ఎన్‌ఐఆర్‌డీలో జరిగిన కార్యక్రమంలో దువ్వూరిని సత్కరిస్తున్న డబ్ల్యూఆర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలపై కొంత రాజకీయ ప్రభావం ఉంటుందని, అందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహాయింపు కాదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. బుధవారం జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ)లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు. ‘ఆర్‌బీఐ–మేకింగ్ ఏ డిఫరెన్స్ టు ఎవ్రీడే లైవ్స్’ అనే అంశంపై అక్కడ ప్రసంగించారు. ఆర్‌బీఐ కేవలం నోట్ల ముద్రణ, పంపిణీ ప్రక్రియే కాకుండా ఆర్థిక వ్యవస్థకు కీలకంగా వ్యవహరిస్తోం దన్నారు. ద్రవ్య విధానం రూపకల్పన, ఆర్థిక సంస్థల పర్యవేక్షణలో ఆర్‌బీఐ నిర్ణయాలు ముఖ్యమైనవని తెలిపారు. వాణిజ్య బ్యాంకులకు ఆర్‌బీఐ రుణాలిచ్చి, వాటిపై రెపో రేటును విధిస్తుందన్నారు.
ఈ బ్యాంకుల ద్వారా ప్రజలు రుణాలు పొందే విధానాన్ని సైతం నిర్వహిస్తోందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నా వాటి ప్రభావం మన దేశంపై తప్పక ఉంటుందని పేర్కొన్నారు. నోట్ల రద్దు వల్ల నల్లధనం, ఉగ్ర కార్యకలాపాలు, దొంగ నోట్ల చలామణికి అడ్డుకట్ట పడిందన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిం చడం మంచిదని, ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతకు వీలు కల్పిస్తుందన్నారు. ఎఫ్‌ఆర్‌డీఏతో బ్యాంకులు, ఖాతాదారు లకు ఎలాంటి నష్టం ఉండబోదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐఆర్‌డీ డైరెక్టర్ జనరల్ డబ్ల్యూఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment