కూతురి పెళ్లికి దాచిన డబ్బు చెదల పాలు.. సాయం ప్రకటించిన 'బేబీ' సినిమా నిర్మాత | Baby Movie Director SKN Money Help To A Farmer | Sakshi
Sakshi News home page

Baby Movie Producer SKN: కూతురి పెళ్లికి దాచిన డబ్బు చెదల పాలు.. సాయం ప్రకటించిన 'బేబీ' సినిమా నిర్మాత

Nov 19 2023 3:57 PM | Updated on Nov 20 2023 6:59 AM

Baby Movie Director SKN Money Help To A Farmer - Sakshi

పసి వయసులో చేయి పట్టుకొని నడిపిస్తూ ఈ విశాల ప్రపంచాన్ని తొలిసారి పరిచయం చేసేది నాన్నే. భుజాలపై ఎక్కించుకుని ఆడించినా.. అల్లరి చేసినప్పుడు దండించినా బిడ్డ భవిష్యత్తే నాన్నకు ముఖ్యం. ప్రధానంగా ఆడపిల్ల ఉన్న తండ్రి ఇంకా భిన్నంగా ఆలోచిస్తాడు. ఎంతో కష్టపడి అతని చేతిలో డబ్బున్నా తన గారాల బిడ్డ చదువు, ఆమె పెళ్లి కోసం డబ్బు దాస్తాడు. తన కోసం ఏదీ కొనుక్కోడు కానీ పిల్లల కోసం తన కోరికలను, ఆశలను చంపుకుని డబ్బు కూడాబెడుతాడు. అలాంటి డబ్బే చెదల పాలు అయితే ఆ తండ్రి వేదన భరించలేనిది.

పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ తండ్రి కూడా బిడ్డల భవిష్యత్‌ కోసం దాచుకున్న డబ్బు చెదల పాలు కావడంతో కన్నీరుమున్నీరు అయ్యాడు. తన కూతురి పెళ్లి కోసం రోజంతా కష్టపడి వచ్చిన డబ్బును తన ఇంట్లో దాచి ఉంచాడు. సుమారు రూ. 2 లక్షల మొత్తాన్ని అతను తన ఇంట్లో భద్రపరిచాడు.. కానీ ఆ డబ్బు చెదులు పట్టిందా..? లేదా ఎలుకలు కొరికాయో తెలియదు కానీ ఇలా ఆ మొత్తం డబ్బు వినియోగించుకునేందుకు పనికిరాకుండా పోయింది. ఆ డబ్బును చూసిన ఆ తండ్రి కంట కన్నీళ్లు ఆగడం లేదు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

సోషల్‌ మీడియా ద్వారా ఆ తండ్రి కన్నీళ్లు చూసిన బేబీ సినిమా నిర్మాత ఎస్‌కేఎన్‌ (SKN) రియాక్ట్‌ అయ్యాడు. ఆ కుటుంబానికి సాయం చేసేందుకు ఆయన ముందుకు వచ్చాడు. ఆ తండ్రి వివరాలు తనకు పంపాలని... ఆయన కుమార్తె పెళ్లికి అవసరమయ్యే రూ. 2లక్షల డబ్బును ఆయన ఇస్తానని తన ఎక్స్‌లో తెలిపాడు. ఇందుకు గాను గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. బ్యాంకులలో డబ్బును దాచుకునేలా వారికి అవగాహన కల్పించాల్సిన భాద్యత అందరిపైన ఉందని ఆయన తెలిపాడు.

దీంతో ఎస్‌కేఎన్‌ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు రియాక్ట్‌ అవుతున్నారు. కష్టంలో ఉన్న వారికి ఇలాంటి సాయం చేయడానికి ముందుకు వచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీడేంటి రా ఇంత మంచోడు అంటూ మరోకరు తెలిపారు. ఆ సినిమా డైరెక్టర్‌ సాయి రాజేష్‌ కూడా తన ఫ్రెండ్‌ చేస్తున్న మంచి పనిని అభినందించినట్లు సమాచారం.  ఏదేమైనా నష్టపోయిన ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఎస్‌కేఎన్‌కు అందేలా చేయండని మరికొందరు తెలుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement