పార్లమెంట్‌లో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. క్రిప్టోకరెన్సీలపై పలువురు భారత ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా వారిలో తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కూడా చేరారు.
ఆర్బీఐ నియంత్రణను కోల్పోయే అవకాశం..!
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) , న్యూయార్క్ యూనివర్శిటీ , స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన వెబినార్‌లో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ....క్రిప్టోకరెన్సీతో ఆర్బీఐ తన పట్టును కోల్పోయే అవకాశం ఉందని దువ్వూరి అభిప్రాయపడ్డారు. క్రిప్టో కరెన్సీని అనుమతిస్తే ద్రవ్య, పరపతి విధానాల పైన ఆర్బీఐ నియంత్రణను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. నగదు సరఫరా, ద్రవ్యోల్భణ నిర్వహణ అదుపు తప్పుతాయని హెచ్చరించారు.
డిజిటల్ కరెన్సీ అప్పుడే సాధ్యం..!
పటిష్టమైన డేటా పరిరక్షణ చట్టాలు మూలధన నియంత్రణలు ఉన్నందున సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (CBDC)ని జారీ చేయడానికి భారత్ అంత బలంగా ఉండకపోవచ్చునని దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. డిజిటల్ చెల్లింపులకు పెరుగుతున్న ఆదరణతో భారత్‌లో కరెన్సీ నోట్ల వాడకం భారీగా తగ్గే అవకాశం ఉందన్నారు. కరోనాతో తలెత్తిన లాక్ డౌన్ కారణంగా దేశంలో కరెన్సీ నోట్ల చలామణి భారీగా పెరిగిందని పేర్కొన్నారు. పటిష్టమైన డేటా పరిరక్షణ చట్టాలు ఉంటే తప్ప, ఆర్బీఐ తన సొంత డిజిటల్ కరెన్సీకి వెళ్లడం మంచిది కాదని సూచించారు.
చదవండి: క్రిప్టో కరెన్సీకి అనుమతి? సీఐఐ సూచనలు
Comments
Please login to add a commentAdd a comment