Duvvuri Subba Rao
-
‘అలా చేస్తే ఆర్బీఐకు ఇక్కట్లు తప్పవు..!’
పార్లమెంట్లో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. క్రిప్టోకరెన్సీలపై పలువురు భారత ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా వారిలో తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కూడా చేరారు. ఆర్బీఐ నియంత్రణను కోల్పోయే అవకాశం..! నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) , న్యూయార్క్ యూనివర్శిటీ , స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన వెబినార్‌లో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ....క్రిప్టోకరెన్సీతో ఆర్బీఐ తన పట్టును కోల్పోయే అవకాశం ఉందని దువ్వూరి అభిప్రాయపడ్డారు. క్రిప్టో కరెన్సీని అనుమతిస్తే ద్రవ్య, పరపతి విధానాల పైన ఆర్బీఐ నియంత్రణను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. నగదు సరఫరా, ద్రవ్యోల్భణ నిర్వహణ అదుపు తప్పుతాయని హెచ్చరించారు. డిజిటల్ కరెన్సీ అప్పుడే సాధ్యం..! పటిష్టమైన డేటా పరిరక్షణ చట్టాలు మూలధన నియంత్రణలు ఉన్నందున సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (CBDC)ని జారీ చేయడానికి భారత్ అంత బలంగా ఉండకపోవచ్చునని దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. డిజిటల్ చెల్లింపులకు పెరుగుతున్న ఆదరణతో భారత్‌లో కరెన్సీ నోట్ల వాడకం భారీగా తగ్గే అవకాశం ఉందన్నారు. కరోనాతో తలెత్తిన లాక్ డౌన్ కారణంగా దేశంలో కరెన్సీ నోట్ల చలామణి భారీగా పెరిగిందని పేర్కొన్నారు. పటిష్టమైన డేటా పరిరక్షణ చట్టాలు ఉంటే తప్ప, ఆర్బీఐ తన సొంత డిజిటల్ కరెన్సీకి వెళ్లడం మంచిది కాదని సూచించారు. చదవండి: క్రిప్టో కరెన్సీకి అనుమతి? సీఐఐ సూచనలు -
జీడీపీ వృద్ధి 5 శాతానికి పుంజుకుంటుంది
ముంబై: దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21) 5 శాతం క్షీణతను చవిచూస్తుందని.. అయితే 2021–22లో తిరిగి 5 శాతం వృద్ధి రేటుకు పుంజుకుంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. తన అంచనాలకు మద్దతునిచ్చే అంశాలను తెలియజేస్తూ.. ‘‘ఇది సహజ విపత్తు కాదు. మన పరిశ్రమలు ఇప్పటికీ అలాగే నిలిచి ఉన్నాయి. మన మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థలు పనిచేస్తూనే ఉన్నాయి’’ అని సుబ్బారావు వివరించారు. భారత జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనస్ 5 శాతానికి క్షీణిస్తుందంటూ క్రిసిల్, ఫిచ్ రేటింగ్ సంస్థలు అంచనాలు వ్యక్తీకరించిన విషయం తెలిసిందే. సుబ్బారావు అంచనాలు కూడా వీటికి పోలికగానే ఉండడం గమనార్హం. ‘భారత ఆర్థిక వ్యవస్థ.. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడం’ అనే అంశంపై ఓ బిజినెస్ స్కూల్ నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ వెబినార్ ద్వారా దువ్వూరి సుబ్బారావు ప్రసంగించారు. వృద్ధి వేగం గా క్షీణించడం అన్నది సర్దుబాటులో భాగమే నన్నారు. మనవంటి పేదదేశానికి ఎంతో ఇబ్బంది కరమన్నారు. అయితే, వ్యవసాయ ఉత్పత్తి భారీగా ఉండడం, విదేశీ వాణిజ్యం స్థిరంగా ఉండడం అన్న వి మన ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేవిగా పేర్కొన్నారు. ప్రభుత్వానికి ద్రవ్యపరిమితుల నేపథ్యంలో రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విధానం బాగుందన్నారు. అదనంగా రుణాలను తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారు. 5–6 శాతం వృద్ధి సాధ్యమే: అహ్లువాలియా ప్రణాళికాసంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్‌సింగ్ అహ్లువాలియా సైతం 2020–21లో 5–6% వృద్ధి రేటు సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆయన కూడా మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీవ్ర మాంద్యాన్ని చవిచూడనున్నట్టు చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పన్ను సంస్కరణలు వెంటనే తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. -
ఇతర దేశాల కంటే వేగంగా రికవరీ: దువ్వూరి
హైదరాబాద్: ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ త్వరితగతిన కోలుకుంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. మంథన్ ఫౌండేషన్ ఆదివారం నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. ‘కరోనా నేపథ్యంలో ప్రస్తుతం వృద్ధి రేటు తగ్గుతుంది. అయితే మూలధనం అలాగే ఉంది. ఫ్యాక్టరీలు, దుకాణాలూ నిలదొక్కుకుని ఉన్నాయి. లాక్డౌన్ ఎత్తివేయగానే పనులకు వెళ్లేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. దీంతో రికవరీ విజయవంతం అవుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన అవకాశాలు భారత్‌కు ఉంటాయి’ అని దువ్వూరి అభిప్రాయపడ్డారు. -
కేంద్ర సంస్థలపై రాజకీయ ప్రభావం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలపై కొంత రాజకీయ ప్రభావం ఉంటుందని, అందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహాయింపు కాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. బుధవారం జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ)లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు. ‘ఆర్బీఐ–మేకింగ్ ఏ డిఫరెన్స్ టు ఎవ్రీడే లైవ్స్’ అనే అంశంపై అక్కడ ప్రసంగించారు. ఆర్బీఐ కేవలం నోట్ల ముద్రణ, పంపిణీ ప్రక్రియే కాకుండా ఆర్థిక వ్యవస్థకు కీలకంగా వ్యవహరిస్తోం దన్నారు. ద్రవ్య విధానం రూపకల్పన, ఆర్థిక సంస్థల పర్యవేక్షణలో ఆర్బీఐ నిర్ణయాలు ముఖ్యమైనవని తెలిపారు. వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ రుణాలిచ్చి, వాటిపై రెపో రేటును విధిస్తుందన్నారు. ఈ బ్యాంకుల ద్వారా ప్రజలు రుణాలు పొందే విధానాన్ని సైతం నిర్వహిస్తోందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నా వాటి ప్రభావం మన దేశంపై తప్పక ఉంటుందని పేర్కొన్నారు. నోట్ల రద్దు వల్ల నల్లధనం, ఉగ్ర కార్యకలాపాలు, దొంగ నోట్ల చలామణికి అడ్డుకట్ట పడిందన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిం చడం మంచిదని, ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతకు వీలు కల్పిస్తుందన్నారు. ఎఫ్ఆర్డీఏతో బ్యాంకులు, ఖాతాదారు లకు ఎలాంటి నష్టం ఉండబోదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఆర్డీ డైరెక్టర్ జనరల్ డబ్ల్యూఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధిని ఊహించటం కష్టమవుతోంది
ప్రభుత్వ విధానాలతో ఊహించని పరిణామాలు ► 2008లో ఆర్థిక సంక్షోభంతో వృద్ధి తల్లకిందులు ► తయారీ మినహా అన్ని రంగాలూ ప్రతికూలంలోనే ► ఉద్యోగ నైపుణ్యాల కొరత కొట్టొచ్చినట్లు కనబడుతోంది ► ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వ్యాఖ్యలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘పలు ప్రభుత్వ విధానాల కారణంగా దేశ ఆర్థికాభివృద్ధిని ముందే ఊహించడం కష్టం. ఎందుకంటే 2003–08 మధ్య దేశ జీడీపీ 9 శాతం. కానీ, 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో మొత్తం తల్లకిందులైంది. జీడీపీ 5 శాతానికి పడింది. పెట్టుబడులూ తగ్గాయి. అభివృద్ధికి ప్రధానమైనవి పెట్టుబడులు, ఉత్పాదకత. అవి పెరిగితేనే అభివృద్ధిని అంచనా వేయొచ్చు’’ అని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. రోటరీ క్లబ్, ఫ్యాప్సీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారమిక్కడ జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ‘‘పెద్ద నోట్ల రద్దు తర్వాత వ్యవసాయ, సేవలు, ఐటీ రంగంలో ఉద్యోగాలు పడిపోయాయి. తయారీ రంగంలో పెట్టుబడులు పెరగాలి. అప్పుడే ఉద్యోగాలు వస్తాయి’’ అని చెప్పారాయన. దేశంలో ఏటా వేల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నా వీరిలో సగానికి పైగా విద్యార్థులకు నైపుణ్యం ఉండట్లేదని, అమెరికా, జపాన్, యూరప్ వంటి దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని చెప్పారాయన. నైపుణ్యమున్న ఉద్యోగుల కోసం ప్రపంచం ఎదురుచూస్తోందంటూ... దీన్ని మనం అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రైవేట్ సంస్థల డబ్బులు, ప్రభుత్వం విధానాలు రెండూ కలిస్తేనే పీపీపీ విధానంలో నిపుణులు వస్తారు. ఈ విషయంలో చైనా నుంచి మనం నేర్చుకోవాలి. అక్కడి పీపీపీ విధానాలను అవలంభించాలి’’ అని దువ్వూరి సూచించారు. మన విద్యార్థుల్లో నైపుణ్యం, పరిశోధన రెండూ కొదవేనని అభిప్రాయపడ్డారు. పరిణతి చెందిన మార్కెట్ ఏదీ? దేశంలో పరిణతి చెందిన మార్కెట్ లేదని దువ్వూరి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగంలోని సవాళ్లను గుర్తించి, వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వం, బ్యాంకులూ దృష్టిసారించాలని సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే స్థలం, విద్యుత్, నీళ్ల వంటి మౌలిక వసతులు, రాయితీలు అందించడంతోనే పెట్టుబడులు రావని.. కట్టుదిట్టమైన చట్టాలు కూడా ఉంటేనే పారదర్శక పెట్టుబడులొస్తాయని చెప్పారాయన. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో వృద్ధి నత్తనడకన సాగుతోందని, ఇది మరికొద్ది కాలమే నని చెప్పారు. దీర్ఘకాలంగా బ్రిక్స్‌లోని ఇతర దేశాల కంటే మన దేశ జీడీపీ రెండింతలు వృద్ధి చెందుతుందని చెప్పారాయన. కార్యక్రమంలో రోటరీ క్లబ్ తరఫున జె. అబ్రహం, ఎఫ్‌టాఫ్సీ అధ్యక్షుడు గౌర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఫెడ్’ప్రభావం తక్కువే..
అక్కడ వడ్డీరేట్లు పెంచినా మనపై అంత ప్రతికూలత ఉండదు.. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికా వడ్డీ రేట్లు పెంచినా మన ఆర్థిక వ్యవస్థపై అంతగా ప్రతికూల ప్రభావం చూపదని ఆర్బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లు పెంచడం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (క్యాడ్) కొద్దిగా పెరుగుతుందన్నారు. డాలరుతో రూపాయి విలువ ఇప్పటికే బాగా క్షీణించడం వల్ల అమెరికా వడ్డీరేట్ల ప్రభావం వల్ల మరింత తగ్గే అవకాశాలు తక్కువేనన్న అభిపాయ్రాన్ని వ్యక్తం చేశారు. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) ఫౌండర్ డెరైక్టర్ డాక్టర్ వహిదుద్దీన్ ఖాన్ స్మారకోపన్యాస కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుబ్బారావు ‘సాక్షి’తో మాట్లాడుతూ అమెరికా వడ్డీరేట్లు పెంచితే స్వల్పకాలానికి మార్కెట్లు కొద్దిగా కుదుపునకు లోనవుతాయే కానీ, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపదన్నారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ బేస్ రేట్ మార్పుపై స్పందిస్తూ ఇది నిరంతర ప్రక్రియని, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ప్రైసింగ్ ప్రకారం మార్చాలని చూస్తోందన్నారు. అంతకముందు స్మారకోపన్యాసంలో ఆయన మాట్లాడుతూ తన ఐదేళ్ల పదవీ కాలమంతా సంక్షోభాలతో నడించిందన్నారు. అమెరికా సబ్ ప్రైమ్, యూరప్ రుణ సంక్షోభం తర్వాత కరెన్సీ క్షీణించడం వంటి వరస సంక్షోభాలను చవి చూడాల్సి వచ్చిందన్నారు. వీటన్నింటిల్లో 2013లో జరిగిన రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోవడం పెను సవాల్‌గా నిలిచిందన్నారు. ఆ సమయంలో కేవలం మూడు నెలల్లో రూపాయి విలువ 17 శాతం క్షీణించిందన్నారు. మిగిలిన సంక్షోభాలను అర్థం చేసుకొని పరిష్కార మార్గం కనుక్కోవడానికి తగిన సమయం ఉండేదని, కానీ కరెన్సీ విలువ పతనాన్ని అడ్డుకోవడానికి అప్పటికప్పుడు రియల్ టైమ్‌లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చేదన్నారు. ఇలాంటి సమయంలో తీసుకున్న నిర్ణయాలు మార్కెట్‌కు నమ్మకం కలిగించకపోవడంతో రూపాయి మరింత క్షీణించేదన్నారు. ప్రపంచంలో ఏ దేశ రాజకీయ నాయకులైనా, కార్పొరేట్లు అయినా.. వడ్డీరేట్లు తగ్గించడం ద్వారా జీడీపీ వృద్ధి రేటును పెంచాలని డిమాండ్ చేస్తుంటారే కానీ వడ్డీరేట్లు పెంచడం ద్వారా ధరలను తగ్గించాలని పేదవాడి కోసం ఎవరూ అడగరని దువ్వూరి వ్యాఖ్యానించారు. ఇందుకు ఇండియా కూడా మినహాయింపు కాదన్నారు. కానీ వడ్డీరేట్లు తగ్గింపునకు కొత్త ఇన్వెస్ట్మెంట్లకు సంబంధం లేదన్నారు. ధరల స్థిరీకరణ, వృద్ధిరేటు, ఆర్థికవ్యవస్థ స్థిరత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆర్బీఐ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. గంటకు పైగా సాగిన ప్రసంగంలో అప్పటి సంక్షోభాలు వాటిని ఎదుర్కొన్న తీరును ఆ సందర్భంలో వచ్చిన విమర్శలను దువ్వూరి వివరించారు. -
ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)కి కొత్తసారొచ్చారు. ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రస్తుతం ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా ఉన్న రఘురామ్ రాజన్ ఆర్బీఐ 23వ గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టారు. కాగా, పదవీ కాలం పూర్తయిన దువ్వూరి సుబ్బారావు స్థానంలో ఆయన కొలువుదీరారు. రాజన్ బాధ్యతల స్వీకరణ, దువ్వూరి పదవీ విరమణ ఒకే రోజు నేపథ్యంలో ఇరువురూ అభినందనలు తెలుపుకున్నారు. కాగా, బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రాజన్ తొలిసారిగా గవ ర్నర్ హోదాలో విలేకరులతో మాట్లాడారు. వస్తూవస్తూనే భారీ చర్యల ప్యాకేజీ తీసుకొచ్చారు. స్వల్పకాలంలో చేపట్టబోయే సవివర రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. రూపాయి అథపాతాళానికి పడిపోయి విలవిల్లాడుతున్న ఫైనాన్షియల్ మార్కెట్‌కు బూస్ట్ ఇచ్చేవిధంగా పలురకాల సెటిల్మెంట్లను రూపాయిల్లో జరుపుకోవడం తదితర చర్యలను ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థకు ఈ ఎకనమిక్స్ ప్రొఫెసర్ ఎలాంటి చికిత్స చేస్తారనేదానిపైనే చర్చ నడుస్తోంది. యాభై ఏళ్లకే ఆర్బీఐ చీఫ్‌గా వచ్చి ఈ బాధ్యతలు చేపట్టిన అత్యంత పిన్నవయస్కుల్లో ఒకరిగా రాజన్ నిలిచారు. గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)లో ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేశారు.దేశ ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగానే ఉందని, అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. ధరలను కట్టడి చేయడంతోపాటు సమీకృత ఆర్థికాభివృద్ధిపై దృష్టిసారిస్తామని పేర్కొన్నారు. పడిపోతున్న వృద్ధిరేటును తిరిగి గాడిలోపెట్టడం, ఆర్థిక స్థిరీకరణకు కృషి చేస్తామని చెప్పారు. ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా తాజా మాజీ గవర్నర్ దువ్వూరి వృద్ధిరేటు పడిపోతున్నా పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వడ్డీరేట్లు తగ్గించాలని కార్పొరేట్లు పదేపదే డిమాండ్ చేసినా ఆయన ధరలను దించడమే తొలి ప్రాధాన్యమంటూ అనేకసార్లు తేల్చిచెప్పారు కూడా. ఈ విషయంలో చిదంబరం, ప్రభుత్వం చేసిన సూచనలను కూడా పక్కనబెట్టడంతో తీవ్రమైన విభేదాలు కూడా తలెత్తాయి. ఈ నేపథ్యంలో కొత్త గవర్నర్ రాజన్ వృద్ధిపై దృష్టిపెడతామని అంటూ పరోక్షంగా వడ్డీరేట్ల తగ్గింపు సంకేతాలివ్వడం గమనార్హం. చకచకా కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌లు... జనవరికల్లా కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌లను జారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని రాజన్ వెల్లడించారు. లెసైన్స్‌లు ఇచ్చేవిషయంలో అత్నున్నత ప్రమాణాలు, పారదర్శకత, పరిశీలన జరుపుతామని పేర్కొన్నారు. కొత్త బ్యాంకుల ఏర్పాటు కోసం టాటా, బిర్లా, అంబానీలతోసహా మొత్తం 26 కార్పొరేట్ సంస్థలు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తుల మదింపునకు ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు రాజన్ తెలిపారు. గడచిన 20 ఏళ్లలో ప్రైవేటు రంగంలో 12 బ్యాంకులకు ఆర్బీఐ లెసైన్స్‌లు ఇచ్చింది. 2003-04లో కోటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంక్‌లకు దక్కిన లెసైన్స్‌లు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు కొత్త బ్యాంకులకు ఆర్బీఐ తెరతీయనుంది. సమీక్ష తేదీ మార్పు...: ఈ నెల 18న జరగాల్సిన ఆర్బీఐ పాలసీ సమీక్షను కొత్త గవర్నర్ రాజన్ 20కి మార్చారు. ఇదే ఆయనకు తొలి పాలసీ సమీక్ష ప్రకటన కానుంది. మరోపక్క, మానిటరీ పాలసీ విధివిధానాలు, ఆర్థిక స్థిరీకరణ, మారుమూల ప్రాంతాలకూ బ్యాంకింగ్ సేవల కల్పన(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్), బ్యాంకుల్లో మొండిబకాయిలను తగ్గించడం వంటి వాటిపై కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు రాజన్ ప్రకటించారు. ‘పడిపోతున్న దేశీ కరెన్సీకి చేయూతనిచ్చేలా విశ్వాసం పెంచే ద్రవ్య స్థిరీకరణ అనేది ఆర్బీఐ ప్రాథమిక కర్తవ్యం. అంతిమంగా స్థిరమైన, తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణమే లక్ష్యం. రూపాయి పతనం, సరఫరాపరమైన అడ్డంకులు, డిమాండ్ ఒత్తిళ్లు ఇలా దేశీయ పరిణామాలు వేటివల్లయినా ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీయొచ్చు. అయితే, సమగ్ర వృద్ధిరేటు, అభివృద్ధి అనేవి కూడా చాలా ప్రధానమైన అంశాలే. ఆర్థిక స్థిరీకరణా ముఖ్యం’ అని రాజన్ వ్యాఖ్యానించారు. మరోపక్క, ధరల కట్టడే లక్ష్యంగా పనిచేసిన దువ్వూరి విషయంపై స్పందించాలని విలేకరులు కోరగా... ఈ నెల 20 (పాలసీ సమీక్ష) వరకూ దీనిపై నేను ఎలాంటి కామెంట్స్ చేయను’ అని స్పందించారు. వృద్ధి రేటు పుంజుకుంటుంది... దేశ ఆర్థిక మూలాలు చాలా పటిష్టంగా ఉన్నాయని, కొన్ని సానుకూల పరిణామాలు కనబడుతున్న నేపథ్యంలో వృద్ధికి ఊతం లభించగలదని రాజన్ పేర్కొన్నారు. స్థూల దేశీయోత్పత్తి పుంజుకోవడం కోసం పలు సంస్కరణలను తాను బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ప్రకటిస్తునట్లు తెలిపారు. ఇక భారత్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేస్తామన్న స్టాండర్డ్ అండ్ పూర్స్ హెచ్చరికలపై స్పందిస్తూ... మూడింట ఒకవంతు చాన్స్ ఉందని ఎప్పటినుంచో ఈ ఏజెన్సీ చెబుతోంది. ఇందులో కొత్తేమీలేదన్నారు. మరిన్ని చర్యలకు ప్రణాళిక...: బ్యాంకులకు అమలయ్యే చట్టబద్ద ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్)ని తగ్గించేవిధంగా ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని రాజన్ సంకేతాలిచ్చారు. భారత్‌లో విదేశీ బ్యాంకుల కార్యకలాపాలపై మరింత నియంత్రణ, పర్యవేక్షణను తీసుకొచ్చే ప్రణాళికల్లో ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు. మరోపక్క, ఆర్బీఐ ముందస్తు అనుమతి లేకుండానే దేశీ బ్యాంకులు శాఖలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను కల్పించనున్నట్లు రాజన్ హామీనిచ్చారు. మార్కెట్లలో సంస్కరణలను ఒక్కొక్కటే ప్రవేశపెడతామని.. ముఖ్యంగా సెబీతో సంప్రదింపుల ద్వారా పొజిషన్లు, పెట్టుబడులపై నియంత్రణలను తొలగించేందుకు ప్రయత్నిస్తామని కూడా చెప్పారు. ఓవర్‌నైట్ వడ్డీరేట్లపై కూడా వడ్డీరేట్ల ఫ్యూచర్స్ కాంట్రాక్టులను ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాజన్ వెల్లడించారు. నగదురూపంలో సెటిల్ చేసుకునే పదేళ్ల కాలపరిమితిగల వడ్డీరేట్ల ఫ్యూచర్స్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇంకా, రిటైల్ ద్రవ్యోల్బణంతో అనుసంధానించే ద్రవ్యోల్బణ సూచీ సేవింగ్స్ సర్టిఫికెట్లను కూడా జారీచేయనున్నట్లు వెల్లడించారు. బ్యాంకర్ల శుభాకాంక్షలు.. ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాజన్‌కు పలువురు బ్యాంకర్లు తమ శుభాకాంక్షలను తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంలో ఆయన కీలకపాత్ర పోషించగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. విజ్ఞానిగా పేరొందిన డాక్టర్ రాజన్ నుంచి దేశ ఆర్థిక రంగానికి అత్యుత్తమ సేవలు అందుతాయని ఎస్బీఐ చీఫ్ ప్రతీప్ చౌదరి పేర్కొన్నారు. ఆర్థిక అనిశ్చిత నేపథ్యంలో రాజన్ లాంటి దార్శనికుడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడం మంచి పరిణామమని కోటక్ మహీంద్రా బ్యాంక్ వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో అపార అనుభవం, అన్ని అర్హతలు కలిగిన వ్యక్తి ఆర్బీఐలో కొలువుతీరడం ఆహ్వానించదగ్గ విషయమని బీఓబీ సీఎండీ ఎస్ఎస్ ముంద్రా అన్నారు. ఫేస్బుక్లో ‘లైక్స్’ కోసం కాదు.. ఆర్బీఐకి గవర్నర్‌గా నేతృత్వం వహించడం, బాధ్యతలు నెరవేర్చడం అంటే ఫేస్బుక్లో లైక్స్ సంపాదించడం లేదంటే ఎవరిదైనా మనసు గెలుచుకోవడం వంటిది కాదని రాజన్ వ్యాఖ్యానించారు. తద్వారా తాను కొన్ని కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. ‘ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడం అనేది ఈ స్థానంలోకి వచ్చే వ్యక్తి పేరుప్రఖ్యాతుల నుంచే మొదలవుతుంది. అయితే, నేను తీసుకునే కొన్ని చర్యలు అంతగా పేరొందకపోవచ్చు. రుచించకపోవచ్చు’ అని పేర్కొన్నారు. విమర్శలకు తాను వెరవనని... సరైనదనుకుంటే ఎలాంటి చర్యలకైనా వెనుకాడనని కూడా ఆయన తేల్చిచెప్పారు. సద్విమర్శలైతే వాటిని ఆచరణలో పెట్టడానికి కూడా సిద్ధమేనన్నారు. -
పాపమంతా ప్రభుత్వానిదే: దువ్వూరి
ముంబై: మరో వారం రోజుల్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ)గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రభుత్వంపైనా, ఆర్థిక మంత్రి పీ చిదంబరంపైనా తన విమర్శనాస్త్రాలకు మరింత పదును పెంచారు. వృద్ధిని పణంగా పెట్టి మరీ కఠిన పరపతి విధానాన్ని పాటిస్తున్నారంటూ ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. ప్రస్తుత ఆర్థిక కష్టాలకు ప్రభుత్వం అసంబద్ధ ఆర్థిక విధానాలే కారణమని విమర్శించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటనల వల్లే రూపాయి కుప్పకూలిందంటూ తప్పంతా ఫెడ్‌పై నెట్టేసేందుకు ప్రయత్నిస్తే తప్పుదారి పట్టించినట్లే అవుతుందన్నారు. దేశీయంగా వ్యవస్థాగత అంశాలే రూపాయి క్షీణతకు మూలకారణమని దువ్వూరి చెప్పారు. ఉద్దీపన ప్యాకేజీలు ఉపసంహరిస్తామన్న ఫెడ్ ప్రకటనలు దీనికి మరింత ఆజ్యం మాత్రమే పోశాయన్నారు. ‘సమస్యలకు మూలకారణం దేశీయంగా వ్యవస్థాగత అంశాలే అన్న విషయాన్ని అంగీకరించలేకపోతే.. వ్యాధి నిర్థారణలోను, చికిత్సలోను మనం ఘోరంగా విఫలమవుతాం’ అని దువ్వూరి వ్యాఖ్యానించారు. వృద్ధి గురించి ఆలోచించే కఠిన వైఖరి..: వృద్ధిని గురించి ఆలోచించబట్టే కఠిన పరపతి విధానం పాటించాల్సి వచ్చిందని దువ్వూరి చెప్పారు. అధిక వడ్డీ రేట్ల వల్ల వృద్ధి కాస్త మందగించినా.. అది స్వల్పకాలికమేనన్నారు. వృద్ధి మందగించడానికి ఆర్బీఐ కఠిన పరపతి విధానం కొంత వరకూ కారణం కావొచ్చని.. అయితే..సరఫరా తరఫు సమస్యలు, గవర్నెన్స్ అంశాలే ఇందుకు ప్రధాన కార ణమన్నారు. ఇవి ఆర్బీఐ పరిధిలో లేని అంశాలని దువ్వూరి చెప్పారు. 2009-12 మధ్య ప్రభుత్వం అనుసరించిన అస్తవ్యస్త ఆర్థిక విధానాలే వృద్ధి మందగమనం, అధిక ద్రవ్యోల్బణానికి దారి తీశాయన్న దువ్వూరి.. సర్కారు ద్రవ్య స్థిరీకరణ వేగంగా చేయగలిగి ఉంటే, పరపతి విధానాన్ని కఠినతరం చేయాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. క్యాడ్ కట్టడి చేస్తేనే రూపాయి చక్కబడేది.. కరెంటు ఖాతా లోటు(క్యాడ్) అదుపుచేయలేని స్థాయికి పెరిగిపోవడమే రూపాయి భారీగా పతనమవడానికి మూలకారణమని దువ్వూరి చెప్పారు. దీన్ని అదుపు చేయగలిగితే పరిస్థితి చక్కబడుతుందన్నారు. అయితే, ఇది ప్రభుత్వం తరఫునుంచి వ్యవస్థాగతమైన చర్యలతో జరగాల్సిందే తప్ప ఆర్బీఐ చేయగలిగేదేమీ లేదన్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్టమైన 68.80ని తాకడం, జీడీపీలో క్యాడ్ 4.8 శాతానికి ఎగియడం తెలిసిందే. రూపాయి హెచ్చుతగ్గులను కట్టడి చేసేందుకు తీసుకున్న చర్యలు గందరగోళపర్చాయన్న విమర్శలపై స్పందిస్తూ.. ఆర్బీఐ తన చర్యల హేతుబద్ధతను మరింత సమర్ధంగా తెలియజేసి ఉండాల్సిందని దువ్వూరి అభిప్రాయపడ్డారు. పెట్టుబడులపై ఆంక్షలు విధించడం ఆర్బీఐ అభిమతం కాదన్నారు. చిదంబరంపైనా విసుర్లు.. ఇటీవల అనేకసార్లు ఆర్బీఐని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన ఆర్థికమంత్రి చిదంబరంపైనా దువ్వూరి ఈసారి నేరుగా వ్యాఖ్యలకు దిగారు. ఆర్బీఐ ఉండటం వల్లే దేశం కాస్త బతికి బట్టకట్టిందని చిదంబరం స్వయంగా అనే రోజు ఏదో ఒకనాడు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జర్మనీ మాజీ చాన్సలర్ గెరార్డ్ ష్రోడర్‌ని దువ్వూరి ఉటంకించారు. ‘బుండెస్‌బ్యాంక్ (జర్మనీ సెంట్రల్ బ్యాంక్) పనితీరు నాకు విసుగు తెప్పించింది. కానీ దేవుడి దయవల్ల అది ఉండటం మంచిదే అయ్యింది’ అని గెరార్డ్ అప్పట్లో వ్యాఖ్యానించారని సుబ్బారావు చెప్పారు. అదే విధంగా ఏదో ఒక రోజు చిదంబరం సైతం ‘నేను కూడా మా రిజర్వ్ బ్యాంక్‌తో విసుగెత్తిపోయాను.. ఎంతగా విసుగెత్తిపోయానంటే .. అవసరమైతే ఒంటరిగానే పోరాటం చేయాలనుకున్నాను. కానీ దేవుడి దయవల్ల రిజర్వ్ బ్యాంక్ అనేది ఒకటి ఉండటం మంచిదైంది’ అని అంటారని ఆశిస్తున్నట్లు సుబ్బారావు వ్యాఖ్యానించారు. చిదంబరానికి, దువ్వూరికి మధ్య ఉన్న బహిరంగ వైరం తెలిసిందే. వృద్ధికి ఊతమిచ్చేలా వడ్డీ రేట్లను తగ్గించాలంటూ చిదంబరం అనేకసార్లు సూచనప్రాయంగా చెప్పినప్పటికీ ద్రవ్యోల్బణ కట్టడి లక్ష్యంతో దువ్వూరి పట్టించుకోలేదు. దీంతో నిస్పృహకు లోనైన చిదంబరం వృద్ధిని మెరుగుపర్చేందుకు అవసరమైతే ఒంటరిగానైనా ప్రభుత్వం పోరాడుతుందంటూ గత అక్టోబర్‌లో నిర్వేదం వ్యక్తం చేశారు. నేను చెప్పిందీ అదే: చిదంబరం ఆర్థిక సమస్యలకి ప్రభుత్వమే కారణంటూ దువ్వూరి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన చిదంబరం.. తాను రెండు రోజుల క్రితం చెప్పినదాన్నే ఆయనా చెప్పారన్నారు. ‘నేను మొన్న పార్లమెంటులోనూ ఇదే విషయాన్ని చెప్పాను’ అని ఆయన విలేకరులతో తెలిపారు. అంతర్జాతీయ పరిణామాలే కాకుండా దేశీయంగా అంతర్గత అంశాలు కూడా ఆర్థిక కష్టాలకు కారణమయ్యాయని చిదంబరం మంగళవారం పార్లమెంటులో చెప్పారు. 2009-11 మధ్య (ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు) తీసుకున్న నిర్ణయాల వల్లే ద్రవ్య లోటు, కరెంటు ఖాతా లోటు పెరిగాయని వ్యాఖ్యానించారు. -
భారీ బ్యాంకులతో ముప్పే
ముంబై: చిన్న చిన్న ప్రభుత్వరంగ బ్యాంకులను కలిపి ఒకటో, రెండో ప్రపంచ స్థాయి భారీ బ్యాంకులను ఏర్పాటు చేయాలన్న వాదనలను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తోసిపుచ్చారు. ఇలాంటి బ్యాంకుల వల్ల ఆర్థిక సుస్థిరతపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. ఈ తరహా బ్యాంకుల వల్లే 2008 నాటి అంతర్జాతీయ సంక్షోభం వచ్చి పడిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కావాల్సినది గుత్తాధిపత్యం కాదని, ఒకటో రెండో అత్యంత భారీ బ్యాంకుల కన్నా నాలుగైదు పెద్దస్థాయి బ్యాంకులు అవసరమని దువ్వూరి తెలిపారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ మంగళవారం ఏర్పాటు చేసిన బ్యాంకింగ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారీ బ్యాంకుల వల్ల సంక్లిష్టతతో పాటు నైతిక సమస్యలు పెరుగుతాయన్నారు. విలీనాల వల్ల అధిక మూలధనం అందుబాటులో ఉంటుందని, డిమాండ్‌కి తగినట్లు రుణాలు మంజూరు చేసే వీలుతో పాటు జీడీపీ వృద్ధికి, వ్యయాల తగ్గింపునకు ఉపయోగ పడుతుందని దువ్వూరి చెప్పారు. అయితే, నియంత్రణపరమైన సమస్యలూ తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. అత్యంత భారీ బ్యాంకులు గుత్తాధిపత్య ధోరణులను ప్రదర్శించగలవని, దీనివల్ల పోటీ దెబ్బతింటుందని దువ్వూరి పేర్కొన్నారు. భారత్ వంటి వర్ధమాన ఎకానమీ కోసం అత్యంత భారీ బ్యాంకులు కొన్నైనా అవసరమని ఆర్థిక మంత్రి చిదంబరం చెబుతున్న నేపథ్యంలో దువ్వూరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచ స్థాయికి చాలా కాలం భారత బ్యాంకులు అతి పెద్ద గ్లోబల్ బ్యాంకుగా ఎదగాలంటే ఇంకా చాలా సంవత్సరాలు పట్టేస్తుందని సుబ్బారావు చెప్పారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ.. అంతర్జాతీయస్థాయిలో చూస్తే 60వ స్థానంలో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయబద్ధమైన పద్ధతిలో విస్తరిస్తే.. ఎదగాలంటే చాలా కాలం పడుతుందని ఆయన తెలిపారు. 1991 ప్రారంభంలో ఆర్థిక రంగ సంస్కరణలను ప్రవేశపెట్టినప్పట్నుంచి బ్యాంకుల కన్సాలిడేషన్ అంశం ప్రాధాన్యం సంతరించుకుందని దువ్వూరి పేర్కొన్నారు. 1969లో తొలిసారి బ్యాంకులను జాతీయం చేసినప్పట్నుంచి 41 విలీనాలు జరిగాయని, ఇందులో 17 డీల్స్ ..1991కి ముందు మిగతావి ఆ తర్వాత జరిగాయన్నారు. చిన్న బ్యాంకులతో ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ తోడ్పాటు.. చిన్న వ్యాపారులు, రైతులు, ఇతర అసంఘటితరంగ సంస్థలకు రుణాలు అందుబాటులో ఉంచేందుకు చిన్న బ్యాంకులు ఉపయోగపడతాయని, వీటి వల్ల అందరికీ ఆర్థిక సేవలు (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) సాధ్యపడగలవని దువ్వూరి పేర్కొన్నారు. అయితే.. స్థానిక ఎకానమీ పరిస్థితుల నుంచి వీటికీ రిస్కులు ఉంటాయన్నారు. ప్రాంతీయ చిన్న బ్యాంకులు విఫలమైనా దాని ప్రభావం బ్యాంకింగ్ వ్యవస్థపై పెద్దగా ఉండబోదని, పరిష్కారం కూడా సులువుగానే ఉండగలదని పేర్కొన్నారు. ఎన్‌బీఎఫ్‌సీలన్నీ ఆర్బీఐ నియంత్రణలోనే ఉండాలి.. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలపై (ఎన్బీఎఫ్సీ) నియంత్రణాధికారాలను ఆర్బీఐ నుంచి దూరం చేసి ఏకీకృత ఆర్థిక సంస్థ అధీనంలో ఉంచడం సరికాదని దువ్వూరి అభిప్రాయపడ్డారు. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని, ఫలితంగా ద్రవ్య విధానంపైనా ప్రతికూల ప్రభావం పడగలదని చెప్పారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతరత్రా డిపాజిట్లు తీసుకునే సంస్థలకు మధ్య పరస్పర సంబంధాలు ఉంటాయని.. ద్రవ్య విధానం, ఆర్థిక మార్కెట్లు స్థిరంగా ఉండాలంటే ఇవన్నీ ఆర్బీఐ నియంత్రణ పరిధిలోనే ఉండాలని దువ్వూరి పేర్కొన్నారు. సీఆర్ఆర్ తగ్గాలి..: నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్), స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) మరింత తగ్గించాల్సిన అవసరం ఉండొచ్చని భావిస్తున్నట్లు దువ్వూరి చెప్పారు. సీఆర్ఆర్ తగ్గించాలని లేదా కనీసం వడ్డీ అయినా ఇవ్వాలని, అలాగే ఎస్ఎల్ఆర్ను తగ్గించాలంటూ బ్యాంకర్ల నుంచి డిమాండ్లు వెల్లువెత్తినా ససేమిరా అన్న దువ్వూరి తాజా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం సీఆర్ఆర్ 4 శాతంగాను, ఎస్ఎల్ఆర్ 23 శాతంగానూ ఉన్నాయి.