నారు. వృద్ధి మందగించడానికి ఆర్‌బీఐ కఠిన పరపతి విధానం కొంత వరకూ కారణం కావొచ్చని.. అయితే..సరఫరా తరఫు సమస్యలు, గవర్నెన్స్ అంశాలే ఇందుకు ప్రధాన కార ణమన్నారు. ఇవి ఆర్‌బీఐ పరిధిలో లేని అంశాలని దువ్వూరి చెప్పారు. 2009-12 మధ్య ప్రభుత్వం అనుసరించిన అస్తవ్యస్త ఆర్థిక విధానాలే వృద్ధి మందగమనం, అధిక ద్రవ్యోల్బణానికి దారి తీశాయన్న దువ్వూరి.. సర్కారు ద్రవ్య స్థిరీకరణ వేగంగా చేయగలిగి ఉంటే, పరపతి విధానాన్ని కఠినతరం చేయాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు.
క్యాడ్ కట్టడి చేస్తేనే రూపాయి చక్కబడేది..
కరెంటు ఖాతా లోటు(క్యాడ్) అదుపుచేయలేని స్థాయికి పెరిగిపోవడమే రూపాయి భారీగా పతనమవడానికి మూలకారణమని దువ్వూరి చెప్పారు. దీన్ని అదుపు చేయగలిగితే పరిస్థితి చక్కబడుతుందన్నారు. అయితే, ఇది ప్రభుత్వం తరఫునుంచి వ్యవస్థాగతమైన చర్యలతో జరగాల్సిందే తప్ప ఆర్‌బీఐ చేయగలిగేదేమీ లేదన్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్టమైన 68.80ని తాకడం, జీడీపీలో క్యాడ్ 4.8 శాతానికి ఎగియడం తెలిసిందే. రూపాయి హెచ్చుతగ్గులను కట్టడి చేసేందుకు తీసుకున్న చర్యలు గందరగోళపర్చాయన్న విమర్శలపై స్పందిస్తూ.. ఆర్‌బీఐ తన చర్యల హేతుబద్ధతను మరింత సమర్ధంగా తెలియజేసి ఉండాల్సిందని దువ్వూరి అభిప్రాయపడ్డారు. పెట్టుబడులపై ఆంక్షలు విధించడం ఆర్‌బీఐ అభిమతం కాదన్నారు.
చిదంబరంపైనా విసుర్లు..
ఇటీవల అనేకసార్లు ఆర్‌బీఐని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన ఆర్థికమంత్రి చిదంబరంపైనా దువ్వూరి ఈసారి నేరుగా వ్యాఖ్యలకు దిగారు. ఆర్‌బీఐ ఉండటం వల్లే దేశం కాస్త బతికి బట్టకట్టిందని చిదంబరం స్వయంగా అనే రోజు ఏదో ఒకనాడు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జర్మనీ మాజీ చాన్సలర్ గెరార్డ్ ష్రోడర్‌ని దువ్వూరి ఉటంకించారు. ‘బుండెస్‌బ్యాంక్ (జర్మనీ సెంట్రల్ బ్యాంక్) పనితీరు నాకు విసుగు తెప్పించింది. కానీ దేవుడి దయవల్ల అది ఉండటం మంచిదే అయ్యింది’ అని గెరార్డ్ అప్పట్లో వ్యాఖ్యానించారని సుబ్బారావు చెప్పారు. అదే విధంగా ఏదో ఒక రోజు చిదంబరం సైతం ‘నేను కూడా మా రిజర్వ్ బ్యాంక్‌తో విసుగెత్తిపోయాను.. ఎంతగా విసుగెత్తిపోయానంటే
.. అవసరమైతే ఒంటరిగానే పోరాటం చేయాలనుకున్నాను. కానీ దేవుడి దయవల్ల రిజర్వ్ బ్యాంక్ అనేది ఒకటి ఉండటం మంచిదైంది’ అని అంటారని ఆశిస్తున్నట్లు సుబ్బారావు వ్యాఖ్యానించారు. చిదంబరానికి, దువ్వూరికి మధ్య ఉన్న బహిరంగ వైరం తెలిసిందే. వృద్ధికి ఊతమిచ్చేలా వడ్డీ రేట్లను తగ్గించాలంటూ చిదంబరం అనేకసార్లు సూచనప్రాయంగా చెప్పినప్పటికీ ద్రవ్యోల్బణ కట్టడి లక్ష్యంతో దువ్వూరి పట్టించుకోలేదు. దీంతో నిస్పృహకు లోనైన చిదంబరం వృద్ధిని మెరుగుపర్చేందుకు అవసరమైతే ఒంటరిగానైనా ప్రభుత్వం పోరాడుతుందంటూ గత అక్టోబర్‌లో నిర్వేదం వ్యక్తం చేశారు.
నేను చెప్పిందీ అదే: చిదంబరం
ఆర్థిక సమస్యలకి ప్రభుత్వమే కారణంటూ దువ్వూరి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన చిదంబరం.. తాను రెండు రోజుల క్రితం చెప్పినదాన్నే ఆయనా చెప్పారన్నారు. ‘నేను మొన్న పార్లమెంటులోనూ ఇదే విషయాన్ని చెప్పాను’ అని ఆయన విలేకరులతో తెలిపారు. అంతర్జాతీయ పరిణామాలే కాకుండా దేశీయంగా అంతర్గత అంశాలు కూడా ఆర్థిక కష్టాలకు కారణమయ్యాయని చిదంబరం మంగళవారం పార్లమెంటులో చెప్పారు. 2009-11 మధ్య (ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు) తీసుకున్న నిర్ణయాల వల్లే ద్రవ్య లోటు, కరెంటు ఖాతా లోటు పెరిగాయని వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement