తెలుగమ్మాయిలకు ఛాన్సులు ఇ‍వ్వకూడదు: ఎస్‌కేఎన్‌ | Producer SKN Comments On Telugu Actress | Sakshi
Sakshi News home page

తెలుగమ్మాయిలకు ఛాన్సులు ఇ‍వ్వకూడదు: ఎస్‌కేఎన్‌

Feb 17 2025 7:56 AM | Updated on Feb 17 2025 12:36 PM

Producer SKN Comments On Telugu Actress

టాలీవుడ్‌లో బేబీ సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత 'ఎస్‌కేఎన్‌'.. అయితే ఆ మూవీ విజయంలో కీలక పాత్ర తెలుగమ్మాయి 'వైష్ణవి చైతన్య'దే అని అందరికీ తెలిసిందే. అయితే, తాజాగా 'రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్' సినిమా వేడుకలో తెలుగు హీరోయిన్లను తక్కువ చేస్తూ ఎస్‌కేఎన్‌ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయని నెట్టింట వైరల్‌ అవుతుంది. ల‌వ్ టుడే సినిమాతో త‌మిళంతో పాటు తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జోడీగా రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో రెండో హీరోయిన్‌గా అస్సాం నటి 'క‌య‌దు లోహ‌ర్' నటిస్తుంది. ఆమెను ఉద్దేశిస్తూ ఎస్‌కేఎన్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

'రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్' సినిమా వేడుకలో హీరోయిన్‌ 'క‌య‌దు లోహ‌ర్' గురించి ఎస్‌కేఎన్‌ మాట్లాడారు.  సరిగ్గా హీరోయిన్‌ పేరు కూడా ఆయన పలకలేకపోయారు.  'క‌య‌దు లోహ‌ర్' బదులుగా కాయల్‌ అంటూనే.. ఎమండీ మీ పేరు కాయలా..? పళ్లా..? అంటూ ఎటకారంతో కవరింగ్‌ చేసేశాడు. 'మేము తెలుగు రాని అమ్మాయిల్నే ఎక్కువగా ఇష్ణపడుతాం. ఎందుకంటే, తెలుగు వచ్చిన అమ్మాయిల్ని ఎంకరేజ్‌ చేస్తే ఏమౌతుందో తర్వాత నాకు తెలిసింది. ఇకనుంచి తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్‌ చేయకూడదని నాతో పాటు మా డైరెక్టర్‌ సాయి రాజేశ్‌ నిర్ణయించుకున్నాం' అని తెలిపాడు. ఆపై అప్పుచేసి అయినా సరే  సినిమా టికెట్లు కొనాలని యూత్‌కు సలహా ఇచ్చాడు. కావాలంటే లోన్‌ యాప్‌ నుంచి డబ్బు తీసుకుని అయినా సరే టికెట్లు కొని సినిమా చూడాలని యూత్‌కు ఉచిత సలహా ఇచ్చాడు.

'బేబీ' హీరోయిన్‌ వైష్ణవి గురించేనా..?
ఎస్‌కేఎన్‌ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు కూడా తప్పుబడుతున్నారు. బేబీ హీరోయిన్‌ వైష్ణవి గురించే అతను ఈ కామెంట్‌ చేశాడా..? అంటూ చర్చించుకుంటున్నారు. తెలుగు హీరోయిన్లకు ఛాన్సులివ్వండని వేదిక‌ల‌పై కొంత మంది హీరోలు గ‌ట్టిగానే చెబుతుంటే.. ఈయనేంటి ఇలా అంటున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు. సినిమా హిట్‌తో ఒక తెలుగు న‌టి స‌క్స‌స్ అయింద‌న్న మాట త‌ప్ప‌..! ఇప్ప‌టివ‌ర‌కూ ఆమెకి కొత్త అవ‌కాశాలు వ‌చ్చిన దాఖ‌లాలు ఎక్క‌డా క‌నిపించ‌లేదని వారు గుర్తుచేస్తున్నారు. కానీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 80 శాతం అక్కడి అమ్మాయిలకే అవకాశాలు ఇస్తారని చెప్పుకొస్తున్నారు.  మన నిర్మాతలకు పక్కింటి పుల్లగూర రుచిగా ఉటుందని ఈ విషయంలో ఇప్పటికే మేకర్స్‌పై విమర్శలు ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. తెలుగు అమ్మాయిలు దొరకడం లేదు, రూల్స్ పెడతారు అంటూ సాకులు చెబుతూనే ఎలాంటి మార్కెట్ లేని పరభాషా హీరోయిన్లని తెచ్చుకుంటారని వ్యాఖ్యానించారు.

మన తెలుగమ్మాయిలకు సరిగ్గా పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేయాలే గానీ తెరపై బాగా రాణించగల సత్తా ఉంది. తెలుగమ్మాయిల్లో  టాలెంట్‌కు ఎలాంటి కొదవ లేదు. కానీ, మన నిర్మాతలకు, డైరెక్టర్లకు వారు కనబడరు. తెల్లతోలు తారలకు నటన రాకపోయినా పర్లేదు వాళ్లకు అడిగినంతా డబ్బు ముట్టజెప్పి ఛాన్సులు ఇచ్చేస్తారు. ఇలా ఎన్నో విమర్శలు తెలుగు మేకర్స్‌పై ఉన్నాయి.

గ్లామర్ రోల్స్‌లో మనోళ్లు ఏమాత్రం తగ్గరు
మెగా డాటర్‌ నిహారిక కొణిదెల సెకండ్ ఇన్నింగ్స్‌లో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంది. తమిళ సినిమా మద్రాస్కారన్‌లో గ్లామర్‌ రోల్‌లో కనిపించి ఆడియన్స్‌కు షాక్ ఇచ్చింది. మరోవైపు నిర్మాతగానూ తన మార్క్ చూపుతుంది. చాలా కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈషా రెబ్బా సరైన పాత్ర కోసం ఎదురుచూస్తుంది. సరైన ఛాన్స్‌ల కోసం లెక్కలేనన్ని  గ్లామరస్‌ ఫోటోషూట్స్‌తో సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది. 

కెరీర్‌ ప్రారంభం నుంచే గ్లామర్ ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తున్న తెలుగుమ్మాయి ప్రియాంక జవాల్కర్‌. విజయ్‌ దేవరకొండతో టాక్సీ వాలా సినిమాలో నటించిన ఆమె.. ట్రెడిషనల్‌ లుక్‌తో పాటు గ్లామరస్‌ పాత్రలు అయినా చేయగలదు. అయినా, ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రావటం లేదు. గ్లామర్‌ విషయంలో ముంబై అమ్మాయిలకు ఏమాత్రం వీళ్లు తగ్గరు. కానీ, ఛాన్సులు మాత్రం దక్కడం కష్టంగా మారిందని చెప్పవచ్చు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement