న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలు, వర్చువల్ డిజిటల్ అసెట్లపై పన్నులకు సంబంధించి తరచుగా తలెత్తే సందేహాలను (ఎఫ్‌ఏక్యూ) నివృత్తి చేయడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ), రిజర్వ్ బ్యాంక్, రెవెన్యూ విభాగం, న్యాయ శాఖ మొదలైనవి ఎఫ్‌ఏక్యూలకు సమాధానాలను సిద్ధం చేస్తున్నాయి. ఇవి కేవలం సమాచారం ఇవ్వడానికి ఉద్దేశించినవే తప్ప క్రిప్టోకరెన్సీలకు చట్టబద్ధత కల్పించేవి కాకపోయినప్పటికీ .. ఎలాంటి లొసుగులు ఉండకూడదనే ఉద్దేశంతో న్యాయ శాఖ అభిప్రాయం కూడా తీసుకుంటున్నట్లు అధికారి ఒకరు తెలిపారు.
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) విధింపునకు సంబంధించి క్రిప్టోకరెన్సీ అనేది వస్తువుల విభాగంలోకి వస్తుందా లేక సర్వీసు కింద పరిగణిస్తారా అనే దానిపై ఎఫ్‌ఏక్యూల్లో స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం క్రిప్టో ఎక్సే్చంజీలను ఆర్థిక సేవలు అందించే సంస్థలుగా పరిగణిస్తూ 18 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. ప్రత్యేకంగా క్రిప్టోను వర్గీకరించలేదు. క్రిప్టో అసెట్స్ ద్వారా వచ్చే ఆదాయాలపై పన్నులు విధించేలా 2022–23 బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ప్రతిపాదనల ప్లకారం డిజిటల్ అసెట్స్ ఆదాయాలపై 30 శాతం ఆదాయపు పన్ను (సెస్సు, సర్‌చార్జీలు అదనం) ఉంటుంది. వర్చువల్ కరెన్సీల చెల్లింపులపై 1 శాతం టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment