ఆర్‌బీఐ వద్ద సరిపడా కరెన్సీ
• కొత్త నోట్ల లెక్క ఇప్పుడే చెప్పలేం
• కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడి
• పార్టీలకు మినహాయింపులపై పరిమితులు!
న్యూఢిల్లీ: డిసెంబర్ 30 తర్వాత కరెన్సీ ఇబ్బందులు తలెత్తకుండా ఆర్‌బీఐ వద్ద తగినంత కరెన్సీ ఉందని ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ స్పష్టం చేశారు. ఆర్‌బీఐ చెస్టుల్లో సరిపడా నగదు నిల్వలు ఉన్నాయని మంగళవారం విలేకరుల సమావేశంలో అన్నారు. ‘ఆర్‌బీఐ ఎప్పుడూ పూర్తి సన్నద్ధతతో ఉండేది. నోట్ల రద్దు అనంతరం బ్యాంకులకు తగినంత కరెన్సీ విడుదల చేయని రోజంటూ లేదు’ అంటూ జైట్లీ పేర్కొన్నారు. తగినంత కరెన్సీ నిల్వలతో ఎప్పుడూ ముందు జాగ్రత్తతో వ్యవహరించేదని, ప్రస్తుతం అదే పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. డిసెంబర్ 30 వరకే కాకుండా ఆ తర్వాత కూడా సరఫరా చేసేందుకు కొత్త కరెన్సీ అందుబాటులో ఉంచారని వెల్లడించారు.
ప్రస్తుతం ఎంత మేర కొత్త కరెన్సీ చలామణిలో ఉందని ప్రశ్నించగా... డిసెంబర్ 30 తర్వాతే పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. రద్దైన నోట్లను ప్రజలు ఒక్కసారే బ్యాంకుల్లో జమ చేసుకోవాలని, పదే పదే చేయడం వల్ల సందేహం తలెత్తవచ్చన్నారు. డిపాజిట్లపై మినహాయింపులు కొనసాగితే పాత కరెన్సీ నోట్లు వస్తూనే ఉంటాయని, ఆంక్షలు విధిస్తే.... తప్పనిసరిగా ఒక్కసారే పాతనోట్లను డిపాజిట్ చేస్తారంటూ స్పష్టత నిచ్చారు.
బ్యాంకులపై ఈడీ, సీబీఐ నిఘా
బ్యాంకుల కార్యకలాపాలపై ఈడీ, సీబీఐలు నిఘా కొనసాగిస్తున్నాయని, తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ సూచించినట్లు జైట్లీ తెలిపారు. విచారణ సంస్థలకు పట్టుబడని అధికారుల్ని గుర్తించి వారిపై వేటు వేసినట్లు యాక్సిస్ బ్యాంక్ సీఈవో చెప్పారంటూ జైట్లీ వెల్లడించారు. నోట్ల అక్రమాలకు పాల్పడ్డ బ్యాంకులపై చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించగా... ‘ఇంకేం కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి? బ్యాంకుల్లో లక్షల మంది పనిచేస్తున్నారు... వారిలో ఎక్కువ మంది ఎంతో కష్టపడుతున్నారు’ అని సమాధానమిచ్చారు.
దేశంలో క్రమంగా కరెన్సీ లభ్యత మెరుగుపడుతోందని, డిసెంబర్ 30 వరకూ డిమాండ్‌కు సరిపడా నగదు అందుబాటులో ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ చెప్పారు. నోట్ల రద్దు ప్రకటనకు ముందే 200 కోట్ల 2 వేల నోట్లు ముద్రించారని మంగళవారం ఆయన తెలిపారు. నవంబర్ 8 అనంతరం కొత్త రూ. 500 నోట్ల ముద్రణ ప్రారంభించారని, దేశంలోని నాలుగు ముద్రణా సంస్థల్లో నిరంతరం ముద్రణ కొనసాగుతుందని చెప్పారు.
పార్టీలకు మినహాయింపులపై..
రాజకీయ పార్టీలకు పన్ను మినహాయింపులపై పరిమితి పెట్టే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నికల కమిషన్ సిఫార్సులతో ఈ అంశంపై విచారించాలని రెవెన్యూ కార్యదర్శికి సూచించామన్నారు. ఎన్నికల్లో పోటీ చేయని, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు గెలుపొందని పార్టీలకు రూ. 2 వేలకు మించి విరాళాలపై నిషేధం విధించాలంటూ ఈసీ సిఫార్సు చేసింది.
3,185 కోట్ల అప్రకటిత నగదు
పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా నల్లకుబేరులపై డిసెంబర్ 19 వరకు నిర్వహించిన దాడుల్లో ఆదాయపు పన్ను శాఖ రూ. 3,185 కోట్ల అప్రకటిత నగదును వెలికితీసింది. అలాగే రూ. 86 కోట్ల విలువైన కొత్త నోట్లను సీజ్ చేసినట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. మొత్తం 667 చోట్ల తనిఖీలు, సర్వేలు, విచారణలు కొనసాగించామని, పన్ను ఎగవేత, హవాలా తరహా కార్యకలాపాలపై వివిధ సంస్థలకు 3,100 నోటీసుల్ని జారీ చేసినట్లు పేర్కొన్నారు. విచారణలో భాగంగా 220 కేసుల్ని సీబీఐ, ఈడీలకు సిఫార్సు చేసినట్లు ఐటీ శాఖ పేర్కొంది. తనిఖీల్లో భాగంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ)తో పాటు ఆర్‌బీఐతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లినట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.
ఆందోళన బాటలో బ్యాంకు ఉద్యోగులు!
వడోదరా: పెద్ద నోట్ల రద్దు కారణంగా బ్యాంకులు, బ్యాంకు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలను చేపట్టేందుకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్లు సిద్ధమయ్యాయి. దీనిలో భాగంగా డిసెంబర్ 28న నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని, 29న జైట్లీకి లేఖను ఇవ్వాలని యూనియన్లు ప్రకటించాయి. జనవరి 2, 3 తేదీల్లో ఆందోళన నిర్వహించనున్నాయి. తాము ఇచ్చిన పిలుపు మేరకు అన్ని ప్రధాన కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు స్థానిక రిజర్వు బ్యాంకు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారని సూచించారు.
కొత్త 500 నోటు ముద్రణకు రూ.3.09
ఇండోర్: ఆర్బీఐ కొత్త రూ.500 నోటు ముద్రణకు రూ.3.09, రూ.2000 నోటుకు రూ.3.54 చొప్పున వెచ్చిస్తున్నట్లు వెల్లడైంది. నోట్లు ముద్రణకు ఆర్బీఐ నుంచి ఈ మేరకు వసూలు చేస్తున్నట్లు అనుబంధ సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటుముద్రణ ప్రైవేట్ లిమిటెడ్(బీఆర్‌బీఎన్‌ఎంఎల్) తెలిపింది. కొత్త, పాత రూ.500 నోటుకు సమానంగా వ్యయమవుతోందని, పాత రూ.1000 నోటు ముద్రణకయ్యే మొత్తాన్నే కొత్త రూ.2000 నోటుకు తీసుకుంటున్నామని ఓ ఆర్టీఐ దరఖాస్తుదారునికిచ్చిన బదులులో స్పష్టం చేసింది.
మావోల ఖాతాల్లో రూ.55కోట్లు∙
రాంచీ: జార్ఖండ్‌లోని 40 మంది మావోయిస్టుల బ్యాంక్ ఖాతాలను అధికారులు నిలిపివేశారు. మావోల కుటుంబ సభ్యులు, బంధువుల ఖాతాలనూ స్తంభింపజేసినట్లు పోలీసులు తెలిపారు. వీటిల్లో సుమారు రూ.55 కోట్ల ధనం ఉన్నట్లు తెలుస్తోంది. రాంచీ, జంషెడ్‌పూర్, చాయ్‌బాసాలో ఈ ఖాతాలు ఉన్నాయి. వీటిపై పోలీసులు జరిపిన విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో 15 మంది మావోల పేరిట భారీ నజరానా ఉంది.